సూరంటే కారుతున్న కన్నీళ్లు
ABN , First Publish Date - 2021-12-26T06:04:32+05:30 IST
ఆమె కలలన్నీ కట్టెల పొయ్యి మీద మసులుతున్న ఏసర్లో పోసింది .... ఆమె ఇష్టాలని ఇత్తడి బిందెలో దాచి అటకెక్కిచింది..

ఆమె కలలన్నీ కట్టెల పొయ్యి మీద
మసులుతున్న ఏసర్లో పోసింది ....
ఆమె ఇష్టాలని ఇత్తడి బిందెలో దాచి అటకెక్కిచింది..
ఆమె తెలివిని తగులేసి గుంజకి కట్టేసింది...
ఆమె భవిషత్తును బూడిద చేసి తట్టలో ఎత్తి
పెంట కుప్పలో పారేసింది....
ఆమె అడుగులు ఊడ్చిన ఆకిలి వరకే...
ఆమె మాటలు ఇంటి పెంకులు కిందే...
ఆమె మోస్తున్న బరువు
వీపునానుకున్న మొగురానికి ఎరుక..
ఆమె దుఃఖం ఎంతటిదో
ఉప్పునీళ్ళ బాయికి తెలుసు..
ఆమె గుండెనొప్పి ఎసొంటిదోకొప్పెర కింద
మండుతున్న కొర్రాయినడుగు...
ఆమె కష్టాలుఆ ఇంటి సూరంటే
కారుతున్న కన్నీళ్లు...
ఆమె చిరునవ్వును గుమ్మిలో దాచిపెట్టి
గుమ్మంలో గంగిరెద్దులా నిలబెట్టి..
నోరున్న మూగదాన్ని సేసింర్రు
తెలివున్న ఎడ్డిదానిగా మార్చింర్రు....
అలిసిపోయి పాకురు పట్టిన ఆమె పానానికి
అరుగుబండే ఆసరా...
తుమ్మల కల్పన రెడ్డి