నేతన్నకు నమ్మక ద్రోహం
ABN , First Publish Date - 2021-08-11T06:38:28+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పేరుతో చేనేత కార్మికులను నయవంచనకు గురి చేస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.24వేలు ఇస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటూ...
రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పేరుతో చేనేత కార్మికులను నయవంచనకు గురి చేస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.24వేలు ఇస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటూ, టీడీపీ సర్కార్ రూ.50వేలకు పైగా లబ్ధి చేకూరుస్తూ అమలు చేసిన పథకాలను రద్దు చేసింది. చేనేత కార్మికులకు అందాల్సిన కార్పొరేషన్ రుణాలు, వాటిపై ఇచ్చే సబ్సిడీలు, పనిముట్లపై రాయితీలు అన్నీ రద్దు చేసి, నేస్తం అంటూ మోసం చేస్తూ నేత కార్మికులకు గుండు కొడుతోంది. గత ప్రభుత్వాలు చేనేత సహకార సంఘంలోని కార్మికులు చేసే పనిని బార్లుగా కొలుస్తూ, ఒక్కో బారుకు రూ.1000 వరకు ప్రోత్సాహకం అందించేవి. ఇప్పుడు నేతన్న నేస్తం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నందున ప్రోత్సాహకం అవసరం ఏమిటని జగన్ సర్కార్ ప్రశ్నిస్తూ దానిని నిలిపివేసింది. రాయితీల విషయానికొస్తే.. గతంలో నూలు, రంగులు, ఇతర ముడి సరుకులపై రాష్ట్ర ప్రభుత్వం 30- నుంచి 50శాతం వరకు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు ఆ సబ్సిడీల ఊసే లేదు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు. కార్పొరేషన్ ద్వారా రూ.2లక్షలు రుణాలిచ్చి, రూ.లక్ష సబ్సిడీ అందించి తర్వాత రుణాలను మాఫీ చేయడం ద్వారా ఆర్థికంగా బాసటగా నిలిచారు. కానీ జగన్ సర్కార్ వచ్చాక బడ్జెట్ కేటాయింపులు లేవు. రుణాల మాటా లేదు. వర్షాకాలంలో పనులు లేనప్పుడు గతంలో భృతి అందేది, ఉచిత విద్యుత్ అందేది. ఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, రంగులపై సబ్సిడీ వగైరాల కోసం రూ.25 కోట్లు, పావలా వడ్డీ ద్వారా రూ.2కోట్ల రుణాలు, మూలధనం కింద రూ.30 కోట్లు, మరమగ్గాలకు 50 శాతం రాయితీ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. 50 సంవత్సరాలు దాటిన 1.11లక్షల మంది చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చారు. చేనేతరంగం అభివృద్ధికి, కార్మికులకు భరోసా కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం త్రిఫ్టు (ఉద్యోగులకు పీఎఫ్ లాంటిది)ను 8 శాతం నుంచి 16 శాతానికి పెంచింది. 10శాతం ఉన్న నూలు సబ్సిడీని 40శాతా నికి పెంచింది. ఏడాదిలో 150 రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని 365 రోజులకు పొడిగించింది. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీకే రుణాలిచ్చి ఆర్థిక తోడ్పాటు అందించింది. కార్పొరేషన్ ద్వారా సొంత మగ్గం లేని వారికి మగ్గాలు, పే కార్మికుడి శ్రమను తగ్గించేందుకు ‘ఆదరణ’ ద్వారా లిఫ్టింగ్ యంత్రాలు, సిల్కుపై కిలోకు రూ.250 చొప్పున రాయితీ, మహాత్మాగాంధీ భంకర్ బీమా పథకంలో మరణించిన చేనేతలకు రూ.60వేల పరిహారం అందించింది. ప్రతి చేనేత కార్మికుడికీ రూ.30వేల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించింది. సహకార సంఘాల ద్వారా తయారైన ఉత్పత్తులను ఎప్పటికప్పుడు ఆప్కో ద్వారా కొనుగోలు, మజూరీతో పాటు అదనపు రాయితీలు అందించి కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంది. కానీ, ప్రస్తుతం రాయితీలు కాదు కదా, కనీస వేతనాలు కూడా అందక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చేనేత కార్మిక దినోత్సవం నాడే మదనపల్లిలో ఓ కార్మికుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నేతన్న నేస్తం అంటూ ఆర్భాటం చేస్తున్న జగన్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.50 లక్షల చేనేత కార్మికులు ఉంటే 81,024 మందికి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. సొంత మగ్గం ఉన్నవారికే పథకం అమలు అంటూ నిబంధన పెట్టడం వల్ల, అదే రంగంలో నూలు వడకడం, రాట్నం తిప్పడం, దారం బొందులు ఎక్కించడం, రంగుల అద్దకం వంటి పనులు చేసే కార్మికులందరికీ ఆ పథకం దూరమైంది. మగ్గం పని చేసే ప్రతి కార్మికుడికి, కూలితో సంబంధం లేకుండా ఏటా రూ.50 వేలు వచ్చే అదనపు ఆదాయాన్ని నిలిపేసి రూ.24 వేలు చేతిలో పెట్టి చేనేత వృత్తినే ప్రశ్నార్ధకం చేస్తున్నారు. గతంలో ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రెండేళ్లుగా ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిపేశారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 37 సంఘాల వద్ద రూ.5 కోట్ల విలువైన వస్త్రాలు అమ్ముడుపోక పేరుకుపోయాయి. దీంతో కొత్తగా తయారీ ఆగిపోయింది. నేతన్నలు పని కోల్పోయారు. గత రెండేళ్లలో పదుల సంఖ్యలో చేనేతల ఆత్మహత్యలు జరిగాయి.
చేనేతలో దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం కారణంగా చేనేత రంగంలో భవిష్యత్ తరమే ఉండబోని పరిస్థితులు నెలకొన్నాయి. కూలి చేసుకుని అయినా బతుకుతాం గానీ, మగ్గం మీదకు వెళ్లబోమని నేతన్నల పిల్లలు అంటున్నారంటే దానికి రాష్ట్ర ప్రభుత్వపు నిర్లక్ష్యం, నిర్లిప్తతే కారణం. రుణాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలను కొనసాగించి చేనేతను కాపాడుకోవాల్సింది పోయి చిల్లర విదిల్చి రాజకీయం చేస్తూ మగ్గానికి మరణశాసనం రాయడం మానుకుని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రంగానికి అండగా నిలవాలి.
గంజి చిరంజీవి
(మంగళగిరి మాజీ మున్సిపల్ ఛైర్మన్)