వచన కవితా పితామహుడు

ABN , First Publish Date - 2021-12-16T06:15:40+05:30 IST

ఇంటికి వచ్చిన కొత్తకోడలి వ్యవహారాన్ని చూసి అత్త అనుకుంటుంది ‘కని, ఈమెకు అప్పగించాను. నా కొడుకు మేదకుడు’ - అని. కోడలనుకుంటుంది కదా! ‘‘ఏమిటి ఈమె గొప్ప? ఈమె కనకపోతే నాకు మొగుడే దొరక్కపోయేవాడా!’’ అని...

వచన కవితా పితామహుడు

ఇంటికి వచ్చిన కొత్తకోడలి వ్యవహారాన్ని చూసి అత్త అనుకుంటుంది ‘కని, ఈమెకు అప్పగించాను. నా కొడుకు మేదకుడు’ - అని. కోడలనుకుంటుంది కదా! ‘‘ఏమిటి ఈమె గొప్ప? ఈమె కనకపోతే నాకు మొగుడే దొరక్కపోయేవాడా!’’ అని. లోకంలో లాగే సాహిత్యలోకంలో కూడా ఏమిటాయన గొప్ప; ఆయన లేకపోతే ఆ సాహిత్యప్రక్రియ ప్రభవించదా! అంటూ తరువాతి తరం వాళ్లు అనుకోవటం సహజంగానే ఉంటుంది. కుందుర్తి విషయంలో కూడా నేటి తరం అలా అనుకోవచ్చు. కుందుర్తికి ముందు వచన కవిత్వం రాసినవాళ్లు ఉండవచ్చు. ఆ ప్రక్రియను పదికాలాలపాటు బ్రతికించటానికి ఆయన పడ్డ కష్టాన్ని, దానికోసం అంకితమైపోయి దొరికిన ప్రతి వేదికను అందుకోసమే వినియోగించుకున్న కుందుర్తి నిబద్ధత తెలియకపోతే అలాగే అనిపిస్తుంది.


ఆంధ్రసాహిత్యంలో భావకవితా పితామహుడు, పదకవితా పితామహుడు, ఆంధ్రకవితా పితామహుడు -ఇలా కవితా పితామహులు చాలామంది కనిపిస్తారు. కుందుర్తికి లభించిన వచన కవితాపితామహ బిరుదు కూడ అల్లసానికి లభించిన ఆంధ్రకవితాపితామహ బిరుదు లాంటిదే. ఆంధ్ర కవిత్వానికి అల్లసాని పితామహుడేం కాదు కదా! అంతకు పూర్వం బోలెడంత కవితా సంపద ఉంది కదా! అంటే ఆ యుగానికి ఆయన పెద్ద పెద్దన్న. కొత్త ప్రక్రియకు నేతృత్వం వహించదగిన కవితాశక్తి కలవాడు కాబట్టే రాయలు ‘ఆంధ్రకవితాపితామహ! అల్లసాని పెద్దన!’ అంటూ కీర్తించాడు. అలాగే కుందుర్తికి పూర్వం కూడా శ్రీశ్రీ, శిష్‌ట్లా, పఠాభి వంటి వచన కవులు ఉన్నారు. ఉద్యమ ప్రబోధం కోసం ప్రజల్ని ఆకర్షించటానికి ఏ కళారూపమైనా, ఏ ప్రక్రియా రూపమైనా సరేనని కవులు, కళాకారులు భావిస్తున్న కాలంలో వచన కవితా ప్రక్రియనే ఎంచుకొని, ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ పేరుతో దాని వ్యాప్తికి అహరహమూ కృషిచేసినందునే కుందుర్తిని వచన కవితా పితామహుడని తెలుగు సాహితీ లోకం గౌరవిస్తోంది. 


‘వచన కవితావిచారణలో

ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను

అలనాటి కవితా లతాంగిని హత్యచేశాను 

అలంకార ఆభరణాలు అపహరించాను

అన్నీ ఒప్పేసుకున్నాను

ఆనాడు బోనులో ఎక్కి

క్రింది కోర్టువేసిన శిక్షను

మానవ కారుణ్య దృక్పథంతో సడలించి

జన్మఖైదు వేశారు, హైకోర్టు న్యాయమూర్తులు

ఒకతరం పాటు బ్రతకాలన్నారు బందీగా

పాఠకుల గుండెల చెరసాలలో’ అని తన గురించి కుందుర్తి కవితాత్మకంగా చెప్పుకున్నారు. 


