విలీనాలూ విచ్ఛిన్నాల వింత విద్యావ్యవస్థ

ABN , First Publish Date - 2021-11-02T07:52:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం పలుప్రయోగాలకు గురవుతోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో జాతీయ విద్యావిధానం పేరుతో అమలు చేయనున్న విద్యాసంస్కరణలు విపరిణామాలకు దారితీయనున్నాయి....

విలీనాలూ విచ్ఛిన్నాల వింత విద్యావ్యవస్థ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం పలుప్రయోగాలకు గురవుతోంది. ముఖ్యంగా పాఠశాల విద్యలో జాతీయ విద్యావిధానం పేరుతో అమలు చేయనున్న విద్యాసంస్కరణలు విపరిణామాలకు దారితీయనున్నాయి. జాతీయ విద్యావిధానంలో ఫౌండేషన్‌ కోర్స్‌- 5సంవత్సరాలు (3 నుండి 8 సంవత్సరాల వయసు) ప్రిపరేటరీ కోర్స్‌ 3సంవత్సరాలు (9 నుండి -11 ఏళ్ళ వారికి) మిడిల్‌ స్కూల్‌ 3సంవత్సరాలు (12 నుండి -14) సెకండరీ విద్య 4 సంవత్సరాలు (15 నుండి 18) అందించాలని పేర్కొన్నారు. బోధనాంశాలను విభజించడానికి, ప్రమాణాలను నిర్ణయించడానికే గాని పాఠశాలలను ఆ విధంగా భౌతికంగా విడదీయవలసిన అవసరంలేదని జాతీయ విద్యావిధానం చెప్పింది. జాతీయ విద్యావిధానాన్ని అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ‘సార్థక్‌’ (SARTHAQ- -నా-ణ్యమైన విద్య ద్వారా విద్యార్థుల, ఉపాధ్యాయుల సంపూర్ణ అభివృద్ధి) అను పత్రాన్ని విడుదల చేసింది. దాని ముందుమాటలో భారత ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్‌ ‘కొత్త నిర్మాణాలను సృష్టించటం కంటే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను పటిష్ఠపరచుకోవడం ద్వారా జాతీయ విద్యావిధానాన్ని అమలుపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ విద్యావిధాన అమలు ప్రణాళిక ప్రస్తుతం ఉనికిలో ఉన్న నిర్మాణాలను పటిష్ఠపరచడానికి ప్రాధాన్యం ఇస్తుంది’’ అని పేర్కొన్నారు.


