‘మా తెలుగుతల్లి’ : కొన్ని ఆలోచనలు
ABN , First Publish Date - 2021-10-30T07:49:01+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో గత 45 ఏళ్లుగా ఉన్న ‘‘మా తెలుగు తల్లికి’’ గీతమే కొనసాగుతున్నది..
అస్తిత్వాన్ని చాటే అంశాలలో రాష్ట్ర గీతం కూడా ఒకటి. తెలంగాణ తనదైన రాష్ట్ర గీతాన్ని ప్రకటించింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గత 45 ఏళ్లుగా ఉన్న ‘‘మా తెలుగు తల్లికి’’ గీతమే కొనసాగుతున్నది. ఈ గీత రచయిత కీ.శే. శంకరంబాడి సుందరాచారి గారు తెలుగునాట తిరుపతిలోని ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. 1942లో దీనబంధు అనే తెలుగు సినిమా కోసం రాసిన ఈ గీతాన్ని, దర్శక నిర్మాతలు సినిమాలో సందర్భం కొరవడి, ఉపయోగించుకోలేకపోయారు. మద్రాసు స్టేట్ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజులవి. నాటి చలనచిత్ర నటి, గాయని టంగుటూరి సూర్యకుమారి ఆ గేయానికి ముగ్దులై రూ.116తో హక్కులు కొని పాడి, ఈ పాటను హెచ్‌ఎంవి గ్రామ్ ఫోన్ రికార్డింగ్ కంపెనీ నుంచి విడుదల చేశారు. సూర్యకుమారి అనుకున్న విధంగానే ఈ గేయం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో తనదైన పాత్రను నిర్వర్తించింది. ఆపై అమరజీవి ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1975 లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో నాటి ప్రభుత్వం, ఈ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర గీతంగా గౌరవం పొందుతూ, 2014 తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఈ గేయం రాష్ట్ర గేయంగా ఉన్నది.
జాతీయ గీతం, రాష్ట్ర గీతం వంటి వాటికి సార్వజనీనత, విశ్వజనీనత ఉండాలి. విషయపరంగా, భాషాపరంగా గాంభీర్యత ఉండాలి. ఈ గేయంలో విశేషణాలు చేరి విశిష్టతలు విస్మరించబడ్డాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనడం బాగుంది. ‘మా కన్నతల్లి’కి అనడంలో పునరుక్తే తప్ప ఔచిత్యం కనబడటం లేదు. కన్నతల్లి అంటే కని పెంచిన తల్లే. జన్మభూమి అంటే మనం పుట్టిన గడ్డ. ఎవరి గౌరవం వారిదే. కావున కన్నతల్లి పదంతో జన్మభూమి పునఃప్రస్తావన అవసరం లేదు. ‘కడుపులో బంగారు’ అనడంలో కడుపులో (మనసులో) మంచితనం ఉన్నదనో, లేదా గర్భంలో బంగారం వంటి ఖనిజాలు ఉన్నాయనో అర్థం చెప్పుకోవచ్చు కానీ ఇది సరిగ్గా విశదపడటం లేదు. బంగారం అనే పదం సంపూర్ణంగానూ లేదు. సంబోధన లాగా ఉంది. ‘కనుచూపులో కరుణ’ అనడం దేవతలకు ఆపాదించే లక్షణం. మనం దేశాన్ని రాష్ట్రాన్ని ‘‘అమ్మ’’గా చూస్తున్నాం తప్ప అతీత శక్తులు ఆపాదించబడిన దేవతగా కాదు. తరువాతి ‘చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి’లో తల్లి నవ్వుతుంటే ఐశ్వర్యం కురుస్తోంది అనే అర్థాన్ని తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ విశేషణాలు. చెప్పుకోదగినన్ని విశిష్టతలు ఉన్నపుడు ఇలాంటి విశేషణాల ఆపాదన అవసరమే లేదు.
మొదటి చరణాన్ని చూద్దాం. ‘‘గల గలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే’’. గోదావరి కదలి ‘పోవడం’ అనే పదం కూడదేమో! పోవడం కంటే రావడం సరైనది. గలగలా, బిర బిరా శబ్ద విశేషణాలు ఆహ్లాదంగా బాగున్నా, గంభీరతను తగ్గిస్తున్నాయి. పైగా ఆ పదాల బదులు అంతకుమించి చెప్పాల్సిన వాటిని పొందుపరచడం మంచిది. ఈ రెండు వాక్యాల ముక్తాయింపుగా గల ‘‘బంగారు పంటలే పండుతాయి.. మురిపాల ముత్యాలు దొరలుతాయి’’ పాదాలలో గణాలు తగ్గాయి. అందువల్ల పాడే వారు సాగదీసి పాడవలసి వస్తున్నది. నదులు ప్రవహిస్తే బంగారు పంటలు పండుతాయి.. తద్వారా విరిసే సంతోషంగా మురిపాల ముత్యాలు దొరలుతాయి.. అనడం బాగున్నా ఇది కూడా రెండు పాదాలుగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం రాసే నాలుగయిదు చరణాల్లో ఈ విశేషణాలు మాత్రమే చెబితే మనకు, మన భావి తరాలకు మన వాస్తవిక అస్తిత్వం, గొప్పదనం ఎలా తెలుస్తుంది?.
