దుష్టశిక్షణలో కొరగాని ‘దిశ’

ABN , First Publish Date - 2021-08-27T05:58:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఏం చేసినా తప్పించుకోగలమన్న దిలాసా మహిళలపై అడ్డూఆపూ లేని అఘాయిత్యాలకు నేరగాళ్లను పురిగొల్పుతోంది...

దుష్టశిక్షణలో కొరగాని ‘దిశ’

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఏం చేసినా తప్పించుకోగలమన్న దిలాసా మహిళలపై అడ్డూఆపూ లేని అఘాయిత్యాలకు నేరగాళ్లను పురిగొల్పుతోంది. లైంగికదాడులు, హత్యలు ఒక మహమ్మారిలా మహిళల జీవితాల్ని కబళిస్తున్నాయి. పేరు కోసమో, ప్రచారం కోసమో చట్టాలు చేస్తే ప్రయోజనం శూన్యం అనడానికి ‘దిశ’ చట్టమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ చట్టం పేరుతో ప్రభుత్వం హడావిడి చేయడమే కానీ ఒక్క నేరస్థుడికీ శిక్ష పడలేదు. 


ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2019 ప్రకారం మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసిన తొలివారంలో దర్యాప్తు పూర్తిచేయాలి. కోర్టుల్లో విచారణ 14 రోజుల్లో ముగియాలి. 21 పనిదినాల్లో దోషులను తేల్చి శిక్ష ఖరారు చేయాలి. క్రిమినల్‌ ప్రొసీజరల్‌ కోడ్‌ (సీపీసీ–1973)లోని సెక్షన్‌ 173, సెక్షన్‌ 309లను సవరించి ఈ మేరకు అదనపు క్లాజులను చేర్చారు. అయినా ఇప్పటివరకూ దిశ కింద ఒక్కరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


పోస్కో చట్టం–2012 ప్రకారం చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడేవారికి మహిళలను వేధించేవారికి కనిష్ఠంగా మూడు సంవత్సరాలు, గరిష్ఠంగా ఏడేళ్లపాటు జైలుశిక్షలు ప్రతిపాదించారు. కొన్ని కేసులకు జీవితఖైదును ప్రతిపాదిస్తూ ఐపీసీ–1860లో 354 ఎఫ్‌, 354 జి క్లాజులు చేర్చారు. అత్యాచారకేసుల్లో అప్పీల్‌‌ సమయాన్ని మూడు నెలలకు కుదించారు. ఇందుకుగాను సీపీసీ–1973లో సెక్షన్‌ 374, సెక్షన్‌ 377లను సవరించారు. ఇంకొన్ని కేసుల్లో మరణశిక్షను ప్రతిపాదిస్తూ ఐపీసీలోని 376 సెక్షన్‌కు సవరణ చేశారు. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. సోషల్‌ మీడియాలో మహిళలు, చిన్నారులపై అసభ్యకర పోస్టులు పెట్టినా శిక్షలు తప్పవని ప్రతిపాదించారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తారు.


ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న నిర్భయ చట్టం, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌తోపాటు ఇతర కేంద్రచట్టాల్లోని సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. వీటి విచారణకు ప్రత్యేకకోర్టులను ఏర్పాటు చేస్తారు. ఆ కోర్టుల జడ్జీలను ప్రభుత్వమే సిఫారసు చేస్తుంది.


2019 డిసెంబర్ 13న అసెంబ్లీలో దిశ బిల్లు-2019 ఆమోదం పొందింది. అయితే 2020 జనవరి 3న కొన్ని సాంకేతిక లోపాలున్నాయంటూ కేంద్రం దాన్ని వెనక్కు పంపింది. సాంకేతిక పరమైన అంశాలపై అనుమానాలను నివృత్తి చేస్తూ 2020 ఫిబ్రవరి 5న ఆ బిల్లును రెండోసారి కేంద్రానికి పంపారు. దిశ బిల్లులో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన, వివరణ రాలేదని 2021 జూలై 27న లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. సవరణలు పంపడంలో జాప్యం చేస్తున్నారంటే మహిళా భద్రత విషయంలో ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.


