తెలుగు పబ్లిషింగ్‌లో డబ్బుల్లేవు!

ABN , First Publish Date - 2021-12-27T06:05:37+05:30 IST

ఇది అనిల్‌ అట్లూరి నవంబరు 15న వివిధలో రాసిన వ్యాసానికి స్పందనగా రాస్తున్న వ్యాసం కాదు. కానీ ఆ వ్యాసం నన్ను ఆలోచింపజేసింది. నేను 42 ఏళ్లుగా తెలుగు పబ్లిషింగ్‌ రంగంలో ఉన్నా ఇంత బాహటంగా ఎప్పుడూ మాట్లాడలేదు...

తెలుగు పబ్లిషింగ్‌లో డబ్బుల్లేవు!

ఇది అనిల్‌ అట్లూరి నవంబరు 15న వివిధలో రాసిన వ్యాసానికి స్పందనగా రాస్తున్న వ్యాసం కాదు. కానీ ఆ వ్యాసం నన్ను ఆలోచింపజేసింది. నేను 42 ఏళ్లుగా తెలుగు పబ్లిషింగ్‌ రంగంలో ఉన్నా ఇంత బాహటంగా ఎప్పుడూ మాట్లాడలేదు. తెలుగు లిపి చనిపోతున్నది; భాష కూడా మరణానికి మరెంతో దూరంలో లేదు. తెలుగులోని పాఠకుల సంఖ్య తగ్గిపోయింది. డెబ్భై ఎనభైల్లో సవర్ణులు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియమ్‌ స్కూళ్లకు పంపటం మొదలుపెట్టారు. ఈ మిలీనియంలో దళితులూ అదే బాట పట్టారు. 1980ల్లో మొదలైన దళిత పాఠకుల తరం తెలుగు సాహిత్యానికి కొత్త ఊపిరులూదింది. ఇప్పుడు ఆ తర్వాతి తరం ఇంగ్లీషు పఠనంపై ఆధారపడుతోంది. అణగారిన వర్గాల పిల్లలకు ఇంగ్లీషు చదువు ఎంత ముఖ్యమో కంచె ఐలయ్య, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ లాంటివారు చెబుతున్నారు. వారి మాటల్లో నిజం ఉంది. అలాగని ఈ వర్గాలవారికి తెలుగు భాష, చరిత్ర, సంస్కృతుల పట్ల ఎలాంటి బాధ్యతా లేదా? 


1980ల్లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి) ప్రారంభమైన కొత్తల్లో చాలా పుస్తకాలను మూడు వేల నుంచి ఐదు వేల కాపీల వరకూ వేసేవాళ్లం, ఇప్పుడు మూడు వందల నుంచి ఐదు వందల కాపీలు మాత్రమే వేస్తున్నాం. ఒక దశాబ్దం క్రితమే మొదలైన ఈ పతనాన్ని కోవిడ్‌ మరింత వేగవంతం చేసింది. కోవిడ్‌కు ముందు కూడా మా ప్రింట్‌ ఆర్డర్‌ వెయ్యి కాపీలు మాత్రమే. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నది ఒక్క హెచ్‌బిటి సంస్థ మాత్రమే కాదు. మిగతా పబ్లిషర్లుతో మాట్లాడినప్పడు వాళ్లూ ఇదే చెబు తున్నారు. రచయితలు పబ్లిషర్లకు సొంత డబ్బులిచ్చి పుస్తకాలను ప్రచురింపచేసుకోవటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. తెలుగు పుస్తకాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. మన పిల్లలు తెలుగు పుస్తకాలు చదవటం లేదు. చదవాలనుకున్నప్పుడు ఇంగ్లీషు పుస్తకాల వైపే మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఇంకా తెలుగు పాఠకులు ఉన్నారు. కానీ రవాణా, విడిది, భోజన వసతులకయ్యే ఖర్చు వల్ల పబ్లిషర్లు, రచయితలు వారిని చేరుకోలేకపోతున్నారు. ఇక నగరాల్లో ఉన్న కొద్దిమంది పాఠకుల కోసమే తెలుగు పబ్లిషర్ల మధ్య రద్దీ నడుస్తోంది. 


