ఈ పూట గడవటానికి రేపటిని దోచిపెడతారా!?

ABN , First Publish Date - 2021-09-03T06:24:06+05:30 IST

నిర్మలా సీతారామన్ దేశ ఆస్తులను అమ్మి విస్తృతంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తామని ప్రకటించి దేశాన్ని ఒక కుదుపు కుదిపారు. ప్రతి ఏటా చాప కింద నీరులా ఈ ప్రైవేటీకరణ జరుగుతున్నా, ఆస్తుల అమ్మకాన్ని ఇంత పెద్ద ఎత్తున...

ఈ పూట గడవటానికి రేపటిని దోచిపెడతారా!?

నిర్మలా సీతారామన్ దేశ ఆస్తులను అమ్మి విస్తృతంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తామని ప్రకటించి దేశాన్ని ఒక కుదుపు కుదిపారు. ప్రతి ఏటా చాప కింద నీరులా ఈ ప్రైవేటీకరణ జరుగుతున్నా, ఆస్తుల అమ్మకాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక ఆర్గనైజ్డ్ కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ అమ్మకానికి కారణంగా ఆమె ప్రతి ప్రైవేటైజేషన్ ప్రోగ్రామ్ సందర్భంలోనూ వినపడే వాదనే ఆమె వినిపించారు: ‘ఆస్తుల వినియోగ సామర్థ్యం పెంచడం’ కోసమట. ఈ ఆస్తుల అమ్మకం దీర్ఘకాలిక లీజు మోడల్‌గా రూపొందిస్తామని తద్వారా అది అమ్మకం కాబోదని చెప్తున్నారు.


ఈ కార్యక్రమం ఏ మాత్రం హేతుబద్ధమైనదో చూసే ముందు కొన్ని లెక్కలు చూడాలి. 2011–12 సిరీస్ స్థిర ధరల ప్రాతిపదికన చూస్తే 2019–20లో రూ.145లక్షల కోట్లు ఉన్న మన స్థూల జాతీయాదాయం 2020–21 మొదటి అంచనాల ప్రకారం రూ.134లక్షల కోట్లకు పడిపోయింది. ఈ పడిపోవడం ఇలానే ఇంకా కొనసాగుతోంది. అయితే కొవిడ్ ప్రభావం తగ్గడం వల్ల 2021–22కు గాను 9.5శాతం వృద్ధిని సాధించొచ్చు అని ఆర్‍బీ‍ఐ ఒక భరోసా ఇస్తోంది. వాస్తవం ఏమిటంటే– మన ఆర్థికవ్యవస్థ కరోనా ప్రభావానికంటే ముందు నుంచి తగ్గుముఖం పట్టింది. కరోనా పుణ్యమా అని పూర్తిగా కుదేలయ్యింది. కోట్లల్లో ఉద్యోగాలు పోయాయి. పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. ఈ తగ్గుముఖం పట్టడం రెండు విధాలుగా జరిగింది. ఒకటి– ప్రైవేటు వినిమయం రూ.83 లక్షల కోట్ల నుంచి రూ.75 లక్షల కోట్లకు పడిపోవడం. రెండు– కేపిటల్ వ్యయం రూ.43లక్షల కోట్లనుంచి రూ.37లక్షల కోట్లకు పడిపోవడం. ఇంకా గమనిస్తే, మన జాతీయాదాయంలో 2011–12కు గాను 39శాతం కేవలం కేపిటల్ వ్యయం వల్లనే లభిస్తే, అది ఇప్పుడు సుమారు 30శాతానికే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉండాల్సింది రెండే లక్ష్యాలు– ప్రైవేటు వ్యయం పెంచడం, కేపిటల్ వ్యయం పెంచడం. ప్రైవేటు వ్యయం పెరగడమనేది కొంత కేపిటల్ వ్యయం పెరగడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కేపిటల్ వ్యయం ద్వారా లభించిన వ్యక్తిగత ఆదాయం కొంత ప్రైవేటు వ్యయంగా మార్పు చెందే అవకాశం ఉండడం వల్ల అలా జరుగుతుంది.


