పాలనలో ఇదేం దాపరికం!

ABN , First Publish Date - 2021-08-25T06:01:26+05:30 IST

ప్రభుత్వ జీవోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకుండా చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది...

పాలనలో ఇదేం దాపరికం!

ప్రభుత్వ జీవోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకుండా చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ప్రతి గోడపై నవరత్నాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి అమలుకు సంబంధించిన జీవోలను మాత్రం ఎందుకు ప్రజలకు తెలియకుండా దాచి పెడుతున్నారో చెప్పాలి. ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం రెండున్నరేళ్లలో రూ.400కోట్లకు పైగా వ్యయం చేసి పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ, వాటికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం కనిపించకుండా చేస్తామంటున్నారు. పారదర్శక పాలనను అందిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులను రహస్యంగా ఉంచదల్చుకున్నారు. 


తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాల్లో జీవోలు స్థానిక భాషల్లోనే ఇస్తూ సామాన్యులకు సైతం ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆంగ్లంలో ఇచ్చే జీవోలను కూడా ఇప్పుడు నిలిపివేస్తున్నారు. జీవోలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం వలన అనేక వాస్తవాలు ప్రజలకు తెలిసేవి. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్చి 2, 2009న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రోజు రాత్రి వరకు ఒక్క రోజులోనే 389 జీవోలిచ్చారు. అందులో భూముల క్రమబద్ధీకరణ, కేటాయింపులు రెవిన్యూ శాఖకు సంబంధించినవే 92 జీవోలున్నాయి. అప్పటి ప్రతిపక్షాలు ఈ జీవోలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో నిలిపివేశారు. నేడు ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తాయనే జీవోలను ఆన్‌లైన్‌లో నుంచి తీసేసే పద్ధతికి శ్రీకారం చుట్టారు. జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన రామ్ కీ, పెన్నా గ్రూప్, వాంపిక్, హెట్రో వంటి సంస్థలకు గనులు, ప్రాజెక్టులు, భూములు, ఓడరేవులు, నదీజలాలు కేటాయించిన విషయం, వారికి ఇచ్చిన రాయితీలు, మినహాయింపుల వివరాలు జీవోల ద్వారానే బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించి 26 జీవోలపై సీబీఐ విచారణ జరిగి జగన్మోహన్ రెడ్డి 16 నెలలపాటు జైలుకు కూడా వెళ్లారు, ఆరుగురు మంత్రులు పదవులు కోల్పోయారు.


ప్రభుత్వాలు తీసుకునే పాలనా పరమైన నిర్ణయాలు ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు తెచ్చేందుకు రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన ఈ–గవర్నెన్స్‌‍లో భాగంగా 2008లో జీవోలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించేందుకు 2005లో సమాచార హక్కు చట్టాన్ని అందుబాటులోకి తెచ్చారు. పరిపాలించే వారికి, పరిపాలించబడే వారికి మధ్య ప్రజాస్వామ్యంలో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండేందుకు అందుబాటులో ఉన్న సమాచార హక్కు చట్టాలను బలహీనపర్చేలా నేడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసుకునే అవకాశం లేకుంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? 


జగన్మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇసుక కొరత, వరదలతో పంటనష్టం, మద్దతు ధరలు, కోవిడ్ విజృంభణ వంటి అనేక సమస్యలున్నా... యుద్ధ ప్రాతిపదికన ఏనాడూ జీవోలు జారీ చేయలేదు కానీ, స్వప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఆఘమేఘాలపై జీవోలు ఇచ్చారు. జగన్‌రెడ్డి అక్రమ అస్తుల కేసులో ఎ5గా ఉన్న ఐఏయస్‌ శ్రీలక్ష్మిని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ జీవో నెం.423; ఎ10 మురళీధర్‌ రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ జీవో నెం.1218; ఎ10 శామ్యూల్‌ను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమిస్తూ జీవో నెం.1383; ఎ7 పెన్నా ప్రతాప్‌రెడ్డి కంపెనీలకు సున్నపురాయి గనులు కేటాయిస్తూ జీవో నెం.8718; ఎ7 సజ్జల దివాకర్‌రెడ్డి సోదరుడు సజ్జల రామకృష్ణారెడ్డికి జీవో నెం.1341 ద్వారానూ నియామకాలు చేపట్టారు. సొంత ప్రయోజనాలే తప్ప ప్రజా శ్రేయస్సును పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తుంది.

పాటిబండ్ల అనిల్

Updated Date - 2021-08-25T06:01:26+05:30 IST