పోయినవాడు చంద్రుడు!

ABN , First Publish Date - 2021-05-02T06:07:28+05:30 IST

చంద్రని చూడగానే (ఒకనాడు) స్థిమితంగా ఉండగల అమ్మాయిలు ఉండేవారా? అని నాకయితే అనిపించింది. ఆయనకు జతకూడిన రాజారామ్మోహన్‌ రావును...

పోయినవాడు చంద్రుడు!

చంద్ర : (1946–2021)

చంద్రని చూడగానే (ఒకనాడు) స్థిమితంగా ఉండగల అమ్మాయిలు ఉండేవారా? అని నాకయితే అనిపించింది. ఆయనకు జతకూడిన రాజారామ్మోహన్‌ రావును చూసినా అలాగే అనిపించేది.- అందం మనిషయిన వాళ్లిద్దరూ 18 సెం.మీల రిక్షాలో ఇరుక్కుని చిక్కడపల్లిలోనో, మరెక్కడోనో వెడుతోంటే అట్టివిధంగా అనిపించిన కాలం 1978 ప్రాంతాలు. పరిచయం అయిన పది నిముషాలకే ‘ఏరా’ అని ఎవరినైనా పిలవగల ఈ సహృదయులు లాగి లెంపకాయ కొట్టినా మరేమనిపించదనిపించింది. అలాగని తొలిచూపు ప్రేమ ముచ్చట కాదు-. తొలి చూపులోనే ‘రావోయ్‌’ అంటూనే ‘పోరా’ అనే భావం వ్యక్తం చేయగల చిత్కళ ఇతడిలోగలదనీ అనిపించక మానలేదు. బొమ్మ వేసినంతసేపూ అత్యంత సహనం; దానికి ముందు వెనుకల పనికిమాలిన వాళ్ల కోసం నిష్కారణంగా గోవర్ధనగిరి మోస్తున్నట్టు చిరాకు, తిక్క వెరసి అసలే అందమైన పెద్దకళ్లు బుర్ర చితక్కొట్టినట్టు చూసేవి! అదీ చంద్ర తొలి పరిచయపు మలి అనుభవం! నిజం---– ఆపై అంతా ప్రేమచూపులు, మిర్చిబజ్జీలు వేడిగా నమిలే నోరూనూ... నాకయితే ‘30 రోజుల్లో చంద్ర కావటం ఎలా’ అనే ఊహ రాకపోలేదు. ఆ రోజుల్లో ఓ రోజున–స్తంభంలో ఏముందో తెలీక హిరణ్యకశిపుడనే ఆసామి పెద్ద చిక్కు తెచ్చుకున్నట్టే– ‘‘బొమ్మ కొంచెం అర్జెంటుగా కావాలి’’ అని నోరు పారేసుకున్నాను. నా తిక్క వెనువెంటనే దివ్యంగా కుదిరింది. ఇదీ అందమైన విషాదం, నా తొలి పరిచయ ఘట్టం.


ఆంధ్రభూమి, జ్యోతి నెలసరి పత్రికల్లో, యవ్వన అజ్ఞానపు వేళల్లో, నావలె ఎక్కువమందికి ఇలాగే కదా జరిగేదని తెలిసిన రోజుల్లో... చంద్ర దర్శనం అంత సులభం కాదు. ఇప్పుడన్నిరకాల నిబ్బులు, పెన్నులు, బ్రెష్‌లు సరఫరా లేని కాలంలో ఇండియన్‌ ఇంకు జలపాతంతో అన్నేసి బొమ్మలు నిర్విరామంగా గీసి పడెయ్యడానికి ప్రధాన కారణం– ‘‘కళ ఆవేశం కాదురా- నిలిచి బతకాలి’’ అని ఓ పది నిముషాలు లెక్కల మేష్టరులా ప్రేమలు, సంసారం, వృత్తిలో పోటీ ఈక్వేషన్‌లు చెప్పాడు. ‘అపరాధ పరిశోధన’ కథలు, ‘డోర్యా రేకులనే వాడండి’ వంటి అడ్వర్టయిజుమెంట్‌ బొమ్మలు.. గూడ్సుబండి బోగీలన్ని పెట్టెల పెట్టెల పని. గీసినదే తడవుగా మరిన్ని గీయడానికి ఆ బొమ్మల వెనుక బుర్ర, శ్రమ, ఆలోచన ఎలా? అని ఓ వేళగానివేళ అడిగితే ‘‘ప్రతి కథ, రచనా చదివితే పని జరగదు-. అలా చదవాల్సిన కథలు ఎక్కువ ఉండవు-. ఈ సీరియళ్లు, కథల రచయితలూ సబ్బెడిటర్‌ కుర్రాళ్ళూ ఎలాగూ సినిమా కథలా చెప్పేస్తారు-. నోరు మూసుకుని గీసి పడెయ్యటమే- కానీ వొళ్లు దగ్గర పెట్టుకుని!’’ అని చంద్ర బోధ జరిగింది. ‘‘నిజానికి నచ్చిన కథలు, నవలలూ తిరిగి చూసి చదవటం వలన బొమ్మలు ఆలస్యంగా ఇవ్వాల్సి వస్తుంది-. ఆలస్యం అయితే అసలే పెనుపోటీ, ఆపై చెడ్డపేరూనూ’’ అని చంద్ర చెప్పిన సందర్భంలో ఆయన చుట్టూ కనిపించిన దృశ్యాలు సస్పెన్స్‌లా వేలాడడం చూశాను. ప్రముఖ నవలా కార్లూ బస్సులూ, ప్రకటనదారులూ సబ్బెడిటర్‌ మూకా, మిత్రుల టూకీ సందర్శన, కాబోయే ఉత్తమ కార్టూనిస్టుల మినీ ఇంటర్వ్యూల ఎదురుచూపులూ... ఇలా గడియారంలో పెండ్యులమ్‌లా చంద్ర చుట్టూ పరిభ్రమించే వారితో బాటు, బెజవాడ ఏలూరు రోడ్డు పబ్లిషర్‌ పెద్దలు చిరునవ్వు వంటి కోపం ప్రదర్శిస్తూ కనబడేవారు-. అందరికీ అన్ని వరాలూ టోకున ఇచ్చే ప్రముఖ దేవుడిలా చంద్ర... బలే దృశ్యాలు అవి!


