వీరగాథల జాషువా

ABN , First Publish Date - 2021-07-24T06:13:15+05:30 IST

విశ్వవిజేత అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను అడ్డుకున్న వీరసంపద మనది. బ్రిటిషు సామ్రాజ్య అహంకారానికే ముచ్చెమటలు పట్టించిన భగత్‌సింగ్, నేతాజీల వారసత్వం మనది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే ఊతకర్రలతో ఎదుర్కొన్న ధైర్యం మనది...

వీరగాథల జాషువా

విశ్వవిజేత అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను అడ్డుకున్న వీరసంపద మనది. బ్రిటిషు సామ్రాజ్య అహంకారానికే ముచ్చెమటలు పట్టించిన భగత్‌సింగ్, నేతాజీల వారసత్వం మనది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే ఊతకర్రలతో ఎదుర్కొన్న ధైర్యం మనది. ఫిరంగుల్ని బాణాలతో కొట్టాలన్న అల్లూరి తెగువ మనది. తుపాకితో గుండెల్ని గురిపెడితే, దమ్ముంటే కాల్చమని రొమ్ము చూపిన టంగుటూరి పొలికేక మనది. ఇల్లిల్లూ, ఊరూరూ పోరుబాట పట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటపటిమ మనది. అలాంటి వీరత్వం ఈ జాతిలో ఇప్పుడెలా ఉంది? ఆ దేశీయ వీరత్వాన్ని తట్టిలేపడానికి జాషువా కలం నుంచి దూసుకొచ్చిన కరవాలమే ‘చిన్నానాయకుడు’.


‘ఇరువదియొక్కమాఱు ధరణీశ్వరులం బరిమార్చి పేర్చి, దు

ర్థరతర సారుడైన జమదగ్ని తనూజుడు- సంగరంబులో

సరిసరి బోరియుం పిదప జాలక యెవ్వని కోహటించె-–నా

పరబల భీష్ము భీష్ము బెఱ పార్థివు లేమనువారు పోరులన్’


అని ‘ఉత్తర హరివంశం’లో నాచన సోముడు చెప్పిన వీరుల్లాంటి ఎందరో ఇతిహాసవీరుల్ని జాషువా తనదైన ముద్రతో మనముందు ఉంచారు. కానీ నేనిప్పుడు చెప్పబోయేది సమీప భూతకాలంలోని చారిత్రక పురుషుడు ఒకరి వీరత్వం గురించి. ఆ వీరుడు చిన్నానాయకుడు. దాని కర్త ధర్మవీరుడు జాషువా. 


నిజానికి జాతీయోద్యమ కాలంలో తెలుగుజాతి పురాచరిత్రను గానం చేయడం ఒక లక్షణంగా తెలుగు సాహిత్యంలో కన్పిస్తుంది. అలాంటి రచనలు అన్ని ప్రక్రియల్లోనూ వచ్చాయి. అవన్నీ మనకు స్వాతంత్ర్యం రాక ముందు రాసినవి. కానీ, జాషువా రాసిన ఈ ‘చిన్నానాయకుడు’ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత (1948లో) రాసింది. దేశీయ వీరత్వానికి ప్రతీక ఈ గాథ. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, తిరుమల రామచంద్ర లాంటి వారు మన దేశ వీరుల గురించి వచనంలో రాశారు. అయితే అలాంటి రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. జాషువాపై పరామర్శల్లో ఆయన దేశభక్తి గురించి చాలామంది చెప్పినా, ఎక్కడా ‘చిన్నానాయకుడు’ ప్రస్తావన లేదు. అందుకు కారణం చాలామందికి అది అందుబాటులో లేకపోవడమే.


