పట్టువిడుపులు తెలిసిన మోదీ

ABN , First Publish Date - 2021-11-23T07:27:24+05:30 IST

గురునానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు...

పట్టువిడుపులు తెలిసిన మోదీ

గురునానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడంలో అర్థం లేదు. 


స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం దేశానికి దీర్ఘకాలం మేలు చేసే నిర్ణయాలను వెనక్కు తీసుకునే మెతక స్వభావి కాదు ప్రధాని మోదీ. పెద్దనోట్ల రద్దు నుంచి అధికరణ 370 రద్దు వరకూ దేశ ప్రయోజనాలను నెరవేర్చగల అనేక నిర్ణయాలు మోదీ తీసుకున్నారు. ఆయన దృఢ నిర్ణయాల మూలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అమలు చేస్తున్న పాకిస్థాన్ ఏ సాహసం చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి పంజాబ్ ఎన్నికల గురించే ఆలోచించి ఉంటే సాగు చట్టాలను వ్యతిరేకించిన మిత్రపక్షం అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వైదొలగకుండా చూసుకునేవారు. సాగుచట్టాల విషయంలో రాజీపడి అకాలీదళ్‌తో స్నేహం కొనసాగించి ఉంటే 2022లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది. అయినప్పటికీ సాగు చట్టాల మూలంగా దేశంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ రూపురేఖలు మారతాయని, రైతుల భవిష్యత్ అద్భుతంగా మెరుగుపడుతుందని భావించినందువల్లే మోదీ వెనక్కు తగ్గలేదు. 2019లో మహారాష్ట్రలో శివసేన డిమాండ్లకు తలొగ్గి చేతులు కలిపి ఉంటే బిజెపి-–సేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేవి. కానీ అధికారం లేకపోయినా సరే శివసేన గొంతెమ్మ కోర్కెలకు అంగీకరించకపోవడంతో ఆ పార్టీ కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలపాల్సి వచ్చింది. ఇక్కడ అధికారం కోసం రాజీ పడిందెవరు? అలా రాజీపడి, ఎవరితోనైనా లాలూచీ పడే తత్వం, ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకునే తత్వం నరేంద్రమోదీకి లేదు. 


దీర్ఘకాలంలో ఆర్థికవ్యవస్థ బలోపేతం కోసం మోదీ తీసుకున్న ఏ నిర్ణయాలను వెనక్కు తీసుకోలేదు. కానీ ప్రజాప్రయోజనాల వరకు వచ్చే సరికి ఆయన నిర్ణయాలపై ఆచితూచి వెనుకడుగు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భూసేకరణ చట్టం విషయంలోనూ, వాక్సిన్‌ను మెజారిటీ ప్రజలకు ఉచితంగా అందించే విషయంలోను మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సవరించుకుంది. సాగుచట్టాల విషయంలోనూ మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నదంటే దాని వల్ల ఏ పంజాబ్‌లోనో, ఉత్తరప్రదేశ్‌లోనో బిజెపికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని భయపడడం ఏ మాత్రం కారణం కాదు. నిజానికి ఈ చట్టాలు వెనక్కి తీసుకోకముందే కొన్ని జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బిజెపి తిరిగి ఘనవిజయం సాధిస్తుందని తేలింది. సాగుచట్టాల మూలంగా దళారీ వ్యవస్థ బలంగా ఉన్న పంజాబ్‌లో రైతులు, పశ్చిమ యుపిలో జాట్‌రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, దేశవ్యాప్తంగా వీరికి మద్దతు లేదని అందరికీ తెలుసు. అయినప్పటికీ వారు ఏడాదికాలంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నందువల్ల, వారిని ఒప్పించేందుకు ఎన్నిసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేనందువల్ల ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని మోదీ నిర్ణయించారు. నిజానికి ఈ చట్టాలు ప్రస్తుతం అమలులో లేవు. సుప్రీంకోర్టు కూడా వాటి అమలుపై స్టే విధించింది. అంతకు ముందే మోదీ ప్రభుత్వం రైతులను ఒప్పించే వరకూ ఈ చట్టాల అమలును నిలిపివేసేందుకు తానే ముందుకు వచ్చింది. అందువల్ల ఇప్పుడు ప్రధానంగా పంజాబ్ రైతులను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా చట్టాలను ఉపసంహరించుకోవాలని మోదీ చేసిన ప్రకటన వెనుకడుగు కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం కానీ చేసింది ఎలా అవుతుంది? రాజకీయ పార్టీల ప్రేరేపణతో ప్రజలు మొండిగా వ్యవహరిస్తున్నారని తెలిసినా నాయకుడు అనేవాడు వారికోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ‘మేము చిన్న రైతుల ప్రయోజనం కోసం పంట బీమా పథకాలతో పాటు మూడు సాగుచట్టాలను తీసుకువచ్చాం. అనేకమంది రైతులు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు చిన్న రైతుకు సాధికారిత కల్పించడం కోసం ఈ చట్టాలను ప్రవేశపెట్టాం. రైతులకు వివరణ ఇచ్చేందుకు మా శాయశక్తులా కృషి చేశాం. చట్టాలను సవరించేందుకు, నిలిపివేసేందుకు కూడా సిద్ధపడ్డాం. అయినా వినలేదు. మేము రైతులను ఒప్పించలేకపోయాం. ఎంత చైతన్యపరచేందుకు నిర్ణయించినా ఒక వర్గం వ్యతిరేకిస్తూనే ఉన్నది. అందుకే వాటిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించాం..’ అని ప్రధానమంత్రి చేసిన ప్రకటనలో అడుగడుగునా నిజాయితీ కనిపిస్తోంది. అందుకే ఆయన సాగుచట్టాలను అమలు చేయలేకపోయినందుకు మొత్తం రైతాంగానికి క్షమాపణ చెప్పుకున్నారు. నిజంగా దేశ ప్రయోజనాలను సమగ్రంగా నెరవేర్చే సాగుచట్టాలను ఉపసంహరించుకోవడం దీర్ఘకాలంలో దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం చేకూర్చే పరిణామమే. రైతులను రెచ్చగొట్టి, హింసాకాండకు ప్రేరేపించిన కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు నరేంద్రమోదీ. 


