ఇంటర్‌లో సంస్కృతం అనాలోచితం

ABN , First Publish Date - 2021-07-17T05:35:49+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతభాషను ప్రవేశపెడుతూ ఇంటర్‌ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి కమిటీలు నియమించకుండా, సంప్రదింపులు జరపకుండా జారీ చేసిన ఈ ఉత్తర్వులు....

ఇంటర్‌లో సంస్కృతం అనాలోచితం

రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతభాషను ప్రవేశపెడుతూ ఇంటర్‌ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి కమిటీలు నియమించకుండా, సంప్రదింపులు జరపకుండా జారీ చేసిన ఈ ఉత్తర్వులు అన్ని వర్గాల వారిని అయోమయానికి గురిచేశాయి. ఇంటర్మీడియెట్‌ విద్యలో కార్పొరేట్‌ సంస్థలు కాలు పెట్టనంతవరకు ద్వితీయ భాష ఎంపిక విద్యార్థి ఇంటిభాషను బట్టే సాగేది. ర్యాంకుల వ్యాపారం మొదలైనప్పటినుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు విద్య కన్నా మార్కులు, ర్యాంకుల వైపే మొగ్గు చూపుతుండడంతో సంస్కృతం ద్వితీయభాషగా మారిపోయింది. దీనివల్ల నష్టాలే అధికం.


ఇంటర్‌, డిగ్రీల తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే విధిగా తెలుగు భాషా సాహిత్యాలకు, సంబంధించిన సాధారణ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వాటికి సుమారు 30 మార్కులు కేటాయిస్తారు. ద్వితీయ భాషగా తెలుగు చదవని వారు ఆ మార్కులు నష్టపోతారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంఏ (తెలుగు) చదివే అర్హత కూడా కోల్పోతారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల కేవలం 400 మంది సంస్కృత బోధకులకు ఉపాధి లభించవచ్చు కానీ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుంది. అంతేకాక ఇది జూనియర్‌ కళాశాలల్లోని తెలుగు ఉపన్యాసకులకు, హిందీ బోధకులకు, డిగ్రీ కళాశాలల్లోని అన్ని భాషల బోధకులకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే చర్య. గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఇంటర్‌లో ‘చరిత్ర పాఠ్యాంశం’ అవసరం లేదని అనాలోచిత చర్యలకు పాల్పడి తిరిగి ఎలా సవరించుకున్నారో తెలిసిందే. అలాంటి వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా తెలుగు భాష బోధనను నిర్వీర్యం చేయడం తగదు.


ఇంటర్‌ కళాశాలల్లో సంస్కృత బోధన ఉత్తర్వులను వెంటనే నిలిపి వేసి బంగారు తెలంగాణకు దోహదపడే తెలుగు భాషా బోధనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఇంటర్‌ విద్యామండలి అధికారులు గుర్తించాలి. అభివృద్ధి అంటే తాత్కాలిక ఎదుగుదల కాదు, భావి జీవితాల పటిష్టతకు పునాదిగా నిలవడమే.


అమ్మిన శ్రీనివాసరాజు

Updated Date - 2021-07-17T05:35:49+05:30 IST