తెలుగు పబ్లిషింగ్‌లో అనువాదాలది ముఖ్య భాగం. ఈ మధ్య నాసిరకం అనువాదాల వల్ల నాణ్యతలేని ప్రచురణలు ఎక్కువ య్యాయి. ఫలితంగా నిరాశపడే పాఠకులూ పెరిగారు. గతంలో మనకు సహవాసి, సూరంపూడి సీతారాం లాంటి గొప్ప అనువా దకులు ఉండేవారు. మరి ఇప్పుడు అనువాదాల స్థాయి ఇంతగా దిగజారటానికి కారణం ఏమిటి? రచయితలు తమ రాతప్రతు లను సరిచూసుకోవటం లేదు, తిరగరాయటం లేదు. సహరచ యితల చేత రచనను సమీక్షింపజేసే సంప్రదాయాన్ని (‘పీర్‌ రివ్యూ’ను) చాలామంది రచయితలు వ్యతిరేకిస్తున్నారు. భారత దేశంలోని ఇంగ్లీషు పబ్లిషింగ్‌ హౌస్‌లలో నడిచే ఎడిటింగ్‌ ప్రక్రి యలో పదోవంతు కూడా తెలుగు పుస్తకాలకు జరగటం లేదు. సాహిత్య విమర్శ ఫేస్‌బుక్‌లో లైకులకు పరిమితమైపోయింది. 


ఇదివరకు పుస్తక ప్రచురణ అంటే ఎంతో ప్రేమతో చేసే పని. నేను 1980లో 500 రూపాయల జీతంతో పని మొదలుపెట్టాను. రెండు నెలల క్రితందాకా 13వేల రూపాయల జీతం అందుకు న్నాను. హెచ్‌బిటిలో జీతాలలో సమానత్వం ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ లాభాలు తక్కువ. ఇది బహిరంగంగా ఎందుకు చెబుతు న్నానంటే- హెచ్‌బిటిలో పుస్తకాల ధరలు ఎక్కువనీ, రచయితల పారితోషికాలు తక్కువనీ విమర్శించేవారు పుస్తక ప్రచురణలో పెద్ద డబ్బేమీలేదని అర్థం చేసుకోవాలి. తక్కిన చిన్న ప్రచురణ కర్తలకు కూడా డబ్బులు రావటం లేదు. ప్రచురణ రంగంలోకి కొత్తనీరు ప్రవేశించాల్సిన తరుణమిది. దానికి దోహదం చేయగల ప్రతిభావంతులు సహజంగానే ఈ రంగం నుంచి తగిన రాబడిని ఆశిస్తారు. కానీ ప్రస్తుత పబ్లిషింగ్‌ రంగంలోని ఆదాయం అందుకు తగినట్టుగా లేదు. తెలుగులో పబ్లిషింగ్‌ అనేది ఒక బాధ్యతలాగ కాకుండా, ఒక వృత్తిలాగ మారాలంటే, పుస్తక ధరల సరళి పూర్తిగా మారాలి. ప్రింటింగ్‌ ఖర్చును బట్టి మాత్రమే పుస్తకం ధరను నిర్ణయించలేం. పుస్తక ధర పబ్లిషింగ్‌ సంస్థ నిర్వహణ ఖర్చును, జీతాలు, ఆఫీసు అద్దె, ఇంకా చెల్లించాల్సిన అనేక బిల్లుల ఖర్చును ఇముడ్చుకోవాలి. ఇది జరగకపోతే, సీరియస్‌ పబ్లిషింగ్‌కు ఇక భవిష్యత్తు లేనట్టే. పాఠకుడు రూ.699 పెట్టి ఒక మూడు వందల పేజీల ఇంగ్లీషు పుస్తకం కొనుక్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ కనీసం రూ.250 పెట్టి ఒక తెలుగు పుస్తకం కొనటానికి మాత్రం సంకోచిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒక భాషకి ఇచ్చే విలువ పుస్తకాల ధరను ప్రభావితం చేస్తోంది.


మాట్లాడే భాషగా తెలుగుకు వచ్చిన లోటేమీ లేదు. తెలుగు సినిమా పాపులారిటీ ఇన్నేళ్లలో ఏమాత్రం తగ్గకపోవటమే దానికి ఒక ఋజువు. కానీ ఒక లిపి మరణించాక, భాష ఇంకెన్నాళ్లు బతికి ఉంటుంది? లిపి లేనిదే రచయితలు లేరన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. లిపి లేనిదే జ్ఞానాన్ని విస్తారంగా వ్యాప్తి చేయటం, చిరకాలం భద్రపరచటం అసాధ్యం. రాతలో భద్రపరచబడిన రికార్డులు జ్ఞాపకాన్ని దాటి, గాల్లో కలిసిపోయే మాటల్ని దాటి మనగలవు. రచన ద్వారా మాత్రమే సమాచారం స్థలకాలాల్ని దాటి ప్రయాణం చేయగలదు. అక్షరాలతో నిండిన కాగితాలు మాత్రమే మన జీవితాలపై శాశ్వత ముద్రని వేయ గలవు. వికీపీడియాలో ఉన్న ఒక జాబితా ప్రకారం భారత దేశంలో 191భాషలు బలహీనమైన స్థితిలోనో, పూర్తిగా అంత రించిపోతూనో ఉన్నాయి. 2010లో ‘పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’లో భాగంగా 790 భారతీయ భాషలను నమోదు చేసిన జి.ఎన్‌. దెవీ- వీటిలో 600 భాషలు మరణించే దశలో ఉన్నా యనీ, గత అరవై ఏళ్లలోనే 250 దాకా భాషలు మరణించాయనీ పేర్కొన్నారు. 


