తెలుగు వారికే విశాఖ ఉక్కు

ABN , First Publish Date - 2021-02-26T06:13:59+05:30 IST

రెండు లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును రూ.4850 కోట్లకు కేంద్రం అమ్మదలుచుకున్నపుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పు చేసైనా...

తెలుగు వారికే విశాఖ ఉక్కు

రెండు లక్షల కోట్ల విలువైన విశాఖ  ఉక్కును రూ.4850 కోట్లకు కేంద్రం అమ్మదలుచుకున్నపుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర అప్పు చేసైనా సరే కొనుగోలు చేసి కాపాడుకోవాలి. దానివల్ల విశాఖ ఉక్కుకు ఉన్న 30 వేల ఎకరాలు, ఇతర వనరులు, మన ఉద్యోగాలూ మనకే మిగులుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు 5000 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు. అవి ఎంతో ఖర్చు చేస్తుంటాయి. అందువల్ల విశాఖ ఉక్కునే కాదు, కేంద్రం ఏది అమ్మినా రాష్ట్రాలు ఎలాగైనా సరే కొనేసి వనరులు ఇతరుల హస్తగతం కాకుండా కాపాడుకోవాలి. ఆయా ప్రాజెక్టుల కోసం కేంద్రానికి అవసరమైన భూములను ప్రజలను ఖాళీ చేయించి రాష్ట్రమే సమకూరుస్తుందని మరిచిపోరాదు. ఎవరు సేకరించినా భూమి మీద హక్కు రాష్ట్రాలకే ఉంటుంది. కనుక భూములను, అందులో ఉన్న పరిశ్రమలను తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించడం అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫెడరల్ సంబంధాలుంటాయి. కేంద్రం పరిశ్రమలను నడపడం తనవల్ల కాదనుకున్నపుడు రాష్ట్రమే పూనుకొని వాటిని, భూములను, ఉద్యోగాలను కాపాడుకోవాలి. అలా కాకుండా ప్రైవేటుపరం కానిస్తే ఉపాధి అవకాశాలు సగానికిపైగా తగ్గిపోతాయి. భూములు, ఆస్తులు ప్రజలకు చెందకుండా పోతాయి.  కనుక ఫెడరలిజం దృష్టికోణంలో రాష్ట్రాలు పూనుకుని వాటిని కైవసం చేసుకోవాలి. అవసరమైతే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు రెండూ కలిసి విశాఖ ఉక్కును కొని బయ్యారం,  రాయలసీమ గనులను తవ్వి తోడి ముడి సరుకు అందించి దానిని లాభాల బాట పట్టించాలి.

బి.ఎస్. రాములు 

బిసి కమిషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం

Updated Date - 2021-02-26T06:13:59+05:30 IST