అడవితల్లి ఒడిలో ఆర్కే

ABN , First Publish Date - 2021-10-19T05:42:11+05:30 IST

అడవి తల్లి ఒడి అమ్మై లాలించినాదా ఆకులు రాల్చిన నీళ్లు జీవగంజయ్యినాయా చుట్టూ ఇనుపకంచె పక్కన జనసేన పక్షుల జోహార్లు...

అడవితల్లి ఒడిలో ఆర్కే

అడవి తల్లి ఒడి 

అమ్మై లాలించినాదా

ఆకులు రాల్చిన నీళ్లు 

జీవగంజయ్యినాయా

చుట్టూ ఇనుపకంచె

పక్కన జనసేన

పక్షుల జోహార్లు

ప్రకృతి రాల్చే పూలు

దండాలు ఆర్కే నీకు ఎర్రెర్ర దండాలు

‍ఆకాశమెర్రబారి 

కప్పేన జెండాలు


కటిక చీకటిలోనా

మెరిసే తారల గుంపు

నిండూ అమాసపైనా

పండు వెన్నెల పోరూ

గుంటనక్కల వేట

పైడికంటెల పాట

గాలి పలికే హోరు

ఘనమైన జోహారు

దండాలు ఆర్కే నీకు ఎర్రెర్ర దండాలు

‍ఆకాశమెర్రబారి 

కప్పేన జెండాలు


కళ్లల్ల ఎర్రజీర

భళ్లున తెల్లారినాదా

కన్నీటి ధార కదిలి

కర్తవ్యం గీసినాదా

కొలువుదీరిన చెట్లు

బారులు దీరిఉండ

కొండలెనుక పొద్దు

ఎరుపెక్కి గుంకిపాయె

దండాలు ఆర్కే నీకు ఎర్రెర్ర దండాలు

‍ఆకాశమెర్రబారి 

కప్పేన జెండాలు


కాపాడిన అడవితల్లి

వీడ్కోలు పలికినాదా

జింక లేళ్లు వగిసి

పరుగు మానినాయా

అమ్ము విల్లమ్ములన్నీ

అవనతమైనాయా

అదునుజూసి అడవి

కదనమయ్యినట్లు

అమరుడయ్యి ఆర్కే 

సమరమైనాడా

త్యాగంతో నింగీ నేలను సింగిడై కల్పినాడా

మిత్ర

(శాంతి చర్చల సహచరుడు, మావోయిస్టు పార్టీ నాయకుడు ఆర్కే స్మృతిలో...)

Updated Date - 2021-10-19T05:42:11+05:30 IST