లిపి అన్నది భాషకు ఒక తొడుగు లాంటిది మాత్రమేననీ, భాష సారం మారకుండానే ఈ పై తొడుగును మార్చవచ్చుననీ ఒక వాదన ఉంది. సంస్కృతం, మరాఠీ, హిందీ భాషలను వాటి సారం మారకుండానే దేవనాగరి లిపిలో రాస్తున్నారు. ఖసీ భాషను రోమన్‌ లిపిలో రాస్తున్నారు. తెలుగు కూడా అలాగే రోమన్‌ లిపి వాడుతూ అభివృద్ధి చెందగలదా? ఇప్పటికే తెలుగు వాట్సాప్‌ సంభాషణ ల్లాంటివి రోమన్‌ లిపిలో సాగుతున్నాయి. తెలుగు సినిమాల్లో చాలామంది నటులకు తెలుగు చదవటం రాదు గనుక, చాలా స్ర్కిప్టులను రోమన్‌ లిపిలోనే రాస్తున్నారు.


భాషల అభివృద్ధికి ఆయా రాష్ట్రాలు తీసుకునే చర్యలు చాలా కీలకం. రెండు తెలుగు రాష్ట్రాలు భాషకోసం చేస్తున్నదల్లా ఆ గిడస బారిన తెలుగు అకాడమీని ప్రమోట్‌ చేయటం, లాబీయింగ్‌ చేయగల రచయితలకు ఏటా సాహిత్య బహుమతులు ఇవ్వటం. తెలుగు ఫాంట్‌ లాంటి ఒక చిన్న విషయమే తీసుకుందాం- రచయితలకు, ప్రింటర్లకు, పాఠకులకు మధ్య సమాచార మార్పిడికి పనికి వచ్చేట్టు ఒక ఉమ్మడి తెలుగు ఫాంట్‌ను కూడా ఈ ప్రభు త్వాలు ఇప్పటిదాకా తయారు చేయలేకపోయాయి. ప్రతి వారా ్తపత్రిక సొంత ఫాంట్‌ను వాడుతుంది, కొందరు రచయితలు కమర్షియల్‌గా లభ్యమయ్యే అనుపమ ఫాంట్‌ను, కొందరు యూని కోడ్‌ను, చాలావరకు ప్రింటర్లు కమర్షియల్‌ ఫాంట్‌లను వాడతారు. దీనివల్ల సమీక్షకులు, పాఠకులు, రచయితలు, ప్రింటర్లు ఒకరితో ఒకరు డాక్యుమెంట్లను సులభంగా మార్చుకునేందుకు ఒక ఫాంట్‌ అంటూ లేకుండాపోయింది.


తెలుగు రాష్ట్రాలు పుస్తక పఠనాన్ని, ప్రచురణను ప్రోత్సహించే ఏ చర్యా చేపట్టలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకప్పుడు గొప్ప గ్రంథాలయ సంస్కృతి నడిచింది. ఇప్పుడు లైబ్రరీలు పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం గైడ్స్‌ తప్ప ఇంకేమీ కొనవు. కొంటే గింటే అధికారులకు లంచాలిచ్చే పబ్లిషర్స్‌ నుంచి పుస్తకాలు కొంటాయి. మరోపక్క తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అచ్చయిన ప్రతి పుస్తకానికి వందల కాపీలు కొంటూ ప్రచురణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ‘తమిళనాడు రాష్ట్ర అనువాద సంఘం’ ఏర్పాటు చేసి తమిళ పుస్తకాలు భారతీయ భాషలన్నింటిలోనికీ అనువాదమయ్యేలా శ్రద్ధ తీసుకొంటోంది. హెచ్‌బిటి స్వయంగా వీటిలో మూడు అనువాదాలపై పని చేస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం తమ రాష్ట్ర అధికార భాష అయ్యుండీ తెలుగు భాష చావును కళ్ల జూస్తున్నారు.


