సంక్రాంతి హేల

ABN , First Publish Date - 2021-01-13T06:17:21+05:30 IST

నింగినేలు ఉదయాద్రి శోభల రంగురంగుల రంగవల్లుల గొబ్బియల గారాల నెలవుల...

సంక్రాంతి హేల

నింగినేలు ఉదయాద్రి శోభల 

రంగురంగుల రంగవల్లుల 

గొబ్బియల గారాల నెలవుల 

రాగరంజిత రమ్యవిపంచిగ 

సంకురాతిరి తరలివచ్చెను 

సకల శుభావహమై

    మంచుముత్యపు పిలుపునందిన 

    పుష్యమాసపు పడతి వధువై 

    మహీతలపు ప్రణయవేదిక 

    ముగ్ధమోహన రాగసుధగా 

    సంకురాతిరి మరలవచ్చెను 

కృషికి ఫలితము చేతికందెను 

రైతు బిడ్డకు ముదముహెచ్చెను 

జియ్యరయ్యకు చేవవచ్చెను 

తిరుప్పావై మధువు పంచగ 

సంకురాతిరి శుభము పలికెను 

సకల మానవోన్నతికై–

కానీ...

గంగిరేడుల వినుతి హెచ్చిన 

గంగిరెద్దుల గుణము పోవలె 

హేతువాదపు విలువతెలిసిన 

శాంతి పధమె మనది కావలె 

    భోగిమంటలు నింగికెగసిన 

    భాగ్యమేమియు కూడిరాదు 

    ఆ అగ్నిజ్వాలల దహనమవవలె 

    అంతరంగపు కలుషతమంతము 

అపుడె జాతికి తేజమొదవును 

భాగ్యరాసులె పొంగి పొరలును 

ప్రజల రాజమెవెలసి నపుడదె 

నిక్కమగు ‘సంక్రాంతి’ పర్వము 

పింగళి పాండురంగారావు

Updated Date - 2021-01-13T06:17:21+05:30 IST