పెప్సీ ‘దుంప’ తెగింది

ABN , First Publish Date - 2021-12-07T06:02:37+05:30 IST

పెప్సీ కంపెనీ తాను ఉత్పత్తి చేసే బంగాళాదుంప చిప్స్ బ్రాండ్ ‘లేస్’పై హక్కులను కోల్పోయింది. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‍ను డిసెంబర్ 3న రద్దు చేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం...

పెప్సీ ‘దుంప’ తెగింది

పెప్సీ కంపెనీ తాను ఉత్పత్తి చేసే బంగాళాదుంప చిప్స్ బ్రాండ్ ‘లేస్’పై హక్కులను కోల్పోయింది. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ పెప్సీ రిజిస్ట్రేషన్‍ను డిసెంబర్ 3న రద్దు చేసింది. ఇది విత్తనంపై హక్కును నిలుపుకోవటంలో భారత రైతులు సాధించిన ఘనవిజయం. బంగాళాదుంప పంటలో ఉపయోగించే ఈ వంగడాలను మన దేశానికి 2009లో తీసుకువచ్చారు. రైతులకు ఈ విత్తనాలను అందించి, వారు పండించాక వారి నుంచి బంగాళదుంపలను కొనుగోలు చేసేట్టు పెప్సీ ఒప్పందాలను కుదుర్చుకున్నది. దేశంలో 12 రాష్ట్రాలలో 24 వేల మంది రైతులకి లైసెన్సుపై ఈ బంగాళాదుంప విత్తనాలను ఇచ్చి తిరిగి వారి నుంచి బంగాళాదుంపలు కొనేటట్లుగా కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్నది. ‘యఫ్.యల్.2027’ అని పిలవబడే ఈ బంగాళదుంపలను చిప్స్‌గా తయారు చేసి ‘లేస్’ అన్న బ్రాండ్ పేరుతో పెప్సీ కంపెనీ అమ్ముకుంటున్నది. 2016 ఫిబ్రవరి 2న ఈ రకపు వంగడాన్ని PPVFR–2001 చట్టం (ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ఏక్ట్–పీపీవీఎఫ్‌ఆర్) 64, 65 సెక్షన్ల క్రింద పెప్సీ కంపెనీ పేటెంటు నమోదు చేసుకున్నది. దీనిపై పూర్తి హక్కులు తమకే చెందుతాయని, తమ అనుమతి లేకుండా ఎవరూ ఆ రకాన్ని పండించటానికి వీలు లేదని ప్రకటించింది. చట్టాల పేరున సాంప్రదాయక రైతు విత్తన హక్కుపై దాడి చేయటానికి ప్రయత్నించింది. 


రెండు సంవత్సరాల క్రితం గుజరాత్‌లో ఈ రకం బంగాళ దుంపలను సాగు చేస్తున్న నలుగురు రైతులపై పెప్సీ కంపెనీ మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టింది. నష్ట పరిహారంగా ఒక్కొక్క రైతు ఒక కోటి ఐదు లక్షల రూపాయలను, అంటే మొత్తం రూ.4.2 కోట్లను, చెల్లించాలంటూ కోర్టు ద్వారా డిమాండ్ చేసింది. 2018 ఏప్రిల్ 8న అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎక్స్ పార్టీ డిక్రీ ఇచ్చింది. రైతులు కోర్టులో లేకుండానే, రైతులను విచారించకుండానే, రైతుల లాయర్ లేకుండానే మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. అయితే యావత్ భారత దేశ రైతులు, ప్రజాస్వామిక వాదులు రైతు విత్తన హక్కు కోసం నిలబడ్డారు. కోర్టు కేసులు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. గుంటూరు దగ్గర తుమ్మలపాలెంలో కూడా పెప్సీ కంపెనీ వద్ద రైతు సంఘాలు కలిసి ఆందోళన చేశాయి. పెప్సీ కంపెనీ తయారు చేస్తున్న చిరుతిళ్ళను, కూల్ డ్రింకులను బహిష్కరించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆనాడు ఎన్నికల ముందు దేశవ్యాప్త ఆందోళనల ఫలితంగా పెప్సీ కంపెనీ కేసులన్నీ వెనక్కి తీసుకున్నది. కానీ విత్తనంపై హక్కు తమదే అన్న వాదనను మాత్రం మార్చలేదు. చట్టం ప్రకారం రైతులకు విత్తనం తయారుచేసుకునే హక్కులేదని వాదిస్తూనే వచ్చింది. ఇందుకు ప్రతిగా రైతు సంఘ నాయకురాలు కవిత కురుగంటి రైతుల విత్తన హక్కుకోసం పిటీషన్ వేశారు. రైతుల విత్తన హక్కును పెప్సీ కంపెనీ ఉల్లంఘిస్తున్నదని, పీపీవీఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం వారికిచ్చిన రిజిస్ట్రేషన్ చెల్లదని ఆమె రైతుల తరపున పిటీషన్ దాఖలు చేశారు. చట్టంలోని సెక్షన్ 64ను పెప్సీ వాడుకుంటే, రైతులు అదే చట్టంలోని సెక్షన్ 39(1)ను ఉదహరించారు. ఈ సెక్షన్ ప్రకారం వ్యవసాయానికి విత్తనాలను నాటటం, తిరిగి నాటటం, విత్తనాలను మార్చుకోవటం, పంచుకోవటం లేదా విక్రయించటానికి రైతులకు అవకాశం ఉన్నది. ఈ చట్టం అమలులోకి రాకముందులాగానే రైతులకు హక్కులన్నీ ఉంటాయని కూడా సెక్షన్ 39 చెప్తున్నది. కాకపోతే రైతులు బ్రాండులతో విత్తనాలను అమ్మకూడదు. ఈ రక్షణ నిబంధనలు విత్తన రకాలపై పేటెంటును అనుమతించటంలేదని, కాబట్టి పెప్సీకి చెందిన ‘యఫ్.సి 5’ బంగాళదుంప రకానికి మంజూరు చేసిన మేధోరక్షణను రద్దు చేయాలని రైతుల తరఫున వచ్చిన వాదనను పీపీవీఎఫ్‌ఆర్ అథారిటీ అంగీకరించింది. రైతులకు విత్తనాలను తయారు చేసుకునే హక్కు ఉన్నదని, బ్రాండ్ లేని విత్తనాలను అమ్ముకునే హక్కు కూడా రైతుకు ఉన్నదని ఒప్పుకుంది.


పెప్సీ కంపెనీ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఆ బంగాళాదుంప వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో కంపెనీవి కావని తీర్పు చెప్పింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కులను రద్దుచేస్తూ పీపీవీఎఫ్‌ఆర్ అథారిటీ శుక్రవారం తీర్పు ఇచ్చి సందిగ్ధాన్ని తొలగించింది. గతంలో కంపెనీకి ఇచ్చిన పేటెంటు హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెటును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ తీర్పువలన మన దేశ రైతులకు చారిత్రక విజయం లభించింది. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా విత్తనంపై సంపూర్ణ హక్కు పొందే అవకాశం లేకుండా స్పష్టమైన తీర్పును, పీపీవీఎఫ్‍ఆర్ అథారిటీ చైర్‌పర్సన్ కె.వి.ప్రభు ఇచ్చారు. రైతులోకం స్వాగతించవలసిన తీర్పును సాధించిన కవితా కురుగంటి అభినందనీయులు.

డాక్టర్ కొల్లా రాజమోహన్

నల్లమడ రైతు సంఘం, గుంటూరు

Updated Date - 2021-12-07T06:02:37+05:30 IST