జాతీయ విద్యావిధానాన్ని అమలుపరచే ఉద్దేశ్యంతో ఉన్నట్లయితే పైన పేర్కొన్న విధంగా పాఠశాల విద్యను పటిష్ఠపరుచుకోవడానికి, పూర్వ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పడానికి లేదా ప్రాథమిక పాఠశాలలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించడానికి, ఇంటర్‌ విద్యస్థానంలో 2 తరగతులను అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పూర్వ ప్రాథమిక విద్యను అందించుటకు తగిన శిక్షణ పొందినవారు లేరు. శిక్షణ ఇవ్వడానికి ట్రైనింగ్‌ కళాశాలలు కూడా రాష్ట్రంలో లేవు. వాటిని ప్రారంభించాలి. కాని అందుకు భిన్నంగా ఉనికిలో ఉన్న ప్రతి గ్రామంలోను, ఆవాస ప్రాంతంలోను ఉన్న ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేసి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడానికి ఆదేశాలు జారీచేశారు. అభ్యంతరాలు రావడంతో ఈ విద్యాసంవత్సరంలో ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మాత్రమే విలీనం చేస్తామంటున్నారు. అయితే రాబోయే సంవత్సరంలో ఉన్నత పాఠశాలలకు 3కి.మీ సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేయడం అశాస్త్రీయం. 6 నుండి -11, 12 నుండి -14 ఏళ్ళ వారికి వారి వయసుకు, మానసిక స్థితికి తగిన బోధనాశాస్త్ర పద్ధతులను అవలంభించడం జరుగుతుంది. అందుకే ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి తప్పనిసరిగా డి.ఐ.ఇ.టి. శిక్షణ పొందినవారినే నియమించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ నిబంధన విధించింది. రాష్ట్రప్రభుత్వం 3, 4, 5 తరగతులకు సబ్జెక్టు టీచర్లచే బోధిస్తామని చెబుతోంది. సబ్జెక్టు టీచర్లు అంటే బి.ఎడ్‌ చేసిన వారికి 12–15 ఏళ్ళ వారికి బోధించుటకే శిక్షణ పొంది ఉంటారు. (కొన్ని రాష్ట్రాలలో బి.ఎడ్‌ వారిని ఎస్‌.జి.టిలుగా నియమిస్తున్నారు) వారు ప్రాథమిక పాఠశాల విద్యార్ధులకు ఎలా బోధించగలరు? మరో వైపున ఉన్నతపాఠశాలల్లో మౌలిక సదుపాయాలు తగినంతలేవు. 3, 4, 5 తరగతుల వారికి అదనంగా తరగతి గదులులేవు. నాడు-–నేడు పథకంలో భాగంగా బాగుచేసిన ప్రాథమిక పాఠశాలలను ఖాళీగావదలి, సౌకర్యాలు లేని ఉన్నత పాఠశాలలోనికి విద్యార్థులను మరలించడం సరైనదేనా? ఇప్పటికే 10వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయగా నడుస్తున్నాయి. కొత్తగా 1, 2 తరగతులతో ఏర్పడే ఫౌండేషన్‌ పాఠశాలల్లో 40మంది విద్యార్థుల కొరకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామంటున్నారు. కాలక్రమంలో ఈ పాఠశాలలన్నీ అంటే దాదాపు 34,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోతాయి. విద్యాశాఖ వారు రకరకాల యాప్‌లను రూపొందించి వాటిని అప్‌లోడ్‌ చేసే పని ఏకోపాధ్యాయులకు అప్పగించారు. ఏకోపాధ్యాయునికి టాయిలెట్ల ఫోటోలు తీయడం, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఫోటోలు తీయడం, దాదాపు 30కి పైగా ఆ ఫోటోలన్నింటిని అప్‌లోడ్‌ చేయడం, విద్యార్థులకు హాజరు వేయడం, అప్‌లోడ్‌ చేయడం, విద్యార్థులచే బయోమెట్రిక్‌ హాజరు వేయించడం, మధ్యాహ్న భోజన హాజరు అప్‌లోడ్‌ చేయడం, గుడ్లు, చిక్కిలు సహా సంబంధించిన సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడంతోనే ఒక పూట సరిపోతుంది. ఇక పాఠ్యబోధనకు సమయమెక్కడుంటుంది? ఈ యాప్‌లను రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాలు మొరబెడుతున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడంలేదు.


