రమణీయం

ABN , First Publish Date - 2021-02-06T06:37:31+05:30 IST

కొందరు వ్యక్తులను గమనించగానే వారు ‘కారణజన్ములు’ అనిపిస్తుంది. వారూ, మనందరిలాగే జన్మించినా, తమ సమాజ శ్రేయః తపన వల్ల యశస్వులవుతారు...

రమణీయం

కొందరు వ్యక్తులను గమనించగానే వారు ‘కారణజన్ములు’ అనిపిస్తుంది. వారూ, మనందరిలాగే జన్మించినా, తమ సమాజ శ్రేయః తపన వల్ల యశస్వులవుతారు. కారంచేటు తిరుమల వేంకట రాఘవాచార్యులు, పద్మావతమ్మగారల ప్రథమసంతానంగా 1952 ఫిబ్రవరి 8న జన్మించిన వేంకట రమణాచారి (కె.వి. రమణ) జీవన వివరాలను గమనిస్తే, ‘పూవు పుట్టగానే పరిమళిస్తుంది’ అన్న నానుడి గుర్తుకు వస్తుంది.


ఒక సామాన్య మధ్యతరగతి వైష్ణవ కుటుంబంలో జన్మించిన రమణ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్సీ చదివాడు. 1970–72లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ రసాయనశాస్త్రంలో యూనివర్సిటీ ప్రథముడుగా నిలిచాడు. పిహెచ్‌డి చేయాలన్న ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించలేదు. అయితే రమణ ప్రతిభను గమనించిన మిత్రులు గ్రూప్‌–1 పరీక్ష రాయమని ప్రోత్సహించారు. దాంతో ఆ పరీక్ష రాసి కలెక్టర్‌గా ఎంపిక కావటం రమణ బుద్ధికుశలతకు తార్కాణం. డిప్యూటీ కలెక్టర్‌గా ‘ప్రొబేషన్‌’ పూర్తి చేసుకుని అధికారిగా ఏయే ధర్మాలు ఆచరించాలి, తన కింది వారితో వాటిని ఎలా ఆచరింపజేయాలి, ప్రజల పట్ల ప్రేమాదరణలు ఎలా కనబర్చాలి అన్న విషయాలు క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు. కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట - ఎక్కడకు బదిలీ అయినా ప్రజాహిత కార్యక్రమాలు, వైద్యశిబిరాలు, విద్యాసంస్థల స్థాపన, బలహీనవర్గాలకు ఇళ్ళు కట్టించడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాల నిర్వహణకు ఆయనదే ముందడుగు. ‘వఠ్ఠి మాటల మనిషి కాదు, చేతల మనిషి’ అని గిరిజన సహకార సంస్థ, షెడ్యూలు కులాల కార్పొరేషన్‌లో పని చేసినప్పుడు నిరూపించుకున్నాడు. పూర్తిస్థాయి ఐఎఎస్‌ అధికారిగా పదోన్నతి పొందిన అనంతరం ‘కులీకుతుబ్‌ షా అథారిటీ’ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయిన సందర్భంలో అదో ‘పనిష్మెంట్‌ పోస్టు’ అని నలుగురిలా అనుకోకుండా, అహర్నిశలూ శ్రమించి వెనుకబడిన పాతబస్తీలోని ముస్లిం ప్రజలకు ప్రేమపాత్రుడయ్యాడు. రోడ్ల విస్తరణ, డ్రయినేజి మరమ్మతులు, స్టేడియాల స్థాపన లాంటి అభివృద్ధి పనులు నిర్వహించారు. సాంస్కృతిక వ్యవహారాలశాఖ డైరెక్టర్‌గా, క్రీడాశాఖ కమిషనర్‌గా, కడప కలెక్టర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన ఆంతరంగికుల్లో ఒకడిగా, సమాచారశాఖ కమిషనర్‌గా ఆయన ఆదరణ చూరగొన్నారు. చిన్నవ్యవస్థ అయిన ‘ఖాదీబోర్డు’కు వెళ్ళవలసినా నిరుత్సాహపడక, తన నిర్వహణాసామర్థ్యంతో బోర్డు ఆదాయాన్ని పెంచాడు. మధ్యతరగతి కలలను సాకారం చేస్తూ సింగపూర్‌ టౌన్‌షిప్‌, మలేషియన్‌ టౌన్‌షిప్‌లకు శంకుస్థాపన చేసి జంటనగరాల్లో ‘గేటెడ్‌ కమ్యూనిటీ కాన్సెప్ట్‌’కు ఆద్యుడయ్యాడు. జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించి వారి జీవితాల్లో ‘భద్రత’ వెలుగులు నింపాడు.