తర్వాతి చరణంలో ‘అమరావతీ గుహల అపురూప శిల్పాలు’ అని రాశారు శంకరంబాడి వారు. అమరావతిలో గుహలు లేవు. విజయవాడలో ఉన్నాయి. బహుశా ఆ ప్రాంతం మొత్తాన్ని కలిపి అమరావతి అని పేర్కొన్నారేమో! కానీ, తర్వాత ప్రభుత్వ ప్రచురణలో ‘గుహల’ పదం తీసేసి, ‘నగరి’ అని సరి చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అమరావతి అనే పదం కూడా సరిచేయాల్సినదే. అది ప్రాచీనమైనది కాదు. ధాన్యకటకం మాత్రమే ప్రాచీన నగరం. వాసిరెడ్డి వేంకటాద్రినాయుడి రాజధాని ‘అమరావతి’ 230 సంవత్సరాల నాటిది. అమరలింగేశ్వరుడి ఆలయమున్న ‘అమరారామం’ 800 ఏళ్ల నాటిది. బౌద్ధం విలసిల్లిన; నాగార్జునుడు, బుద్ధఘోషుడు వంటివారు తిరుగాడిన; తొలి ఆంధ్ర సామ్రాజ్ఞులు శాతవాహనుల రాజధాని ‘ధాన్యకటకం’ (నేటి ధరణికోట) మాత్రం 2300 ఏళ్ల క్రితం నాటిది.
‘‘త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు’’.. ఈ పాదంలో తారాడు అనేది వర్తమాన కాలంలో ధ్వనిస్తోండగా, ‘నాదం’ అనే పదం శంఖానాదం, ఢమరుక నాదం వంటి వాటికే సరిపడుతుంది. ‘తిక్కన కలములో తియ్యందనాలు’ అంటూ తెలుగు నుడికారాలను అద్భుతంగా ప్రయోగించిన తిక్కనను పేర్కొనడం మంచి విషయం (ఆదికవి నన్నయ్యను విస్మరణ కూడా లోపమే). తియ్యందనాలు.. అనడం కేవలం విశేషణం. అంతకు మించిన ఖ్యాతి వారి రచనకు ఉంది. ‘‘నిత్యమై నిఖిలమై నిలచి వుండే దాక’’.. మంచి ముక్తాయింపు.
చివరి చరణంలో.. ‘రుద్రమ్మ భుజశక్తి’ అనడం బాగుంది. కానీ ‘మల్లమ్మ పతిభక్తి’ అనడం.. ఈ గేయం రాసేనాటికి కూడా అన్వయించదని నా ఉద్దేశం. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, గౌరవం, ప్రేమ మాత్రమే చలామణి అవ్వాల్సిన ఆధునిక కాలంలో పతి భక్తి గురించి చెప్పలేము కదా! ‘‘తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి’’ కూడా బాగుంది.
తర్వాతి పాదంలో ‘‘చెవులు రింగుమనడం’’ వంటి శబ్ద విశేషణాలు రాష్ట్ర గీతానికి ఉండాల్సిన గాంభీర్యతను తగ్గించాయనిపించింది. ‘‘నీ పాటలే పాడుతాం’’ అనడం బాగుంది కానీ నీ ఆటలే ఆడుతాం అనడం అర్థవంతంగా లేదు. తెలుగువారి సంప్రదాయ ఆటలు ఉన్నాయి గానీ అక్కడికే పరిమితం కాము కదా! బహుశా ఆటలు అనడంలో క్రీ.శ. 2వ శతాబ్దం నుంచి ఉన్న తెలుగు నాట్య రీతుల గురించేమో. మొత్తం గేయంలో బంగారం, దొరలడం వంటి పదాలు రిపీట్ అయ్యాయి. కావున తొలగించాల్సినవి తొలగించి, ఉంచాల్సినవి ఉంచి, పెంచాల్సినవి పెంచి.. ఈ గేయాన్ని ఆంధ్రరాష్ట్రం (దరిదాపు నేటి ఆంధ్ర ప్రదేశ్) ఆవిర్భవించిన 1953 నాటి కాలంతో ఉన్నతీకరించుకోవలసిన అవసరం ఉంది. అస్తిత్వాలను నిలుపుకోవాల్సిన తరుణంలో ఇది అవశ్యం కూడా!.
కొండబాబు
సీనియర్ జర్నలిస్ట్