పై దృశ్యాల్లో ఉపదృశ్యం కార్టూన్‌లు వేయడం– కథలు, మహత్తర నవలల సీరియల్‌ భాగాలూ, ‘నవల్సు’ల అట్టబొమ్మలు, అర్జెంటు పోర్‌ట్రెయిట్‌లూ, పాతమిత్రుల ప్రేమ బెదిరింపుల మధ్య కార్టూన్‌లు ఎలా పుట్టుకొస్తాయి? ‘‘...అందుకేగదా బొమ్మలు ఆలస్యంగా ఇస్తారు చంద్ర అని నన్ననేది! ఒక కార్టూన్‌ ఐడియా రాగానే వెంటనే అది వేసెయ్యకపోతే దాని హాస్యదృశ్యం మరిచిపోయినా, పాతబడిపోయినా కష్టం గదా-! అందుకని ఒక ఊపున పదోపాతికో కార్టూన్‌లు వేసేసి హమ్మయ్య అని కథలకి బొమ్మలు గీస్తుంటా. అఫ్సరు, నీలాంటివాడు నన్ను ఆలస్యం చేసేడంటారు-’’ అని తొలిప్రేమలో కొత్తగా దెబ్బతిన్న వెర్రిపిల్లలా అదంతా చెప్పేరు చంద్ర.


చంద్ర వేసిన బొమ్మలు, చంద్ర దగ్గర గల ఆర్టు పుస్తకాలూ చంద్రకే లెక్క తెలియవని నాకు ఇట్టే తెలిసింది. పుస్తకం కొని సంతకించి, పేజీ తిప్పకుండా అవతల కట్టల్లో పడేసిన సందర్భాలూ చూశాను. పోర్‌ట్రెయిట్‌ పని, వాటర్‌ కలర్‌, ఆయిల్‌ కలర్‌ పని, నలుపు-తెలుపు కార్టూన్‌ పని అయి, కానీ వేళల్లో తన సినీ ముచ్చట పనులు గాక– చంద్రలో క్రోక్విల్‌, పెన్‌ పనితనపు వేళలు వేరే బోలెడున్నాయి.


అప్పుడు, ఆ సమయాల్లో మలిన శృంగార దృశ్యసంభ్రమాలు కట్టలు కట్టలు కట్టతెంచుకుని కనిపించాయి.. అనగా, చంద్ర చూపెట్టాడు- ఎన్ననీ?! ఆ గీతలు, నలనల్లని సనసన్నని బ్లేడుతో గీసినట్టు రేఖలు, గీతలు, స్ట్రోక్‌లు, శరీర అధోభాగపు అడవులు, రెల్లు, కీలక అవయవాల భోగట్టా, వాటి రూపురేఖల జరజర గీతలు ఎన్నెన్నో... కాగితం చిరిగిపోదా ఆ సన్నని పాళీగీతలకి? అని పరమాశ్చర్యం కలిగించే గీతలవి!


