పేదల అభ్యున్నతే సార్థక సంక్షేమం

ABN , First Publish Date - 2021-12-30T06:28:34+05:30 IST

ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రధాన ప్రాతిపదిక జాతి శ్రేయస్సు ముఖ్యంగా పేదల అభ్యున్నతే కావాలి. పాలకులకు ఈ విధ్యుక్త ధర్మాలను భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించాయి...

పేదల అభ్యున్నతే సార్థక సంక్షేమం

ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రధాన ప్రాతిపదిక జాతి శ్రేయస్సు ముఖ్యంగా పేదల అభ్యున్నతే కావాలి. పాలకులకు ఈ విధ్యుక్త ధర్మాలను భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించాయి. ప్రజా సంక్షేమానికి అవసరమైన విధానాలు రూపొందించడం, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించడం, సాధారణ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలలో అవసరమైన మార్పులు చేయడం ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. 


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంత పేద కుటుంబాలకు తప్పకుండా ఉపయోగపడుతున్నాయి. అయితే, ఈ పథకాల అమలు తీరులో, మార్గదర్శకాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మెరుగుపరుచుకుంటే ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రజలకు మరింత మేలు చేస్తాయి. 


తెలంగాణ రాష్ట్రంలో ‘ఆసరా’ పథకం క్రింద 2021 జనవరి నాటికి 37,86,020 మందికి వివిధ క్యాటగిరీల క్రింద పెన్షన్ అందిస్తున్నారు. అయితే, ఎంతమంది అర్హులు ఉన్నా, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం, పైగా ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ మొత్తాన్ని పెంచకుండా అదే మొత్తాన్ని కొనసాగించడం ఈ పథకంలో ఉన్న రెండు పెద్ద సమస్యలు. నెలకు 2000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తున్నట్లు కనిపించినా, నిజానికి కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు వివిధ క్యాటగిరీల క్రింద అర్హులు ఉన్నా వారికి పెన్షన్ లభించక పోవడంతో, ఆయా కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. మార్గదర్శకాల ప్రకారం మద్దతు అవసరమైన ప్రతి వ్యక్తిని గుర్తించి పెన్షన్ అందించాల్సిన ప్రభుత్వం కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించడం అన్యాయం.


మరీ ముఖ్యంగా 2018 సంవత్సరాంతం నుంచీ తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కొత్త వారికి పెన్షన్ ఇవ్వడం పూర్తిగా మానేసింది. మన్నే రఘు అనే సామాజిక కార్యకర్తకు సమాచార హక్కు చట్టం క్రింద వచ్చిన సమాధానం మేరకు రాష్ట్రంలో 1,88,876 మంది అర్హులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసి గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుందనడంలో సందేహం లేదు. 44,466 మంది వృద్ధులు, 82,455 మంది వితంతువులు, 39,356 మంది వికలాంగులు, 3,716 మంది గీత కార్మికులు, 1,889 మంది చేనేత కార్మికులు, 4,686 మంది బీడీ కార్మికులు, 7,805 మంది ఒంటరి మహిళలు, 1,575 మంది కళాకారులు, 2,898 మంది బోదకాలు బాధితులు - ఇలా ఎదురు చూస్తున్న వారిలో ఉన్నారు. వీరికి వెంటనే పెన్షన్ అందించాలి. దరఖాస్తు వచ్చిన వెంటనే విచారణ చేసి ఒక నెల రోజుల లోపే పెన్షన్ దరఖాస్తును పరిష్కరించేలా మార్గదర్శకాలను సవరించాలి. 


రాష్ట్రంలో 81,80,000 కుటుంబాలకు ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. ఈ కార్డు ఉన్న వారికి కిలో రూపాయి చొప్పున మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తారు. ఇటీవల అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన జవాబు ప్రకారం మరో 9,41,641 కుటుంబాలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 3,59,974 మందికి కార్డులు జారీ చేశారు. 92,892 మంది కార్డులను తిరస్కరించారు. మరో 4,88,775 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. అర్హులైన అందరికీ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలి.