ఇప్పుడూ ఈ దేశ ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన సంపాదనను తిరిగి దేశ ఆస్తులు సమకూర్చడానికి వినియోగిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేయడాన్ని బట్టి మన దేశంలో కేపిటల్ వ్యయం పెంచడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతున్నదిగా అనిపిస్తుంది. అంటే– ఆ ఆరు లక్షల కోట్లు ఎక్కడికీ పోవనీ, కొత్త ఆస్తులను సృష్టిస్తాయనీ మనలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ ఆర్థికవ్యవస్థ ఇక్కడి రాజకీయానికి ఒక విచిత్రమైన ముడి సరుకు అందిస్తుంది. దేశంలో ఆస్తులు సమర్థవంతంగా నడుస్తుంటే వాటిని అమ్మడం ద్వారా మరింత సంపాయించవచ్చునని ఒకరూ, అవి సరిగ్గా నడవనప్పుడు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకుంటే మంచిదని ఒకరూ... ఇలా అందరూ అన్ని విధాలుగానూ దేశ ఆస్తులను ప్రైవేటుపరం చేసే పద్ధతికే వంతపాడుతున్నారు. కానీ ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి సంబంధించిన రూ.28,747కోట్ల గనులు కూడా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారో అర్థం కాదు. గనులు సహజ వనరులు. అందులో నిల్వలను బట్టి మాత్రమే ప్రభుత్వమైనా ప్రైవేటురంగమైనా ఆదాయం సంపాయించగలవు. ఇందులో చెప్పుకోడానికి పెద్దగా వేరే చలనాత్మక అంశాలు (variables) ఏమీ లేవు.


కొన్ని సింపుల్ నియమాలని ఇక్కడ చూద్దాం. ప్రభుత్వం ఒక సంస్థను ప్రైవేటుకు అమ్మదల్చుకున్నప్పుడు ఆ సంస్థ ఇచ్చే లాభాల విలువ కన్నా తక్కువ ధరకు అమ్మాలి. అప్పుడే దాన్ని కొనుక్కున్న ప్రైవేటు సంస్థ లాభాన్ని పొందగలుగుతుంది. ఉదాహరణకు ఓ సంస్థ సమర్థవంతమైన (efficient) ఆస్తి విలువ రూ.100కోట్లు అనుకుందాం. అది పెట్టుబడి మీద పది శాతం లాభం ఇవ్వాలి అనుకుంటే, 90 కోట్లకే కొనుగోలుదారుడికి అమ్మాలి. అలాగే మన దగ్గర నష్టాల్లో నడుస్తున్న ఒక సంస్థ ఉందనుకోండి, అప్పుడు దాన్ని మరింత నష్టానికి అమ్ముకుని బయట పడాల్సి వస్తుంది. ఈ ఆస్తుల అమ్మకం అన్నది మన వ్యక్తిగత ఆస్తుల అమ్మకంలా ఉండదు. కేంద్రప్రభుత్వం అమ్మ జూస్తున్న ఆస్తులు ఈ దేశ ప్రజానీకానికి నిరంతరంగా, పరంపరగా ఆదాయాన్ని, సంక్షేమాన్ని ఒనగూర్చే వాహకాలు. ప్రైవేటుకు అమ్మటం వల్ల సామర్థ్యం పెరుగుతుంది అని వాదించడం వినడానికి బాగుంటుంది. మరి ఈ సామర్థ్యం పెంచటమనే వాదన మనం సుమారు రూ.5లక్షల కోట్ల ఆదాయాన్ని వెచ్చించే మన డిఫెన్స్, మిలిటరీ రంగాల విషయంలో కూడా వర్తిస్తుందేమో తెలియజెప్పాలి. సామర్థ్యం అన్నది ఒక ప్రభుత్వ సంస్థకు ఒకలానూ ఇంకో ప్రభుత్వ సంస్థకు ఇంకోలానూ ఎలా వర్తిస్తుందో కూడా తెలియజేయాలి. స్టేట్‍బేంక్, ఎల్‍ఐ‍సీ, సెయిల్‌ లాంటి సంస్థలు ఆయా రంగాల్లో విజయ బావుటాను ఎగరేస్తున్నాయి. వీటికి సామర్థ్యం అనే అంశం ఎందుకు వర్తించదో ఈ ‘సామర్థ్య పోషక వాదులు’ తెలియజేయాలి. సామర్థ్యం పెంచడమే వాదన అయినప్పుడు ఆరు లక్షల కోట్ల ఆస్తులు అమ్మి, ఆరులక్షల కోట్ల ఆస్తులు తిరిగి ప్రభుత్వమే పునర్నిర్మిస్తే– మరి ఆర్థిక సామర్థ్యం తిరిగి ఎలా నిర్మితమౌతుంది? ఇవన్నీ ప్రాథమిక ప్రశ్నలు.


ఈ ప్రక్రియలో సుమారు 5.5శాతం రైల్వే స్టేషన్లను కూడా అమ్మే స్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ల నిర్వహణకు సంబంధించి సామర్థ్యం ఎలా పెంచదల్చుకున్నారూ అని ఆలోచిస్తే మనకేమీ సమాధానం కనబడదు. రైల్వే స్టేషన్‍లో వసతులు సదుపాయాలు పెంచడం సామర్థ్యం పెరగడం రెండూ వేరు వేరు. ఆ వసతులు పెంచే విధానం ఖర్చుతో కూడినది. ఆ ఖర్చు పాసెంజెర్లమీద పడకుండా ఆపగలిగే శక్తి ఏదీ లేదు ఇకపైన.


