ఆర్టీఐ అంటే అంత వణుకెందుకు?

ABN , First Publish Date - 2021-10-29T06:26:41+05:30 IST

సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) వలే, ప్రభుత్వాన్ని వణికించిన చట్టం మరొకటి లేదనుకుంటాను. ఆర్టీఐ వయసు పదహారేళ్లు. రాజ్యాంగం వచ్చి 71 సంవత్సరాలు దాటింది. దానికి ఎవరూ భయపడడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి మూడున్నర దశాబ్దాలు దాటింది...

ఆర్టీఐ అంటే అంత వణుకెందుకు?

సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) వలే, ప్రభుత్వాన్ని వణికించిన చట్టం మరొకటి లేదనుకుంటాను. ఆర్టీఐ వయసు పదహారేళ్లు. రాజ్యాంగం వచ్చి 71 సంవత్సరాలు దాటింది. దానికి ఎవరూ భయపడడం లేదు. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి మూడున్నర దశాబ్దాలు దాటింది. దీనికీ భయపడిన వాడొక్కడైనా లేడు. అయితే సమాచారం అడిగితే చాలు, ఒకటే వణుకు. భయం. ప్రభుత్వ అధికారులు ఎంతటి వారైనా సరే, రాజకీయ నాయకులు ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా సరే ఆర్టీఐ అంటే గజగజ వణికి పోతున్నారు. సమాచారం అడిగితేనే తలనొప్పి. ఆ సమాచారం ఇస్తే తలబొప్పి. 


మన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒక సామాన్యుడు ‘అయ్యా న్యాయమూర్తిగారూ, మీ ధర్మపీఠంలో పనిచేసే న్యాయమూర్తులు తమ ఆస్తిపాస్తుల చిట్టాను ప్రధాన న్యాయమూర్తికి ఏటేటా సమర్పించాలని ఒక తీర్మానం చేసుకున్నారు కదా. ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది ఇవ్వలేదు సార్?’ అని ఆర్టీఐ కింద అడిగారు. దీంతో ఒక సమాచార అసమ సమరం ఆరంభమైంది. అది ఒక దశాబ్దకాలం కొనసాగింది. నిజానికి ఆయన ఆస్తిపాస్తుల వివరాల కాపీలు అడగలేదు. కేవలం తీర్మానం అమలు చేశారా లేదా అని మాత్రమే అడిగారు. కనుక అది ఇవ్వాలని సమాచార కమిషన్, ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం, సంపూర్ణ ధర్మాసనం కూడా ఆదేశించాయి. అయితే సుప్రీంకోర్టు తమ పిఐఓ తమ ముందు దాఖలు చేసిన రిట్ అప్పీలులో తమ సమాచారం ఇవ్వకుండా తామే స్టే ఇచ్చుకుని తొమ్మిదేళ్లదాకా దాన్ని బాగా నానబెట్టి, ఆ తరువాత, విచక్షణ అంతా ప్రజాసమాచార అధికారి (పిఐఓ)దే అని గంభీరమైన న్యాయ విశ్లేషణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ఆ సమాచారం ఇవ్వవచ్చేమో బాగా లోతుగా పరిశీలించండి అని తీర్పు ఇచ్చింది (ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదు). ఇంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిన కేసులో కూడా పిఐఓలు సమాచార అభ్యర్థనలపై చీఫ్ జస్టిస్ ఆదేశాల ప్రకారం వ్యవహరించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. కానీ బ్యూరోక్రాట్ల తెలివితేటల ముందు సుప్రీంకోర్టు కూడా తెల్లబోవాలేమో. ఉన్నతాధికారులు చెప్పేదాకా ఏ సమాచారమూ ఇవ్వకండి అని ఒక్క ముక్క రాసి పారేసి ఆ సర్క్యులర్ అనే మంచుకత్తి వంటి పెన్నుతో ఆర్టీఐని వెన్నులో పొడిచేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇక మనకు పార్లమెంటులూ, రాజ్యాంగాలూ, ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకండీ? ఓ ఎమ్మెల్యే పదవికి ఉపఎన్నికలు, దానికి వందల కోట్లు, హడావిడి ఎందుకండీ? ఇటువంటి సర్క్యులర్ ఒక్కటిస్తే చాలు రాజ్యాంగహక్కుకు, సమాచార హక్కుకూ దిక్కూమొక్కూ ఉండదు. 