‘‘ఇలాటి బొమ్మల వెనుక గమనింపు, శ్రమ, గీసిన ఫలితం ఎవడికి కావాలిరా?! బోడి బూతుబొమ్మలే గదా ఇవి అనికొట్టిపడేసిన రచయిత మిత్రులు వున్నార్రా నాకు’’ అని చంద్ర చేతిలో సిగరెట్టు వేళ్లని చుర్రుమనిపించేవరకు చెప్పి అవతలపడేయటం గుర్తు. సంగీతం వినటం, బొమ్మలు చూడటం, తెలుగు సినిమా చూసేటంత సులువు కాదు- దుఃఖభాజనమయిన ఆ వెన్నతోపెట్టని విద్య వేరు- అని చంద్ర వేసిన నలుపు-తెలుపు ‘అఘాయిత్యపు’ బొమ్మలు చూస్తే ఎవరికైనా తెలియక మానదు.


మొదటి భాగంలో చివరి పేరా వలె–‘సినిమా ఫస్టాఫ్‌’లో  ఎన్‌టిఆర్‌ రిక్షా తొక్కి విశ్వచెల్లి చంద్రకళను ఎంబిబిఎస్‌ చదివించినంత–తిప్పలు పడ్డాడు చంద్ర- ‘ఫస్టాఫ్‌’లో. పది నిముషాల్లో పాతికమందిని శత్రువులుగా చేసుకోగల గొప్ప టేలెంటు కూడా నేను చూశాను-. పరిచయం అయీ అవని కుర్రాడికి సైతం పెద్ద చిత్రకారులు ఫోటో దృశ్యాలను ఎలా కాపీ కొట్టేవారో, పాత ఫోటో, దాన్ని కాపీలాగించిన ఇలస్ట్రేషన్‌– విఎకె రంగారావుగారు రికార్డుల కథ చెప్పినట్టు– చూపెట్టేవాడు-. చంద్రకళ తెలీని విద్యార్థి మూర్ఖుడు సరాసరి ఆ పెద్ద చిత్రకారుడికి చెప్పక ఊరుకుంటాడా?!... సకారణంగా పెద్దల నుంచి కోపతాపాలు సరఫరా దింపుకున్న వైనం తనే చెప్పాడు. దీనంతటి వెనుక బొమ్మలు వేస్తున్న, నేర్చుకుంటున్న దశలో పడే శ్రమ, శ్రద్ధ ఫలితం, ఆపై కాపీ కాదు, ఇన్‌స్పిరేషన్‌’’ అని గ్రహించిన సంస్పందన చంద్ర చెబుతోంటే ‘‘శ్రద్ధవాన్‌ లభతే విద్య’’ అనే ముఖ్యమైన సంగతి అర్థంకాక పోదు.


చంద్ర ప్రాచీన తొలిప్రేమ గాక, తీరిగ్గా ‘సెకండాఫ్‌’ ప్రేమ, దాని పర్యవసానంతో చాలా సంవత్సరాలుగా గట్టిగా ఇవిగో బొమ్మలు అని గీసిన సంఖ్య అత్యల్పం. ఆపై స్వభావానికి గిట్టని ఉద్యోగం ఒకటి వెలగబెట్టి, శత్రువుల్ని పోగేసుకుని, ప్రేమించే మిత్రుల ఓదార్పుతో ధైర్యం కూడదీసుకున్నంతగా బొమ్మలు వేసింది తక్కువ– తిన్న దిక్కుమాలిన మిర్చిబజ్జీలు, పాకం వోడిపోతుండే జిలేబీలూ ఎక్కువ. ఐనా తన ఆరోగ్యం గట్టిదని భ్రమించేవాడిని. మంచి చెప్పిన సన్మిత్ర పెద్దల్ని చంద్ర తుపాకి వేటు దూరంలో ఉంచడం మూలానూ వ్యక్తిగత ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోడం లేదని అనుకున్న వారిలో నేనొకడిని. ఇవి చిత్రకళ/ఇలస్ట్రేషన్‌ పనికి సంబంధం లేనివని అనుకోలేము. (‘‘బాల్జాక్‌ డైడ్‌ ఆఫ్‌ ఫిఫ్టీ థౌసెండ్‌ కప్స్‌ ఆఫ్‌ బ్యాడ్‌ కాఫీ!’’) 


అదంతా అలాగెలాగో ఉండగా, చంద్ర ఇలస్ట్రేషన్‌, ఇతర బొమ్మలు, కార్టూన్‌లు విడివిడిగా గాని, కలగలిపి గాని, ఎవరేనా పెద్ద పుస్తకంగానో, చిన్న మ్యూజియంగానో చేస్తే చూడాలనుకోడంలో తప్పులేదు-– ప్రయోజనకరం. కానీ బాపుగారి గురించి చెప్పినట్టే అంత పెద్దగా ఏమీ జరగదనే సినికల్‌గా అనుకోవలసిందేనా?!


