ఆయన ప్రసంగం అసత్యాల కుప్ప

ABN , First Publish Date - 2021-08-21T06:30:30+05:30 IST

వాస్తవాలు చికాకు కలిగిస్తాయి. బూటకాలు ఉత్తేజకరంగా ఉంటాయి. నిజానిజాలను నిగ్గు తేల్చడమనేది ప్రమాదకరమైన వ్యవహారం. నకిలీ విషయాలు పులకరింపచేస్తాయి. మీకు ఏవి కావాలి? మీ ప్రియమైన దేశాన్ని మహోన్నత సమాజంగా....

ఆయన ప్రసంగం అసత్యాల కుప్ప

వాస్తవాలు చికాకు కలిగిస్తాయి. బూటకాలు ఉత్తేజకరంగా ఉంటాయి. నిజానిజాలను నిగ్గు తేల్చడమనేది ప్రమాదకరమైన వ్యవహారం. నకిలీ విషయాలు పులకరింపచేస్తాయి. మీకు ఏవి కావాలి? మీ ప్రియమైన దేశాన్ని మహోన్నత సమాజంగా తీర్చేదిద్దేవి, మీ జీవితాన్ని ఆనందప్రదం చేసేవి ఏవో మీరే నిర్ణయించుకోండి. 


ప్రపంచనాయకులు విధిగా వెలువరించే ప్రసంగాలలో ఒక దానికి సకల దేశాలలోనూ విశేషప్రాధాన్యం లభిస్తోంది. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు చేసే వార్షిక ‘స్టేట్‌ ఆఫ్ ది యూనియన్’ ఉపన్యాసమది. అమెరికా విధానాలు ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేసేవి గనుకనే ఆ దేశాధ్యక్షుడి ప్రసంగం ప్రాముఖ్యం పొందుతోంది. ప్రతి ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి జాతి నుద్దేశించి చేసే ప్రసంగానికి అంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ, అది ఎవరూ ఉపేక్షించని ఉపన్యాసమే. దానికి ఉండే ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. స్వాతంత్ర్యదినోత్సవ వేడుక గణతంత్ర దినోత్సవ వేడుకల వలే కన్నులపండువగా జరిగే శోభాయమాన ఉత్సవం కాదు. అయితే ప్రధానమంత్రి ప్రసంగం ఆ వేడుక ప్రత్యేకత, విశిష్టతకు ఒక తార్కాణంగా ఉంది. 


చరిత్ర ప్రసిద్ధమైన ఎర్రకోట బురుజు నుంచి ప్రధానమంత్రి చేసే ఉపన్యాసం జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి ఒక ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నేను దానిని ‘జాతి పరిస్థితి’ (స్టేట్ ఆఫ్ ది నేషన్) ప్రసంగమని అంటాను. ఆ ప్రసంగం జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన సమున్నత సంప్రదాయాలలో ఒకటి. నరేంద్రమోదీ అపహసించని, త్యజించని నెహ్రూ సంప్రదాయమది. అయితే నరేంద్రమోదీ ఆగస్టు 15 ప్రసంగాలు, నెహ్రూ ఉపన్యాసాల వలే స్ఫూర్తిదాయకమైనవేనా? కానే కావు. ఎందుకని? ఎన్నికల ప్రచారసభలలో మోదీ చేసే ఉపన్యాసాలకు, ఆయన ఎర్రకోట నుంచి వెలువరించే ప్రసంగాలు భిన్నంగా ఉండవు. కాకపోతే ప్రతిపక్ష నాయకులపై అవహేళనాత్మకమైన వ్యాఖ్యలు ఏవీ అందులో ఉండవు.


