పాశ్చాత్య ప్రశంసలే ప్రామాణికమా?

ABN , First Publish Date - 2021-03-21T06:29:51+05:30 IST

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ పై ఇప్పుడు ఒక పెద్ద కార్యభారం పడింది. ‘ఉదారవాద’ అనే విశేషణంతో గౌరవం పొందే యోగ్యత లేని...

పాశ్చాత్య ప్రశంసలే ప్రామాణికమా?

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ పై ఇప్పుడు ఒక పెద్ద కార్యభారం పడింది. ‘ఉదారవాద’ అనే విశేషణంతో గౌరవం పొందే యోగ్యత లేని ప్రభుత్వానికి ఉదారవాద తళ తళలు, నిగ నిగలు సంతరింప చేయడమే ఆ బృహత్ బాధ్యత. విదేశాలతో సంబంధాలను పర్యవేక్షించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజా సంబంధాలను నెరపే మరో బృహత్తర పాత్ర కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింప చేయడమే ఆయన కర్తవ్యం. 


ఇదొక సంక్లిష్ట కార్యం. సవాళ్లతో కూడుకున్న పని. ఆ కర్తవ్యాన్ని జైశంకర్ తన శాయశక్తులా నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తడబడుతున్నారు. సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. అయితే ఇందుకు మన గౌరవనీయ విదేశాంగ మంత్రిని తప్పుపట్ట కూడదు. వారం రోజుల క్రితం ఒక మీడియా సంస్థ నిర్వహించిన ఒక సదస్సులో కొన్ని ప్రశ్నలకు ఆయన ప్రతిస్పందించిన తీరును గమనించారా? ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య స్థాయిని నిర్ధారించే రెండు ప్రముఖ సంస్థలు భారత్ స్థానాన్ని తగ్గించడం గురించి సభికులు ప్రశ్నించారు (అమెరికాకు చెందిన ప్రభుత్వేతేర సంస్థ ‘ఫ్రీడమ్ హౌస్’ తన తాజా నివేదికలో ‘పాక్షిక స్వేచ్ఛ’గల దేశంగా మాత్రమే భారత్ ను వర్గీకరించింది. ‘పౌర స్వేచ్ఛ’ల విషయంలో భారత్ కు గత ఏడాది కంటే ఈ ఏడాది ఆ సంస్థ తక్కువ రేటింగ్ ఇచ్చింది. అలాగే స్వీడన్ కు చెందిన ‘వెరైటీస్ ఆఫ్ డెమొక్రసీ’

(వి-డెమ్) అనే సంస్థ కూడా భారత్‌ను ఒక ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’గా శ్రేణీకరించింది. 


ఈ విషయాలపై జైశంకర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ఇది పూర్తిగా కపటత్వం. కొంతమంది తమను తాము ప్రపంచ సంరక్షకులుగా నియమించుకున్నారు. భారత్ లోని బాధ్యతాయుతులు తమ ఆమోదం కోసం ఆరాటపడక పోవడాన్ని సహించలేకపోతున్నారు. తాము కోరుతున్న విధంగా భారతీయులు వ్యవహరించకపోవడాన్ని వారు భరించలేకపోతున్నారు. తత్కారణంగా వారు తమ సొంత నిబంధనలు రూపొందించుకుని, ప్రమాణాలు నిర్దేశించుకుని తీర్పులు వెలువరిస్తున్నారు. తమ తీర్పులు ప్రపంచ స్థాయిలో ప్రామాణిక మైనవి అయినట్టుగా వారు వ్యవహరిస్తున్నారు’ అని జైశంకర్ ధ్వజమెత్తారు. 


పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రజాస్వామ్య రేటింగ్ సంస్థలు కపటత్వంతో వ్యవహరిస్తున్నాయన్న జైశంకర్ ఆరోపణతో నేను విభేదించడం లేదు. అవునూ, ప్రజాస్వామ్య నాణ్యత కు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ఐరోపా, ఉత్తర అమెరికాలకు గల నైతిక అర్హత ఏమిటి? ఆ దేశాల విదేశాంగ విధానాలు, ఆర్థిక ప్రయోజనాలతో ముడి వడి ఉన్న కారణంగానే కాకుండా, అసలు ఆ పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లో పలు లోపాలు, లొసుగులు ఉన్నందున కూడా ఆ ప్రజాస్వామ్య రేటింగ్ సంస్థలతో మనం ఏకీభవించనవసరం లేదు. 


ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో నియంతృత్వ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఆమెరికా అన్ని విధాల వత్తాసునివ్వలేదూ? అసలు ప్రజాస్వామ్య రేటింగ్‌ల విషయంలో ఫ్రీడమ్ హౌస్, వి-డెమ్‌ల నిర్ణయాలను ప్రామాణికమైనవి కావు. వాస్తవానికి ఈ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలు అనేవే లేవు. ప్రజాస్వామ్యాన్ని గురించిన ఏ పరిమాణాత్మక కొలతలు లేదా వర్గీకరణలు అయినా అనివార్యంగా ఆత్మాశ్రయ పరమైనవి. బహిరంగంగా సవాల్ చేయదగ్గవి. అన్ని రేటింగ్ సంస్థలూ నిపుణులను ఆహ్వానిస్తాయి. వారు తమ సొంత విలువల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం కద్దు. కనుక సంపూర్ణంగా నిష్పాక్షిక ప్రజాస్వామిక రేటింగ్ అనేది లేదు. ఉండదు. అయితే ఆత్మగతమైన నిర్ధారణలు తప్పనిసరిగా పక్షపాత వైఖరులతో ప్రభావితమయినవని భావించనవసరం లేదు. 


నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిందించేందుకే ఫ్రీడమ్ హౌస్, వి-డెమ్‌లు ప్రజాస్వామ్య రేటింగ్‌లను కనిపెట్ట లేదు. ఈ వాస్తవాన్ని జైశంకర్ విస్మరించకూడదు. ప్రపంచంలోని పలు దేశాల విషయంలో ఏటా ఈ రేటింగ్స్‌ను అవి ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలతో పాటు ‘ది ఎకనామిస్ట్’ ప్రచురించే ‘డెమోక్రసీ ఇండెక్స్’, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ మొదలైన రేటింగ్స్ కూడా సుప్రసిద్ధమైనవి. వీటితో పాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ మొదలైనవి కూడా ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య స్థాయి గురించి వార్షిక నివేదికలు ప్రచురిస్తాయి. ఈ నివేదికలన్నిటిలోనూ భారత్ స్థానం క్రమంగా తగ్గిపోతూ వస్తుందన్న వాస్తవం జైశంకర్‌కు తెలిసే ఉంటుంది. మానవ హక్కుల కమిషన్ల నివేదికలు భారత్ ను తీవ్రంగా అభిశంసిస్తూనే ఉన్నాయి. భారత్‌లోని వాస్తవాల గురించి తెలిసినవారికి ఆ నివేదికల నిర్ధారణలు విస్మయం కలిగించడం లేదు. 


ప్రజాస్వామ్యాన్ని గురించిన పాశ్చాత్య ఉదార వాద అవగాహనకు అనుగుణంగా ఈ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందనేది స్పష్టం. అవన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పన్నిన ఒక మహాకుట్రలో భాగమని భావించడం సరికాదు. తన ప్రజాస్వామ్యానికి పాశ్చాత్య ప్రపంచం నుంచి ఆమోదం కోసం భారత్ ఎదురు చూడడం లేదని జై శంకర్ అన్నారు. అయితే వాస్తవాలు భిన్న సత్యాన్ని సూచిస్తున్నాయి. నరేంద్ర మోదీకి పూర్వం ఏ భారత ప్రధానమంత్రి కూడా తనపేరు ప్రతిష్ఠలను పెంపొందించుకునేందుకు దేశం వెలుపల మేళాలను నిర్వహించలేదు. డోనాల్డ్ ట్రంప్‌ను సంతృప్తిపరిచేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నించినట్లుగా ఏ అమెరికా అధ్యక్షుని విషయంలో ఏ భారత ప్రభుత్వాధినేత కూడా అలా వ్యవహరించలేదు. వ్యాపార సౌలభ్యం సూచీలో భారత్ స్థానం పెరుగుదలను కూడా ఏదో ఒక గొప్ప విజయంగా భావించవలసిన అవసరముందా? మోదీ ప్రభుత్వ హయాంలో వలే ఏ భారత ప్రభుత్వమూ తన సొంత గణాంకాలను ఉపేక్షించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) సంస్థ సమాచారానికి ప్రాధాన్యమివ్వడం జరగలేదు. వలసపాలననుంచి విముక్తమయిన అనంతరం ఏ భారత ప్రభుత్వం కూడా ప్రస్తుత ప్రభుత్వం వలే పాశ్చాత్య దేశాల ప్రశంసలు, సర్టిఫికెట్లకు ఆరాటపడలేదు.


