రోశయ్య చెప్పిన కావమ్మ కథ

ABN , First Publish Date - 2021-12-09T08:29:15+05:30 IST

దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నప్పటికీ తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ గురించి మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ...

రోశయ్య చెప్పిన కావమ్మ కథ

దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నప్పటికీ తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ గురించి మాట్లాడుతూ ‘మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది’ అన్నారు. దానికి ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ ‘నాకు కథలంటే చాలా ఇష్టం. చెప్పండి’ అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: ఒక ఊళ్ళో వైశ్య దంపతులు ఉండేవాళ్ళు. వారికి ఒక్కతే కూతురు. ఎనిమిదేళ్ళు రాగానే వివాహం జరిపించారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి ఎలాగూ రెండుమూడేళ్ళు పడుతుంది కనుక, నేను దేశాటనం చేసి, ఏదైనా వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినాయి కానీ అల్లుడి జాడ లేదు. అత్తమామలు దిగులుపడ్డారు. ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని వేపపుల్లతో పళ్ళు తోముకుంటూ కనిపించాడు. ఆ అబ్బాయిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులాగా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునన్నారు. వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనం పెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు సమాధానంగా అతడు ‘కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది’ అన్నాడు.


రోశయ్య చెప్పిన ఈ కథ విని ఎన్‌టిఆర్‌ సహా సభ్యులందరూ నవ్వుకున్నారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని ‘నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి?’ అనడిగారు. అందుకు రోశయ్య ‘మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 సంవత్సరాలు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి ఇంకో సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– ‘నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు’... ముక్తా యించారు రోశయ్య.


ఆయన కారు స్టీరియోలో ఎన్‌టిఆర్‌ నటించిన పాత సినిమాలలోని పాటలు ప్లే అవుతుండేవి. ఈ విషయమై ప్రశ్నించినపుడు ‘నేను ఎన్‌టిఆర్‌ రాజకీయాలను వ్యతిరేకిస్తాను. కానీ నటుడిగా ఆయనకు వీరాభిమానిని. ఆయన లాంటి నటుడు ఇంతకుముందు లేరు. ఇక ముందు పుట్టబోరు’ అని రోశయ్య అన్నారు. 


ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది. పవర్‌కట్‌ విపరీతంగా ఉన్న రోజుల్లో ఒక రాత్రి 2 గంటల సమయంలో ఒక వినియోగదారుడు ఆగ్రహంగా 

రోశయ్య ఇంటికి ఫోన్‌ చేశాడు. రోశయ్య గారే ఫోన్‌ ఎత్తారు. అవతల వ్యక్తి ఆశ్చర్యపోయి, ‘సార్‌ మీరు ఈ సమయంలో మేలుకొని ఉన్నారా?’ అని అడిగాడు. ‘అవునయ్యా! కరెంటు పోయింది. దోమలు కుడుతున్నాయి. నిద్ర పట్టడం లేదు’ అని రోశయ్య సమాధానం చెప్పారు. వినియోగదారుడు నిరుత్తరుడయ్యాడు.


రోశయ్య ఒకసారి నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆయనకు ఢిల్లీ రాజకీయాలు పడలేదు. ‘నేను ఇక లోక్‌సభకు పోటీ చేయను. అక్కడ అంతా హిందీ గొడవ, నాకేమో అర్థం కాదు’ అని రోశయ్య అన్నారు.


ఒకసారి ఎన్నికల సమయంలో ఆయన మచిలీపట్నం వెళ్ళారు. అక్కడ కార్యకర్తలు చాలా దిగులుగా కనిపించారు. తెలుగుదేశం పార్టీ చాలామంది సినీ నటుల్ని ప్రచారానికి తీసుకువచ్చిందని, వారిముందు కాంగ్రెస్ ప్రచారం నిలబడటం లేదని వారు చెప్పారు. ‘మనం కూడా దూకుడు పెంచుదాం. వచ్చేవారంలో అర్జున్‌సింగ్‌, ఎన్‌డి తివారి మనకు ప్రచారం చేస్తారు’ అని రోశయ్య చెప్పారు. అందుకు ఆ కార్యకర్తలు ‘మనకు సినిమా నటులు ఎవరూ ప్రచారానికి రారా’ అని అడిగారు. కార్యకర్తల వైఖరికి రోశయ్య నిరుత్తరుడు అయ్యారు.


ఒకసారి పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెనుదిరిగి వెళ్లుతున్నప్పుడు నరసింహారావు ఇట్లా అన్నారు... ‘ఏమయ్యా రోశయ్య! జనం నీ ప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?’. దీనికి రోశయ్య బదులిస్తూ... ‘అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది’ అని చెప్పి పీవీని నవ్వించారు.


రోశయ్యకు ముఖ్యమంత్రి కావటం సుతరామూ ఇష్టం లేదు. అధిష్ఠానం మాట కాదనలేక ఆయన ఆ పదవి స్వీకరించారు. ఎవరైనా ముఖ్యమంత్రి పదవి స్వీకరించినపుడు సంతోషంగా, దిగిపోయినపుడు దిగులుగా కనిపిస్తారు. అయితే రోశయ్య ఇందుకు విరుద్ధంగా పదవికి రాజీనామా చేసినపుడు నెత్తిమీది బరువు దించుకున్నట్టు ఉల్లాసంగా కనిపించారు. అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.


ఎం. వెంకటేశ్వరరావు

జర్నలిస్ట్‌

Updated Date - 2021-12-09T08:29:15+05:30 IST