గడిచిన రెండేళ్లలో మహిళలపై 500కి పైగా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు జరగటం జగన్ ప్రభుత్వ అసమర్థపాలనకు అద్దం పడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడే ముఖ్యమంత్రి నివాసం, డీజీపీ ఆఫీస్‌కు సమీపంలో రమ్య అనే దళిత విద్యార్థినిని నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా నరికి చంపారు. వారి కుటుంబాన్ని ఓదార్చడానికి  వెళ్లిన ప్రతిపక్ష నాయకులపై అక్రమకేసులు బనాయించి, అరెస్టులు చేసి నవ్వులపాలయ్యారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని సీతానగరం పుష్కరఘాట్‌లో మహిళపై అత్యాచారం జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషను తోటి విద్యార్థి విష్ణువర్దన్ రెడ్డి దారుణంగా గొంతు నులిమి చంపేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతవరకూ నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏడాది క్రితం కర్నూలు జిల్లా ఎర్రబాడు గ్రామానికి చెందిన మైనారిటీ యువతి హజీరాను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చినా ఇంతవరకూ నిందితుణ్ణి పట్టుకోలేదు. పైపెచ్చు వారి కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు వెళ్లిన లోకేష్‌ను అధికారపక్షం నేతలు అడ్డుకోవడం దారుణం. అనంతపురంలో దళితబిడ్డ స్నేహలతను హత్య చేసి సజీవ దహనం చేశారు. అదే జిల్లాలో ఎర్రవంకపల్లిలో 6వ తరగతి చదువుతున్న బాలికపై లారీ డ్రైవర్ దారుణంగా అత్యాచారం చేశాడు. ఒక ప్రజాప్రతినిధిగా బాధితులకు న్యాయం చేయాల్సిన ఎంపీ అత్యాచారం చేసిన వాడికి రక్షణగా నిలిచాడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే దళితమహిళపై అత్యాచారం జరిగినా చర్యలు లేవు. ఒంగోలు శివారులో దివ్యాంగురాలిని కిరాతకంగా పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. రాజమండ్రిలో 17 ఏళ్ల మైనారిటీ దళితబాలికపై 12 మంది  సామూహిక అత్యాచారం జరిపి పోలీస్‌స్టేషన్ ఎదుటే వదిలివెళితే నేటికీ ఆ మృగాళ్లకు శిక్షపడలేదు.


కృష్ణాజిల్లా మదనపల్లిలో దళితయువతిని ప్రేమ పేరుతో సాయిరెడ్డి అనే వ్యక్తి వేధించి ఆమె ఇంటికి నిప్పు పెడితే అధికారపక్షం నేతలు అతడికి సహకరించారు. కేసు కూడ పెట్టనివ్వకుండా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తేజస్విని, విజయవాడ చిట్టినగర్‌కు చెందిన తస్నీమ్‌ ఫాతిమా, విశాఖలో వరలక్ష్మి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని, విజయవాడకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని, అదే జిల్లాలో 19 ఏళ్ల గాయత్రి, చిత్తూరు జిల్లాలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న సుష్మిత మృగాళ్ల చేతిలో దారుణహత్యకు గురయితే ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇలా ఎంతోమంది మహిళలు, చిన్నారులు, విద్యార్ధులు తమ జీవితాలను కోల్పోయినా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టిన్నట్లుగా కూడా లేదు. దిశ చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని ప్రకటించి ఆ చట్టాన్ని ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై అధికారపక్షం సానుభూతిపరుడు లక్ష్మణరెడ్డి లైంగికదాడికి పాల్పడ్డాడు. రాజమండ్రి బొమ్మూరులో మైనారిటీ బాలిక మీద అత్యాచారయత్నం జరిగితే బాధితకుటుంబంపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బాలికను రేప్ చేసిన వైకాపా నాయకుడు కరుణాకర్ రెడ్డి బెయిల్ పై వచ్చి బెల్ట్ షాపు పెట్టుకుని మరీ వ్యాపారం చేసుకుంటున్నాడు.


మహిళా హోంమంత్రి వచ్చాక స్ట్రీలపై అఘాయిత్యాలు తగ్గకపోగా మరింత పెరిగాయి. సాక్షాత్తూ ఆ మంత్రి జిల్లాలోనే రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ 600 రోజులకు పైగా ధర్నాలు, దీక్షలు చేస్తున్న మహిళలపై ప్రభుత్వం చేసిన దాడికి న్యాయస్థానాలు సైతం నివ్వెరపోయాయి. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిపై పెట్టిన అసభ్యకర పోస్టింగ్‌ల విషయంలో దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా పోలీసుల నుంచి స్పందన లేదు. కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్ట్ పెట్టినా వెంటనే అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారు, చేస్తున్నారు. అంటే చట్టం అందరికీ సమానం కాదా? అది అధికారపార్టీ చుట్టమేనా?

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి

Updated Date - 2021-08-27T05:58:44+05:30 IST