సరే, నరేంద్ర మోదీ ఎనిమిదవ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం సారాంశానికి వస్తాను. అది ప్రధానంగా ఆయన ప్రభుత్వ ‘విజయాల’ ఏకరువు. విచారకరమైన విషయమేమిటంటే అమెరికాలో వలే మన మీడియాలో ప్రభుత్వాధినేతల ప్రకటనల, వాదనల నిగ్గు తేల్చే ఆనవాయితీ అంతగా లేదు. ప్రొఫెసర్ రాజీవ్ గౌడ నేతృత్వంలోని ఒక యువబృందం ప్రధాని మోదీ ప్రసంగాన్ని నిశితంగా పరిశీలించింది. వారి పరిశీలనలను వివరంగా చూద్దాం. 


‘కరోనా మహమ్మారిని భారతీయులు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆ విషక్రిమిపై పోరులో మనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రతి సవాల్‌నూ మనం అధిగమించగలిగాం. ఈ కృషిలో మనం మొదటి నుంచీ స్వశక్తిపైనే ఆధారపడ్డాం. ప్రపంచంలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో మాత్రమే అమలయింది’ అని నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో పేర్కొన్నారు. నిజమేమిటి? అధికారిక గణాంకాల ప్రకారం మనదేశంలో కొవిడ్ వ్యాధితో సంభవించిన మరణాల సంఖ్య 4,33,632. ఈ మరణాల విషయంలో మనదేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. అయితే పలు స్వతంత్ర అధ్యయనాలలో కొవిడ్ మరణాలు వాస్తవానికి అధికారిక సంఖ్యకు కనీసం పదిరెట్లు అధికంగా ఉండవచ్చని వెల్లడయింది. నిపుణులందరూ ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. దీన్ని బట్టి మనదేశంలోనే ఆ మరణాల సంఖ్య అత్యధికంగా ఉందనేది స్పష్టం. రెండవ దఫా ఉద్ధృతిలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్స్ మొదలైన వాటి కోసం నలభైకి పైగా దేశాల సహాయ సహకారాలపై ఆధారపడ్డాం. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమానికి స్వస్తి చెప్పారు.


తత్ఫలితంగా మనపై ఆధారపడ్డ అనేక చిన్నదేశాలు తీవ్ర సమస్యల పాలయ్యాయి. వ్యాక్సిన్ల కోసం మనం రష్యా, అమెరికాలను ప్రాధేయపడవలసివచ్చింది. మరి వ్యాక్సిన్ల విషయంలో మన స్వావలంబన ఎక్కడ? స్ఫుత్నిక్ వ్యాక్సిన్‌ను మోదీ సర్కార్ ఆమోదించడం హర్షణీయమే. ఇంకా పలు విదేశీ కంపెనీలతో వ్యాక్సిన్ల కోసం సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. మొత్తం మీద వ్యాక్సిన్‌ల సరఫరా అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీవ్ర అవరోధాలు నెలకొన్నాయి. నేను ఈ కాలమ్ రాస్తున్న సమయానికి మనదేశంలో 44,01,02,169 మందికి ఒక డోస్ టీకా వేశారు. 12,63,86,264 మందికి మాత్రమే టీకా రెండు డోసులు వేశారు. మరి 2021 సంవత్సరాంతంలోగా వయోజనులు (95–-100 కోట్లు) అందరికీ టీకాలు వేయాలన్న లక్ష్యం నెరవేరుతుందా? 


‘80 కోట్లకు మందికి పైగా ఆహారధాన్యాలను ఉచితంగా సరఫరా చేశాం. ప్రపంచం ఈ విషయం గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతోంది’ అని ప్రధాని మోదీ అన్నారు. మనదేశంలో 27కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ సగటున ఐదుగురు వ్యక్తులు ఉంటారు. ఒకొక్కరికి ఐదు కిలోల చొప్పున తిండి గింజలు సరఫరా చేస్తే అది భారత ఆహారసంస్థ గోదాంల నుంచి జరిగే వినియోగంలో ప్రతిబింబించాలి. అయితే ఎఫ్‌సిఐ గోదాంల నుంచి ఆహారధాన్యాల వినియోగం 2012–13లో 66 మిలియన్ టన్నుల నుంచి 2018–-19లో 62 మిలియన్ టన్నులకు, 201౯-–20లో 54 మిలియన్ టన్నులకు పడిపోయింది. మహమ్మారి సంవత్సరం 2020-–21లో ఆ వినియోగం 87 మిలియన్ టన్నులకు పెరిగింది... అంటే ఉద్దేశించిన లబ్ధిదారులు అందరికీ తిండి గింజలు ఉచితంగా అందలేదు. ఐదు కిలోల ఉచిత ఆహార ధాన్యాల పథకం (గరీబ్ కల్యాణ్ అన్న యోజన) కింద కేవలం 27 శాతం కుటుంబాలు మాత్రమే పూర్తిస్థాయిలో లబ్ధి పొందాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 107 దేశాలలో మనదేశం 94వ స్థానంలో ఉంది. 


