మలుపు తిప్పిన జర్నలిస్టు ఉద్యమం

ABN , First Publish Date - 2021-05-30T07:17:04+05:30 IST

వికసించే కాలాల్లో వీరులు పుడతారు, పోరాడతారు. కానీ ఉద్యమ కాలాలు జీవితం పొడవునా మనల్ని నడిపే దారి దీపాలుగా ఉంటాయి. తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి...

మలుపు తిప్పిన జర్నలిస్టు ఉద్యమం

వికసించే కాలాల్లో వీరులు పుడతారు, పోరాడతారు. కానీ ఉద్యమ కాలాలు జీవితం పొడవునా మనల్ని నడిపే దారి దీపాలుగా ఉంటాయి. తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఒక వేదికగా ఏర్పడి పోరాడడమే చైతన్య సందర్భం, వెలిగిన సందర్భం. అది తెలంగాణ జర్నలిస్టులను మలిచిన దారిదీపం. ఒక అస్తిత్వపోరాటంలో మమేకమై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ప్రభావం వేసి తెలంగాణ ఉద్యమానికి కలాలను ఆయుధాలుగా చేసుకొని పోరాడిన ‘తెలంగాణ జర్నలిస్టు ఫోరం’ ఏర్పడి రెండు దశాబ్దాలు. ఇరవై ఏళ్ల క్రితం, 31–మే నాడు ప్రెస్‌క్లబ్‌లో వందలాది జర్నలిస్టులతో, తెలంగాణ ప్రముఖ నాయకులతో ఆ సభ జరిగి ఇరవై ఏళ్లు. అప్పటిదాకా ఉన్న జర్నలిస్టు ఉద్యమాల స్వరూప స్వభావాలను మార్చివేసిన ఉద్యమం ప్రారంభమైన రోజు అది. టీజేఎఫ్ అనే చిరునామాకు పుట్టిన రోజు. జర్నలిస్టుల రాజకీయ అవగాహనల్లో, ఉద్యమ కార్యాచరణలో, ఆర్థిక డిమాండ్ల స్థానంలో జాతి విముక్తి డిమాండ్‌ను ముందుకు తెచ్చిన ఉద్యమం అది. ఆ రోజును తలచుకోవడమే కాదు, ఆ స్పృహను, అవగాహనను, పదును పెట్టుకొని ఊరేగాల్సిన సందర్భం ఇది. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు అనే చైతన్యాన్నిచ్చింది తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్. 


అదేమంత సులభంగా ఏర్పడలేదు. తెలంగాణ భావన అంటేనే వ్యతిరేకతలు ఉన్నకాలం అది. జర్నలిస్టులు తెలంగాణ వారే అయినా బయటపడి బహిరంగంగా మాట్లాడే పరిస్థితులు లేవు. వేధింపులు ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. పరాధీనులుగా ఉన్న తెలంగాణ జర్నలిస్టులకు తొలి ప్రేరణ తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులే. 1996 నుంచి ప్రారంభమైన మలి తెలంగాణ ఉద్యమ కదలికలు, తెలంగాణ పరిస్థితులపై మేధావులు, బుద్ధి జీవులు పెంచిన అవగాహనలు, తెలంగాణ అస్తిత్వ సమస్యను అన్ని కోణాల నుంచి అర్థం చేసుకున్న కొత్త అవగాహనలు తెలంగాణ జర్నలిస్టులను కొత్త దృక్కోణాల్లోకి మళ్లించింది. పూర్వ రంగంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టు ముఖ్యుల సమావేశాలు, అప్పటికే ఆధిపత్యం, అస్తిత్వం, తెలంగాణ తోవల నడిచిన చర్చ, సంస్కృతి, అస్తిత్వాల ప్రత్యేక వేదికల ఏర్పాట్లు చర్చోప చర్చల కార్యరంగం ఉన్నది. 


బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయాల మధ్య, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, విముక్తి, ఆధిపత్య భావ జాలాల సారాంశాలూ స్వరూపాలూ అవగాహన చేసుకున్న గుప్పెడు మందితో ఇది ప్రారంభం అయ్యింది. అప్పటికే లబ్థ ప్రతిష్టులయిన, తెలంగాణపైన బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ల మద్దతుతో, కసరత్తు ప్రారంభం అయ్యింది. ఈ చర్చోపచర్చల వల్ల తేలేది ఏమీ లేదు, తెలంగాణ భూమి పుత్రులుగా కార్యరంగంలోకి దూకడమే అని తెగించి ఆ పిడికెడు మంది తలపడ్డారు. అప్పటికి ప్రాంతీయ అస్తిత్వాలకు సంబంధించిన అవగాహనల్లో ‘తటస్థత’ రాజ్యం ఏలుతున్నది. అదొక కపట నినాదం, ఆధిపత్య భావజాలాన్ని కాపాడే సాధనం అని ‘తటస్థత’ అనే ఒక భ్రమను తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటు బద్దలు కొట్టింది. తెలంగాణలో అన్ని రంగాల ఉద్యోగులు, బుద్ధి జీవులు, అందరూ తెలంగాణ అంటున్నప్పుడు, జర్నలిస్టులు ‘తటస్థత’ పేరిట అటు ఇటూ కాకుండా ఉండకూడదని, తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ తల్లి విముక్తి మన బాధ్యత అని కుండబద్దలు కొట్టింది టీజేఎఫ్. 


‘తెలంగాణ, మే, 31’ అనే ఒక పుస్తకం 13 వ్యాసాల సంకలనం ఆనాడే ఆవిష్కృతమయింది. ‘ఆఖ్‌రీ మోఖా–ఔర్ ఏక్ దక్కా’ అనే నినాదంతో ఒక చిన్న కరపత్రం. జర్నలిస్టులు ‘తటస్థత’ను బద్దలు కొట్టి బయటపడ్డారు. పన్నెండేండ్లపాటు తెలంగాణ అన్ని ఉద్యమాల్లో, అన్ని ఆందోళనల్లో, అన్ని పార్టీల అనుసంధానంలో, ఎక్కడ చూసినా జర్నలిస్టులే కనబడే స్థాయికి ఎదిగింది. ఒకవైపు ఆందోళనలు, మోర్చాలు, ఊరేగింపులు, సభలు, ధూమ్‌ధామ్‌ల్లో పాల్గొంటూనే, మరో వైపు ఉద్యమం చతికిలపడ్డప్పుడల్లా అది మళ్లీ లేచి నిలబడడానికీ, మరొకమాటు ఎగసిపడేలా ఊపిరులూదడానికి ఫోరమ్‌ బహుముఖ కార్యక్రమాలు చేపట్టింది. 


పని భద్రత, ఉద్యోగుల జీత భత్యాలు, వేజ్ బోర్డుల సాధనలో మాత్రమే కూరుకుపోయి గిడస బారిన ట్రెడ్ యూనియన్ రాజకీయాలు బద్దలయ్యాయి. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అన్న ఏకత్వం సాధ్యమయ్యింది. యాజమాన్యాలు ఎవరివైనప్పటికీ, జర్నలిస్టులు తెలంగాణ చైతన్యంతో సమస్యలను లేవనెత్తారు. తెలంగాణపై అన్ని కోణాల్లో వార్తలు రాయడం, వ్యాసాలు రాయడం ప్రారంభం అయ్యింది. నీటిగోస, నియామకాల వివక్ష, నిధుల మళ్లింపులతో పాటు వలస ఆధిపత్యం, భావనలు, పోకడలు, అస్తిత్వ వాదనల కథనాలు విపరీతంగా రాయడం ఒక చైతన్యం అయితే ప్రత్యక్షంగా ఉద్యమంలో మమేకం కావడం మరో పార్శ్వం. అదే జర్నలిస్టుల ఫోరమ్ ప్రధాన మలుపు. 


అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ప్రారంభం అయిన విద్యార్థి ఉద్యమం వెంట జర్నలిస్టులు ఉన్నారు. జేఏసీ ఏర్పడడంలో కానీ, విద్యార్థులు నిర్బంధం ఎదుర్కొన్న సందర్భాల్లో కానీ, విద్యార్థులు ఉద్యమ సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో కానీ, చివరకు క్యాంపస్ నిర్బంధం సందర్భంలో కానీ జర్నలిస్టులు విద్యార్థులతో భుజం భుజం కలిపి పోరాడారు. రోజుల తరబడి విద్యార్థి సమూహాల మధ్య జీవించారు. మరోవైపు సింగరేణిలో నిర్బంధం సందర్భంలో తెలంగాణ జర్నలిస్టుల పోరాటం ఎన్నదగింది. సింగరేణి ఉద్యమం మీద ముద్రలు వేసి అణచివేసే ప్రయత్నం చేసినప్పుడు అన్ని పార్టీల నాయకులను కలుపుకొని సింగరేణి జైత్రయాత్ర చేసి లక్షలాది మందితో సమావేశాలు ఏర్పాటు చేసింది జర్నలిస్టుల ఫోరమ్. కార్మిక, విద్యార్థి, బుద్ధి జీవుల మధ్య జర్నలిస్టులు పని చేసిన ఈ తొలి సందర్భం–ఉద్యమ విశేషం కూడా. అసెంబ్లీలో తెలంగాణ మాట వినపడకూడదు అన్నప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజాప్రతినిధులను కూడగట్టి తెలంగాణ కేతనం ఎగరేసింది జర్నలిస్టులే. అంతటా నిర్బంధం. కదలడానికి మెదలడానికి కాని కాలం. ఆ సమయంలో 144 సెక్షన్ లను అధిగమించి గన్‌పార్క్ స్థూపం నుంచి ఆర్టీసీ కళ్యాణమండపం దాకా పదివేల మంది జర్నలిస్టులతో ఊరేగింపు జరిపింది. ఒకవైపు ఉద్యమంలో రకరకాల అభిప్రాయ భేదాలు వచ్చిన కాలం అది. ఆర్టీసీ కళ్యాణమండపంలో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపీఐ, బీజేపీ, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను కూడగట్టి మరోవైపు అదే వేదిక మీద గద్దర్, కేసీఆర్ ‘అలాయ్ బలాయ్’ చేయించింది జర్నలిస్టుల ఫోరమ్.


ఇదంతా ఒకెత్తు అయితే, ఒక అస్తిత్వ ఉద్యమ సందర్భంలో కానీ, మరే ఉద్యమ సందర్భంలో కానీ ఇప్పటి వరకు రెండువేల మంది జర్నలిస్టులు ఢిల్లీకి వెళ్లిన ఘట్టం ఇప్పటివరకు చరిత్రలో లేదు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు కట్టుకుని 2 వేల మంది జర్నలిస్టులు ఢిల్లీ వెళ్లి ఊరేగింపు జరిపి పార్లమెంటు పక్కలో టెంట్ వేసి అన్ని పార్టీల నాయకులతో రోజంతా ధర్నా చేసిన ఘనత జర్నలిస్టు ఫోరమ్‌దే. ఇదొక మహత్తర ఘట్టం. చలో హైదరాబాద్‌లో మేమున్నాం, సాగరహారంలో మేమున్నాం, ఓయూలో, కేయూలో, ఉర్రూతలూగే ప్రజా శ్రేణుల్లో మేమున్నాం. 


చివరగా ఒక మాట: ‘తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు వస్తున్నది. మన వాళ్ల ఏర్పాట్లు ఏమీ లేవు. ఏమన్న చెయ్యండి. రేపు అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతు పలకాలె. ఒక్క ఫోరమ్ వల్లనే ఇది సాధ్యం అవుతుంది’ అంటూ తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్‌కు కేసీఆర్ ఫోన్. దీంతో, ఒకేపూటలో ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా అన్ని పార్టీల్లోని తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లక్డికాపూల్ హోటల్‌కు రప్పించి, ‘ఫ్లోర్ మేనేజ్ మెంట్’ రూపకల్పన జరిపింది, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహన్ని రచించింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌. తెలంగాణ ప్రకటన తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ 10 వేల మంది జర్నలిస్టులతో బ్రహ్మాండమైన సభ నిర్వహించింది. కేసీఆర్‌తో పాటు అన్ని రాజకీయపార్టీల నాయకులు హాజరైనారు. తెలంగాణ జర్నలిస్టు పోరాట అనుభవం, కార్యాచరణ జర్నలిస్టు ఉద్యమాలకు ఒక కరదీపిక. ఈ పోరాటం చరిత్రకు ఎక్కదగింది. జై తెలంగాణ.

అల్లం నారాయణ

తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు, 

వ్యవస్థాపక కన్వీనర్

(మే 31: టీజేఎఫ్‌కు 20 ఏళ్లు)

Updated Date - 2021-05-30T07:17:04+05:30 IST