ఇంత గాలి కావాలి

ABN , First Publish Date - 2021-05-24T09:53:06+05:30 IST

కంటి నిండా ఒక్క రేయి నిద్రా లేదు. రాత్రి లేచి ఞ్చజూఞజ్ట్చ్టీజీౌుఽట అయి గుండెపట్టుకుంటే అయ్యో...

ఇంత గాలి కావాలి

1

కంటి నిండా ఒక్క రేయి నిద్రా లేదు.

రాత్రి లేచి palpitations అయి 

గుండెపట్టుకుంటే

అయ్యో... నాన్నా అను 

ఒక్క స్పర్శ లేదు.


దేహాంతరాళమొక పచ్చిపుండయి

తల్లీ నిన్ను దలంచీ

సాకీ... నిన్‌ యాద్దెచ్చుకుని


ఏమి బతుకురా నాయన

మట్టి పొత్తిళ్ల వాసనలేని

మాయపేగు దుప్పటి లేని బతుకు


గాలీ గాలీ గాలీ గాలీ

లాలబోసి మొఖం మీద

         ఊదినంత గాలి కావాలి

చక్కిలిగింతల గాలి కావాలి

ఏడున్నావే అమ్మా....

ఇప్పటికిప్పుడు

ఈ మొఖాన ఇంత గాలి ఊదిపో


2

డాలీ డాలీ డాలీ

అధివాస్తవిక బింబమై రెటీనా 

       మీదా వాలావా

లేకపోతే కాంక్రీట్‌ పిల్లర్‌ 

       చుట్టకట్టుకుపోవటమేమిటి

ట్యూబ్‌లైట్‌ ఒక పడవై

చోక్‌ ఒక చుక్కానై

గోడపై పయనించటమేమిటి


3

ఇది ఆసుపత్రి గీతమో

జీవన్మరణ పోరాటమో

తెలియదు. 


ఎందుకు?

ఏమో!

తెలియదు గాక తెలియదు

చుట్టూ లుంగలు 

 చుట్టుకుపోతున్న మనుషులు

పోయాక బట్టలో 

 చుట్టబడుతున్న మనుషులు

తింటూ తింటూ

వెనక్కి మల్లుతును గదా


హయ్యో... 

ఇచ్చోటనే తారాడిన మనిషి

ఇప్పుడో విగతజీవి


నోట్లో ముద్దను ఊసేద్దునా

కళ్ళు మూసుకుని మింగేద్దునా


ఒళ్ళంతా వేడి సెగలు

ముద్ద 

నోట్లో ముద్ద 

ఇక మింగుడుపోవడం లేదు

గొంతు దిగడం లేదు


నీళ్లు నీళ్లు నీళ్లు

గొంతులో ఏదో అడ్డం

తి

రి

గిం

ది. 


4

తల్లీ నిను దలంచీ

మనిషీ మనిషీ దూరమవుతున్న చోట

నాలుగు మాటలు ఇచ్చిపో

మనుషులకు మనుషులు        

కాకుండా పోతున్న కాలాన

ఇంత వెచ్చటి కౌగిలిచ్చిపో

ఈ కన్నీటి సాగరంలోంచి 

చేబట్టి లాగి ఒడ్డున అచ్చంగా      

              నిలబెట్టిపో


నన్ను

ఆసుపత్రిలోంచి

సమాజాన్నీ

ఆసుపత్రిలోంచి

లాక్కొచ్చి

 మా మొఖాల మీద 

ఇంత గాలి ఊదు


 ముందు వెంట్రుకలు ఎగిరిపడేలా

 ఒక్క నవ్వు మా పెదాల 

మీద పూయించు.

అరుణాంక్‌ లత

arunank.latha@gmail.com


Updated Date - 2021-05-24T09:53:06+05:30 IST