తల్లావజ్ఝల ‘హృదయేశ్వరి’లో ప్రణయ లాలిత్యం!

ABN , First Publish Date - 2021-02-01T06:03:36+05:30 IST

భావకవుల నించి అభ్యుదయ కవుల దాకా వ్యాపించిన ఎన్నో సాహిత్య సంఘాలకు అధ్యక్షుడుగా, యువ కవుల్ని ప్రోత్సహించేవాడిగా...

తల్లావజ్ఝల ‘హృదయేశ్వరి’లో ప్రణయ లాలిత్యం!

భావకవుల నించి అభ్యుదయ కవుల దాకా వ్యాపించిన ఎన్నో సాహిత్య సంఘాలకు అధ్యక్షుడుగా, యువ కవుల్ని ప్రోత్సహించేవాడిగా, బహుభాషా కోవిదుడుగా, బౌద్ధ సాహిత్య ఆవిష్కర్తగా తల్లా వజ్ఝల శివశంకరశాస్త్రిగారు సుప్రసిద్ధులు. భావ కవిత్వం తొలినాళ్లలో అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు, కృష్ణశాస్త్రి మొదలైన కవులు కావ్యాలు రాశారు. అమలిన శృంగారం సాహిత్యమంతా అల్లుకున్న కాలం. ప్రకృతి కవుల్ని పలకరించిన కాలం. ఆహ్లాదకరమైన ఊహలు కవుల మనసుల్ని కమ్మేసిన కాలం. వివశమైన ప్రణయం పల్లవిం చిన కాలం. ఆ రోజుల్లో తొణికిసలాడే యవ్వనంలో శివశంకరశాస్త్రిగారు రాసిన ప్రణయ కావ్యం ‘‘హృదయేశ్వరి’’. 


భావకవిత్వంలో దాదాపు ప్రియుడు ప్రేయసిని తాకడమంటూ ఉండదు. ఈ కావ్యమూ మినహా యింపు కాదు. ఇందులో వస్తువు స్థూలంగా ప్రియుడు ప్రియరాలిని చూస్తాడు, ప్రేమిస్తాడు. ప్రియుడు విద్యావంతుడు, ప్రేయసి కూడా విద్యా సంస్కారం కలిగిందే. ఆమె దర్శనంతో కవి అను రాగ సంద్రంలో మునకలేస్తాడు. కవి పెద్దల పట్ల గౌరవం గలవాడు. దారంటా వెళుతూ ప్రియు రాలి ఇంటి ముందు నుంచి ఆమెను చూస్తాడు. ఆమె చూస్తుంది. ఎప్పుడైనా ఆ ఇంట్లో వాళ్ళు కవిని ఆహ్వానిస్తారు. వరండాలో కూచుంటాడు. వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. మధ్యలో మెరు పులా మెరుస్తూ ఆమె చూస్తుంది. కవి విరహం. అమె తాకిన పుస్తకం, ఆమె పూలు కోసిన చెట్టు, ఆమె చూసిన ఆకాశం అన్నీ కవికీ అద్భుతాలు. ఇలా సాగిన ప్రేమ కలయికతో సుఖాంతమవుతుంది.


భావ కవిత్వం గొప్పతనం దాని నిర్వహణలో ఉంది. పదాలకూ పద్యాలకూ పరిమళాన్ని అద్దడంలో ఉంది. ప్రేయసి ఒక సాయంకాలం కనిపించింది. అది ఆవిష్కారం కావడం: 

‘‘ఆ మనోహర మాఘ సాయాహ్న వేళ

ఇష్ట సఖుతోడ సరణి నే నేగుచుండ

అక్కజము గొల్పి తోచె నీ యాననమ్ము

సరసిపై తేలియాడెడు జలజమట్లు’’

మాఘ మాస సాయంత్రం. మిత్రునితో వెళు తున్నాడు. హఠాత్తుగా ఆమె ప్రత్యక్షమైంది. ఆమె సాయంసంధ్యలో కొలనులో కదులుతున్న పద్మంలా ఉందట. కవి మనసు తుమ్మెదలా మారి ఆకాశ సంచారం చేసింది. ఆమె వెళ్ళిపోయింది. శూన్యం మిగిలింది. అప్పుడప్పుడూ ఇంటిదగ్గర కూడా కనిపించేది. దర్శనమే అనుభవంగా కవి భావించు కుంటాడు. ఊహలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఆమె వదనం ఎన్నిసార్లు చూసినా తృప్తి తీరదు!


