‘ఆత్మనిర్భర్’ లక్ష్యంగా కొత్త బడ్జెట్

ABN , First Publish Date - 2021-01-20T09:03:47+05:30 IST

కేంద్రఆర్థికమంత్రి ఏటా ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలూ ఆసక్తి చూపడం కద్దు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2021–-22 ఆర్థిక...

‘ఆత్మనిర్భర్’ లక్ష్యంగా కొత్త బడ్జెట్

కేంద్రఆర్థికమంత్రి ఏటా ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలూ ఆసక్తి చూపడం కద్దు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మరింత ప్రత్యేకమైనదిగా అందరూ పరిగణిస్తున్నారు. అవును, రాబోయే బడ్జెట్‌ ప్రత్యేకమైనది. ఎందుకంటే అది కేవలం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, చెల్లింపులు, అప్పుల అంచనాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదు; వినియోగం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ వ్యయాలతో పాటు, కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన అనిశ్చితల నేపథ్యంలో ప్రజల మనో వైఖరులను ప్రభావితం చేసే అనేక విషయాలను నిండుగా ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్–19 మహమ్మారి మూలంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళలోనూ, ఉపాధి కల్పనలోనూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడమనేది చాలా ముఖ్యమైనది. 


2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీలో మూడు ముఖ్యమైన, సున్నితమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొవిడ్–19 లాక్‌డౌన్ అనిశ్చితిని ఎదుర్కోవడానికి ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ’ని జాగ్రత్తగా రాబోయే బడ్జెట్‌కు అనుసంధానించాల్సిన అవసరం ఉంది. అర్హులైన పేదలకు సహాయం అందిస్తూనే, ఉత్పాదకత పెంచి స్వయం సమృద్ధ భారత్‌గా మార్చడానికి ఆ ప్యాకేజీతో నాంది పలకడం జరిగింది. బ్యాంకింగ్ రంగంలో అవలంబించిన నిర్మాణాత్మక సంస్కరణలు, ఎఫ్‌డిఐలో సంస్కరణలు, ఆటోమొబైల్‌లో సంస్కరణలు, వస్త్ర ఉత్పత్తుల రంగాలు, ఎన్‌బిఎఫ్‌సిల కోసం చేపట్టిన సంస్కరణల ఫలితాలు మహమ్మారి కారణంగా ఆశించిన స్థాయిలో లేవు. కాబట్టి ఈ సంస్కరణలు మరింత పటిష్ఠంగా అమలు జరిగే విధంగా రాబోయే బడ్జెట్ ఉండి తీరాలి. రెండవ అంశం- గత ఏడాది ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ 100 లక్షల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ పథకాలు, కార్యక్రమాలు, వాటిని అమలుపరిచే పద్ధతులు, విధానాలను ప్రకటిస్తూ, వచ్చే 5 సంవత్సరాలలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దేందుకు లక్ష్య నిర్దేశం చేశారు. ముఖ్యమైన మూడవ అంశం- అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా 21 కోట్ల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ. ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధ భారత్)కు ఇది చాలా కీలకం. రాబోయే బడ్జెట్ కోసం దేశంలోని వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరించేటప్పుడు, ఈ సారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సాధారణ దృక్పథానికి అదనంగా చర్యలు తీసుకోవడంపై గణనీయమైన శ్రద్ధ చూపవచ్చు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత తరువాత, 2014 నుంచి ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతున్నప్పటికీ, ప్రస్తుత అసాధారణ సవాళ్ళ నెదుర్కొనేందుకు దాని ఆవశ్యకత మరింత ఎక్కువగా ఉంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020–21) వాస్తవ గణాంకాలను అసలు బడ్జెట్, సవరించిన బడ్జెట్ అంకెలతో విశ్లేషించడం చాలా అవసరం. అయితే 4వ త్రైమాసికం పురోగతిలో ఉన్నందున వాస్తవ గణాంకాలను పొందడానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. 2021–22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ తయారీ ప్రక్రియలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండవ త్రైమాసికాలలోని అన్ని అసమానతలను కొలిచిన తరువాత 2020–21 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ గణాంకాలు నిర్ధారించబడతాయి. మహమ్మారి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన వసూళ్ళు (రుణాలు కాకుండా) 22.46 లక్షల కోట్లు కాగా, అంచనా వేసిన ఆర్థిక లోటు 3.5 శాతం ప్రకారం 30.42 లక్షల కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 135 శాతానికి పెరగడంతో, అది 11లక్షల కోట్ల నుంచి 11.50 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. వసూళ్ళ విషయానికి వస్తే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళ కొరత 4 నుంచి 4.50 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు. ఊహించినట్లుగానే పన్నుల వసూళ్ళలో సగటున కనీసం 12.5 శాతం మేర మహమ్మారి ఒత్తిడి కారణంగా ప్రతికూల ప్రభావం చూపుతుందనేది వాస్తవం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020–21లో మొత్తం పరోక్ష పన్నుల అంచనా 10.96 లక్షల కోట్లుగా ఉంది. అందులో నికర జీఎస్టీ నుంచి 6.90 లక్షల కోట్లు అని అంచనా. ఇప్పటికే, అంతకుముందు సంవత్సరంతో పోల్చినప్పుడు మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్ళు 1.30 లక్షల కోట్ల వరకు తక్కువగా ఉన్నాయి, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జూలై, ఆగస్టులలో కూడా ఆ వసూళ్ళు అంచనాలకన్న 26వేల కోట్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ వసూళ్లలో వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం సహజమే. అందువల్ల 2020–21లో జీఎస్‌టీ వసూళ్ళు 1.75 లక్షల కోట్ల వరకు తక్కువగా నమోదు కావచ్చు. ప్రత్యక్ష పన్నులలో కార్పొరేట్, ఆదాయపు పన్ను వసూళ్ళ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 12.80 లక్షల కోట్ల రూపాయలు కాగా, 2021 మార్చి 31నాటికి 3 నుంచి 3.50 లక్షల కోట్ల మేరకు నికర వసూళ్ళలో కొరత ఉండవచ్చు అనిపిస్తుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ సానుకూలంగా ఉంది. దానికి కారణం కొవిడ్–19 ప్రభావం వల్ల దిగుమతులు తక్కువ కావడమే. ఎగుమతుల పరిమాణమూ విలువల పరంగా చాల తక్కువగా ఉండడమే. లాక్‌డౌన్ అనంతరం సవరించిన అంచనా గణాంకాలు తక్కువగా కనపడడం, ఆదాయ వ్యయాలు భారీగా తగ్గడం గమనించవచ్చు. ఈ మార్పుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిని అంచనా వేసినప్పటికీ ప్రతికూల (–7.5 శాతం) వృద్ధిరేటే సిద్ధించింది. ఇది కాకుండా, ప్రస్తుత పరిస్థితులలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ సంవత్సరం 2.10 లక్షల కోట్లు సమీకరించాల్సి ఉండగా, అది ఇప్పటివరకు 13.84 వేల కోట్ల మేరకు మాత్రమే సాధ్యమయ్యింది.


కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌ని వివిధ రకాలైన అంశాలతో 20.97 లక్షల కోట్ల రూపాయలుగా ప్రకటించింది. లాక్‌డౌన్ ఇబ్బందులను ఎదుర్కోవడానికి వనరులు పరిమితం అయినప్పటికీ, వ్యూహాత్మకంగా కేంద్రప్రభుత్వం, ఆర్‌బిఐ స్వయంసమృద్ధ భారత్ కోసం పటిష్ఠ ఆర్థిక చర్యలు చేపట్టాయి. వివిధ రంగాలు, విభాగాలకు ప్రోత్సాహకాలతో మంచి ప్రణాళికలను అమలు చేశాయి. మన దేశ జిడిపిలో దాదాపు 10 శాతానికి సమానమైన నిధులను ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవానికి నియోగించారు. ఆర్థిక నిపుణులు ప్రస్తుత సంవత్సరానికి ప్రతికూల వృద్ధిని అంచనా వేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ చేపట్టిన వివిధ చర్యల కారణంగా దానిని తగ్గించి సవరించారు. 2021–22 సాధారణ బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక శాఖ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటనలపై దృష్టి పెట్టాలి. లాక్‌డౌన్, అన్‌లాక్ కాలాల అనుసంధానానికి అత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ఒక చక్కటి వారధి. కనుక ఆ ప్యాకేజీలోని అంశాల కలయికతో నూతన బడ్జెట్ ఉండాల్సిన అవసరం ఉంది. మహమ్మారి అనిశ్చితలు కొనసాగే అవకాశమున్నందున ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్ రూపకల్పనలో మరింత ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరముంది. ఎందుకంటే, ఈ బడ్జెట్ భవిష్యత్ గ్లోబల్ ఎకానమీ, మహమ్మారి ప్రభావ అనంతరం అడ్డంకులు, పరిమితులకు సంబంధించిన సున్నితమైన అంశాలు మన ఆర్థిక వ్యవస్థకు భావి దిశానిర్దేశంలో భాగం అవుతాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం కొన్ని దేశాలలో ఆర్థిక మందగమనం, మాంద్యం ఉన్న సమయంలో ఎఫ్‌డిఐలు, బ్యాంకింగ్, ఎన్‌బిఎఫ్‌సిలు మొదలైన వాటిలో నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించింది. ఇంకా కొన్ని చర్యలు అమలులోకి రావాలి. ఇవి కాకుండా, కొత్త వ్యవసాయచట్టాల అమలుకు మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు ఈ రాబోయే బడ్జెట్‌లో కీలకం అవుతాయి. కార్పొరేట్ పన్నుల విషయానికి వస్తే అవి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలోని ప్రకటనల ప్రకారం కొనసాగుతాయని హామీ ఇవ్వాలి. అలాగే చిన్న, మధ్య తరహా భాగస్వామ్య సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి వీలుగా ప్రస్తుత ఆదాయపు పన్నురేట్లను తగ్గించాలనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తీరాలి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో వారి కోసం ఎటువంటి ప్రకటన చేయలేదనే వాదనలు విస్మరణీయమైనవి కావు. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ప్రధాని మోదీ సంకల్పించిన ప్రతిష్ఠాత్మక 5 ట్రిలియన్ ఎకానమీని సుసాధ్యం చేసేందుకు విశేషంగా దోహదం చేయగలదని ఆశిస్తున్నాను. 

దినకర్ లంకా

Updated Date - 2021-01-20T09:03:47+05:30 IST