జాగుచేస్తే ప్రళయమే!

ABN , First Publish Date - 2021-08-20T06:17:27+05:30 IST

వాతావరణంలో మార్పులు గరుడవేగంతో సంభవిస్తున్నాయి. ధరిత్రిని దహించివేసి, మానవ మనుగడను అసాధ్యం చేసే వైపరీత్య ప్రభావాలు ఇప్పుడే కానవస్తున్నాయి..

జాగుచేస్తే ప్రళయమే!

వాతావరణంలో మార్పులు గరుడవేగంతో సంభవిస్తున్నాయి. ధరిత్రిని దహించివేసి, మానవ మనుగడను అసాధ్యం చేసే వైపరీత్య ప్రభావాలు ఇప్పుడే కానవస్తున్నాయి. అవును, వాతావరణ మార్పు ఒక తిరుగులేని వాస్తవం. స్వయంకృతంతో మనం ఒక మహాముప్పునకు సమీపంలో ఉన్నాం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) తాజా నివేదిక ఈ కఠోరసత్యాన్ని మరింత స్పష్టంగా చెప్పింది. దావానలాలు, వరదలు, తుఫానులు ఇత్యాది ప్రాకృతిక విపత్తులన్నీ వాతావరణ మార్పులను ధ్రువీకరిస్తున్నాయని ఐపీసీసీ ఘంటాపథంగా చెప్పింది. ఆ భయానక భవిష్యత్తు రేపో, మాపో కాదు ఇప్పుడే, ఇక్కడే ఉంది. లేదని పొరపడవద్దు. ‘బహుశా’లకు ఇంకెంతమాత్రం ఆస్కారం లేదు. స్థిమితంగా ఉండడానికి వీలు లేదు. నిమ్మళంగా వ్యవహరించడం వినాశనాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. నిజమైన, అర్థవంతమైన కార్యాచరణకు మనం తక్షణమే, భావవేగంతో పూనుకోవాలి. ఐపీసీసీ నివేదిక ఇదే కర్తవ్యాన్ని చెప్పకనే నిర్దేశించింది. 


కాలుష్యకారక వాయువుల ఉద్గారాలను నియంత్రించకపోతే 2040 సంవత్సరం నాటికే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1850–1900 సంవ త్సరాల మధ్య ఉన్న స్థాయిలను మించి 1.5డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిపోతాయని ఐపీసీసీ నివేదిక పేర్కొన్న మొదటి ముఖ్యాంశం. ప్రస్తుత ఉష్ణోగ్రతల పెరుగుదల పారిశ్రామిక విప్లవకాలం స్థాయికి 1.09డిగ్రీల సెల్సియస్ మాత్రమే అధికం. అయినప్పటికీ ఈ అధిక ఉష్ణోగత్రలు ఎంత వినాశనం సృష్టిస్తున్నాయో మనకు తెలుసు. కనుక ఇప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదం ఎంత తీవ్రమైనదో మనం తక్షణమే అర్థం చేసుకోవాలి. మానవచర్యల మూలంగానే వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని చెప్పేందుకు ఐపీసీసీ శాస్త్రవేత్తలు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇది వారి నివేదికలోని రెండో ముఖ్యాంశం. ఇంతవరకు మనం ప్రపంచవ్యాప్తంగా తరచు వాటిల్లుతున్న ప్రాకృతిక వైపరీత్యాలపరంగా వాతావరణ మార్పులను అవగతం చేసుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కెనడాలో వడగాడ్పులు, గ్రీస్‌లో దావానలాలు, జర్మనీలో వరదలు సంభవించడంలో వాతావరణ మార్పులు నిర్వహిస్తున్న పాత్ర సమగ్రంగా అర్థమవుతోంది. కనుక ఈ మార్పులు ఒక తిరుగులేని వాస్తవమనే సత్యాన్ని ఇప్పుడిక కొట్టివేయలేం. 


ధరిత్రిని విషవాయువుల ఉద్గారాల నుంచి కాపాడుకోవడంలో మనం ఇంకెంత మాత్రం సముద్రాలు, అడవులు, నేలల మొదలైన ప్రాకృతిక వ్యవస్థలపై ఆధారపడలేం. ఈ దృష్ట్యా ప్రపంచ దేశాలు తమ ‘నెట్ జీరో’ ప్రణాళికలపై పునరాలోచన చేయవలసి ఉంది (మానవచర్యల మూలంగా ఉత్పన్నమవుతున్న హరిత గృహవాయువుల పరిమాణం, వాతావరణం నుంచి మనం తొలగిస్తున్న ఆ వాయువుల పరిమాణం మధ్య సమతుల్యతను నెట్ జీరో సూచిస్తుంది). కాలుష్యకారక వాయువుల ఉద్గారాలను, వాటిని శోషించుకోవడంలో అడవుల, సముద్రాల, నేలల; నిరోధించడంలో అధునాతన సాంకేతికతల శక్తి సామర్థ్యాల కంటే తక్కువస్థాయిలో ఉంచుతామనే లక్ష్యాన్ని వివిధదేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ లక్ష్యాన్ని 2050నాటికి సాధిస్తామని అమెరికా, 2060నాటికి సాధిస్తామని చైనా హామీ ఇచ్చాయి. అయితే ఆలోగానే అంటే 2040లోగానే ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రమాదకర పరిమితులను అధిగమించనున్నదని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది. 


