జగన్ స్వయంకృతాపరాధాలు

ABN , First Publish Date - 2021-08-10T09:02:23+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తోందని, కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తే ముఖ్య మంత్రి కావాలన్నదే బిజెపి ఆశ...

జగన్ స్వయంకృతాపరాధాలు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తోందని, కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తే ముఖ్య మంత్రి కావాలన్నదే బిజెపి ఆశ అని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ఆరోపించారు. ఈ ఆక్రోశం జగన్, ఆయన అనుయాయుల్లో నెలకొన్న నిరాశా నిస్పృహలను మాత్రమే కాక ఒక తీవ్ర అభద్రతా ధోరణిని కూడా ప్రతిబింబిస్తున్నది. బిజెపి కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేదు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడే దుష్ట సంస్కృతిని కాంగ్రెస్ లాగా బిజెపి ఏనాడూ అవలంభించలేదు. మరి బిజెపి తన వ్యక్తిని ఎలా ముఖ్యమంత్రిగా నియమించగలదు?


విచిత్రమేమంటే రాష్ట్రంలోని 175 సీట్లలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ తమ ప్రభుత్వం పడిపోతుందని వైసీపీ భయపడడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఆ పార్టీలో అంతర్గత లుకలుకలు ఏమైనా ఉన్నాయా? తన పార్టీ ఎమ్మెల్యేలే తనపై తిరుగుబాటు చేసే పరిస్థితి ఉన్నదని జగన్ ఆందోళనతో ఉన్నారా? తాను చేసిన తప్పిదాల వల్ల తన రాజకీయ భవిష్యత్ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారా? వైసీపీ నేతలు మీడియాలో చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వారు జగన్‌కు మద్దతు పలుకుతున్నారా లేక భవిష్యత్‌లో ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుందని ఊహించి అందుకు పోటీపడుతున్నారా? అర్థం కావడం లేదు.


పెద్ద ఎత్తున ఖనిజ వనరులు, గుజరాత్ తర్వాత అతి విస్తారమైన కోస్తా తీరం, పచ్చటి పంటలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక పార్టీ ప్రజల మనసు చూరగొనేవిధంగా ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మకమైన, అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందిస్తుందని ఎవరైనా భావిస్తారు. కాని రెండేళ్లలోనే అనేక ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చి ఉద్యోగులు జీతాలకోసం, రైతులు, లబ్ధిదారులు, ఇతర బలహీన బడుగు వర్గాలు పథకాల అమలుకోసం, కాంట్రాక్టర్లు చెల్లింపులకోసం వేచి చూడాల్సిన పరిస్థితికి మారుస్తారని ఎవరూ ఊహించలేదు. ప్రజల ఆస్తులనే కాక, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా భవిష్యత్ లో వచ్చే పన్ను ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసే దుస్థితికి దిగజార్చడం, మార్కెట్ రుణాలపై కేంద్రం కోత పెట్టాల్సిరావడం దారుణం.


రాష్ట్ర విభజన సమయంలోఆంధ్రప్రదేశ్‌కు రూ.97వేల కోట్ల రుణ భారం ఉంటే, తెలుగుదేశం హయాంలో అది రూ. 2,58,928 కోట్లకు పెరిగింది. దాన్ని గత నవంబర్ నాటికి కేవలం రెండేళ్లలోనే రూ.3,73,140 కోట్లకు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుంది. కాగా లెక్కల ప్రకారం వార్షిక రుణ లక్ష్యం రూ. 48,295.59 కోట్లు కాగా గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ లోపే రూ. 73,811.85 కోట్లు అప్పులు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎడాపెడా వేల కోట్ల మేరకు రుణాలు చేయడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిన ఘనకార్యమేమీ లేదు. 2020–21లో ప్రతి నెలా ఈ ప్రభుత్వం సగటున నెలకు రూ. పదివేల కోట్లకు పైగా అప్పులు చేస్తూ వస్తోంది. కేవలం అప్పులు చేయడానికే రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ను నెలకొల్పడం, అది స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల మేరకు అప్పులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అటువంటప్పుడు దాన్ని అప్పుల కార్పొరేషన్ అనాలి కాని అభివృద్ధి కార్పొ రేషన్ అని ఎలా పిలుస్తారు? పోలిస్తే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇవాళ మూడో స్థానంలో ఉన్నది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే 142 శాతం అధికంగా జగన్ ప్రభుత్వం రుణాలు చేసింది. కాగ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు గడచిన ఆర్థికసంవత్సరంలో అత్యధికంగా రూ. 68,536 కోట్లకు చేరుకుంది. గత డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ మొత్తమే రూ. 13406 కోట్లకు పేరుకుపోయింది. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) పరిమితులను ఉల్లంఘించి మరీ ఎడా పెడా అప్పులు చేయడంతో కేంద్రం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మరో వైపు ఏపిలో ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపుతున్నారు. తాజాగా ఆస్తి,చెత్త పన్ను పేరుతో రూ.426 కోట్లు ప్రజలనుంచి వసూలు చేయాలని నిర్ణయించారు.ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై రూ.11 వేల కోట్లకు పైగా పన్నులు వసూలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజీల్ రేట్లు పలు రాష్ట్రాలకంటే అధికస్థాయిలోఉన్నాయి. మద్యం పేరుతో దాదాపు మరో రూ.11 వేల కోట్ల మేరకు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేస్తోంది.