జాషువా దేశభక్తిని చెప్పేక్రమంలో అన్నీ ఒక ఎత్తు, ఈ ‘చిన్నానాయకుడు’ ఒక ఎత్తు. జాషువాకి దేశమంటే ఇష్టం. రాష్ట్రమంటే మరికొంత. గుంటూరంటే ఇంకొంత. వినుకొండ అంటే మరీనూ. ఇక్కడో పద్యం గుర్తు చేసుకోవాలి. ‘గుంటూరు’ అనే ఖండకవితలో ‘అవల పల్నాడు కొండవీడివల నిలిచి/ జనన మెత్తిన చిఱుత బాలునకు గూడ/గురువులై వీరగాథలు గరపుచోటు/వీరభాషాభిరామ గుంటూరు సీమ’ . మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషంటే గౌరవం, ఇష్టం ప్రతి ఒక్కరికీ సహజాతం కావాలి. ఆత్మాభిమానం ఎవ్వరికైనా ఉంటుంది. ఉండాలి. ఇవి లోపిస్తున్న జాతిగాతెలుగువారు తయారుకాకూడదని జాషువా రాసిందే ‘చిన్నానాయకుడు’ అనే వీరగాథ. 


‘చిన్నానాయకుడు’ లోని కథాస్థానం గుంటూరు జిల్లాలోని వినుకొండ పరిసరాలు. ఈ కథలోని ప్రధాన పాత్రలు కన్నమదాసు (బొల్లాపల్లె అడవి), మల్రాజు గుండారావు (నరసారావుపేట), ధనిసెట్టి (వినుకొండ), చిన్నానాయకుడు (వినుకొండ). ఈ ప్రాంతాల పేర్లు ఇప్పటికీ ఇలాగే ఉన్నాయి. కన్నమదాసు కోట శిథిలాలూ సజీవ సాక్ష్యంగా అలాగే ఉన్నాయి. ఈ వచన కావ్యంలో వీరగాథకు ఉండాల్సిన అద్భుత రసం ఉంది. పల్నాటి పౌరుష కావ్యం ‘పల్నాటి వీరచరిత్ర’ను, అందులోని పాత్రల్ని చాలాసార్లు జ్ఞాపకం చేస్తారు జాషువా. బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు, కోడిపందేలు మొదలైనవన్నీ ఇందులో ప్రస్తావనకు వస్తాయి. 


నిజానికి జాషువాలోని వీరత్వం, కవితా వీరగానం గురించి పెద్దగా చర్చ జరగలేదేమో. శివాజీ (1926), నేతాజీ (1947), వీరాబాయి (1947) అనే వీరగాథా కావ్యాలు జాషువా రాయడమే కాక, తన రచనల్లో సందర్భం వచ్చిన ప్రతిసారీ వీరత్వాన్ని గానం చేశారు. జాషువా చేసిన వీరగానంలో నేను పరిచయం చేస్తున్నది కొంతే. ‘నేతాజీ’ కావ్యాన్ని తన తండ్రికి అంకితం చేస్తూ, ‘వీర గాథాకర్ణన కుతూహల స్వాంతులయిన మా నాయనగారి యాత్మకీ కావ్యము శాంతి సమకూర్చుగాక’ అంటారు. జాషువాలోని మౌలికతకు బీజాలు చిన్నప్పుడే పడ్డాయి. ఆయనలోని తిరుగుబాటు ధోరణికి నాన్న నుంచి వచ్చిన ఈ వారసత్వమే కారణం.


‘సుద్దుల్ సెప్పుచు వీర గొల్లల యశంబున్ బాహుపాండిత్యమున్ 

ముద్దుల్ గారు విలక్షణం బయిన యేడ్పుం బాణితో బాడి మా

పెద్దల్ వీరని పొంగి పోయెడు భవ ద్వీరోత్సుకత్వంబ కా

ప్రొద్దుల్ నిండిన కవితయై వలచె బాబూ! నన్ను బాల్యంబునన్’ 


