నెల్లూరు వైమానిక వీరుడు

ABN , First Publish Date - 2021-02-06T06:34:55+05:30 IST

దొడ్లరంగారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ వైమానికదళ అధికారిగా ఆంగ్లేయుల సైన్యంతో...

నెల్లూరు వైమానిక వీరుడు

దొడ్లరంగారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయ వైమానికదళ అధికారిగా ఆంగ్లేయుల సైన్యంతో కలిసి యుద్ధం చేస్తూ శత్రువిమానాన్ని పడగొట్టిన మొదటి పైలట్ రంగారెడ్డి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వాసి. 23 ఏళ్లకే శౌర్యపరాక్రమాలు ప్రదర్శించి తనువు చాలించిన ధీరుడు.


రంగారెడ్డి వీరగాథ వివరాల తెలుగువారిని ద్రిగ్భ్రాంతికి గురిచేస్తాయి: 1944 ఫిబ్రవరి 8న నలుగురు భారతీయ యువ వైమానిక పైలట్లు బర్మా (నేటి మియన్మార్) వాయుతలంలో జపాన్ విమానాలతో ముఖాముఖీ తలపడ్డారు. ఆ నలుగురు పైలట్లు ఫ్లైయింగ్ ఆఫీసర్ జగదీష్‌చంద్ర వర్మ (25), ఫ్లైయింగ్ ఆఫీసర్ ముర్కోట్ రమున్నీ-(28), ఫ్లైయింగ్ ఆఫీసర్ దొడ్ల రంగా రెడ్డి-(23) ఫ్లైయింగ్ ఆఫీసర్ జోసఫ్ చార్లెస్ డి లిమా-(27). హాకర్ హరికేన్ ఫైటర్ విమానాలను నడిపే ఈ యువకులు భారతీయ వైమానికదళం లోని 6వ స్క్వాడ్రన్‌కు చెందినవారు. ఆ నాడు ఆంగ్లేయుల వలసరాజ్యాలయిన భారత్, బర్మా సరిహద్దు ప్రాంతమైన కాక్స్ బజార్ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో భాగం)లో వారు విధులు నిర్వహిస్తున్నారు. 1944 ఫిబ్రవరి 8 ఒక దుర్దినం. సరిహద్దున ఉన్న టాంగ్ బజార్ అనే పట్టణానికి సమీపంలోని జపాన్ సైనిక స్థావరాలపై దాడి జరపాలని ఈ నలుగురు వైమానికులను ఆదేశించారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఇద్దరు భారతీయ పైలట్లు చనిపోయారు. కాని రెండవ ప్రపంచయుద్ధంలో ఒక భారతీయ వైమానికుడు తన ప్రత్యర్ధి విమానాన్ని నేలకూల్చిన మొదటి సందర్భమది. వైమానిక దళ రికార్డ్ ప్రకారం రంగారెడ్డి, జోసెఫ్ తిరిగి రాలేదు. తమ విమానాలకంటే శక్తిమంతమైన జపాన్ మిత్సుబిషి విమాన దాడుల్లో వీరు హతమై ఉంటారని భావించారు. 


తిరిగి వచ్చిన రమున్నీ తరువాత అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. 95 ఏళ్ళ వరకు బతికాడు. మలయాళంలో చాలా పుస్తకాలు రాశాడు. ‘స్కై వజ్ ది లిమిట్’ అనే పుస్తకంలో అతను ఇలా రాశాడు: ‘వర్మ ఆదేశం ప్రకారం నాలుగు విమానాలు శత్రువు వైపుకు దూసుకువెళ్ళి బాంబులు కురిపించాలి. ముందు వర్మ, ఆయన వెనుక నేను, తరువాత రంగారెడ్డి, చివర జోసెఫ్ బయలుదేరాం. మొదటి విమానం బాంబులు కురిపించి పక్కకు తప్పుకుంటున్నప్పుడు శత్రువిమానాలు వచ్చేయడం చూసి అందరిని వెనక్కు వచ్చేయమని ఆదేశించాడు వర్మ. రంగారెడ్డి కేకలు పెట్టాడు. ‘నా వెనుక విమానం వస్తుంది, జాగ్రత్త’ అంటూ. దాని బారి నుండి తప్పించుకోడానికి ఆకాశంలో గిరికీలు కొడుతున్న నా విమానం వెంటపడిన శత్రువిమానాన్ని పేల్చేశాడు రెడ్డి. ఈలోగా అతని వెనుక ఉన్న శత్రువిమానం అతణ్ణి దెబ్బ తీసింది. విమానం కింద ఉన్న దట్టమైన అడవిలో కూలిపోయింది. ఆ రోజు సాయంత్రం నా గదికి నేను వెళ్ళలేక పోయాను. ఎందుకంటే చాలాకాలంగా నేను, రెడ్డి ఒకే రూములో ఉండేవాళ్ళం. మద్రాస్ ఫ్లైయింగ్ క్లబ్‌లో కూడా మేము కలిసి ఉండేవాళ్ళం. మా రూములో తన తల్లికి రాస్తూ సగంలో ఆపిన అతని ఉత్తరం ఉండిపోయింది. 


తిరిగిరాని పైలట్లు రెడ్డి, జోసెఫ్ శరీరాలు కూడ దొరకలేదు. కానీ కామన్వెల్త్ యుద్ధ సమాధులలో వారికి గౌరవస్థానం లభించింది. జోసఫ్ బొంబాయిలోని బాంద్రా నివాసి. నిజానికి రంగారెడ్డి విమానాల ముఖాముఖీ పోరాటంలో చనిపోలేదు. అక్క డ తప్పించుకొని తిరిగివస్తూ సరిహద్దు దాటే సమయంలో నేలపై నుండి శత్రువు పేల్చిన తుపాకిగుండుకు అతని విమానం నేలకూలి చనిపోయాడు. రెడ్డి తన సహచరుడిని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణరక్షణ చూసుకోకుండా శత్రువు దాడికి బలికావడం దురదృష్టం. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా విధిపట్ల అంకిత భావానికి, స్వార్ధరహిత మానవత్వానికి అతను ప్రతీక. తెలుగువారి శౌర్యానికి నిలువెత్తు సాక్ష్యం దొడ్ల రంగారెడ్డి. బుచ్చిరెడ్డి పాలెం జమిందారీ కుటుంబానికి చెందిన రంగారెడ్డి ఆసక్తితో శిక్షణ పొందిన వ్యక్తి. 1941 సెప్టెంబర్ 14న మద్రాస్ నగరంలో ఎయిర్ ఫోర్స్‌లో చేరాడు. అక్కడే శిక్షణ పూర్తి చేశాడు. అతడు కదన రంగాన చూపిన ప్రతిభతో 1943 మార్చి 14న ప్లెయింగ్ అఫీసర్‌గా పదోన్నతి పొందాడు. సరిగ్గా 23 ఏళ్ల వయసులో 1944 ఫిబ్రవరి 8న వీరమరణం పొందిన తెలుగు వీరుడు రంగారెడ్డి.

ఈత కోట సుబ్బారావు

(ఫిబ్రవరి 8 రంగారెడ్డి వర్ధంతి)

Updated Date - 2021-02-06T06:34:55+05:30 IST