అన్ని పరిమితులు ఉల్లంఘించి అప్పుల రూపంలోనూ,పన్నుల రూపంలోనూ భారీ ఎత్తున సమీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎక్కడ వినియోగిస్తోంది? తాము ఇచ్చిన రుణాలు మౌలిక సదుపాయాలకోసం ఖర్చు పెట్టడం లేదని నాబార్డ్, ఇతర బ్యాంకులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా రకరకాల పథకాల క్రింద తాము బదిలీ చేస్తున్న నిధులు ఏపీలో ఎక్కడకు మళ్లుతున్నాయో అర్థం కావడం లేదు. ఈ నిధుల మళ్లింపు వ్యవస్థల్లో అరాచకత్వానికి దారి తీస్తుంది. గత రెండేళ్లలో పట్టణ పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోగా,అనేక పథకాలు అవినీతికి ఆలవాలమయ్యాయి. ఏ బృహత్తర అభివృద్ధి కార్యక్రమమూ జరిగిన దాఖలాలు లేవు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ పరిస్థితి 12వ స్థానానికి దిగజారగా ఉన్న పరిశ్రమలు కూడా ప్రభుత్వ విధానాల వల్ల ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లే ప్రమాదం ఏర్పడింది.


ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్త పాలన నిర్వహిస్తున్న జగన్ ప్రభుత్వ ప్రతిష్ఠ గత రెండేళ్లలోనే దిగజారిన విషయం తెలిసినందువల్లే ఆ ప్రభుత్వంలో లుకలుకలు బయలుదేరాయి. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఆర్థిక మంత్రిని పదే పదే ఢిల్లీ పంపించి, నిధులు కావాలని అడిగినంత మాత్రాన మోదీ సర్కార్ వద్ద జగన్ ప్రభుత్వం పప్పులు ఉడికే అవకాశాలు ఏ మాత్రం కనపడడం లేదు. జగన్ ప్రభుత్వానికి ఎన్ని డబ్బులు ఇచ్చినా వాటిని అక్రమంగా మళ్లించడం తప్ప జరిగేదేమీ ఉండదని రోజురోజుకూ ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. మరో వైపు న్యాయస్థానాల్లో అందరు నేరచరితుల మాదిరే జగన్ పై కూడా కేసుల విచారణ కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసేందుకు జగన్ అనుయాయులు ప్రయత్నిస్తున్నారు. జగన్ అసమర్థ పాలనకు, ఆయన గతంలో పాల్పడిన అవినీతి వల్ల శిక్ష పడే అవకాశాలు ఉన్నందుకు బిజెపిని నిందించి ప్రయోజనం ఏముంది? స్వంత పార్టీ ఎంపియే తిరుగుబాటు చేసి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళితే బిజెపి మాత్రం ఏమి చేయగలదు? బకాయీలు, అప్పులు, కక్ష సాధింపు చర్యలు తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఏమీ మిగలడం లేదు. 


వై. సత్యకుమార్బి

జెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-08-10T09:02:23+05:30 IST