 కొవిడ్ మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచ ఆర్థికవ్యవస్థలు కోలుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో హరిత గృహవాయువుల (జీహెచ్‌జీ) ఉద్గారాలు మరింతగా పెరిగిపోయే ప్రమాదముందనేది ఎవరూ విస్మరించలేని వాస్తవం. 2010 నాటి ఆ ఉద్గారాల స్థాయిలో, 45 నుంచి 50శాతం మేరకు తగ్గుదలను 2030 సంవత్సరం నాటికి సాధించి తీరాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే 2050 సంవత్సరం నాటికి నెట్ జీరో లక్ష్యాల సాధన సాధ్యమవుతుంది. అంటే మానవాళి ముందున్నది ఒక బృహత్తర కర్తవ్యం. వాతావరణ మార్పులకు అత్యధికంగా కారణమవుతున్న దేశాలలో అమెరికా, చైనా అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ వార్షిక జీహెచ్‌జీ ఉద్గారాలలో సగభాగానికి ఈ రెండు దేశాలే కారణమని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 1870 నుంచి 2019 వరకు వాతావరణంలోకి విడుదలయిన మొత్తం హరిత గృహవాయువుల ఉద్గారాలలో 60శాతానికి అమెరికా, 27 దేశాల యూరోపియన్ యూనియన్, రష్యా, బ్రిటన్, జపాన్, చైనా పుణ్యమే. 


మరి భారత్ విషయమేమిటి? ప్రపంచ అగ్రగామి ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించాలని ఆరాటపడుతున్న మనదేశం వార్షిక కర్బన ఉద్గారాలలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. అయితే ఆ ఉద్గారాల పరిమాణం చాలా స్వల్పమైనది. 1870 నుంచి 2019 దాకా ప్రపంచ కర్బన ఉద్గారాలలో మన దేశం వాటా కేవలం 3శాతం మాత్రమే. ఆ కారణంగా వాతావరణ మార్పులను నిరోధించడంలో మనదేశం పాల్గొనవలసిన పని లేదని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది. మన ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ మార్పులను అరికట్టడానికి శీఘ్రగతిన, పెద్దఎత్తున పటిష్ఠచర్యలు చేపట్టాలి. ఇప్పటికే అతివృష్టి, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, మేఘాల విస్ఫోటం మొదలైన వాటి రూపేణా మన ప్రజలను వాతావరణ మార్పులు నానా వెతలపాలు చేస్తున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే విషయంలో మనకు ఉన్న బాధ్యత స్వల్పమైనదే. అయితే ఆ స్వల్ప బాధ్యతను నిర్వర్తించేందుకు మనం చెప్పుకోదగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నది ఒక నిష్ఠురసత్యం. ఇది మన శ్రేయస్సుకు తోడ్పడదు. వాతావరణ మార్పుల్ని అరికట్టేందుకు సమర్థమైన ప్రభావశీలమైన ప్రపంచ నాయకత్వం అవసరం. ఈ నాయకత్వం ఎంత దుర్బలంగా ఉందో కొవిడ్ వాక్సిన్ల విషయంలోనే తేలి పోయింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వాక్సిన్లను అందుబాటులో ఉంచే విషయంలో ఈ నాయకత్వం ఘోర వైఫల్యం చెందింది. కరోనా విలయం వలే వాతావరణ మార్పు కూడా ఒక విశ్వవిపత్తు. మానవాళి ఈ ఆపదను సమష్టిగా ఎదుర్కోవాలి. సమస్త దేశాల కోసం ఒక్కదేశం నిలవకపోయినా, ఒక్కదేశం కోసం సమస్త దేశాలు నిలవకపోయినా ఎవరికీ మేలు జరగదు. కరోనా వైరస్ వలే వాతావరణ మార్పు కూడా ఒక గొప్ప సమానీకరణ శక్తి. ఈ ప్రచండ ప్రాకృతిక మార్పులు ధనిక–-పేద అంతరాలకు అతీతమైనవి. ఈ వాస్తవం దృష్ట్యా వాతావరణ మార్పులపై సమస్త మానవాళి సమష్టిగా పోరాడాలి. శాస్త్రవేత్తలు సత్యాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ హానికర మార్పులకు వ్యతిరేకంగా సమరస్థాయిలో కార్యాచరణకు మనం తక్షణమే పూనుకోవాలి.



‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు

సునీతా నారాయణ్

Updated Date - 2021-08-20T06:17:27+05:30 IST