నాయంకర్లు, దుర్గాలు కాకతీయుల బలం

ABN , First Publish Date - 2021-10-03T05:55:22+05:30 IST

వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలుపరిచిన విశిష్ట రాజవంశం కాకతీయులు. టెంపుల్, టౌన్, ట్యాంక్ (ఆలయం, పట్టణం, తటాకం) కేంద్రంగా వారి పాలన సాగింది. కనుకనే కాకతీయులు అద్భుతమైన జలాశయాలు, దేవాలయాలు నిర్మించారు...

నాయంకర్లు, దుర్గాలు కాకతీయుల బలం

వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలుపరిచిన విశిష్ట రాజవంశం కాకతీయులు. టెంపుల్, టౌన్, ట్యాంక్ (ఆలయం, పట్టణం, తటాకం) కేంద్రంగా వారి పాలన సాగింది. కనుకనే కాకతీయులు అద్భుతమైన జలాశయాలు, దేవాలయాలు నిర్మించారు. కాకతీయ శిల్పానికి మకుటాయమైన రామప్ప గుడికి ఇటీవలే ‘ప్రపంచ వారసత్వ కట్టడం’గా యునెస్కో గుర్తింపు లభించింది. క్రీ.శ. 1050 మొదలు 1323 వరకు దాదాపు 273 సంవత్సరాలు వర్ధిల్లిన కాకతీయుల పరిపాలన తెలుగువారి చరిత్రలో మహోజ్వలమైన స్మృతులను మిగిల్చింది. మహోన్నత సుదీర్ఘ పాలననందించిన కాకతీయుల బలం ఏమిటి? వారికి అనుకూలించిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ఇరుగు పొరుగు రాజ్యాలతో సఖ్యతగా ఉండడం ప్రధానమైనది. వైరం లేకుండా ఉండేందుకై కాకతీయులు వివిధ రాజకుటుంబాలతో వైవాహిక బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. శత్రువులు లేకుండా జాగ్రత్తపడ్డారు. రాజ్యంపైకి దండెత్తివచ్చిన శత్రురాజులను ఎదుర్కోవడానికి కాకతీయులు అనుసరించిన వ్యూహం కూడా విశిష్టమైనది. శత్రువులను కాకతీయ రాజ్య ప్రధాన స్థావరానికి వెలుపలనే అడ్డుకోవడం, రాజధాని పొలిమేరలకు కూడా రాకుండా చూడడం ఆ వ్యూహ లక్ష్యం. ఇందుకుగాను ఓరుగల్లు చుట్టూ చిన్న చిన్న ఉప రాజ్యాలను ఏర్పాటు చేసి వాటికి అధిపతులుగా ‘నాయంకరులు’ అనే పేరుతో సామంతరాజులను నియమించుకున్నారు. శత్రుసేనల గురించిన సమాచారాన్ని నాయంకరులకు వెంటనే తెలియచేయడం, ఆ మేరకు వారు తక్షణమే స్పందించే పటిష్ఠ వ్యవస్థ నొకదాన్ని కాకతీయ రాజులు ఏర్పరుచుకున్నారు. దీనితో కాకతీయ సామ్రాజ్యంపై ఏ శత్రురాజులు దండెత్తినా వారిని సమర్థంగా, రాజధానికి దూరంగానే ఎదుర్కోవడానికి ఈ నాయంకరులు సదా సంసిద్ధంగా ఉండేవారు. 


రాణి రుద్రమదేవి పాలనా కాలంలో ఈ నాయంకరుల వ్యవస్థ ఏర్పాటయింది. ఆమె హయాంలో దాదాపు 77 మంది నాయంకరులు ఉండేవారని ప్రముఖ చరిత్రకారుడు డా. రేచర్ల గణపతి పేర్కొన్నారు. ఈ దండనాయకుల వ్యవస్థను ప్రతాపరుద్రుడు మరింత పటిష్ఠంగా రూపొందించాడు. ఆ వ్యవస్థలో భాగంగా ఓరుగల్లు చుట్టూ దాదాపు 70కి పైగా చిన్న చిన్న దుర్గాలు ఉండేవి. హుజురాబాద్ సమీపంలోని మొలంగూర్; జాఫర్‌గఢ్, కొత్తగట్టు, ధర్మారాయుని దుర్గం (పస్రా), ఎక్కేల కోట; పంబాల -హసన్‌పర్తి సమీపంలోని చంద్రగిరి పట్నం, హుస్నాబాద్ సమీపంలోని సర్వారాయిని దుర్గం, ఇంకా అంబాలా, తాడికొండ మొదలైన ప్రదేశాలలో ఈ రక్షణ దుర్గాలు ఉండేవి. రాజధాని ఓరుగల్లుకు సమీపంలోని రక్షణ దుర్గాలు అత్యున్నత స్థాయి సైనికాధికారుల ప్రత్యక్ష అజమాయిషీలో ఉండేవి. ఇలా దాదాపు 70కి పైగా రక్షణ దుర్గాలు ఉండేవి. ఇవన్నీ ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ మాదిరిగా ఉండేవి.


