‘విశాఖ ఉక్కు’పై తాడో పేడో!

ABN , First Publish Date - 2021-12-30T06:19:33+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్ విషయమై కేంద్ర మోదీ ప్రభుత్వం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలలో ఒక ప్రశ్నకు సమాధానంగా దీన్ని అమ్మేస్తామని...

‘విశాఖ ఉక్కు’పై తాడో పేడో!

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్ విషయమై కేంద్ర మోదీ ప్రభుత్వం తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలలో ఒక ప్రశ్నకు సమాధానంగా దీన్ని అమ్మేస్తామని, అది సాధ్యం కాకపోతే మూసేస్తామని స్పష్టంగా వ్యాఖ్యానించింది. దాదాపు సంవత్సర కాలంగా ఆ పరిశ్రమ కార్మికులు, ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందేమోనని కొంతమందిలోనైనా ఉన్న భ్రమలు కాస్తా దీనితో తొలగిపోయాయి. దీని అమ్మకాన్ని అనుమతించడమా? నిలువరించడమా? అన్నది తేల్చుకోవాల్సింది ఇక తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలే.


మోదీ ప్రభుత్వం లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేయాలనే నిర్ణయాన్ని విధానపరంగానే తీసుకుంది. ప్రభుత్వం వ్యాపారం చేయదని, అందువల్ల ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తామని స్వయంగా ప్రధానమంత్రే ప్రకటించారు. ఇందులో భాగమే నేటి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం. 


స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు జనవరి నెలలో ప్రభుత్వ నిర్ణయం వెలువడినప్పటి నుండి నేటి వరకు పోరాడుతూనే ఉన్నారు. నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రజల మద్దతు దీనికి పుష్కలంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు వీరి పోరాటానికి బహిరంగ మద్దతు తెలిపాయి. తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ, జనసేన వంటి పార్టీల అగ్ర నాయకులు దీక్ష శిబిరం వద్దకు వచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ విమానాశ్రయంలో స్టీల్‌ కార్మిక సంఘాల నాయకుల సమావేశం నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశంలోని అనేక ప్రాంతాల నుండి వివిధ తరగతుల ప్రజలు కేంద్ర ప్రభుత్వ అమ్మకం నిర్ణయానికి వ్యతిరేకత అనేక రూపాలలో వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ జరిగి కొన్ని నెలలు గడిచాయి. అయినా మోదీ ప్రభుత్వం మాత్రం మొండిగానే ఉంది అన్నది దాని తాజా ప్రకటనతో తేటతెల్లమయింది. 


ఇది స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. వారి సమస్యే అని వారు భావించి ఉండిఉంటే, ఉద్యోగ భద్రతకు, వేతనాలకు ప్రమాదం లేదనే ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమాన్ని ఆపేసి ఉండేవారు. దేశ ప్రజల కష్టార్జితంతో నిర్మితమైన ప్రభుత్వ రంగ పరిశ్రమను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేయడం దేశ ప్రయోజనాలకు భంగకరమని వారు భావించడం వల్లనే వారి ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్రంలోని అతిపెద్ద భారీ పరిశ్రమను వదులుకోవడం అంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే.


రాష్ట్ర ప్రయోజనాల రీత్యా దీనిని కాపాడుకోవడం అందరి బాధ్యత. అన్ని రాజకీయ పార్టీలు కార్మికులకు అండగా ఉంటామని ప్రకటిస్తేనే చాలదు. రోడ్లపై కొచ్చి పోరాడితేనే అది సాధ్యం. ఇలా చేయడంలో సహజంగానే రాష్ట్ర ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత. రాష్ట్ర ప్రజలందరినీ సమీకరించి, రాష్ట్రమంతా ఒక్కటై నినదిస్తే ఎలాంటి మొండి ప్రభుత్వమయినా దిగిరాక తప్పదు. ఇలా జరగాలంటే పైపై కార్యక్రమాలకే పరిమితమయితే సరిపోదు. అదేం విచిత్రమో, పార్లమెంటులో కూర్చుని ఉన్న మన ఎంపీల నుంచి కనీస వ్యతిరేక స్పందన కూడా లేకపోవడం ఈ సమస్య వంక చూస్తున్న చాలామందిని కలవరపరిచిన అంశం. వీరే ప్రశ్నలు వేయడం, అటునుండి సమాధానం తిరకాసుగా వచ్చినా, నోరుమూసుకుని ఉండటం అనేక సందేహాలకు సహజంగానే తావిస్తోంది. వీరందరూ కలసికట్టుగా ఈ సంవత్సర కాలంలోనూ ఏకోన్ముఖంగా ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీయకపోవడం వీరినెన్నుకున్న ప్రజలను అవమానపరచడమే అవుతుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం 1971లో ఈ ప్లాంటును రాష్ట్ర ప్రజలు 32 మంది యువకుల బలిదానంతో సాధించుకున్నాం. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో సాగిన ఆ మహోద్యమంలో అగ్రభాగాన నిలిచిన నాయకుల స్పృతి నేటికీ ప్రజల హృదయాలలో నిలిచే ఉంది. ముందు తరం సాధించి ఇచ్చిన ఈ నవరత్నాన్ని వదిలేసుకోవడాన్ని చరిత్ర ఏ మాత్రం క్షమించదు.

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2021-12-30T06:19:33+05:30 IST