హృదయం లేని ఆర్థిక పాలన

ABN , First Publish Date - 2021-02-06T06:44:17+05:30 IST

కొత్తబడ్జెట్ సగటుమనిషి కష్టాలను కనీసంగానైనా తీర్చేదేనా? ప్రభుత్వ విధానాలు, చర్యలు, నిష్క్రియాపరత్వం వల్ల తమకు అన్యాయం జరిగిందని...

హృదయం లేని ఆర్థిక పాలన

కొత్తబడ్జెట్ సగటుమనిషి కష్టాలను కనీసంగానైనా తీర్చేదేనా? ప్రభుత్వ విధానాలు, చర్యలు, నిష్క్రియాపరత్వం వల్ల తమకు అన్యాయం జరిగిందని సమాజంలోని అనేకవర్గాలు భావిస్తున్నాయి. నిరుపేదవర్గాలు, రైతులు, వలస కార్మికులు, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు, మధ్యతరగతి కుటుంబాలు, నిరుద్యోగులు ఎన్నో ఆశలతో కొత్తబడ్జెట్ కోసం ఎదురు చూశారు. మరి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-–22 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆయా వర్గాల వారికి ఏమాత్రమైనా ఊరటనిచ్చిందా? ప్రభుత్వ సహాయం ఎవరికైతే తప్పనిసరో వారే తీవ్ర ఆశోపహతులయ్యారు. సామాన్యులకు, అందునా కొవిడ్ మహమ్మారితో కకావికలయిన వారికి బడ్జెట్‌ ఉపశమనం కల్పించగలదని నేను ఆశించలేదు. ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. కనుక నేనేమీ చింతించడం లేదు. అయితే దేశపాలకులు తమను వంచించారని కోట్లాది మంది భావిస్తున్నారు. మహాసంపన్నులు, ఇతరుల మధ్య అంతరాలను కొత్త బడ్జెట్ మరింతగా పెంపొందించింది. బడ్జెట్ అనేది ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విభేదాలను తొలగించుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు ఒక అవకాశం కదా. మరి ఈ విషయంలో 2021–22 బడ్జెట్ ఏమేరకు సఫలమయింది? 


సరే, కొత్తబడ్జెట్‌ను నిర్మల ఎటువంటి అసాధారణ పరిస్థితుల్లో సమర్పించారో ఒకసారి గుర్తు చేసుకుందాం! వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలలో (2018–19; 2019–2020) వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయింది. ఆర్థికమాంద్యం ముమ్మరయింది. కొవిడ్ ఉపద్రవంతో పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు తలకిందులయిపోయాయి. లక్షలాది కుటుంబాలు దారిద్ర్యరేఖ దిగువకు నెట్టివేయబడ్డాయి. వాటిపై రుణభారం పెరిగిపోయింది. కోట్లాది వయోజనులు ఉద్యోగాలు, జీవనాధారాలను కోల్పోయారు. మొత్తం కార్మికులలో 64.7 మిలియన్ మంది వీధిన బడ్డారు. వీరిలో 22.6 శాతం మంది మహిళలు. 2.8కోట్ల మంది ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. 35 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఈ ఆర్థికభారతం ఎవరిని కలవరపచకుండా ఉంటుంది? మరో రెండు కఠిన వాస్తవాలను కూడా మనం ఈ సందర్భంగా తప్పక ప్రస్తావించుకోవాలి. అవి: (1) హిమాలయ పొలిమేరలో చైనా దురాక్రమణలు. ఇది మన జాతీయభద్రతకు ప్రమాదఘంటికలు మోగిస్తోంది; (2) ఆరోగ్య భద్రతారంగంలో సదుపాయాల మెరుగుదలకు భారీ పెట్టుబడుల ఆవశ్యకత. 


ఈ కఠోర వాస్తవాల నేపథ్యంలో ఇదే కాలమ్‌లో ‘అసమానతల వైరస్‌పై యుద్ధం ఏదీ?’  జనవరి20) అని ప్రశ్నించాను. రక్షణ, ఆరోగ్య భద్రతారంగాలలో భారీపెట్టుబడులు అత్యవసరమని స్పష్టం చేశాను. ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించిందని, ఆ రెండురంగాలలో తప్పక భారీ మదుపులు చేస్తుందని కూడా గట్టిగా విశ్వసించాను. వివిధ రంగాలలో చేపట్టవలసిన చర్యలు, తీసుకోవలసిన నిర్ణయాలపై పది సూచనలు చేశాను (ఉద్దేశపూర్వకంగానే పది సూచనలకు పరిమితమవుతున్నానని కూడా చెప్పాను). మరి కొత్తబడ్జెట్‌లో ఆయా అంశాలకు లభించిన ప్రాధాన్యం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఒక్క మూలధన వ్యయాలకు సంబంధించిన సూచనకు మాత్రమే ప్రాధాన్యం లభించింది. ఏ రెండురంగాలలో భారీపెట్టుబడులు అత్యవసరమో ఆ రెండురంగాలు (రక్షణ, ఆరోగ్య-ం)లో కొత్త బడ్జెట్ తీరుతెన్నులను నిశితంగా చూద్దాం. 


