నోటుపై బాబా సాహెబ్ ఫొటో ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-11-23T07:20:00+05:30 IST

స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో మన రూపాయి విలువ పడిపోతున్నప్పుడు డా. అంబేడ్కర్ దానికి విరుగుడు వెతికారు. సగటు వ్యక్తి సంక్షేమాన్నీ...

నోటుపై బాబా సాహెబ్ ఫొటో ఎప్పుడు?

స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో మన రూపాయి విలువ పడిపోతున్నప్పుడు డా. అంబేడ్కర్ దానికి విరుగుడు వెతికారు. సగటు వ్యక్తి సంక్షేమాన్నీ, దేశ ఆర్థిక స్థితినీ దృష్టిలో ఉంచుకుని, రూపాయి విలువను కాపాడేందుకు బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగులేని పోరాటం చేశారు. రిజర్వు బ్యాంక్ ఏర్పాటును కోరుతూ 'రూపాయి, దాని సమస్య పరిష్కార మార్గం- ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర' అన్న పుస్తకాన్ని రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి, హిల్టన్ యంగ్ కమీషన్‌కు అందజేశారు. 1927లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమీషన్ రిజర్వు బ్యాంకు అవసరాన్ని ఆమోదించింది. అలా 1935 ఏప్రిల్ 1న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అమల్లోకి వచ్చింది. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం తర్వాత 1949లో రిజర్వు బ్యాంకును జాతీయం చేశారు. 1926 నుంచి 1949 వరకు అంబేడ్కర్ ఈ చట్టాన్ని తీసుకురావటం కోసం ఎంతో మేధోపరమైన కృషి చేశారు. మన ఆర్.బి.ఐ.కు రూపకర్తగా నిలిచారు. అయినా ఆయన ఫొటో లేకుండా కరెన్సీ నోటు ఉండటం బాధాకరం. కరెన్సీ నోట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంబంధంలేని ప్రముఖుల ఫొటోలను ముద్రించటాన్ని మేము వ్యతిరేకించటం లేదు. కానీ ఆయన ఫొటోను కూడా కరెన్సీ నోటుపై ముద్రించటానికి అభ్యంతరమేమిటని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ఆర్.బి.ఐ. చరిత్రను అందరూ తెలుసుకోవాలని, కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలన్న మా డిమాండుకు మద్దతు తెలపాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మా డిమాండ్స్ ఇవి: 1) ఆర్.బి.ఐ కరెన్సీ నోటుపై తక్షణం అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలి. 2) ఈ దిశగా రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు బిల్లు ప్రవేశపెట్టాలి. 3) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాన్ని ప్రవేశపెట్టాలి. 

4) అంబేడ్కర్ విగ్రహాల వద్ద లైట్లను, సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసి విగ్రహాల ధ్వంసాన్ని అరికట్టాలి. 

5) కరెన్సీ నోటుపై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. ఈ డిమాండ్లతో మేము నవంబరు 26, 2021 నుంచి ఏప్రిల్ 14, 2022న అంబేడ్కర్ జయంతి దాకా జ్ఞాన బుద్ధ యాత్రను నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కోరుతున్నాం.

జేరిపోతుల పరశురామ్

ఇండియన్ కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి

Updated Date - 2021-11-23T07:20:00+05:30 IST