తెలంగాణ ఆహార భద్రతా నియమాలు 2017 ప్రకారం ‘అంత్యోదయ అన్న యోజన’ క్యాటగిరీ క్రింద రేషన్ కార్డులు ఇస్తే, వారికి ప్రతినెలా కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా 35 కిలోల బియ్యం ఇవ్వవలసి ఉంటుంది. భూమి లేని వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, గ్రామీణ చేతి వృత్తుల వారు -కుండలు చేసేవారు, చేనేత కార్మికులు, కంసాలి, కార్పెంటర్ పనులు చేసేవారు, పూలు, పళ్ళు అమ్ముకుని జీవించేవారు, మురికివాడలలో నివసించేవారు, పాములు పట్టేవారు చెత్త సేకరించేవారు, చెప్పులు కుట్టేవారు, వితంతువులు, దీర్ఘకాలిక రోగగ్రస్తులు, వికలాంగులు, 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు మాత్రమే ఉన్న కుటుంబాలు, ఇతరుల సహాయం, తోడు లేని ఒంటరి మహిళలు, ఆదిమ ఆదివాసీ తెగలు, కుష్టు రోగులు, హెచ్‌ఐ‌వి బాధితులు, నిరాశ్రయులు, భిక్షాటన చేసేవారు ఈ పథకం క్రింద అర్హులు అవుతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్యాటగిరీ క్రింద చాలా మందికి AAY కార్డులు జారీ చేయడం లేదు. అర్హులైన వారికి తక్షణమే అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇవ్వాలి. 


మొత్తంగా పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంపై మాత్రమే ఆధారపడిన కుటుంబాలకు మరింత ఎక్కువ పరిమాణంలో బియ్యం సరఫరా చేయడంలో తప్పులేదు. కానీ ప్రస్తుతం సరఫరా అవుతున్న బియ్యంలో గణనీయమైన భాగం పేద ప్రజల ఆహార అవసరాలకు ఉపయోగపడకుండా పక్కదారి పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ రంగంలో అవినీతి మాఫియా వేళ్లూనుకుని ఉన్నది. అన్ని స్థాయిలలో అధికారులు, రాజకీయ నాయకులు ఇందులో భాగమై ఉన్నారు.


నిరుపేదలకు ఉచితంగా బియ్యం అందించినా, పేదలకు రూపాయికి కిలో బియ్యం ఇచ్చినా తప్పులేదు. కానీ అవసరం లేని వారికి కూడా ఆహార భద్రత పథకం క్రింద రూపాయికి కిలో బియ్యం విడుదల చేస్తూ అవినీతికి ఆస్కారం ఇవ్వడం, ప్రజాధనం వృధా చేయడం ఆపాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు కూడా ఈ కీలక సమీక్షకు సిద్ధం కావాలి. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యం సేకరణ చేయాలి కనుక, ధాన్యం ధరలు పెరగకుండా చూసుకుంటున్నది. ఫలితంగా దశాబ్ద కాలం గడిచినా ధాన్యానికి న్యాయమైన ధరలు లభించక రైతులు నష్ట పోతున్నారు.


ప్రజల వైద్య అవసరాల కోసం ఉపయోగించుకునే ఆరోగ్య శ్రీ పథకాన్ని రేషన్ కార్డుకు లింక్ చేయడం వల్ల కూడా, బియ్యం రేషన్ కార్డుల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజలందరికీ ఉచిత వైద్యం హక్కుగా అందిస్తూ, ప్రత్యేక ఆరోగ్య కార్డులు ఇవ్వడం ద్వారా, బియ్యం కార్డులు కేవలం నిజమైన పేదలకే అందేలా చూడాలి. 


దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా పథకం చాలా ముఖ్యమైనది. అవసరమైనది కూడా. 2018 ఆగస్టు 15 నుంచి ప్రారంభించిన ఈ పథకం వల్ల తప్పకుండా రైతు కుటుంబాలకు మేలు జరుగుతున్నది.


2018–19 సంవత్సరంలో 31,27,000 మంది రైతులు ఈ బీమా పథకం పరిధిలోకి వచ్చారు. వీరిలో 17,979 మంది రైతులు మరణించినప్పుడు వారికి 5 లక్షల రూపాయల చొప్పున 899 కోట్ల రూపాయలు పరిహారంగా అందింది. 2019–20లో 30,81,000 మంది బీమా పరిధిలోకి వచ్చారు. వారిలో 18,918 మంది రైతులు మరణించినప్పుడు వారికి 946 కోట్ల రూపాయలు పరిహారంగా అందింది. 2020–21లో 32,73,000 మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. వారిలో 11,158 మందికి 558 కోట్లు పరిహారంగా అందింది. 