‘‘తృప్తి తీరక భవదీయ దివ్యవదన

మండలాభపైన్నేను మరల మరల

వెనుతిరిగి చూచుచున్‌ బోతి వెగ్గలంపు

తటిని కేదురేగు చుండేడి తరణి ఓలె’’

ఆమె కనిపించింది కాలం స్తంభించింది కానీ వెళ్ళక తప్పదు. ఇక్కడ కవి అద్భుతమైన భావన చేసాడు. తను వెళుతున్నాడు. ప్రాచీన కవులు ఇట్లాంటి సందర్భాల్లో రకరకాలైన ఉపమానాలు వాడారు ప్రియురాలు అక్కడే ఉంది. ప్రియుడు వెళుతున్నాడు కానీ మనసు వెనక్కి వెళ్తుంది అది ఎలాగంటే రథం ముందుకు పోతూ ఉంటే రథంపైన ధ్వజం వెనక్కి వెళుతున్నట్లు ఉంది అన్నాడు కాళిదాసు. ప్రియురాలు అక్కడ నిలు చుంది ప్రియుడు వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉందంటే- ప్రవాహానికి ఎదు రీదే పడవలా ఉందట మనసు. ఇట్లాంటి చిత్రమైన ఊహలు ఎన్నో కవి చేస్తాడు. 


‘‘గ్రీవము మనోజ్ఞముగ వంచి 

      క్రింది చూడ్కి

మోహన మయూరి పోలిక నాహరించి

ఏక కాలము నందె మదీక్షణములు

చిత్తమును గూడ, సౌధమ్ము చేరినావు’’

ఆమె తల వంచి మనోహరంగా నెమలిలా ఉంది అట్లాంటి ప్రియురాలు ఒకే కాలంలో కవి మన సులోకి వచ్చింది, వాళ్ళ ఇంటికి చేరింది అంటాడు. అప్పుడప్పుడు కనీసం ప్రియురాలు కలుస్తూ ఉంటే ఆనందంగానే ఉంటుంది. ఒక్కోసారి ప్రియు రాలు కనిపించదు లోకమంతా అంధకార బంధురం అవుతుంది అప్పుడు:


‘‘ఎల్లకాల మమావాస్యయే మదీయ

హృదయమున: ఎన్నడేని నీ వదన చంద్ర

కాంతి తోచునయేని ఆ క్షణము నందు

మాత్రము చతుర్దశీరాత్రి మాడ్కి నుండు’’

ఇట్లా కవికి ఎన్నో సందర్భాలలో ఆమె మెరు పులా కనిపిస్తుంది మాయమవుతుంది విద్యావం తుడు సంస్కారి ఐన కవి లలిత హృదయుడు. ఎప్పటికైనా ఆమెని హృదయేశ్వరిగా నిలుపుకోవ డమే కాదు, జీవితేశ్వరిగా చేసుకోవాలన్నది అతని లక్ష్యం. ఒక్కోసారి గుడి దగ్గర కనిపిస్తుంది. ఒక్కో సారి దారిలో ఇంటికి వెళుతూ కనిపిస్తుంది. కానీ మాట్లాడుకోరు. మనసు నిండుగా అనురాగాన్ని నిలుపుకుంటారు. ఆనాటి రోజులు వేరు. వందేళ్ల క్రితం స్త్రీ పురుష సంబంధాల్లో పరిస్థితులు ఇప్పటి లాంటివి కావు. పెద్దవాళ్లు నిశ్చయించింది మాత్రమే జరిగేది. ఈ కాలం వాళ్లకు అప్పటి పరిస్థితులు విచిత్రంగా అనిపించవచ్చు. కానీ అది అప్పటి వాస్తవం. ప్రత్యేకించి విద్యావంతులకు ఉన్నత కుటుంబీకులకు కూడా ఎన్నో హద్దులు ఉండేవి. కృష్ణశాస్త్రి ‘‘జగము నిండ స్వేచ్ఛగాన ఝరుల నింతు’’ అన్న మాటల అంతరార్థాన్ని మనం ఆలో చించాలి. ఆ రోజుల్లో ప్రేమ అన్నమాట చిత్రంగా ఉండేది. ఇష్టాయిష్టాలు పని చేసేవి కావు. సంప్ర దాయం బలంగా సమాజాన్ని పట్టుకుని ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో భావ కవిత్వం సాహిత్య రంగంలోకి వచ్చింది స్వేచ్ఛ, సమానత్వం, ప్రేమ అన్నీ రంగంలోకి వచ్చాయి. అది ఒక అద్భు తమైన ఆవిష్కరణ. దాంతో కవులు ఊహలకు హద్దులు లేకుండాపోయాయి. ఇది కేవలం ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల వచ్చింది కాదు. ఆంగ్లంతో సంబంధంలేని ఎందరో కవులు స్వేచ్ఛా మాధుర్యం చవిచూశారు. వేదుల మొదలైన కవులకు ఆంగ్ల పరిచయమే లేదు.