జాషువాని కేవలం దళిత నేపథ్యం నుంచే చూసేవాళ్ళకు, ఆయన కవిత్వంలోని బీజాల్ని ఈ కోణం నుంచి కొంత చేర్పు చేయాల్సిన అవసరాన్ని మర్చిపోకూడదు అని గుర్తుచేస్తున్నాను. జాషువాని కులాల పంజరంలోనే బంధించేవాళ్ళకు ఈ పద్యం ఒక శరాఘాతం. ఆయన వీరగానాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఆయనను సరిగ్గా అర్థం చేసుకున్నారా? ఆయన దేశం కోసం రాశారు. ద్వేషంతో రాయలేదు. ఉన్మాదం ఇతరుల్ని ఏడ్పిస్తుంది. గుండెల్ని ఛిద్రం చేస్తుంది. జాషువా రసోన్మాదమూ కన్నీళ్ళు తెప్పిస్తుంది. గుండెల్ని ద్రవింపజేస్తుంది. మనిషిని మనీషిగా మారుస్తుంది. ఇవి చదివీ మారనివాడు మనిషి కాదు. రసోన్మాది జాషువా. రసోన్మాది జాషువా. రసోన్మాది జాషువా. 


‘చిన్నానాయకుడు’లో కొన్ని లోపాలూ పొరపాట్లూ ఉన్నాయి. ఒకచోట చిన్నానాయకుని వయసు ఐదేళ్ళనడం, మరోచోట ఏడేళ్ళనడం. అలాంటిదే వినుకొండ బ్రాహ్మణ అగ్రహారంలోని వైదిక నియోగి కక్షలు, వాటి ఆదర్శంగానే మాల మాదిగ వర్గాల పోట్లాట అనే వ్యంగ్యంతో ఉన్న ఒకటిన్నర పేజీల కథ ఈ వీరగాథలో అతకడం లేదు. ఈ కథలోని గురుమూర్తిసెట్టి చిన్నతనంలో వీధిబడిలో పెద్దబాలశిక్ష చదివాడనడం కూడా అంతే. ఈ కథ జరిగే నాటికి పూదూరి చదలువాడ సీతారామశాస్త్రి పెద్దబాలశిక్ష (1832) అనే పుస్తకం అచ్చవలేదు. కవి కథ చెప్పి ఊరుకోక, తన అభిప్రాయాల్ని మధ్యమధ్యలో ధారాళంగా చెప్పేస్తుంటాడు. మహాత్ముడి ప్రస్తావన, భారత భగవంతుడు, స్త్రీవిద్య లాంటివి ఉన్నా వీరగాథా లక్ష్యాన్ని దెబ్బతీసేంతవి కావు. 


జాషువా చిన్నానాయకుడనే వీరగాథను ‘మహా వీరుడయిన చిన్నవానిని పల్నాడు మరచిపోయినది’ అని ముగించారు. విశ్వవిజేత అని విర్రవీగిన అలెగ్జాండర్‌ను అడ్డుకున్న వీరసంపద మనది. బ్రిటిషు సామ్రాజ్య అహంకారానికే ముచ్చెమటలు పట్టించిన భగత్‌సింగ్, నేతాజీల వారసత్వం మనది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే ఊతకర్రలతో ఎదుర్కొన్న ధైర్యం మనది. ఫిరంగుల్ని బాణాలతో కొట్టాలన్న అల్లూరి తెగువ మనది. తుపాకితో గుండెల్ని గురిపెడితే, దమ్ముంటే కాల్చమని రొమ్ము చూపిన టంగుటూరి పొలికేక మనది. ఇల్లిల్లూ, ఊరూరూ పోరుబాట పట్టిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటపటిమ మనది. అలాంటి వీరత్వం ఈ జాతిలో ఇప్పుడెలా ఉంది? ఆ దేశీయ వీరత్వాన్ని తట్టిలేపడానికి జాషువా కలం నుంచి దూసుకొచ్చిన కరవాలమే ఈ ‘చిన్నా నాయకుడు’. ఈ వీరగాథల వల్ల ఎవరికైనా ఎవ్వరినైనా ప్రశ్నించే ధైర్యం వస్తుంది. జాతి జనులు భీరులు కాక, వీరులు కావాలంటే ఈ వీరగాథలు చదవడం, చదివించడం చాలా అవసరం. 


-టి. సతీశ్

(నేడు జాషువా 50వ వర్థంతి)

Updated Date - 2021-07-24T06:13:15+05:30 IST