కాలం మా వృత్తి

ABN , First Publish Date - 2021-02-05T06:46:09+05:30 IST

ఇంటిముందు కుక్కను కట్టేసుకున్నట్టు కులాన్ని కట్టేసుకుంటున్నవు ఆహంకారాన్ని పాలుపోసి...

కాలం మా వృత్తి

ఇంటిముందు

కుక్కను కట్టేసుకున్నట్టు

కులాన్ని కట్టేసుకుంటున్నవు

ఆహంకారాన్ని పాలుపోసి 

పెంచుకుంటున్నవు


ఒక్కనాడైనా

మగ్గంమీద బట్టలు నేసి

నీ అంగిలాగు నీవే కుట్టుకొని

నీవే ఉతుక్కోని తొడుక్కున్నవా

ఒక్కసారైనా

నీ చెప్పులు నీవే కుట్టుకొని

నీ కాళ్లతో నీవెన్నడైనా నడిచావా

ప్రతిభ ఉన్నోడవు గదా!


ఒక్క దినమైనా

నీ తలమీద బొచ్చు నీవే గొరుక్కోని

ఏదేవుడినైనా దర్శనం చేసుకున్నవా

ఏ పూటైనా

నీ ఇంటి కర్మక్షౌరం నీవేచేసుకొని

నీ మనసాక్షిగా నీవే నీళ్లళ్ల మునిగినవా

ప్రతిభ ఉన్నోడవు గదా!


ఏ కార్తిలో నైనా

చెరువుకింద మడికట్లకు నీళ్లు కట్టి

చెలుకలో నీవే గింజలేసుకోని

నీవే కలుపు పీకీ కల్లంచేసినవా

ఒక్కపండుగకన్న

ఊరి దేవళాన్ని ఊడ్చి సున్నమేసి

గుడిచుట్టూ ఎడ్లబండై ఉరికినవా

బొడ్రాయికాడ తప్పెటకొట్టి

మేకపోతును గోసి తిత్తి తీసినవా

ప్రతిభ ఉన్నోడివి గదా!


చస్తే చావు మైల

పుడ్తే పురుట్ల మైల

ప్రతిభున్న జాతెన్నడైనా 

కంటే మాయెత్తిపోసిందా

పురుట్ల బొడ్డుగోసిందా నీ ప్రతిభ


కట్టేసి పెంచుకుంటున్న

నీ కులోన్మాదాన్ని

మైలపోలు తీయడానికి

నా మంగలి కత్తుల్ని సానపడ్తున్న

పాలిచ్చి గోముగా సాక్కుంటున్న

నీ అహంకారాన్ని  మంటపెట్టడానికి

నా చాకిరేవు బండమీద దరువేస్తున్న

నీ ఉన్మాదానికి కుండగొట్టడానికి

నా కుమ్మరి వామును నిద్రలేపుతున్న


కులం మీ వృత్తి

కాలం మా వృత్తి


వనపట్ల సుబ్బయ్య

Updated Date - 2021-02-05T06:46:09+05:30 IST