‘ఉన్నతవిద్య’లో ‘అమ్మ’ భాషకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-10-29T06:18:01+05:30 IST

తెలంగాణ తెలుగు మాగాణం. తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శతకం, చారిత్రక కావ్యం, ఉదాహరణ కావ్యం, అచ్చతెలుగు కావ్యం లాంటి ఎన్నోప్రక్రియలకు తెలంగాణా ప్రాంత కవులే నారుపోసి నీరుపోశారు....

‘ఉన్నతవిద్య’లో ‘అమ్మ’ భాషకు పెద్దపీట

తెలంగాణ తెలుగు మాగాణం. తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శతకం, చారిత్రక కావ్యం, ఉదాహరణ కావ్యం, అచ్చతెలుగు కావ్యం లాంటి ఎన్నోప్రక్రియలకు తెలంగాణా ప్రాంత కవులే నారుపోసి నీరుపోశారు. వందసంవత్సరాలక్రితమే శేషాద్రి రమణ కవులు కాలికి బలపం కట్టుకొని తెలంగాణా ప్రాంతమంతా పర్యటించి అపురూపమైన వాఙ్మయ విశేషాలను, అమూల్యమైన సాహిత్య సమాచారాన్ని రాశిపోశారు. ‘నిజాము రాష్ట్రమున పరిశుద్ధమగు ఆంధ్రభాషా స్వరూపము ద్యోతకమగు తావులు కలవు’ అని వేయికన్నులతో పరిశీలించి ప్రకటించారు. ‘నిజాం రాష్ట్ర ప్రశంస’ కావ్యంతో తెలంగాణ చారిత్రక వైశిష్ట్యానికి నీరాజనాలు పలికారు. తెలుగుదేశ చరిత్రకు తెలంగాణా విత్తనమని కొమర్రాజు లక్ష్మణరావు పంతులు పరిశోధనాత్మక దృష్టితో నిర్ధారించాడు. ‘అచ్చతెనుంగు కబ్బమున కాదిపదంబయి పోల్చు భాగ్యమున్ హెచ్చుగా గన్న దేశమని’ ఆంధ్రప్రాంత కవి ఆదిపూడి సోమనాథరావు, తెలంగాణాను అభివర్ణించాడు. 'తెలుగు బిబ్బోకవతి పేరు నిలుపుచున్న సరసులున్న ప్రదేశమని, ‘ఉరుదు శారద ఊరేగు ధరణి’ యని మహాకవి జాషువా తెలంగాణాను ప్రస్తుతించాడు. ‘ప్రాణంబైనది తెల్గుగడ్డకు ధరాప్రాలంబమౌనీ తెలంగాణము, విన్నాణంబైన కవిత్వసంపదలకు’ కేంద్రబిందువని ఇంద్రగంటి హనుమత్‌శాస్త్రి ఈ ప్రాంత సారస్వత వైభవప్రాభవాలను కీర్తించాడు. ఎన్నో మంచి తెలుగు పదాలు నైజామాంధ్రలో, రాయలసీమలో సజీవంగా ఉన్నాయని జమ్మలమడుగు మాధవశర్మ చాటిచెప్పాడు. వీరోచిత పోరాటాలకు పురుడుపోసిన తెలంగాణా ప్రాంతలో తెలుగు నవనవోన్మేషంగా వర్థిల్లిన ముచ్చట చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. 1948లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్థులకు తొలిసారిగా ద్వితీయభాషగా తెలుగును ప్రవేశపెట్టి భాషాభివృద్ధికి బాసటగా నిలిచింది.


భాష నేల వంటిది. మిగతా శాస్త్రాలు విత్తనాల వంటివి. నేల కలకాలం సారవంతంగా ఉంటేనే మిగతాశాస్త్రాలు పుష్పించి, వికసించి ఫలిస్తాయి. భాషా సాహిత్యాల ఎరుకతోనే విద్యార్థులు ఉత్తమపౌరులుగా ఎదగుతారు. పౌరుల నైతిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. ఈ నైతిక ప్రగతి మౌలికంగా భాషా సాహిత్యాల ఎరుక వల్ల సాధ్యమవుతుంది. మన సాహిత్య, సాంస్కృతిక మూలాలను, సత్సంప్రదాయ విలువలను, నాగరికత అడుగుజాడలను చారిత్రక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి, అభివ్యక్తి నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, జీవన సంస్కారాన్ని సమకూర్చుకోడానికి విద్యార్థులకు భాష ఒక ప్రధాన వాహికగా ఉపకరిస్తుంది. భాష మీద పట్టు ఉండటం వల్లనే పివి నరసింహరావు, అటల్ బిహారీ వాజపేయి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటివారు మహానాయకులుగా ఎదిగారు. వారి వక్తృత్వ గరిమకు భాషాధ్యయనం ఎంతగానో దోహదపడింది. తెలుగు భాషమీద, గ్రామీణ యాస మీద అభినివేశం ఉండటం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చతుర వచోనిధిగా జాతీయస్థాయిలో ప్రఖ్యాతి పొందారు. భాషలోని పలుకుబడులను, సామెతలను సందర్భానుసారంగా ఉటంకించటం మూలంగా ఆయన ఉపన్యాస శైలి ఆగర్భ శత్రువులను కూడా ఆకట్టుకుంటుంది. భాషాసాహిత్యాల సోయి వ్యక్తిత్వవికాసంతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా సమకూరుస్తుంది. 


