ఇంతకూ కాకతీయులు ఎవరు?

ABN , First Publish Date - 2021-08-20T06:13:46+05:30 IST

కాకతీయులు క్షత్రియులు కాదని వరంగల్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు దివంగత దెందుకూరి సోమేశ్వరరావు చెప్పారు..

ఇంతకూ కాకతీయులు ఎవరు?

ఇటీవల పాత పుస్తకాలను మళ్లీ తిరిగేస్తుంటే, వరంగల్‌కు చెందిన రిటైర్డ్ ట్రెజరీ అధికారి (ఇటీవలే మరణించారని విన్నాను) తక్కెళ్ల బాలరాజు రచించిన ‘కాకతీయుల వంశ రహస్యం’ అనే పరిశోధనాత్మక గ్రంథం కనిపించింది. అందులో కాకతీయులు మాలలు అని తేల్చారు. దానికి ఆధారంగా పలు శాసనాలు, అప్పటి గ్రంథాల్లో ఉన్న ప్రస్తావనలను, కొన్ని శిల్పాలను, అప్పటి వారి సామాజిక విధానాన్ని రుజువుగా చూపారు. దానితో, అసలు కాకతీయుల కులం ఏమిటనే అంశంపై ఆసక్తి కలిగి ఈ విషయమై అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలు చదివాను. ఇదే అంశంపై ఆరేడు దశాబ్దాలుగా విస్తృత చర్చ జరగడంతో పాటు, పలు పరిశోధనాత్మక గ్రంథాలు కూడా వెలువడ్డాయి. వాటిలో ఆయా రచయితలు తమ తమ కులాలను బట్టి వారికి అనుకూలంగా రాసుకున్నారు. అందుకు సమర్ధనగా ఎక్కడో ఉన్న శాసనాలను, వాటిలోని ఏదో ఒక పదాన్ని, అప్పటి సాహిత్యంలో ఉన్న ఏదో ఒక ప్రస్తావనను ఉదహరిస్తూ కాకతీయులది తమ కులమే అని తేల్చారు. ఇలా  ఈ గ్రంథాలన్నిటిలో అప్పటి సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించే రచనలలో కాకతీయులు బ్రాహ్మణులు లేదా క్షత్రియులు అని మాత్రం ఎవరూ అభిప్రాయపడలేదు. 


కాకతీయులు రేచర్ల గోత్రీకులని తమది కూడా అదే గోత్రం అయినందున తమ కులం వారే అని రెడ్లు, వెలమ, కమ్మ కులస్థులతో పాటు మాలలు సైతం చెప్పుకున్నారు. వేంకటగిరి సంస్థాన రెడ్లకు రేచర్ల అనే గోత్రం ఉందని, వెలమ దొరల నాయకుడైన బ్రహ్మా నాయకుడి (??) గోత్రం కూడా రేచర్ల అని ఆయా రచయితలు తమ గ్రంథాల్లో పేర్కొన్నారు. అసలు రేచర్ల అనే గోత్రం మాలలకు సంబంధించిందని, వారి నుంచే రెడ్లు తీసుకున్నారని ‘మాల మాదిగల ప్రాచీన చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించిన బొనిగల రామారావు పేర్కొన్నారు. చరిత్రకారుడు బిల్ హన్మంతరావు రాసిన ‍‘భారతదేశంలో కులవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాలు’ గ్రంథంలో కాకతీయులు గొప్పరాజులైన పుళిందులంటారు. పుళిందులనగా గిరిజనులు, కోయలు. అయితే, గిరిజనులకు గుర్రపు స్వారీ, ఖడ్గయుద్ధం, కర్రసాము వంటి అప్పటి ఆధునిక యుద్ధ మెళకువలు తెలియవు కాబట్టి వారు గిరిజనులు అనడానికి సరైన ఆధారాలు లేవని పలువురు కొట్టిపారేస్తున్నారు. ఏటుకూరి బలరాంమూర్తి ‘ఆంధ్రుల చరిత్ర’లో కాకతీయులను తెలగాలుగా పేర్కొన్నారు. విద్యానాథుడి ప్రతాపరుద్రీయంలో అత్యరకేందు కులస్థులని పేర్కొన్నారు. అయితే, ఈ కులం ఎక్కడా కనిపించదు. కాజిపేట శాసనం ప్రకారం కాకతీయులు ‘విష్టి’ కులస్థులు. గతంలో తహశీల్ కార్యాలయాల్లో వెట్టితనం చేసే ‘విష్టి’ వృత్తిలో మాలలే ఉండేవారు కనుక శాసనంలో పేర్కొన్న విషయం ప్రకారం కాకతీయులు ఆ కులం వారేనని తక్కెళ్ల బాలరాజు పేర్కొన్నారు. 


కాకతీయులు క్షత్రియులు కాదని వరంగల్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారుడు దివంగత దెందుకూరి సోమేశ్వరరావు చెప్పారు. కంచె ఐలయ్య ‘హిందూ మతానంతర భారతదేశం’ రచనలో కాకతీయులు ‘వడ్డెర’ కులానికి చెందిన వారని, వరంగల్ జిల్లా పరకాలకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దివంగత కానుగంటి మధుకర్ ‘పెరికె కుల చరిత్ర’లో వారు పెరికలని పేర్కొన్నారు. మరి కొన్ని పుస్తకాలు తెలుగు నాయక వంశాల మాదిరి దుర్జయ వంశమువారని పేర్కొన్నాయి. 


కొన్ని శాసనాలు వారిని సూర్యవంశ క్షత్రియులని పేర్కొన్నాయి. గుంటూరు జిల్లా మల్కాపురంలో శిథిల స్థితిలో ఉన్న ఒక గుడి దగ్గర నంది విగ్రహం మీద చెక్కిన శిలాశాసనం కాకతీయులు సూర్యవంశపు క్షత్రియులని పేర్కొంది. కర్నూలు జిల్లా త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర ఆలయంలో ఉన్న శిలాశాసనం ప్రకారం గణపతిదేవుడు సూర్యవంశ క్షత్రియుడు. ఇంత చర్చ జరిగినా, చరిత్రకారులు సహా ఎవరేం చెప్పినా అది అభిప్రాయమే. కాకతీయులు ఏ కులమునకు చెందినవారో కచ్చితమైన ఆధారాలు లేవు. 


కాకతీయులు తొలుత జైనులుగా ఉండేవారని, రెండవ ప్రోలరాజు సుప్రసిద్ధ శైవ మతాచార్యుడైన రామేశ్వర పండితుడి నుంచి శైవ మతం స్వీకరించారని తెలుస్తోంది. వారు ఎక్కడా తమ కులం చెప్పుకోలేదు. అది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఆధునిక సమాజంలో కులానికి అంత ప్రాముఖ్యత లేనప్పటికీ అకడమిక్‌గా ఈ విషయమై మరింత పరిశోధన చర్చ జరగాల్సి ఉంది.


కన్నెకంటి వెంకటరమణ

(జాయింట్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ) 

Updated Date - 2021-08-20T06:13:46+05:30 IST