‘ప్రతి ఒక్కరికీ పాయిఖానా’ పథక లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించాం. అలాగే ఇతర పథకాల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికీ అందాలి’ అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ప్రతి ఒక్కరికీ పాయిఖానా’ అనేది ఒక బోలు మాట. నిర్మించామంటున్న టాయెలెట్‌లలో అత్యధికం అసలు ఉనికిలోనే లేవు. జాతీయ ఆరోగ్య సర్వే-–5 ప్రకారం ఐదు రాష్ట్రాలలోని గ్రామీణ జనాభాలో మూడోవంతు మందికి సొంతగృహాలలో పాయిఖానాలు లేవు. 2018లో ఎన్ఎస్ఓ నిర్వహించిన ఒక సర్వేలో గ్రామీణ కుటుంబాలలో 28.7 శాతం మందికి పాయిఖానా వసతి అందుబాటులో లేదని, 32 శాతం మంది ప్రజలు బహిర్భూమికి వెళుతున్నారని వెల్లడయింది. 


‘రాబోయే సంవత్సరాలలో మనదేశంలో అనేక ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్టు’ మోదీ వెల్లడించారు. ఆక్సిజన్ ప్లాంట్లను విరివిగా నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న ఎనిమిది నెలలకు ప్రభుత్వ ఆసుపత్రులలో పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు బిడ్‌లను ఆహ్వానించారు. ప్రతిపాదించిన 163 ఆక్సిజన్ ప్లాంట్లలో 33 ప్లాంట్లను మాత్రమే నెలకొల్పినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2021 ఏప్రిల్ 8న ట్వీట్ చేసింది. వాటిలో కేవలం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లు మాత్రమే పనిచేస్తున్నాయని ‘స్ర్కోల్’ అనే మీడియా సంస్థ వెల్లడించింది. 


‘ఆధునిక సదుపాయాల కల్పనకు 100లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నామని’ ప్రధాని మోదీ ప్రకటించారు. భారత ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని మోదీ భావిస్తున్నారా? సరిగ్గా ఇదే ప్రకటనను ఆయన 2019, 2020 స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాలలో కూడా చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మదుపులు ఏటా రూ.100 లక్షల కోట్ల మేరకు పెరగడం నిజంగా జరిగితే హర్షించనివారు ఎవరు ఉంటారు? కానీ, వాస్తవం అది కాదుకదా. 


ఇంకా ఇలాంటి గొప్ప ప్రకటనలు చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావించి నేను అలసిపోదలుచుకోలేదు. మిమ్ములను విసిగించను. వాస్తవాలు చికాకు కలిగిస్తాయి. బూటకాలు ఉత్తేజకరంగా ఉంటాయి. నిజానిజాలను నిగ్గుతేల్చడమనేది ప్రమాదకరమైన వ్యవహారం. నకిలీ విషయాలు పులకరింప చేస్తాయి. మీకు ఏవి కావాలి? మీ ప్రియమైన దేశాన్ని మహోన్నత సమాజంగా తీర్చేదిద్దేవి, మీ జీవితాన్ని ఉల్లాసవంతం చేసేవి ఏవో మీరే నిర్ణయించుకోండి. 



పి. చిదంబరం

Updated Date - 2021-08-21T06:30:30+05:30 IST