ప్రతాపరుద్రుడు పటిష్ఠపరిచిన ‘నాయంకర విధానం’ ఒక విధమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైనికాధికారులను నియమించేవారు. ఈ పాలకులనే ‘నాయంకరులు’ అనేవారు. నాయంకరులు దుర్గాధ్యక్షులు. తమ అధికార పరిధిలోని మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి, యుద్ధసమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగోవంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుని కాలంలో 77 మంది నాయంకరులు ఉండేవారు. ఈ నాయంకర విధానాన్ని కాకతీయ రాజ్యపతనం తర్వాత విజయనగర రాజులు కూడా అనుసరించారు. ఆంగ్లేయుల పాలన వచ్చేంతవరకు అది కొనసాగింది. కాకతీయులకు ముందున్న చోళులు, చాళుక్యులు కేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలుపరిచారు. అందుకే నాయంకరులకు సైనిక విషయాలలో మినహా పాలనాపరమైన మిగతా వ్యవహారాలన్నిటిలోనూ సర్వ స్వాతంత్య్రమిచ్చారు. వారి పైన కేంద్ర అధికారాన్ని చెలాయించలేదు. అణచి ఉంచే పద్ధతిని విడిచిపెట్టారు. ఒక రకంగా ఇది ప్రజాస్వామిక భావన. తెలంగాణకు చెందిన నాయంకరులలో యాదవ విశ్వనాథదేవుడు (ఇతడు గణపతిదేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు) నల్లగొండకు, అక్షయ చంద్రదేవుడు కరీంనగర్‌కు పాలకులుగా ఉండేవారు. 


కాకతీయుల ఈ రక్షణ విధానాన్ని పరిశీలిస్తే, ఇదే విధమైన సామంతరాజుల ద్వారా రోమన్ సామ్రాజ్యాధిపతులు తమ సామ్రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుకునేవారని తెలుస్తోంది. అప్పుడు రోమ్ పాలకులు తమ రాజ్యం చుట్టూ ఈ మాదిరి ఉప రాజ్యాలను, రక్షణ దుర్గాలను ఏర్పాటు చేసుకొని శత్రు సైన్యాలను ఎక్కడికక్కడ నియంత్రించేవారట. తొలినాటి రోమన్ సామ్రాజ్యానికి సమకాలికులుగా దక్షిణాదిని ఏలిన శాతవాహనులు ఉండేవారు. వీరి కాలంలో రోమన్ సామ్రాజ్యంతో మన దేశానికి వాణిజ్య సంబంధాలుండేవి. అలా, ఇక్కడికి వ్యాపారాలనిమిత్తం వచ్చిన రోమన్ వర్తకులు తమ రాజ్యంలోని భద్రతా చర్యలను మన వారికి వివరించేవారని, అలా రోమ్ భద్రతా విధానాన్నే ఇక్కడా పాటించారని ఒక అభిప్రాయం. అయితే, శాతవాహనులు- కాకతీయులకు ఎన్నో సంవత్సరాల అంతరం ఉంది. ఈ విధమైన రోమ్ భద్రతా వ్యవస్థ గురించిన చరిత్ర విశేషాలు మౌఖికంగా గానీ, జానపద విజ్ఞానం ద్వారా గానీ, సాహిత్యం ద్వారా గానీ కాకతీయులు అధ్యయనం చేసి అదే విధానాన్ని ఇక్కడ సమర్థంగా అమలు చేశారని పలువురు చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు.


క్రీ.శ. 1303లో కాకతీయ సామ్రాజ్యంపై అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైన్యం కాకతీయ రాజ్యంపై దండెత్తింది. కాకతీయ సైన్యం ఖిల్జీ సైన్యాన్ని ఓడించింది. ప్రతీకారంతో అల్లావుద్దీన్‌ ఖిల్జీ రెండోసారి కాకతీయ రాజ్యంపై అత్యంత ఆధునిక ఆయుధాలతో, ప్రధానంగా ఫిరంగి దళంతో దండయాత్ర చేస్తే ప్రతాపరుద్రుడు పెద్ద ఎత్తున ధనరాశులు, ఏనుగులు ఇచ్చి సంధి చేసుకున్నాడు. 1323లో ఢిల్లీ సుల్తాన్ సేనలు ఓరుగల్లుపై దండెత్తినప్పుడు ఇక్కడి సామంత రాజుల మధ్య ఉన్న అసంతృప్తిని తమకు అనువుగా మలచుకున్నారు. కాకతీయ సేనలను న్యాయబద్ధంగా ఎదిరించడం అసాధ్యమని తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ రెడ్లు, వెలమల నడుమ వైరాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. కాకతీయ సైన్యంలోని కొందరిని తమ వైపుకు తిప్పుకుని వాడుకొని వరంగల్పై అత్యాధునిక యుద్ధ సామగ్రి, ఫిరంగులతో దాడి చేయడంతో ప్రతాపరుద్రుడు పరాజయం పాలయ్యాడు. ఇక్కడ, గమనించాల్సిన చారిత్రక అంశం ఒకటి ఉంది. ఢిల్లీ సుల్తాన్‌ల సామ్రాజ్యంపై చెంఘిజ్ ఖాన్ నేతృత్వంలోని మంగోలులు నిరంతరం దాడులు చేస్తుండేవారు. వారిని అడ్డుకునేందుకు మొఘలులు తప్పనిసరై ఆధునిక యుద్ధ సామగ్రిని, సుదూర ప్రాంతాన్ని టార్గెట్ చేసే ఫిరంగులు తయారు చేసుకున్నారు. అటువంటి ఆధునిక యుద్ధ సామగ్రితో లేకపోవడం తదితర కారణాల వల్లే ప్రతాపరుద్రుడు ఓటమి చెందాడు. తమ సైనిక శక్తిని ఆధునికీకరించడంలో, నవీన సైనిక వ్యూహాలను అనుసరించడంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్లే కాకతీయులు పతనమయ్యారు.

కన్నెకంటి వెంకటరమణ

జాయింట్ డైరెక్టర్,

తెలంగాణ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ

Updated Date - 2021-10-03T05:55:22+05:30 IST