నిజానికి ఆర్థికవ్యవస్థ విస్తరించకపోవడం వల్ల, బేంకింగ్ రంగంలో ప్రాజెక్టు ఫైనాన్సులో మొండి బాకీలు పెరడం వల్ల గత కొద్ది సంవత్సరాలుగా కేపిటల్ వ్యయం బాగా కుంటుపడింది. ముఖ్యంగా ప్రైవేటు సంస్థల విషయంలో ఇది విపరీతంగా పడిపోయింది. మన జీడీపీలో 29శాతం ఉన్న ప్రైవేటు సంస్థల కేపిటల్ వ్యయం ఇప్పుడు 22శాతం దాకా పడిపోయింది. కేవలం అతి పెద్ద సంస్థలైన రిలయన్స్, అదానీ, టాటా, బిర్లా, వేదాంత గ్రూపులు తప్ప కేపిటల్ వ్యయం పెంచగలిగిన సంస్థలు కూడా లేవు. ఉన్నా వాటికి బేంక్ ఋణాలు అందవు. అయితే ప్రభుత్వ సంస్థల విషయంలో పెద్దగా మార్పు లేకుండా సుమారు 7శాతం చుట్టూనే ఉంటుంది. తాజాగా కేపిటల్ వ్యయం పెట్టలేనివాళ్ళు ప్రభుత్వం అమ్మిన ఆస్తుల మీద ఎలా పెట్టగలరు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అంటే, ప్రభుత్వం అమ్మే ఆస్తులు తక్కువ రిస్కుతో కూడి, ఆపరేషన్ హిస్టరీ ఉంది కాబట్టి బేంకుల దగ్గర నుండి ఋణాలు రాడానికి వీలవుతుంది కాబట్టి ఆ మేరకు ప్రోత్సాహం ఉంటుంది. అంటే దానర్థం– వాటి ఫైనాన్షియల్ వయబిలిటీ ఏ ధర వద్ద స్థిర పడుతుందో ఆ ధర వద్ద ప్రభుత్వం కూడా అవే ఆస్తులను సుమారు అంతే లాభంతో నడపవచ్చు. ఆ మాత్రం దానికి ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం హేతుబద్ధమైన ఆలోచన ఎలా అవుతుంది? రిస్క్ తక్కువ, ధర ఆకర్షణీయంగా ఉన్న ఆస్తులను దేశం చేతిలో నుంచి పెద్ద గ్రూపుల చేతుల్లోకి తరలించటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నది ఇక్కడ స్పష్టం. ఇక బీఎస్‍ఎన్‍ఎల్‍ లాంటి నవరత్న సంస్థలు ఈ రోజు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయంటే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం మానేసి ఆస్తులు అమ్మేయడమనే అడ్డదారి తొక్కడం ఏ విధంగానూ సబబుగా అనిపించదు.


ఈ ఆస్తుల అమ్మకంలో హర్షించదగ్గ ఒకే విషయం– జాతీయ రహదారుల సంస్థ, పవర్ గ్రిడ్ సంస్థలు మార్కెట్ నుంచి అప్పు సంపాయించడం ద్వారా మానెటైజ్ చేయడం. దీని వలన పబ్లిక్ ఆ అప్పుకు సబ్‌స్క్రయిబ్ చేయడం జరుగుతుంది. పైగా ఆయా యాజ మాన్యం కూడా ప్రభుత్వపరంగానే ఉంటుంది. చివరగా– దీర్ఘ కాలిక లీజు అమ్మకం కాదు అని మాట్లాడ్డం బూటకం. ఆస్తి కరిగే వరకు దాన్ని అనుభవించిన తర్వాత దానికి ఇక విలువేమీ ఉండదు. దేశంలో ఆస్తులు అమ్మి అసమానంగా పంపకాలు సాగించే ఈ విధానానికి స్వస్తి పలకాలి. దేశ ఆస్తులలో ప్రతి సామాన్యునికి ఒక వాటా ఉంది. ఆ వాటా తిరిగి రాకపోగా, విపరీతంగా డబ్బులు పోగేసుకున్న సంస్థల మీదనే ఈ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని నెట్టివేసి చేతులు దులుపుకుంటే ఇక్కడ రానున్నకాలంలో ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా లేకుండా పోడానికి దారులు నిర్మిస్తున్నట్టే. ఈ రోజు ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే ఆదాయం రేపు దేశానికి ఖర్చు పెంచడానికే. ఫ్రముఖ ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్ర వేత్త అన్నట్టు– ఈ రోజు బతికేద్దాం అనే ఈ అసమంజస విధానం రేపు మరో సంక్షోభ సృష్టికి నాంది పలకడమే.

పి. విక్టర్ విజయ్ కుమార్

(ఇన్వెస్ట్‌మెంట్ బేంకర్)

Updated Date - 2021-09-03T06:24:06+05:30 IST