నర్సింగ్‌ విద్యా నిర్మాత

ABN , First Publish Date - 2021-12-25T05:51:31+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాలు గత బుధవారం (22వ తేదీన) ఒక మహోన్నతురాలిని కోల్పోయాయి. ఆమే తాహిరా హషీమ్ అలీ ఖాన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నర్సింగ్ విద్యకు అంకురార్పణ చేసిన...

నర్సింగ్‌ విద్యా నిర్మాత

ఉభయ తెలుగు రాష్ట్రాలు గత బుధవారం (22వ తేదీన) ఒక మహోన్నతురాలిని కోల్పోయాయి. ఆమే తాహిరా హషీమ్ అలీ ఖాన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నర్సింగ్ విద్యకు అంకురార్పణ చేసిన మహనీయురాలు. ఆమె ఏర్పాటు చేసిన కళాశాల ద్వారా నర్సింగ్ వృత్తిలో డిగ్రీ పొంది, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆమె శిష్యులు విశేష సేవలందిస్తున్నారు.


నిజాం ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్న హాషిం అలీ ఖాన్ సంతానం ఆరుగురిలో తాహిరా ఖాన్ చిన్నది. సుసంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్ననాటి నుంచే ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి స్ఫూర్తి పొందిన ఆమె ఢిల్లీలోని రాజ్‌కుమారి అమృత్ కౌర్ కళాశాలలో 1953లో నర్సింగ్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చి బల్దియా (ఎంసిహెచ్)లో హెల్త్ విజిటర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ కాలంలో గ్రాడ్యుయేట్ నర్స్‌కి తగిన పదవి లేకపోవటంతో విశాఖపట్నంలో ఉన్న లేడీ హెల్త్ విజిటర్స్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కొంతకాలం పనిచేశాక బోస్టన్‌లో ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేయడానికి వెళ్లి మూడు మాస్టర్స్ డిగ్రీలతో తిరిగి వచ్చారు తాహిరా. అప్పటికే హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, జడ్జిఖానా తదితర పెద్ద పెద్ద ఆసుపత్రులున్నప్పటికీ నర్సింగ్‌లో సుశిక్షుతులైన గ్రాడ్యుయేట్లు లేరని ఆమె గ్రహించారు.


హైదరాబాద్ నగరంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని అప్పటి  ప్రభుత్వానికి నిరంతరం దరఖాస్తులు చేయడంతో పాటు అధికారులను కలిసి పదేపదే విజ్ఞప్తి చేసేవారు. దీంతో 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా  మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి తాహిరా ఖాన్‌నే ప్రిన్సిపాల్‌గా నియమించింది. ఆ పదవిలో ఆమె దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. రాజ్‌భవన్ పక్కనే ఉన్న హెరిటేజ్ భవనంలో ఈ నర్సింగ్ కాలేజ్ ఉండేది.


1979లో విశాఖపట్నంలో బిఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక్కటే నర్సింగ్‌ కళాశాల ఉండేది. 1981లో కర్నూల్‌లో మరో కళాశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వైద్యరంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్ లుండడానికి తాహిరా ఖాన్ చేసిన కృషే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1984లో హైదరాబాద్‌లో కేవలం ఆరు  సీట్లతో నర్సింగ్‌లో ఎమ్మెస్సీ కోర్సును ఆమె ప్రారభింపచేశారు. అవివాహితగా ఉండి వేలాదిమంది నర్సింగ్ ప్రొఫెషనల్స్‌ను తయారుచేసిన ఈ తెలంగాణా భూమి పుత్రిక ఒక సాధారణ పౌరురాలిగానే కన్ను మూశారు. తన జీవితాన్ని మొత్తం వైద్యరంగానికి అంకితం చేసిన తాహిరా ఖాన్‌ను ప్రభుత్వాలు కానీ, కనీసం వైద్య ఆరోగ్య శాఖ కానీ ఏమాత్రం గుర్తించలేదన్న  విమర్శలు ఉన్నాయి.


మన ఫ్లోరెన్స్ నైటింగేల్‌గా పేరొందిన ఆమె పద్మవిభూషణ్ అవార్డుకు కచ్చితంగా అర్హురాలు. అయినా కీర్తి కోసం ఏనాడూ పాకులాడకుండా నర్సింగ్ విద్య కోసమే తన జీవితాన్ని ఆమె అంకితం చేశారు. తాహిరా ఖాన్‌ 55వ ఏట ప్రభుత్వ ఉద్యోగానికి ఐచ్ఛికంగా రాజీనామా చేశారు. ఆ తరువాత అందరికీ కనీస విద్య అవసరం అన్న ఆదర్శానికి కట్టుబడి తన సమయాన్నంతా మురికివాడలలో వయోజన విద్యకోసం వెచ్చించారు.


ఈ డిసెంబర్ 31 నాటికి 93వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవలసిన తాహిరా ఖాన్ 22వ తేదీ ఉదయం శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. ఏదీ శాశ్వతం కాదనే తాత్విక జీవనాన్ని గడపిన ఆమె తనకున్న కోట్లాది రూపాయల విలువ చేసే నివాస భవనాన్ని, తన ఖాతాలోని డబ్బును సామాజిక సేవా ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు. తనకు సేవలందించిన ఇద్దరు పనివారికి తన నివాసంలోనే ఒక్కొక్కరికీ ఒక కోటి రూపాయల విలువైన భూమిని ఉచితంగా ఇచ్చారు. నర్సింగ్ ప్రొఫెషనల్స్ ఎప్పటికీ ఆదర్శంగా భావించే తాహిరా ఖాన్‌కు నివాళి.


– కె. వెంకటరమణ

Updated Date - 2021-12-25T05:51:31+05:30 IST