ప్రేమసూత్రాన్ని విస్మరించిన భారతీయులు

ABN , First Publish Date - 2021-03-14T06:22:43+05:30 IST

మీలేఖ, మీరు పంపిన పత్రిక కాపీలు అందాయి. అధిక సంఖ్యాకుల్ని అల్ప సంఖ్యాకులు దోపిడీ చేయడం అనే అంశం గురించి ఇటీవలి కాలంలో నేను ఎక్కువగా...

ప్రేమసూత్రాన్ని విస్మరించిన భారతీయులు

హింస ద్వారా మాత్రమే వలస పాలన నుంచి భారత దేశానికి విముక్తి లభిస్తుంది అని విశ్వసించి, శ్యామాజీ కృష్ణవర్మ, వీడీ సర్కార్, మదన్‌లాల్ ధింగ్రా లాంటి తీవ్రవాద జాతీయవాదుల భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ‘ఫ్రీ హిందూస్తాన్’ అనే పత్రికా సంపాదకుడు తారక్‌నాథ్ దాస్‌కు లియో టాల్‌స్టాయ్ రాసినదే ‘ఒక హిందువుకు ఒక లేఖ’. దానికి సంక్షిప్త అనువాదం ఇది. జీవితంలో, సమాజంలోని సకల రంగాలలో హింసను మఠాధి పతులు, ఆధునికత ఎలా వ్యవస్థీకరించాయో ఈ లేఖ వివరిస్తుంది.


మీలేఖ, మీరు పంపిన పత్రిక కాపీలు అందాయి. అధిక సంఖ్యాకుల్ని అల్ప సంఖ్యాకులు దోపిడీ చేయడం అనే అంశం గురించి ఇటీవలి కాలంలో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అధిక సంఖ్యాకులైన కార్మికవర్గాన్ని పిడికెడుమంది కలిసి దోపిడీ చేయడం అనే సమస్య, ఇరువర్గాలూ ఒకే జాతికి చెందిన వాళ్ళైనా కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఒకేలా కనిపిస్తుంది నాకు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న ఇరవైకోట్ల మంది భారతీయులు, ఎంతో భిన్నమైన ఆలోచనలు ఉన్న ముప్పైవేల మంది బ్రిటిషువారి అధికారం కింద ఉండడం, నాకు కాస్త వింతగా కనిపిస్తుంది గతంలో మనకు తెలిసిన మేరకు మానవాళి ప్రత్యేక కుటుంబాలు, జాతులుగా జీవించింది. వాటిలో మెజారిటీ, ఒక్కరికో కొంతమందికో లొంగి జీవించాయి. శతాబ్దాల తరబడి సాగిన ఈ ఏర్పాటులో జీవితం బలప్రయోగం (coercion) మీద ఆధారపడినా, ప్రతి వ్యక్తిలో ఆధ్యాత్మికత (spirituality) అనే అంశం ఒకటి ఉంది. అదే ఉనికిలో ఉన్న జీవులన్నిటికి జీవితాన్నిస్తుంది. ఆ లక్ష్యాన్ని అది ప్రేమ ద్వారా సాధిస్తుందనే ఆలోచన చాలా జాతులలో, వ్యక్తులలో ఉంది. భిన్న స్థల కాలాల్లో, అన్ని మతాల్లో, అన్ని జాతుల్లో ఈ ఆలోచన ఉంది. అలాంటప్పుడు ఇది మానవ స్వభావంలోనే ఉందనుకోవాలి, ఇది సత్యమే అయి ఉండాలి, మనిషికి సహజమే అయిఉండాలి. కానీ ఈ సత్యం- సమూహాన్ని ఒకటిగా ఉంచాలంటే తమలో కొందరు ఇతరులను అదుపులో ఉంచాల్సిందే అని భావించేవారికి కూడా తెలుసు. దాంతో ఉనికిలో ఉన్న వ్యవస్థకు, ఈ సత్యానికి మధ్య సయోధ్య కుదరలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని అందరూ అంగీకరించినా, దాన్ని తమ ప్రవర్తనకు మార్గదర్శనంగా అంగీకరించలేకపోయారు. బలప్రయోగం మీద ఆధారపడిన సమాజంలో ఈ సత్యం ప్రాచుర్యం పొందలేదు. అధికారంలో ఉన్నవారు, ఈ సత్యాన్ని అంగీకరిస్తే, అది తమ స్థానాన్ని తగ్గిస్తుందని, దాన్ని వక్రీకరించడమే కాక, బహిరంగ హింస ద్వారా వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైనా సత్యం ఏమంటే, జీవితాన్ని నిర్దేశించేది మనిషిలో ప్రేమ రూపంలో వ్యక్తమయ్యే ఆధ్యాత్మికత. కానీ అధికారాన్ని మరిగిన మఠాధిపతులు, పాలకులు హింస ద్వారా, శిక్షల ద్వారా మనిషిలోని సహజమైన ప్రేమను చైతన్యంలో భాగం కాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. బ్రాహ్మణిజం నుంచి అన్ని మతాలలోను ఇది జరుగుతూనే ఉంది. 