కోవిడ్‌ తీవ్రంగా ఉన్న కాలంలో నేను ఆ కారణంగా దెబ్బ తింటున్న పబ్లిషర్ల తరఫున ప్రభుత్వ సాయం కోరుతూ ఒక పిటిషన్‌ తయారు చేసి దానిని పబ్లిషర్స్‌ అందరికీ పంపాను. నాలుగు పెద్ద పబ్లిషింగ్‌ సంస్థల నుంచి జవాబే రాలేదు. కమ్యూ నిస్ట్‌ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఆ సంస్థల తరఫున లాబీ యింగ్‌ చేయటానికి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అలాగే ఫోర్బ్‌స్‌ జాబితాలోని వందమంది సంపన్న భారతీయులలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు. కర్ణాటకలో బోధనపై, సాహిత్య పఠనంపై శ్రద్ధచూపే అజీమ్‌ ప్రేమ్‌జీ వలె తెలుగు రాష్ట్రాల్లో వాటిని పట్టించు కునే సంపన్న దాతలు మాత్రం ఎవ్వరూ లేరు. ప్రజా సమూహం లోని మేధావులు కూడా సమయ సామర్థ్యాలను ఉపయోగించి తెలుగు అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలి. ఫేస్‌బుక్‌లో లైకులు, పరస్పరం వీపు గోక్కోవడాలు, శాలువాలు కప్పుకోవడాలతో పని జరగదు.  


ఇంజనీరింగ్‌, మెడిసిన్‌లు చదువుకున్నంత మాత్రాన సమాజం అభివృద్ధి చెందదు. ఇంగ్లీషు నేర్పి ఊరుకుంటే విద్యార్థులు మల్టీ నేషనల్‌ కంపెనీలకు ఊడిగం చేయటం తప్ప గొప్ప ప్రయో జనమేమీ నెరవేరదు. ‘‘సంస్కృతి ఒక గృహం లాంటిదైతే, భాష ఆ గృహంలోని అన్ని గదులకూ తాళం లాంటిది’’ అంటాడు ఆఫ్ఘనిస్థాన్‌లో జన్మించిన అమెరికన్‌ రచయిత ఖాలెద్‌ హొసేనీ. భాష ఒక సంస్కృతికి సంబంధించిన సంక్లిష్ట స్మృతులను, సమా చారాన్ని వేలఏళ్లపాటు తనలో దాచుకుంటుంది. భాషని చంపుకో వటమంటే- మన తెలుగు జాతి ప్రాతినిధ్యం వహించే ప్రతి విలువను, తెలుగువాడి చరిత్రను, సంస్కృతిని చంపినట్టే. నా మాతృభాష తమిళమే అయినప్పటికీ నేను తెలుగు భాషని సొంతం చేసుకొని, నా నలభై రెండేళ్ల జీవితాన్ని ఈ భాషకు అర్పించాను. అలాంటి భాష ఇప్పుడు ఇంత త్వరగా క్షీణించి అవసాన దశని చేరుకోవటం నన్ను బాధపెడుతోంది. అది భాష కానీ, సంస్కృతి కానీ, చరిత్ర కానీ... ఎక్కడ మిగిలింది తెలుగువాడి ఆత్మగౌరవం? 


ప్రస్తుతం తెలుగులో ప్రచురణ సంస్థలు పుస్తకాలను 300 నుంచి 500 కాపీలు మాత్రమే వేస్తున్నాయి. హెచ్‌బిటి తోపాటు విశాలాంధ్ర, నవతెలంగాణ, ప్రజాశక్తి, నవ చేతన, పీకాక్‌ క్లాసిక్స్‌, ఛాయా... అన్ని ప్రచురణ సంస్థలదీ ఇదే పరిస్థితి. దీన్నిబట్టి పుస్తక పఠనమనే అలవాటు బాగా తగ్గిపోయిందనైనా అనుకోవాలి, పాఠకులు ఇంగ్లీషు పుస్తకాలకే ప్రాధాన్యమిస్తున్నారనైనా అనుకోవాలి. 


కానీ మాట్లాడే భాషగా తెలుగు ప్రాధాన్యం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఉదాహరణకు, అమెరికాలో తెలుగు డయాస్పోరా గత దశాబ్దంలోనే 90 శాతం పెరిగింది. సౌదీ అరేబియా, మయన్మార్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, సింగపూర్‌ లాంటి పలు ప్రాంతాలకు తెలుగు డయాస్పొరా విస్తరించింది. అలాగే ప్రస్తుతం ఆన్‌లైన్‌ మేగజైన్లు, లిటరరీ వెబ్‌సైట్లు, లిటరరీ మీట్స్‌... వీటి విస్తరణనుబట్టి మాతృదేశ సంస్కృతితో ముడిపడివున్న కంటెంట్‌కు చాలా డిమాండ్‌ ఉన్నట్టే లెక్క. కానీ తెలుగు పబ్లిషర్లు ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోలేకపోతున్నారు. తెలుగు రచనలపై ఆసక్తి ఉన్న పాఠకుల సంఖ్య తరిగిపోవటమే దీనికి కారణం. 

గీతా రామస్వామి

Updated Date - 2021-12-27T06:05:37+05:30 IST