ఒక తరమేమిటి, తరువాతి తరాలలోకూడా, ఆయన ప్రచారం చేసిన వచన కవితా ప్రక్రియ వివిధ ప్రయోగాలతో ఎన్నో పోకడలు పోయింది. మహాకావ్య ప్రక్రియ దాకా వికసించింది. వచనకవిత్వం ఖండకావ్యదశనుండి మినీకవిత్వంగా, దీర్ఘకవితగా, మహాకావ్యంగా రూపాంతరం చెందినా వచన స్వభావాన్ని నిలబెట్టుకున్నది. మదిలోమెదిలిన భావాన్ని ఏ సంకెళ్లులేకుండా స్వేచ్ఛగా చెప్పటానికి అనువుగా ఉండటం చేత ప్రతి ఉద్యమకవీ వాడుకున్నాడు. సూటిగా తేటగా చెప్పటానికి, అధిక్షేపానికి, ఆగ్రహాభివ్యక్తికి, అనుభూతి అభివ్యక్తికి, వాస్తవికతకు, తిరుగుబాటుకు, ఆవేశానికి, మానవతాస్పందనలకు, అస్తిత్వ ప్రకటనకు ఒకటేమిటి అన్ని రకాల స్పందనకు కవులు వచనకవిత్వాన్ని వాడుకోవటం చూస్తే అది కుందుర్తి సాధించిన విజయంగానే భావించాలి. అందుకే ఆయన వచనకవిత్వ ప్రయోగవ్యాప్తులకు కులపతి.


ఆధునిక సాహిత్యంలో ఒక పెద్దమలుపు శ్రీశీ. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న వారికి ప్రక్రియాపరంగా కుందుర్తి ప్రచారంచేసిన మార్గం మరోమలుపు. ఏ రాజకీయపక్షానికి కొమ్ముకాయకుండా, ఏ మార్క్సిస్టు భావాలు ప్రజాచైతన్యానికి ప్రజల గుణపరివర్తనకు దోహదం చేస్తాయో వాటిని గౌరవిస్తూనే అభ్యుదయ కవిగానే నిలచి ప్రచారం చేశాడు. శ్రీశ్రీ మార్గకవిలాంటి వాడు అయితే కుందుర్తి దేశికవితలాంటివాడని అద్దేపల్లి ప్రభృతులు భావించారు. 


కుందుర్తిని చూస్తే ‘సాహితీ సమితి’ - సభాపతి గుర్తుకువస్తారని కొందరంటారు. సాహితీసమితికి వచ్చిన ప్రతికవిని ముఖ్యంగా యువకవులను తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి ప్రోత్సహించి నాలుగుమాటలు చెప్పేవాడు. కుందుర్తి కూడా వచనకవుల్ని అలాగే ప్రోత్సాహపరచేవాడు. భావకవిత్వాన్ని ఊరు వాడా నెత్తికెత్తికొని ప్రచారం చేసిన కృష్ణశాస్త్రిలాగా వచనకవిత్వానికి కుందుర్తి సేవ చేశాడనటం సహజోక్తి కాదు.


కుందుర్తి సాహిత్యాన్ని, ఆయన పీఠికలను, వ్యాసాలను పరిశీలిస్తే ‘‘భక్తిమీది వలపు, బ్రాహ్మ్యంబుతో పొత్తు - వదలలేను నేను బసవలింగ’’ - అన్న వీరశౖవకవి పండితారాధ్యునిలాగా కుందుర్తి కనిపిస్తాడు. ‘‘పాత మా పునాది/ నన్నయనుండి నాదాక తెలుగు కవిత అంతా నాది’’ - అన్న తత్త్వాన్ని జీర్ణించుకొని, ‘‘ప్రయోజనం తండ్రి / పరమసౌందర్యం తల్లిగా పలికే ప్రతివాక్కు రసానందకల్పవల్లిగా / నాదారి నాది’’ - అని తాను నిర్మించే ప్రక్రియపట్ల స్పష్టమైన అవగాహనతో పయనించిన మూర్తి కుందుర్తి.


ఉద్యమానికి కావ్యనాయకత్వాన్ని కట్టబెట్టిన ఘనత కుందుర్తిది. సమష్టి చైతన్యాన్ని ఉద్యమశక్తిగా పేర్కొని, మానవతను కాల్చుకుతిన్న మారణశక్తులపై వీరోచితంగా పోరాడిన ఉద్యమ చైతన్యశీలాన్ని సమీక్ష చేసిన కావ్యం తెలంగాణ. కుందుర్తి రాసిన ‘దండియాత్ర’ మహాత్ముని దండియాత్రనుద్దేశించిందే. కాని ఈ రెంటిలో ‘తెలంగాణ’ను పరిపూర్ణ కావ్యమని ఆయన ఎన్నోసార్లు ప్రస్తావించాడు. కేవలం కథాకావ్యాలే కాకుండా అన్ని ప్రక్రియలలో వచన రచనలు రావాలని ఆకాంక్షించాడు. అంటే వచన కవిత్వంలో నాటిక, నాటకాలు కూడా రావాలని ఉద్దేశం. దానికై ‘ఆశ’ - అనే వచన కవితా నాటకాన్ని రాశాడు. 