దాపరికం ప్రాథమికహక్కు అయినప్పుడు ఈ సమాచార హక్కేమిటండీ అనవసరంగా అని వాదించి లా పాయింట్లు తీసేవారూ ఉన్నారు. దాపరికం ప్రాథమిక హక్కు అని ఎవరూ అనలేదు. గోప్యత వేరు, దాపరికం వేరు. రహస్యం వేరు. నేరాల సమాచారం దాచుకోవడానికి ఆర్టీఐ చట్టాన్ని ద్వేషించడం ‘వేరు’. ‘మేమంతా అవినీతిపరులం. మాకు సమాచారహక్కు చట్టం వద్దు’- ఇదీ మన నినాదం. ‘మీరడిగినా సరే మేం ఇవ్వం. పై అధికారుల అనుమతి తీసుకోకుండా ఒక్క ముక్క బయటకు పొక్కడానికి వీల్లేదు’- ఇది మా విధానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జారీచేసిన ఆజ్ఞలు ఈ విధానానికి పట్టుగొమ్మ. 


అసలు ఆర్టీఐ అంటే అధికారులందరికీ ఎందుకింత భయం? జవాబు అందరికీ తెలుసు. భయపడేవాడు బ్లాక్‌మెయిల్‌కు గురయ్యేవాడే. భయపెట్టే వాళ్లలో కొందరు బ్లాక్‌మెయిలర్లు. ప్రభుత్వ ఫైళ్లలో ఉన్న సమాచారం అడిగే వాడు ఆ సమాచారం బయటపెడతా అని బెదిరిస్తున్నాడని అంటున్నారు. అటువంటి సమాచారం దాచి అవినీతిని పెంచే వ్యవస్థను బద్దలు చేయడానికే ఈ చట్టం వచ్చింది. కానీ సమాచారం దాచుకోవడం ఎలా? దోచుకున్న సొమ్ము కన్నా భద్రంగా ఆ సమాచారాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల కొందరు బ్లాక్‌మెయిలర్లుగా తయారయ్యారని, కొత్త వృత్తి మొదలయిందని కనుక ఈ చట్టం ఒక తలనొప్పి అనే వాదం పెరుగుతున్నది కూడా. విచిత్రమేమంటే ఇదివరకు, ఇప్పుడూ పౌరుడు లంచాలు ఇస్తూనే ఉన్నాడు. ప్రజాసేవకులు పుచ్చుకుంటూనే ఉంటారు. మామూలు ఇవ్వడం మామూలే. అయితే ఈ పరిస్థితిని ఆర్టీఐ విప్లవాత్మకంగా మార్చింది. జనం నెత్తిన జనం డబ్బుతో పెత్తనంచేసే ప్రజాసేవకుడు తన బండారం బయటపడకుండా పౌరుడికి లంచం ఇవ్వజూపుతాడు, ఇస్తాడు. ఆర్టీఐ కింద అడిగిన వాడిని అడ్డుకుంటాడు. తను దోచిన సొమ్ములో కొంత ఇచ్చి, మిగతా లూటీ సొమ్ము దాచుకుంటాడు. ఆ సమాచారాన్ని కూడా దాస్తాడు. పౌరుడికి ఆఫీసర్ లంచం ఇవ్వడం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఇది ఆర్టీఐ తెచ్చిన మార్పు. దీన్నే పండితులు బ్లాక్ మెయిలింగ్ అంటారు. ఎక్కడో ‘బ్లాక్’ మచ్చ ఉన్నోడే ఈ ‘మెయిల్’కు గురవుతాడ్రా బాబూ అని ఎంత మొత్తుకున్నా వినరు. 


బ్లాక్ మెయిలర్లను ప్రోత్సహించకూడదు. కానీ సమాచారాన్ని, అవినీతిని దాచుకునే ప్రజాసేవకులను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేయగానే వారు ఫిర్యాదు చేయాలనీ, బ్లాక్‌మెయిలర్లను అరెస్టుచేయాలని కూడా డిమాండ్ చేస్తే చాలా బాగుంటుంది. తేలుకుట్టిన దొంగలు ఫిర్యాదు చేస్తారా? సెమినార్లలో మాట్లాడతారు. సమాచారం బయటపడకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తారు. సమాచారం అడిగినవాడు డబ్బు డిమాండ్ చేయకముందే, ఈ ప్రజాసేవకుడే ఎదురు వెళ్లి ‘మూటలు ఇస్తాను నోరుమూసుకో’ అంటాడు. ఆర్టీఐ దరఖాస్తుదారుడు డబ్బు అడిగితే బ్లాక్‌మెయిల్ అంటాం కదా. కాని అతను అడగకుండానే డబ్బు ఇస్తాననే వాడిని, ఇచ్చే వాడిని ఏమనాలి? అతను వైట్‌మెయిలరా? దాన్ని లంచం అనకూడదా? అంటే లంచం తీసుకునే ఒకే ప్రజాసేవకుడు, తన లంచగొండితనం ఆర్టీఐ ద్వారా బయటపడకుండా ఉండేందుకు లంచం ఇవ్వజూపితే ప్రభుత్వం ఏం చేయాలి? ఏ లంచాన్ని ఆపాలి? లంచగొండి అధికారి సంపాదించిన ఆస్తిని దాచుకునే హక్కును కాపాడుతూ, అందులోంచి కొంత లంచం ఇవ్వకుండా ఆపాలా? అప్పుడు మనం లంచగొండులను రక్షిస్తున్నట్టా, బ్లాక్‌మెయిలర్లను శిక్షిస్తున్నట్టా? ఏమీ అర్థం కావడం లేదు కదూ. అంతా గందరగోళం మరి. అందుకే సమాచారహక్కు చట్టం మనకొద్దు.