ఇప్పటికే 20వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలోని 34వేల ప్రాథమిక పాఠశాలలలో 10వేలు ఏకోపాధ్యాయ కాగా మరో 15వేల పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు తమకు ఉన్న సెలవును వినియోగించుకోవటమే కాక సమీపంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలోని ఉపాధ్యాయుడు సెలవుపెడితే అక్కడకు వెళ్ళాల్సి ఉంటుంది. దానితో ఆ 15 వేల పాఠశాలలు కూడా సగం రోజులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగానే ఉంటున్నాయి. ఖాళీలను భర్తీ చేసి ప్రాథమిక పాఠశాలలను పటిష్ఠం చేసే దిశలో కాక బలహీనపరచే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయి. విద్యార్థులను తల్లిదండ్రులు 3 కి.మీ దూరంలోని ప్రాథమిక పాఠశాలకు ఎందుకు పంపిస్తారు? వారికి స్వంత వాహనాలు ఏర్పాటు చేసుకునే స్తోమత ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేయదు. ప్రైవేటు పాఠశాలలలో ప్రతి తరగతికీ ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. 5 తరగతులకు ఒక పూట మాత్రమే చదువు చెప్పే ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు తమ విద్యార్థులను ఎలా పంపించగలుతారు? అందుకే ఎంత చిన్నదైనా ప్రైవేటు పాఠశాలకే పంపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రస్తుత చర్యలు ప్రైవేటు పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అమ్మఒడికి ఇచ్చే 15వేల రూపాయలతో ప్రైవేటీకరణ వేగంగా జరిగే అవకాశం ఉన్నది. ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను స్వాధీనం చేసుకుంటామంటూ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మాత్రం నిలిపివేసి ఆ సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ సర్వీసులోనికి తీసుకుంటున్నారు. ఆ పోస్టులన్నింటినీ రద్దుచేస్తున్నారు. పోస్టులతో సహా ఉపాధ్యాయులను, అధ్యాపకులను తీసుకోవాలంటున్న సంఘాల డిమాండ్‌ను అంగీకరించటంలేదు. తద్వారా ప్రభుత్వానికి ఏటా ఆరేడు వందల కోట్లు మిగులుతున్నాయి. ఈ ఎయిడెడ్‌ సంస్థలను ప్రైవేటు సంస్థలుగా నడుపుకోవడానికీ, 30శాతం సీట్లను యాజమాన్య కోటాగా భర్తీ చేసుకోవటానికీ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఇది ప్రైవేటీకరణ బాట పట్టించటమే! విజయవాడ నగరంలో ఒకే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నది. చాలా ఎయిడెడ్‌ కళాశాలలున్నాయి. వేలాది మంది విద్యార్ధులు ఎయిడెడ్‌ సంస్థలలో చదువుచున్నారు. వారంతా ఎక్కడ చేరాలి! ఎలా చదువుకోవాలి? తాము చదువుతున్న కళాశాల పూర్తిస్థాయి ప్రైవేటు కళాశాలగా మారినందున ఫీజులు ఎలా చెల్లించగలరు? ప్రభుత్వం ఎంత మేర రీ యింబర్స్‌ చేయగలుగుతుంది? గుంటూరు, తెనాలి, పొన్నూరు, మచిలీపట్నం, బాపట్ల, గుడివాడ, నందిగామ వంటి అనేక పట్టణాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలే లేవు. ఒకటీ అరా ఉన్నా అవి మహిళా కళాశాలలే. వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది? 


పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో గత 30 సంవత్సరాలలో జనాభా మూడునాలుగు రెట్లు పెరిగింది. కాని జనాభాకు అనుగుణంగా కొత్త పాఠశాలలు ఏర్పడలేదు. విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో కార్పొరేషన్‌ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసి ఉంటున్నాయి. అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో కొత్త ఆవాస ప్రాంతాలలో కొత్త పాఠశాలలను ప్రభుత్వం స్థాపించాలి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త ఉపాధ్యాయ పోస్టులను మంజూరుచేయాలి.


విద్యారంగంలో ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ వేదికయింది. ఎక్కడాలేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం కూడా ఇక్కడే మొదలయింది. ప్రపంచదేశాలన్నింటిలో పాఠశాల విద్య మాతృభాషామాధ్యమంలోనే సాగుతుంది. మనం మాత్రం తద్భిన్నంగా ప్రయాణిస్తున్నాం. ఉద్యోగులందరికీ సంబంధించిన ఆర్ధిక సమస్యలైన సి.పి.ఎస్‌ రద్దు, 11వ పి.ఆర్‌.సి. అమలు, 5 డి.ఏ. బకాయిలు మొదలయినవి ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపిటిఎఫ్‌) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ర్యాలీ నిర్వహణకు, జింఖానా గ్రౌండ్‌లో నిరసన సభకు పోలీసు వారు అనుమతినివ్వలేదు. దీంతో బెంజ్‌సర్కిల్‌లోని ‘వేదిక’ ఫంక్షన్‌హాలులో నేడు ఏపిటిఎఫ్‌ నిరసన సభ నిర్వహిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యారంగ పరిస్థితులను చక్కదిద్ది శాస్త్రీయ, ప్రజాతంత్ర విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలి. ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించి, బోధనేతర పనులనుండి వారిని తప్పించి ప్రభుత్వ పాఠశాలలలో బోధనాభ్యసన ప్రక్రియ సక్రమంగా సాగేటట్లుగా చూడాలి.

పి. పాండురంగవరప్రసాదరావు 

ప్రధానకార్యదర్శి 

ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌

(నేడు విజయవాడలో ఏపీటీఎఫ్‌ నిరసన సభ)

Updated Date - 2021-11-02T07:52:54+05:30 IST