ఇంటర్‌ విద్యకు మరింత భరోసా కావాలి!

ABN , First Publish Date - 2021-08-25T05:59:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ప్రైవేట్ రంగంలో నూతన కళాశాలలకు అనుమతిని ఇవ్వడంలేదు. ఈ ఏడేళ్ల నుంచి ఇంటర్ విద్య వికాసం కోసం ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి...

ఇంటర్‌ విద్యకు మరింత భరోసా కావాలి!

రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ప్రైవేట్ రంగంలో నూతన కళాశాలలకు అనుమతిని ఇవ్వడంలేదు. ఈ ఏడేళ్ల నుంచి ఇంటర్ విద్య వికాసం కోసం ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అడ్మిషన్లలో 85 శాతం పైగా పెరుగుదలను నమోదు చేశాయి. 2021–22 విద్యా సంవత్సరంలో 2.80 లక్షల విద్యార్థుల సామర్థ్యం కలిగి ఉన్న 405 ప్రభుత్వ కళాశాలల్లో 1.90 లక్షలు విద్యార్థులు చదువుకుంటున్నారు. 30కి పైగా జనరల్ కోర్సులు, 80కి పైగా వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తున్నారు. ఇవే కాకుండా 6, 8 నెలల స్వల్ప వ్యవధి వృత్తి విద్యా కోర్సుల్లో వేలాదిమంది విద్యార్థులు చేరారు.


ఈ ప్రస్థానం మరింత పరిపూర్ణత వైపు సాగడానికి వీలుగా ప్రభుత్వం మరిన్ని, సౌకర్యాలను కల్పించాలని ఇంటర్ విద్య ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు అనూహ్య సంఖ్యలో చేరడంలో అత్యధిక భాగస్వామ్యం ఒప్పంద అధ్యాపకులదే. వీరికి మరింత ఉద్యోగ భద్రతను కల్పించాలి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదా అనుబంధ వసతి గృహాలను, ఏర్పాటు చేసి ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలి. వెయ్యికి పైగా ఉన్న అన్ని రకాల అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలి. గ్రంథాలయ పాలకులకు పూర్తిస్థాయి అధ్యాపక హోదా కల్పించి పరిపాలన పదోన్నతులు ఇవ్వాలి. ఆచార్య జయశంకర్ అధ్యాపక శిక్షణా కేంద్రాన్ని అకడమిక్ స్టాఫ్ కళాశాలగా మార్చాలి. స్థానిక వనరులు, అవసరాలకనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ ఇంటర్ విద్య స్వయం ప్రతిపత్తిని కొనసాగిస్తూ హేతుబద్ధీకరణను ఆపివేయాలి. ఇంటర్ విద్య స్వర్ణోత్సవ సందర్భంగా గుణాత్మక ఉచిత విద్యను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించాలి. ఇప్పటికే మార్గదర్శకంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్ విద్య ప్రాభవం ఈ చర్యలతో ద్విగుణీకృతం అవుతుందనడం నిస్సందేహం.

అస్నాల శ్రీనివాస్

Updated Date - 2021-08-25T05:59:50+05:30 IST