పేదలకేనా సంకెళ్లు.. నేతల మాటేమిటి?

ABN , First Publish Date - 2021-08-20T06:07:12+05:30 IST

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచింది. ధనవంతులకు, బలవంతులకు..

పేదలకేనా సంకెళ్లు.. నేతల మాటేమిటి?

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు గడిచింది. ధనవంతులకు, బలవంతులకు దక్కినంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు పేదలకు దక్కలేదు. ధనవంతులు, బలవంతులు చేసినన్ని నేరాలు పేదవారు చేయరు. తెలిసో తెలియకో బడుగు ప్రజలు నేరాలు చేస్తే పోలీసులు కేసులు పెట్టి చేతులకు బేడీలు వేసి, జంతువుల్లాగా కోర్టుకు తీసుకువెళతారు. జడ్జీలకు కనబడకుండా బేడీలు తీసివేసి, వారిని జడ్జీల ముందు హాజరుపరుస్తారు. అయితే చేతులకు బేడీలు వేయడం చట్టవిరుద్ధం. బేడీలు వేసిన నేరస్థులను కోర్టుకు తీసుకువస్తే ఒక్క న్యాయవాది కూడా అదేమని పోలీసులను ప్రశ్నించడు. తుపాకులు పట్టుకుని కోర్టులోకి వచ్చే అధికారం కూడ పోలీసులకు లేదు. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న పోలీసులను ప్రభుత్వం ముందుగా శిక్షించాలి. 


ఎన్నికలలో రాజకీయ నాయకులు అనేక వాగ్దానాలు చేసి, డబ్బులు పంచి అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలను అమలు చేయకపోగా, విపరీతంగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఆ వాగ్దానాలను అమలుచేయాలని నిలదీసే వారినే నేరస్థులుగా చిత్రిస్తున్నారు. నోట్లకు, మద్యానికి ఓట్లను అమ్ముకున్నంత కాలం చట్టబద్ధమైన పాలన ప్రజలకు దక్కదు. ప్రజలందరికీ కూడు, గూడు, విద్య, వైద్యం దక్కనంత కాలం ఏ పాలకులనైనా నేరస్థులుగా గుర్తించి శిక్షించే రోజులు రావాలి. ఇలాంటి మార్పు కోసమే ప్రజలు చైతన్యవంతులుగా మారి, భవిష్యత్‌ తరాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. గతంలో పాలకులు న్యాయమైన ప్రజాసమస్యల పరిష్కారానికి పోటీపడి పేరుప్రతిష్ఠలు సంపాదించేవారు. నేటి పాలకులు ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడానికి పోటీపడుతున్నారు. వారి అరాచకాలకు కళ్లెం వేసి దోపిడీరహిత సమసమాజ నిర్మాణం కోసం అందరం ఐక్యంగా పోరాడాలి.


 బిచ్చారెడ్డి

Updated Date - 2021-08-20T06:07:12+05:30 IST