ఈ కావ్యంలో తల్లావజ్ఝల వారి భాష నిర్మల ప్రవాహంలా హృదయాలలోకి లలిత లలితంగా ప్రవేశిస్తుంది. అప్పటికీ ఆయన బౌద్ధమతంతో ప్రభావితుడైనట్లు కొన్ని సందర్భాల్లో గోచరిస్తుంది. కవి తను నిరంతర చేసి ఎన్నో ప్రదేశాలు తిర గాలని ఉద్దేశించాడు. కానీ ప్రియురాలి కోసం, ప్రియురాలి సందర్శన కోసం అవన్నీ వాయిదా వేసుకున్నాడు. తల్లావజ్ఝలవారిలో తాత్వికత అడు గడుగునా కనిపిస్తుంది. బహుశా ఈ కావ్యం రాసిన తర్వాత అనుకుంటాను- అప్పటికీ ఆయ నకు ముప్పై రెండు సంవత్సరాలు గడిచిపో యాయి. ఆ సందర్భంలో ఒక పద్యం చెప్పారు:


కాల మహా పగా విపుల గర్భమునన్‌ 

         పడిపోయె నేటితో

లీల మదీయ జీవన జలేజము 

   ముప్పది రెండు రేకు లీ 

చాలుననే సమగ్రముగ సారస పత్రము

    లొక్కటొక్కటే

రాలి విలీనమై మరలి రావు మహాప్రభు

  శాసనమ్మునన్‌ 

అని రాసుకున్నారు. యవ్వనంలో తాత్విక భావాలు నిర్మలమైనవాళ్ళకే ఉంటాయి. కాలమనే ప్రవాహంలో తన జీవితం ఒక పద్మం లాంటిది. అప్పటికి ముప్పై రెండు రేకులు రాలిపోతాయి. సృష్టికర్త శాసనం ప్రకారం క్రమక్రమంగా అన్ని రేకులు కాలంలో కలిసిపోతాయి. తను అదృ శ్యమై పోతాను. అని అనంత సత్యాన్ని మన ముందు ఉంచుతాడు.


కవి ప్రియురాలిని కలుసుకొనే మధుర ఘడియ వచ్చింది. ఆ సమాగమం అపూర్వం. అవధులు లేనిది. వాళ్లు సంకేతం ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని అనుసరించి ఆమె అభిసారికలా అతని దగ్గరికి వచ్చింది. ఆమె సాహసి. మనసు నిండిన ప్రేమ ముందు ప్రపంచమే బలాదూర్‌.


కవి ధీరుడే కానీ లలితుడు. సమాజాన్ని ఎది రించడం అతని ఉద్దేశం కాదు. అన్నీ సానున యంగా, సానుకూలంగా జరగాలనేది అతని తత్వం. ఆమె ప్రేమ ముందు అనంత విశ్వాన్ని ఎదిరిం చడానికి సిద్ధపడింది. సౌమ్యుడైన కవి సంఘ ర్షణను ఇష్టపడడు. అట్లాంటి పరిస్థితి తమకు లేదన్నది ఆయన అభిప్రాయం. అవధులు దాటిన స్వేచ్ఛని కవి ఆమోదించలేడు


‘‘అప్రయత్నమ్ముగా లభ్యమైన అస్మ

దీయ సమ్మేళనము భవదీయ లజ్జ 

లీన మగునేని, యుద్రిక్త మానసమ్ము

శాంతి గనుటెట్టులో ప్రియకాంత చెపుమ!’’

అన్నాళ్లూ ప్రియురాలు సాన్నిహిత్యంలో లేదే అన్న తపన. ఆమె వచ్చి ముందు నిల్చుంటే కవి పట్టలేని భావోద్వేగ పరవశుడై తను శాంతిని కోల్పోతున్నా నేమో అని, నాకా శాంతి ఎలా దొరుకుతుందని ఆమెనే అడుగుతాడు. 


ఆమె అతనితోబాటు రావడానికి సిద్ధమై వచ్చింది. నువ్వు జీవితమంతా నాతోనే ఉంటావు కదా కొన్నాళ్ళు కావాలంటే వెళ్లి మీ వాళ్ళ దగ్గర ఉండిరా అని కూడా చెబుతాడు కవి, కలయికనే కళ్యాణంగా భావించి:


‘‘ఇంక నొక కొన్ని నాళ్లు పుట్టింటిలోనె

గడిపి వత్తువ నా యంతికమునకు ప్రియ

నేను స్వేచ్ఛారతుండను నీవుకూడ

సంతసమ్మున ేస్వచ్ఛగా సాగిపొమ్ము’’

అంటాడు. అంటే ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ ముఖ్య మైంది. పరస్పర గౌరవం ప్రధానం. ఈ కారణం గానే కవి ఆమెతో నీ స్వేచ్ఛను ఎప్పుడూ కోల్పో వద్దు అని సూచించాడు. కావ్యం ఇలా ముగుస్తుంది. ఇతర భావకవులకు తల్లావజ్ఝల వారికి ఉన్న తారతమ్యం ఇదే. తల్లావజ్ఝల వారు మూల పాలి భాష నించి జాతక కథల్ని తెలుగులోకి తెచ్చారు. వ్యావహారికంలో కథాసాగరం రాశారు. చివరలో అన్నీ పరిత్యజించి సన్యాసం స్వీకరించి ‘‘శివశంకర స్వామి’’ అయ్యారు. ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అసాధారణమైంది. నిరుపమానమైంది.

సౌభాగ్య, 98481 57909


Updated Date - 2021-02-01T06:03:36+05:30 IST