అప్పుల్లో తెలుగు రైతాంగం

ABN , First Publish Date - 2021-12-28T06:25:21+05:30 IST

గురువింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తమ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాయి...

అప్పుల్లో తెలుగు రైతాంగం

గురువింద గింజ తన నలుపు ఎరుగదు అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తమ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ మధ్య కాలంలో ఒక సర్వే విడుదల చేసింది. దేశంలో రైతు కుటుంబాల సంపద, వారి అప్పులు, జీవన స్థితిగతులను ఈ సర్వే పరిశీలించింది. జాతీయస్థాయిలో సగటున 57శాతం రైతు కుటుంబాలు అప్పులలో కూరుకుపోయి ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనూ, తెలంగాణ అయిదవ స్థానంలోను ఉన్నాయి. 


భారతదేశంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ కుటుంబాలు 9 కోట్ల 50 లక్షలు. ఒక్కో కుటుంబానికి నలుగురు వ్యక్తులను లెక్కించినట్లయితే, మొత్తంగా 38 కోట్ల మంది పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వీరిని సామాజిక వర్గాలను బట్టి విభజిస్తే– బీసీలు 45.8 శాతం, ఎస్సీలు 15.9శాతం, ఎస్టీలు 14.2 శాతం, ఇతరులు 24.1 శాతం ఉంటారు. దేశంలో ఒక రైతుకు నెలకు రూ.10,218 ఆదాయం వస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఈ ఆదాయం కుటుంబ పోషణకు భారంగా మారడంతో రైతులు అప్పు చేయక తప్పడం లేదు. దాంతో దేశం మొత్తంలో 50.2శాతం రైతు కుటుంబాలు అప్పులలో కూరుకుపోయి ఉన్నాయి. దేశ స్థాయిలో ప్రతి రైతు తలపై సగటున రూ.74,121 అప్పు ఉంది. ఈ అప్పు 2013లో రూ.47,000 ఉండగా, 2020కి వచ్చేసరికి రూ.74,121కు చేరింది. 


ఆంధ్ర ప్రదేశ్ 93.2 శాతం రైతు కుటుంబాలతో ఒక్కో రైతుపై రూ.2,45,554 అప్పుతో ఉంది. దేశ రాష్ట్రాల్లో ఇది మొదటి స్థానం. కేరళ 69.9 శాతం రైతు కుటుంబాలతో ఒక్కో రైతుపై రూ.2,42,482 అప్పుతో రెండవ స్థానంలోను, పంజాబ్ 54.4 శాతం రైతు కుటుంబాలతో ఒక్కో రైతుపై రూ.2,03,249 అప్పుతో మూడవ స్థానంలోను ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 91.7 శాతం రైతు కుటుంబాలతో ఒక్కొక్క రైతుపై రూ.1,52,113 అప్పుతో దేశంలో అయిదవ స్థానంలో ఉంది. గత ప్రభుత్వాలన్నీ రైతులకు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గొప్పగా చెప్పుకుంటున్నాయి. మరి పరిస్థితి ఇలా ఎందుకు ఉంది? రైతుల ఆత్మహత్యలు ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి?


రైతులు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి 69.6 శాతం అప్పులు పొందగా, గ్రామీణ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల ద్వారా 44.5 శాతం ఋణాలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 49.6 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, 34.1 శాతం ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల నుంచి, 15.4 శాతం వ్యవసాయానికి అప్పులు ఇచ్చే వారి నుంచి, ఇతర ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను నుంచి అప్పులు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులు 42.3 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి, 24.8 శాతం వాణిజ్య బ్యాంకుల నుంచి, 9.1 శాతం వ్యవసాయానికి అప్పులు ఇచ్చే వారి నుంచి, ఇతర ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల నుచి అప్పులు పొందుతున్నారు. వీరి దగ్గర నూటికి రూ.3 నుంచి రూ.5 వరకు వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు.


వ్యవసాయ కుటుంబాలు తీసుకున్న ఈ అప్పుల వినియోగానికి వస్తే– దేశ స్థాయిలో 57.59శాతం వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఖర్చు పెడుతుండగా, 42.5 శాతం వ్యవసాయేతర పనులకు ఖర్చు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు 60.3శాతం వ్యవసాయానికి ఉపయోగిస్తే, 39.7శాతం వ్యవసాయేతర పనులకు, తెలంగాణ రైతులు 63 శాతం వ్యవసాయానికి ఉపయోగిస్తే, 37 శాతం వ్యవసాయేతర పనులకు (అంటే పిల్లల చదువుకు, ఆరోగ్యానికి, హాస్పిటల్ ఖర్చులకు, ఆడపిల్ల పెండ్లి ఖర్చులకు, ఇంటి నిర్మాణానికి) అప్పులు చేస్తున్నారు. గతంలో తీసుకున్న అప్పుల వడ్డీని చెల్లించడం కోసం కూడా ఈ అప్పులను ఖర్చు చేస్తున్నారు. ఇలా రైతాంగం అప్పుల మీద ఆధారపడి బతకటానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే ప్రధాన కారణం. ప్రభుత్వాలు రైతాంగాన్ని కేవలం ఓటర్లుగా చూస్తున్నారు తప్ప వారి బాగోగులను చూడటం లేదు. 


ఇప్పటికైనా ప్రభుత్వాలు దేశానికి అన్నం పెడుతున్న రైతుల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా సమయానికి అందివ్వాలి. ప్రతి ఎకరానికి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభనష్టాల దృష్టితో చూడకుండా రైతు పడుతున్న శ్రమను గుర్తించాలి. వ్యవసాయ ఉత్పత్తులను సంపూర్ణ ధరతో కొనుగోలు చేయాలి. అలాగే రైతులపై ఉన్న అప్పులను రద్దు చేయటంపై చొరవ చూపాలి. దేశంలోని కార్పొరేట్ వ్యవస్థలకు లక్షలాది కోట్ల అప్పులను రద్దు చేస్తున్న ఈ ప్రభుత్వాలు రైతులపై అప్పులను ఎందుకు రద్దు చేయరు?

డా. ఆకుతోట శ్రీనివాసులు 

కాకతీయ విశ్వ విద్యాలయం, వరంగల్

Updated Date - 2021-12-28T06:25:21+05:30 IST