కానీ ఈ బీమా మార్గదర్శకాలలో ఉన్న పరిమితుల వల్ల ఎక్కువ మంది గ్రామీణ రైతులకు, ప్రజలకు ఉపయోగం ఉండడం లేదు. ఈ పథకం కేవలం భూమిపై పట్టా హక్కులు కలిగిన వారికి మాత్రమే వర్తింపచేయడం వల్ల, అనేక మంది ఈ పథకం బయట ఉండి పోతున్నారు. ముఖ్యంగా భూమి ఉన్నా సరే, 59 సంవత్సరాలు దాటిన రైతులు, భూమి లేని కౌలు రైతులు, ఆదివాసీ పోడు రైతులు, భూమి హక్కులు లేని మహిళా రైతులు ఈ పథకం నుంచి మినహాయించబడుతున్నారు. పట్టా హక్కులు తండ్రి లేదా తల్లి పేరు మీద ఉండి, ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వ్యవసాయదారులైన పిల్లలు మరణించినా వారికి ఈ పథకం వర్తించడం లేదు. 


జనాభా లెక్కల విభాగంలో శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రికార్డుల ప్రకారం తెలంగాణ జనాభా 3,80,00,000. వీరిలో గ్రామీణ జనాభా 61 శాతం (2,32,00,000). 2018 ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాలో మరణాల రేటు 8గా ఉంది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రామీణ జనాభా మరణాలు 1,85,744 మంది. 15–59 సంవత్సరాల మధ్య మరణాల రేటు 2017లో 33.3 శాతం కాగా, 2018లో 36.9 శాతం. 2017–18, 2018–19 సంవత్సరాలు కలిపి సగటు మరణాల రేటు 35.1 శాతం. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతంలో 15–59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారి మరణాలు 65,196. కానీ రైతు బీమా పరిహారం కేవలం ఎక్కువలో ఎక్కువగా 18,918 మందికి మాత్రమే అందింది. అంటే మొత్తం మరణాలలో ఇవి 25 శాతం మాత్రమే. 


పైగా గ్రామీణ ప్రాంతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 60 లక్షల మంది వ్యవసాయకూలీలు ఉన్నారు. లక్షల సంఖ్యలో భూమిలేని చేతి వృత్తుల వారు ఉన్నారు. భూమి లేని పశు పోషకులు, మేకల గొర్రెల పెంపకందారులు, గీతకార్మికులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వారికి ఈ పథకం వర్తించడంలేదు. అందువల్ల రైతు బీమా మార్గదర్శకాలలో కొన్ని సవరణలు చేయాలి. రైతు బీమా పథకాన్ని గ్రామీణ ప్రజల బీమా పథకంగా మార్చాలి. మొత్తం గ్రామీణ ప్రజలను ఈ బీమా పథకం పరిధిలోకి తీసుకు రావాలి. వ్యక్తిని కాకుండా కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించాలి. ఆ కుటుంబంలో 16 సంవత్సరాలు దాటిన ఎవరు మరణించినా ఆ కుటుంబానికి పరిహారం అందించాలి. బీమా వర్తించడానికి వయో పరిమితిని 75 సంవత్సరాలకు పెంచాలి.


తాజాగా రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డ్ నియామకమైంది. గ్రామీణ ప్రజలు ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు కూడా ఈ బోర్డ్ పరిధిలోకి వస్తారు. గ్రామీణ ప్రజలను బోర్డ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వేగంగా విధి విధానాలను ప్రత్యేకంగా రూపొందించాలి. అమలు చేయాలి. స్థానికంగానే తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు కల్పించాలి. అలాగే కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన E-shram పోర్టల్‌లో మొత్తం గ్రామీణ శ్రమ జీవులను, ఆదివాసీ ప్రాంతాల ప్రజలను నమోదు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.


విద్యుత్ షాక్ మరణాలు, పిడుగు పాటు మరణాలు, అడవి జంతువుల వల్ల దాడికి గురై మరణాలు జరుగుతున్నా కూడా అవి సరిగా నమోదు కావడం లేదు. వీటికి పరిహారం చెల్లించడానికి జీవోలు ఉన్నా సరిగా ఆమలు కావడం లేదు. ఈ జీవోలు ఉన్నాయనే విషయమే గ్రామీణ ప్రజలకు తెలవదు. ఈ జీవోల ప్రతులను, మార్గదర్శకాలను తెలుగులో గ్రామపంచాయితీలో అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పరిపాలనలో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవే. పరిపాలకులకు తోచినట్లు కాకుండా, పేదలకు ప్రయోజనకరంగా సంక్షేమ పథకాల అమలు ఉండాలి.


డాక్టర్ బాలగోపాల్ చెప్పినట్లు సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తున్న భిక్ష కాదు. సంక్షేమం పొందడం ప్రజల హక్కు. ప్రజల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు పెంచినా తప్పు లేదు. సంక్షేమ పథకాల అమలులో లోపాలు చూపి, వాటిని తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసే పని ప్రజా పక్షపాతులు బాధ్యతగా చేపట్టాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-12-30T06:28:34+05:30 IST