‘పదవి ఏదైనా స్వప్రతిభ వల్లనే ప్రయోజనం చేకూరుతుంది’ అని గాఢంగా విశ్వసించే రమణ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమితుడవడం వల్ల తనలోని ధార్మిక అనురక్తిని ప్రకటించుకునే వీలు కలిగింది. 2007 నుంచి స్వామివారి సేవకుడిగా తన ఆహార్యం మార్చుకున్నాడు. భక్తులకు పలు సౌకర్యాలు కల్పించి, తిరుమల లడ్డూకు పేటెంట్‌ సాధించి, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసి) స్థాపనతో, - ‘భగవంతుడు పలకని దైవమైతే, తాను పలికే సేవకుడి’నని నిరూపించుకున్నాడు. 


ప్రతి వ్యక్తిలో ‘వృత్తి’, ‘ప్రవృత్తి’ అనే రెండు భిన్న ప్రకృతులుంటాయి. ఇవి రెండూ సమాంతరాలు. అత్యవసరాలు కూడా. ఆర్థికావలంబన చేకూర్చేది వృత్తి. సృజనాత్మకతకు మెరుగులు దిద్ది సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేది ప్రవృత్తి. ఈ రెండూ భిన్నధ్రువాలు. అయితే వృత్తిలో ప్రవృత్తిని సమ్మిశ్రితం చేయగలగడం అభినందనీయం. రమణాచారి ఇటువంటి అరుదైన అవకాశాన్ని తనదిగా చేసుకుని ‘పద్య కవిత్వం- వస్తువైవిధ్యం’ అన్న అంశంపై పరిశోధనతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేటు పుచ్చుకున్నాడు. ఉద్యోగ బాధ్యతలో భాగంగా అవకాశం వచ్చినప్పుడల్లా, భారతీయ సంస్కృతి, వైదిక ధర్మాలకు ఆలంబన కల్పించాడు. ఇప్పటికీ ఆకాశవాణిలో ఉదయం ప్రసారమయ్యే ‘భావన’ కార్యక్రమంలో రమణ గొంతు భావస్ఫోరకంగా, గంభీరంగా, శ్రోతలను ఆకట్టుకుంటున్నది. 1991లో సాంస్కృతిక వ్యవహారాల డైరెక్టర్‌గా, ‘కళామంగళ’, ‘సాంస్కృతిక సౌజన్యం’ వంటి పథకాల రూపకర్తగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో థియేటర్‌ ఆర్ట్స్‌ శాఖ ప్రారంభకుడిగా, క్రీడాప్రాధికార సంస్థ అధినేతగా, సురభి నాటకసంస్థ ప్రోత్సాహకుడిగా, తొలి ద్విశతావధాన స్రష్టగా, క్రీడాజ్యోతికి వెలుగుగా, నంది అవార్డులతో నాటకరంగానికి వెన్నుదన్నుగా నిలిచాడు. అంతరించిపోతున్న ‘హరికథ’ ప్రక్రియకు దీపపు వెలుగయ్యాడు. ఏప్రిల్‌ 16 ను తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రకటించి, రాజముద్ర వేయించి తన కళాభిరుచిని చాటుకున్నాడు.


రమణాచారి ‘ప్రజాసేవయే పరమావధి’ అని గ్రహించి, 2010లో ‘ఆనంద నిలయం’ పేరున ఒక వృద్ధాశ్రమం, దానికి అనుబంధంగా ‘ఆనందబాలసదనం’, బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం, పేరున నిర్మించిన భవనసముదాయాలు సుమారు 40 మంది వృద్ధులకు, 40 మంది బాలురకు అండగా నిలిచి వారి జీవితాల్లో కోల్పోయిన వెలుగుపూలను పూయిస్తున్నాయి. ఏ వసతులు లేకుండా మగ్గిపోతున్న లూకారం జాగీర్‌ గ్రామాన్ని (రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం) దత్తత తీసుకుని దాన్ని సంపూర్ణ అక్షరాస్యతా గ్రామంగా తీర్చిదిద్దాడు. 


‘రమణ పనితీరు, పెద్దల పట్ల వారు చూపే గౌరవం, అన్నింటికీ మించి ప్రతిభకు న్యాయం జరగాలనే వారి ఆకాంక్ష, మంచిమాటతోనే కాకుండా మంచి చేతతో అడిగినవారికి సహాయం అందించాలి అనే ఒక పాజిటివ్‌ అధికారిని ఆయనలో చూశాను’ అని కె.వి. రమణతో మూడు దశాబ్దాలు సహచరుడిగా పరిచయం ఉన్న సిఎస్‌ రావు తన ‘ఉద్యోగపర్వం’ అనే సంకలనంలో పేర్కొన్నారు.ఒక ప్రభుత్వాధికారికి ఇంతకన్నా గొప్ప ‘కితాబు’ ఉండదు. సప్తతిలో అడుగిడబోతున్న రమణ జీవితం ఒక మహానదిని తలపిస్తుంది. ఈ శుభసందర్భాన ఆ వేంకటరమణుడు ఈ రమణకు ఆయురారోగ్యాలను ప్రసాదించి తరింపజేయాలని కోరుకుందాం.

కూర చిదంబరం

(ఫిబ్రవరి 8: కె.వి. రమణ పుట్టిన రోజు)

Updated Date - 2021-02-06T06:37:31+05:30 IST