మరి ఆ రేటింగ్స్‌ను చిత్తశుద్ధితో ప్రయత్నించడమెలా?వాస్తవాలతో వాటిని తిప్పి కొట్టడమే. జై శంకర్‌కు ఒకే ఒక వాస్తవం అందుబాటులో ఉంది. భారత్‌లో ఎన్నికల ఫలితాలను ఓడిపోయిన రాజకీయ పక్షాలతో సహా ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు అనే సంపూర్ణ యథార్థాన్ని ఆయన ప్రతిభావంతంగా ఉపయోగించుకున్నారు. అయితే ఆ రేటింగ్స్ పై ఈ పిడిగుద్దు, అమెరికా ఓటర్లకు నరేంద్ర మోదీ సిఫారసు చేసిన నేత -ఇంకెవ్వరు డోనాల్డ్ ట్రంప్- ప్రతిష్ఠకు భంగకరంగా ఉందన్న వాస్తవాన్ని జైశంకర్ విస్మరించారు. ఎన్నికల ఫలితాలను ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారన్న విషయం ఓట్ల లెక్కింపు, కాదూ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా అమలయిందన్న విషయాన్ని మాత్రమే రుజువు చేస్తుంది. అంతేగాని, భారతీయ సమాజంలో పౌర స్వేచ్ఛల పరిస్థితి క్షీణించిపోవడం లేదని, న్యాయవ్యవస్థతో సహా రాజ్యాంగ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోవడం లేదని, పత్రికా స్వాతంత్ర్యం అంతకంతకూ హరించుకుపోవడం లేదని, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోవడం లేదని, భిన్నాభిప్రాయ వ్యక్తీకరణ నేరపూరిత చర్యగా భావించబడడం లేదని ఆ వాదన నిరూపించ లేదు. భారత్‌లో ఎన్నికలు చాల వరకు సక్రమంగా, స్వేచ్ఛగా జరుగుతున్నాయి. ఇందులో సందేహం లేదు. అయితే ఎన్నికలకు, ఎన్నికలకు మధ్య కాలంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందా? వర్ధిల్లడం లేదు కనుకనే భారత్ ను ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’ (ఎన్నికలు జరిగే నిరంకుశపాలనా వ్యవస్థ)గా పరిగణిస్తున్నారు. 


ప్రజాస్వామ్య నాణ్యతను నిర్ధారించేందుకు మరో ప్రత్యామ్నాయాన్ని అన్వేషించవలసివుంది. ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య రేటింగ్స్‌లను ప్రకటించేందుకు విదేశాంగ శాఖ ఒక స్వతంత్ర మేధో మండలికి సంపూర్ణ మద్దతు నివ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. మరో సందర్భంలో అయితే ఇది హర్షామోదాలను పొంది ఉండేది. ప్రస్తుత సందర్భంలో దీనిని స్వాగతించేవారు బహుశా ఎవరూ ఉండక పోవచ్చు. ఎందుకంటే ఆ మేధో మండలి ప్రతిపాదన కల్నల్ గడాఫీ ‘గ్రీన్ బుక్’కు మరో రూపమేననిచెప్పవచ్చు. పాశ్చాత్య రాజనీతిని, ఆధిపత్యాన్ని గడాఫీ ‘గ్రీన్ బుక్’ శబ్దాడంబరంతో ప్రశ్నించింది. అంతకు మించి అదేమీ సాధించలేదు. భారతీయ ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిని కప్పిపుచ్చేందుకు జైశంకర్ ప్రయత్నం మొరటుగా ఉంది. చక్రవర్తి నగ్నంగా ఉన్నాడు. ఎంత పదాడంబరమూ ఆయనకు వస్త్రాలను సమకూర్చలేవు సుమా!

యోగేంద్ర యాదవ్ 

స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు

Updated Date - 2021-03-21T06:29:51+05:30 IST