చివరిగా తరచు చంద్రగారింట తారసపడిన కొన్ని సరదా దృశ్యాలివిగోండి. ముచ్చటకే సుమా.

1. ఫలానా దీపావళి ప్రత్యేక విస్తరాకు సైజు నెలసరి జ్యోతి సంచిక... అర్జెంటు ఇలస్ట్రేషన్‌ ‌- నిన్ననే కావలసివుండగా నేటి దుస్థితి దృశ్యం...


‘‘చంద్ర, బొమ్మలు, ప్రింటింగు షెడ్యూలు...’’ అని నోరు విప్పే ముందు- చాపమీద... శేషశయనుడిలా చంద్ర- – కాకపోతే బోర్లాపడుకుని– రుషుల అమాయక చాదస్తపు స్తోత్రాలు వింటూ కనులు మూసివుంచిన శ్రీమహావిష్ణువువలె... ఆపై- చంద్ర సమస్త సంతానం ఆయన శరీరం మీద అటు నుంచి ఇటు పెరేడ్‌ చేయటం-, ఆయన ఆ మసాజ్‌ని ఆనందించటం-, సగం విరిగిన కప్పులో సిగరెట్‌ విదల్చటం-, పనిమీద వచ్చిన వాడి పని సఫా. గట్టిగా నవ్వాలో, వెర్రిగా ఏడవాలో తెలీని సదసద్‌దృశ్య విషాదం! ఓ అరగంట తరువాత ‘‘ఏరా?!’ ‘ఒండా నొందు కాల దల్లి’ బావుందా అని కుశలప్రశ్న. వచ్చిన కష్టమరు వొంట్లో మంటలు గాక ఏముంటాయి?! చిట్టచివర్న- ‘సాయంత్రం రారా- నే లేకపోయినా లల్లూని అడుగు బొమ్మలు ఇచ్చేస్తుంది’’ అని ధైర్యం పోసి పంపడం!


2. మధ్యాహ్నం ఒళ్లు, ఎండాకాలమూ మండిపోతుండగా... అత్యవసర ఎమర్జెన్సీ బొమ్మ కావలెను- అప్పటికే పరమాలస్యం-ఘోరం. ప్రింటింగ్‌ షెడ్యూలు మార్చలేని వైపరీత్యం-...


చంద్ర ఇంటి తలుపు పగలగొట్టేంత కోపంతో ప్రేమగా, నింపాదిగా తలుపు తీస్తే... ‘‘రారా... మిర్చి తింటావా? చాయ్‌ తాగుతావా?...’’ అని చంద్రహాసం. ‘‘అర్జెంట్‌ ప్లీజ్‌ బొమ్మ’’...


‘‘వొళ్ళు నొప్పులురా-– రాత్రి నిద్ర లేదు,- చెయ్యి లాగుతోంది.. 15 బొమ్మలు వేశా. కొద్దిగా జ్వరంగా ఉంది... నీరసం... సరే కూర్చో’’ అని చంద్ర ‘ఫాట్‌ లిటిల్‌బాయ్‌’ని ప్రయోగించాడు. మూర్ఖుడయిన అర్జునుడు భగవద్గీతను టూకీగా మళ్లీ చెప్పమన్నట్టు! అలా మళ్ళీ చంద్ర చేత చెప్పించుకోడందేనికి? నేను వెనుదిరగబోయా... ప్రముఖ గొలుసు నవలాకారుడు, మరో అర రచయిత ప్రత్యక్షం... ‘‘చంద్రా, రెడీయేగా?! మేట్నీ టికెట్స్‌ రెడీ-.. కారు రెడీ’’ అని అన్నారు. అటక మీద నుంచి పిల్లి దూకినట్టు చంద్ర లేచి... ‘షర్టు వేసుకోనీండి’’ అంటూ కదిలాడు-. కొంచెం సిగ్గుపడి నా కేసి చూసి ‘‘రాత్రి నైన్‌కి గేరంటీ... వచ్చి బొమ్మ పట్టుకుపో’’ అన్నాడు.


చంద్ర మీద నేటికీ ప్రేమ, గౌరవం, అభిమానం నాకే కాదు ఎవరికీ తగ్గవనిపిస్తుంది. నిజంగా రాత్రి తొమ్మిది గంటలకు బ్రహ్మాండమైన బొమ్మ! రెడీ... కథ, దానికి చంద్ర బొమ్మ తరువాతి సంచికకు!

అంతమంచి బొమ్మల, కార్టూన్‌లవాడు గనుకనే చంద్ర చల్లనివాడు. తన లేనితనం మరీ మరీ కనిపించే వాస్తవం.- చంద్రకు నమస్కారాలు.

శివాజీ తల్లావజ్ఝల


Updated Date - 2021-05-02T06:07:28+05:30 IST