ఇతరుల పట్ల ప్రేమ అనేది అత్యున్నత నీతి అనే గుర్తింపును ఇంతవరకు నిరాకరించకుండానే అబద్ధాలతో ఎంత కలగాపులగం చేసారంటే, అందులో పదాలు తప్ప ఏమీ మిగలలేదు. ప్రేమ అనే నీతి వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితమనీ, బహిరంగ జీవితంలో మాత్రం అధిక సంఖ్యాకులను కాపాడడానికి అల్ప సంఖ్యాకుల మీద నిర్బంధం, మరణ శిక్ష, యుద్ధం లాంటి అన్ని రకాల హింసను ప్రయోగించవచ్చని బోధించారు. ఎవరి మీద హింస ప్రయోగించాలో మేము నిర్ణయిస్తామని కొందరంటే, హింసకు గురయ్యేవాళ్ళు కూడా అదే నిర్ణయానికి రావచ్చనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోయారు. గొప్ప మతబోధకులంతా ఈ వైరుధ్యాన్ని గుర్తించినాకనే ప్రేమ అనే నీతికి, గాయాల పట్ల, అవమానాల పట్ల, హింసల పట్ల సహిష్ణత (endurance) ఉండాలని, చెడును చెడు ద్వారా అడ్డుకోకూడదని ఒక తప్పనిసరి షరతు విధించారు: మనుషులు ఎంత ముందుకైనా పోనివ్వండి- ప్రేమ అనే సుగుణానికీ, హింస ద్వారా చెడును అడ్డుకోవడం అనే అసంగతానికీ ముడివేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు. ప్రేమను సుగుణంగా అంగీకరించే వారిలోనూ బలప్రయోగం మీద ఆధారపడిన వ్యవస్థను అంగీకరించే విశ్వాసాన్ని కలిగించారు. 


ప్రజలు చాలాకాలం ఈ వైరుధ్యంలో జీవించారు. మనుషులు ఒకరికొకరు సాయం చేసుకోవడం, ప్రేమించడం సహజమైన విషయమని, ఒకరినొకరు ద్వేషించడం సహజం కాదనే సరళమైన సత్యం స్పష్టమైనాక, పాలకుల అధికార పునాదుల మీద ప్రజలకు విశ్వాసం తగ్గింది. పాలకుల అధికారం దైవదత్తం అనే మఠాధిపతుల ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మానేశారు. కానీ దురదృష్టవశాత్తు, ఈ వైరుధ్యం వల్ల లాభపడినవాళ్ళు పాలకులు మాత్రమే కాదు. పాలకుల చుట్టూ వుండే వాళ్ళు కూడా పరిపాలన పేరుతో ఈ వైరుధ్యాన్ని కొనసాగించడానికి కొత్త రకమైన మోసానికి దారి తీశారు.


అధికారంలో ఉన్నవాళ్లు మొదలుపెట్టిన ఈ కొత్త సమర్థన, పాత సమర్థన వలెనే పనికిమాలినదైనప్పటకీ, దానిని ప్రజలు గుర్తించలేకపోయారు. ఈ కొత్త సమర్థనను ‘శాస్త్రీయత’, ‘చారిత్రక సూత్రం’ పేరుతో మొదలుపెట్టారు. దీన్ని ఎంత నైపుణ్యంతో, వాగాడంబరంతో ప్రచారం చేసారంటే దోపిడీకి గురవుతున్న అధిక సంఖ్యాకులైన సామాన్యులు కూడా నమ్మడం మొదలు పెట్టారు. మత సూత్రాలు ఎంత ప్రశ్నించరానివిగా మార్చారో శాస్త్రీయతకు కూడా అదే స్థాయిని ఇవ్వడానికి ప్రయత్నించారు. మనిషిపై మనిషి చేసే బలప్రయోగం తరాల తరబడి జరిగేదే కాబట్టి, అది ఇంకా తప్పక కొనసాగాల్సిందే అనే సూత్రాన్ని శాస్త్రీయ సమర్థన చేసింది. మనుషులు తమ హేతుబద్ధత, మనసాక్షి ప్రకారం కాకుండా, గతంలో ఎలా జీవించారో అలాగే జీవించాలనే ప్రతిపాదనను ‘చారిత్రక సూత్రం’ ద్వారా చేస్తున్నారు. వారి రెండవ ప్రతిపాదన ఏమంటే, జంతువులలో, మొక్కలలో నిరంతరం మనుగడకు పోరాటం జరుగుతున్నట్టే, మనుషులలోను అది జరగాల్సిందే అనేది. జంతువులలో, మొక్కలలో లేని ప్రేమ, హేతుబద్ధత, చైతన్యం లాంటి లక్షణాలు మనుషులలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రతిపాదన చేస్తున్నారు.