హ్యూమన్‌ ఎమోషన్స్‌కు దేశీయ సరిహద్దులు లేవని భావించే కుందుర్తిపై పాశ్చాత్య రీతుల ప్రభావం అత్యల్పం. వచన కవిత్వంలోనే కాదు, పద్యంలోనైనా, మాత్రాఛందస్సులలోనైనా సంపూర్ణ కావ్యమే నాకు ఇష్టమని చెప్పాడు. కవితా ఖండికలలోసైతం కథా స్పర్శ ఉండాలని, లేకుంటే అది ఆత్మాశ్రయమై భావకవిత్వానికి చిరునామా అవుతుందని ఎన్నోచోట్ల ప్రస్తావించాడు. ప్రజల సంభాషణాశైలికి ఆధునిక కవిత్వశైలి చేరాలని ఆకాంక్షించాడు. ఆధునిక కవిత్వంలో ప్రయోగాల పేరుతో ఆరుద్ర, శ్రీశ్రీలు చేసిన ‘జిమ్మిక్స్‌’ను ముఖ్యంగా అధివాస్తవిక ధోరణి, డాడాయిజం వంటి వాటిని ప్రాచీన కవిత్వంలో ప్రబంధాలవంటి ధోరణులుగా కుందుర్తి భావించాడు. కళ కళకోసమేనన్నవారికి, ప్రయోగం ప్రయోగం కోసమేనన్నవారికి తేడా లేదని కుందుర్తి భావించాడు. 


వచన కవిత్వానికి ‘మినీకవిత’ - ఆయువును మరింత పొడిగించిందని కొందరు విమర్శకులు భావిస్తే, కుందుర్తి వచన కవిత్వానికి మినీ కవిత కౌంటర్‌గా భావించి తిరస్కరించాడు. కవి ఫిలాసఫీతో నిమిత్తం లేకుండా ‘రాసేదేదో రసవత్తరంగా రాస్తే చాలు’ - అన్న సిద్ధాంతం కుందుర్తిది కాదు. ఎలా రాశాడనే దానితో పాటే ఏమిరాశాడన్నది కూడా ముఖ్యమేననేరకం కుందుర్తి. అందుకే అనుభూతి వాదాన్ని తిరస్కరించాడు.


వచన కవిత్వంలో ‘హంస ఎగిరిపోయింది’ అనే సతీస్మృతికావ్యాన్ని తొలిసారిగా రాసింది కుందుర్తే. ‘‘సాధారణంగా నేను ఎన్నుకునే వస్తువులు చైతన్యవంతమైన ప్రజోద్యమాలకు సంబంధించినట్టివిగా ఉంటాయి. రాజకీయ నాయకుల సిద్ధాంత విభేదాలతో నాకు నిమిత్తం లేదు. గాంధీజీ తన అహింసాదృష్టితో చూసి కాదన్నంతమాత్రాన అల్లూరి సీతారామరాజు మహావీరుడు కాకుండా పోడు. అదే విధంగా కమ్యూనిస్టు సిద్ధాంతవేత్తలు ఒప్పుకోనంతమాత్రాన గాంధీజీ తన ఉద్యమాల ద్వారా ప్రజలలో తెచ్చిన చైతన్యానికి చరిత్రలో స్థానం లేకుండా పోదు. ఈ దృష్టితో చూచినప్పుడు ఎన్నిలోపాలు ఉన్నా, ప్రజలలో ఉవ్వెత్తున ఎగసిన చైతన్య మహాసముద్ర తరంగాలన్నీ నాకు కావలసినఘట్టాలే’’ అన్న కుందుర్తి సమకాలీన సాహిత్యోద్యమాల కూడలిగా కనిపిస్తాడు. 


తనకు పద్యాన్ని నిర్మించగల శక్తి ఉండి విశ్వనాథ శిష్యుడై కూడా శ్రీశ్రీ చేత ప్రభావితుడైన కవి కుందుర్తి. కవి ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలని ఆయన భావించారు. నిరాడంబరత, నిస్తుల భావన వచనకవిత్వానికి రెండు కళ్లుగా భావించి ‘డెమొక్రటైజేషన్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’తో నగరాలలో వానను కురిపించిన వచనకవితాపితామహునికి వందేళ్ల వందనం. 

ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు

(నేటి నుంచి కుందుర్తి శతజయంత్యుత్సవాలు)


Updated Date - 2021-12-16T06:15:40+05:30 IST