ఇవాళ మోదీ వెనక్కు తగ్గారని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ తన హయాంలో ఎన్ని నిర్ణయాలు వెనక్కు తీసుకుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేశంలో అంతర్గత కల్లోలం నెలకొన్నదనే సాకుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975 జూన్‌లో ఎమర్జెన్సీ విధించి, మొత్తం ప్రతిపక్షాలను జైలులోకి తోసి, ప్రాథమిక హక్కులను హరించి, దేశాన్నే జైలుగా మార్చింది. సరిగ్గా 21 నెలల తర్వాత ఇందిర తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. షాబానో అనే ముస్లిం మహిళకు భరణం చెల్లించాలనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును తిప్పికొట్టేందుకు పార్లమెంట్‌లో చట్టం చేసిన రాజీవ్ గాందీ ప్రభుత్వం వేసిన వెనుకడుగును దేశప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఇంతెందుకు గత యుపిఏ హయాంలోనే అనేక కీలక నిర్ణయాలు వెనక్కు తీసుకున్నారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అమలు చేయడం, నగలపై ఎక్సైజ్ సుంకాన్ని విధించడం, పెట్రోల్, డీజిల్ ధరలను, రైల్వే ఛార్జీలను పెంచడం వంటి అనేక నిర్ణయాలు తీసుకుని వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు. పత్తి ఎగుమతులపై నిషేధం విధించిన రెండునెలల్లోనే ఎన్‌సిపి నేత శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిషేధం ఎత్తి వేశారు. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు బ్లాకుల వేలంతో సహా ప్రజలకు వేలకోట్ల మేరకు నష్టం చేకూర్చిన యుపిఏ ప్రభుత్వ నిర్ణయాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ పేరుతో రూ. 70వేల కోట్ల అవినీతికి పాల్పడినందుకు యుపిఏ ప్రభుత్వాన్నిసెంట్రల్ విజిలెన్స్ కమిటీ ఎండగట్టింది.


మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం దీర్ఘకాల దృష్టితో తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి స్వార్థమూ లేదని, మోదీ ప్రతి నిర్ణయమూ నిజాయితీతో తీసుకుంటారని ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్ల కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ చరిత్ర మోదీ నిర్ణయాలను సానుకూల దృష్టితో అంచనా వేసి తీరుతుంది.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-11-23T07:27:24+05:30 IST