మూడవది, ముఖ్యమైనది, దురదృష్టవశాత్తు చాలా విస్తృతంగా తరాల తరబడి అమల్లోఉన్న, ‘ప్రజా జీవితంలో అధిక సంఖ్యాకుల రక్షణ కొరకు అల్ప సంఖ్యాకులను అణచడం తప్పనిసరి’ అనే వైఖరిని బలంగా ముందుకు తీసుకెళ్లడం. మానవ సంబంధాలలో ప్రేమ, కరుణ ఎంత ఆచరణీయమైనప్పటికీ, పై సమర్థన బలప్రయోగాన్ని అనివార్యం చేస్తోంది. శాస్త్రీయత పేరుతో చేస్తున్న సమర్థనకు మఠాధిపతులు చేసిన సమర్ధనకు ఒక్కటే తేడా: ఈ బలప్రయోగం చేసే హక్కు కొందరికే ఎందుకు ఉంటుంది, మిగిలినవారికీ ఎందుకు ఉం డదు అనే ప్రశ్నకు వాళ్ళు భిన్నమైన సమాధానాలు ఇస్తారు. పాలకులకు దైవదత్త అధికారం ఉందని మతాధిపతులు సమర్ధిస్తే, శాస్త్రీయత పేరుతో మాట్లాడే వాళ్ళు బలప్రయోగం నిర్ణయాలు ప్రజాభీష్టం మేరకు జరుగుతాయని సమర్థిస్తారు. 


క్రైస్తవ ప్రపంచంలోనూ ఇలా జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ప్రాచీన భారతదేశంలో మానవ జీవితానికి ప్రేమే పునాది అనే స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు మీరు కూడా శాస్త్రీయ జ్ఞానోదయం పేరుతో, సత్యానికి శత్రువులు, హింసావాదులైన యూరోపియన్ గురువులు చొప్పించిన ఆశ్చర్యకరమైన బుద్ధిహీనతను అనుసరించాలని చూస్తున్నారు.


భారతీయులు తిరగబడకపోవడం వల్ల బ్రిటిషు వారికి బానిసలయ్యారని మీరంటారు. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నం. సామాజిక వ్యవస్థకు బలప్రయోగమే పునాది సూత్రం అని భారతీయలు నమ్మడం వల్లే బానిసత్వం సాధ్యమయ్యింది. ఈ సూత్రం ప్రకారం, చిన్న రాజులకు లొంగి, వారి తరపున, ఒకరితో ఒకరు కలహించారు, యూరోపియన్లతో, ఇంగ్లీష్ వారితో యుద్ధం చేశారు. మరల ఇప్పుడు చేస్తున్నారు. 


ఒక వ్యాపారసంస్థ ఇరవైకోట్ల మంది భారతీయులను బానిసలను చేసింది అనే మాటను ‘శాస్త్రీయత’ అనే మూఢనమ్మకం లేని వ్యక్తికి చెప్పండి. అతనికి అర్థం కాదు. ముప్పైవేలమంది మామూలు మనుషులు, ఎంతో శక్తీ, తెలివీ, సామర్థ్యమూ కలిగిఉండి, స్వేచ్ఛను ప్రేమించేవారిని బానిసలుగా మార్చారంటే ఏమిటి అర్థం? భారతీయుల్ని ఇంగ్లీషువాళ్ళు కాదు, వారే తమను తాము బానిసలుగా మార్చుకున్నారని కాదా? భారతీయులు హింస ద్వారా బానిసలయ్యారంటే, దానికి కారణం వారు తమలో అంతర్గతంగా ఉన్న ప్రేమ సూత్రాన్ని గుర్తించడం లేదని అర్థం. ఆ గుర్తించడమే జరిగితే వందలమంది, కోట్లమందిని బానిసనులను చెయ్యడం కాదు, కోట్లమందిలో ఒక్కరిని కూడా బానిసను చెయ్యలేరు. చెడు చేసే వారిని హింసతో ఎదుర్కోకపోవడమే కాదు, చెడులో భాగస్వామి కాకపోవడం కూడా ముఖ్యమే. పాలనలో, కోర్టులలో, పన్నుల వసూలులో, యుద్ధాలలో మీరు పాల్గొనకపోతే మిమ్మల్ని ఎవరూ బానిసలుగా మార్చలేరు. 

లియో టాల్‌స్టాయ్

డిసెంబర్ 14, 1908

(అనువాదం: కరణం మురళి)

Updated Date - 2021-03-14T06:22:43+05:30 IST