సమాచారహక్కు చట్టానికి భయపడే పెద్దలు, ఆ చట్టాన్ని తొలగించడానికి కూడా భయపడడం మరొక వింత. దమ్ముంటే ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రమైనా సరే లేదా పార్లమెంటయినా సరే ఒక శాసనం ద్వారా సమాచారహక్కు చట్టాన్ని రద్దు చేయమనండి చూద్దాం. ఉహూ ససేమిరా చేయరు. చేస్తామని కూడా అనరు. సమాచార హక్కును బహిరంగంగా తొలగిస్తే అవినీతిపరులకు మద్దతు ఇస్తున్నట్టు జనానికి అర్థమవుతుంది కనుక ఆ పని చేయరు. కానీ పైకి కనబడకుండా దాన్ని చంపేయాలి. ఎలా? అధికారంలో ఉన్న వారి ఎజెండా ప్రస్తుతం ఇదే. నెత్తురు అంటవద్దు. తమ చేతిలో ఆర్టీఐని చంపిన నెత్తుటి కత్తి ఉండకూడదు. ఆర్టీఐ పూర్తిగా చావకూడదు. కాని నిర్జీవంగా పడిఉండాలి. 


ఆర్టీఐకి నాలుగు మూలస్తంభాలుగా ఉన్నవారు- సమాచారం అడిగేవాళ్లు, సమాచారం ఇచ్చే పిఐఓలు, తొలి అప్పీలు అధికారులు, ఇప్పించే సమాచార కమిషనర్లు. వీరికి బలీయమైన ప్రత్యర్థులు- అధికారంలో ఉన్నవారు, అధికారులు, జనం డబ్బు మీద పెత్తనం చెలాయించేవారు, అవినీతిని నిరోధించే బాధ్యత కలిగి ఉండి కూడా అవినీతికి పాల్పడేవారు. వీరు, సమాచారం అడిగే వ్యక్తులను బ్లాక్‌మెయిలర్లంటూ బద్నాం చేస్తారు. పిఐఓలకు రికార్డులు పరిశీలించి సరైన సమాచారం ఇవ్వడం రాదంటారు. తొలి అప్పీలు అధికారులను (ఒకవేళ పనిచేద్దామని అనుకుంటే) పనిచేయనివ్వరు. ఇక సమాచార కమిషనర్‌ల బలం తగ్గించి, అధికారం కుదించి, పదవీకాలం కత్తిరించి, బలహీనమైన సేవకులుగా నామమాత్రంగా కుర్చీలో కూర్చోవడానికి సిద్ధం చేస్తారు. ఇవన్నీ ఆర్టీఐకి ఎదురు నిలవలేక, ప్రశ్నల తుపాకీగుండ్లకు గుండె చూపే గుండె లేక వెనుక నుంచి వచ్చి పొడిచే వెన్నుపోట్లు. పెన్నుపోట్లు. 


పౌరులకు ప్రశ్నించే హక్కు ఉందని మన రాజ్యాంగం గుర్తించింది. సమాజంలో మంచి చెడులను విమర్శించడం పౌరుల ప్రాథమికహక్కు. ఆ హక్కులో భాగమైన సమాచారహక్కును ఉపయోగించుకుంటూనే ఉండాలి. ‘ఉన్నతాధికారులు చెప్పేంతవరకు ఏ సమాచారం ఇవ్వొద్దని’ చీఫ్ సెక్రటరీ ఆదేశించేందుకు దారితీసిన ఫైల్‌ను, అన్ని కాగితాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయాలి. ఆర్టీఐ కింద వందలాది మంది ఈ అభ్యర్థన చేయాలి. అభివ్యక్తి స్వాతంత్ర్యాన్ని వాడుకోకపోతే అది పోతుంది. వాడితే ఆ హక్కు బతుకుతుంది, ఆర్టీఐ కూడా వాడితేనే ఉంటుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. 

ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

మాజీ కేంద్ర సమాచార కమిషనర్

Updated Date - 2021-10-29T06:26:41+05:30 IST