భాషా ప్రయోజనాలను నిరంతరం విద్యా ప్రణాళికకు అనుసంధానం చేస్తే విద్యార్థుల్లో విజ్ఞానం విస్తరిస్తుంది. వారిలో మానసిక పరిపక్వత ఇనుమడిస్తుంది. ఈ సమున్నత సంకల్పంతో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అపూర్వ విద్యాసంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యామండలి భారతదేశంలోనే మొదటిసారిగా డిగ్రీ తృతీయ సంవత్సరంలో కూడా తెలుగును ద్వితీయభాషగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టింది. మన విద్యారంగంలో ఇది చరిత్రాత్మక శుభపరిణామం. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరము తెలుగు పాఠ్యగ్రంథాల కంటే విలక్షణంగా, విద్యార్థి సర్వతోముఖ వికాసకేంద్రంగా తృతీయ సంవత్సరం పాఠ్యపుస్తకాన్ని సాహితీదుందుభి పేరుతో పాఠ్యప్రణాళిక సంఘం రూపొందించింది. జర్నలిజం మౌలిక అంశాలు, ఉపన్యాసకళ, పుస్తకసమీక్ష, ఇంటర్వ్యూ నైపుణ్యాలు వంటి సరికొత్త అధ్యాయాలను సంపాదకులు ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. విద్యార్థులు పాత్రికేయులుగా, కవులుగా, రచయితలుగా, వక్తలుగా, వ్యాఖ్యాతలుగా స్థిరపడటానికి అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా ఈ పాఠ్యాంశాలుండటం సాహితీదుందుభి ప్రత్యేకత. ఇబ్బడిముబ్బడిగా విజృంభిస్తున్న దృశ్యశ్రవణ మాధ్యమాల ప్రభంజనంలో లుక్ కల్చర్ పెరిగి బుక్ కల్చర్ కొడిగట్టిపోతుంది. అధ్యయన ఆవశ్యకతను, తద్వారా కలిగే శాశ్వత ప్రయోజనాలను విశ్లేషణాత్మకంగా వివరించే పాఠ్యాంశాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. me and l forget. Teach me and I remember. Involve me and I learn'' అని బెంజిమన్ ఫ్రాంక్లిన్‌ అన్నట్లుగా తరగతిగదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని క్షేత్రస్థాయి అనుభవాలతో పుటం పెట్టుకోవడం వల్ల ఆయా అంశాలపట్ల విద్యార్థులకు పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైన స్టడీ ప్రాజెక్ట్ తీరుతెన్నులను కూడా ఈ పుస్తకంలో వివరించారు. దుందుభి అంటే నాంది అనే అర్థం కూడా ఉంది . సాహితీ దుందుభి ద్వారా డిగ్రీ తెలుగు పాఠ్యప్రణాళికలో గుణాత్మకమైన మార్పుకు నాందిప్రస్తావన జరిగింది. ఈ పాఠ్యాంశాలను మరింత ప్రభావశీలమైన బోధనాపద్ధతుల ద్వారా నవీన బోధనా పరికరాల ద్వారా విద్యార్థులకు చేరవేయటంలో తెలుగు అధ్యాపకులు బాధ్యతాయుతమైన పాత్రను పోషించవలసిన అవసరముంది. సహజంగానే పాఠ్యాంశాలకు కొన్ని పరిమితులుంటాయి. ఈ పరిమితులను అధిగమించి, అధ్యాపకులు ఆయా పాఠ్యభాగాలకు సంబంధించిన బహుముఖీనమైన జ్ఞాన సమాచారాన్ని మెరుగైన బోధనాపద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధించాలి. ఇందుకోసం విద్యావిషయక మేధోమథనం జరగాలి. సృజనాత్మకమైన బోధనాప్రమాణాల గురించి, నైపుణ్యాల గురించి చర్చ జరగాలి. 

డా. కోయి కోటేశ్వరరావు

(‘డిగ్రీ తృతీయ సంవత్సరం తెలుగు పాఠ్యగ్రంథం – సృజనాత్మక బోధనాపద్ధతులు’ అనే అంశంపై హైదారాబాద్లోని ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగుశాఖ నిర్వహిస్తున్న అంతర్జాల జాతీయ కార్యశాల ముగింపు సందర్భంగా)

Updated Date - 2021-10-29T06:18:01+05:30 IST