మన రక్షణదళాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కొత్తబడ్జెట్ విఫలమయింది. ఆర్థికమంత్రి దాదాపు రెండు గంటల పాటు చేసిన బడ్జెట్ ప్రసంగం ‘రక్షణ’ అనే మాటనే ప్రస్తావించలేదు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? దేశ సరిహద్దుల రక్షకులను ఇలా ఉపేక్షించడం అసాధారణం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.3,47,088 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో ఈ కేటాయింపులు రూ.3,43,822 కోట్లు. కేటాయింపులను కేవలం రూ.3,266 కోట్లు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యరంగం విషయానికి వస్తే ఆర్థిక మంత్రి తన తెలివితేటల్లో తన నమ్మకాన్ని చాటుకున్నారు! ఈ రంగానికి కేటాయింపులను 137శాతం అంటే 2020–21లో రూ.94,452 కోట్లు నుంచి 2021–22లో రూ.2,23,846 కోట్లకు పెంచినట్టు నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఎంత బుకాయింపు! ఆమె ప్రకటన మోసపూరితమైనదని బడ్జెట్‌ప్రసంగం ముగిసిన కొద్దిగంటలకే ఆర్థిక మంత్రిత్వశాఖ బడ్జెట్ విభాగం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేశాయి. వాటి ప్రకారం ఆరోగ్యరంగానికి వాస్తవంగా జరిగిన కేటాయింపులు: 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.82,445కోట్లు కాగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.74,602 కోట్లు! నిర్మల సగర్వంగా చెప్పుకున్నట్టు ఆరోగ్య శాఖకు కేటాయింపులు పెరగకపోగా గణనీయంగా తగ్గిపోయాయి! నిర్మల గారడీ చేశారు. ఎలా? ఒకసారి టీకాలు వేయడానికి అయిన వ్యయాన్ని, తాగునీరు, పారిశద్ధ్యం విభాగానికి కేటాయింపులను, మంచినీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య రంగాలలో ఖర్చు పెట్టడం కోసం రాష్ట్రాలకు ఆర్థికసంఘం మంజూరు చేసిన నిధులను ఆరోగ్యశాఖ పద్దులో కలిపివేశారు! 


ఇక ఇప్పుడు నా పది సూచనల విషయానికి వస్తాను. అట్టడుగు స్థాయిలో ఉన్న 20 నుంచి 30 శాతం కుటుంబాలను గానీ, సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు మూతపడి వీధినపడ్డ లక్షలాది కార్మికులను గానీ ఆదుకోవడానికి నిర్దిష్ట కార్యక్రమాలను ప్రకటించకపోగా అసలు ఆ అభాగ్యుల గురించి కనీసం ఒక్క సానుభూతి మాట కూడా ఆర్థిక మంత్రి మాట్లాడనేలేదు. రంగాలవారీగా నిర్దిష్ట పునరుద్ధరణ ప్యాకేజీలను కూడా ఆమె ప్రకటించలేదు. టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, నిర్మాణం, మైనింగ్, పౌర విమానయానం, పర్యాటకం మొదలైన రంగాలలో పరిస్థితులు మెరుగుపడాలంటే వాటికి ప్రత్యేక ఆర్థికప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందుకు ప్రకటించలేదు? వస్తుసేవల పన్నురేట్లను కూడా తగ్గించలేదు. పైగా పెట్రోల్, డీజిల్‌తో సహా పలు ఉత్పత్తులపై సెస్‌లు విధించారు. ఈ సెస్‌లు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలకు తీవ్రవిఘాతం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఒక్క మూలధన వ్యయాల విషయంలో మినహా ప్రతి అంశంలోనూ ప్రజలకు ఆర్థికమంత్రి తీవ్ర ఆశాభంగం కలిగించారు. 


మూలధన వ్యయాల విషయంలో కూడా నిర్మల నిర్ణయాలు సాహసోపేతంగా లేవు. 2021 మార్చి 31 నాటికి ఆమె రూ.10,52,318 కోట్లు అదనంగా అప్పు తీసుకోనున్నారు. అయితే అదనపు మూలధన వ్యయం రూ.27,078 కోట్లు మాత్రమే మూలధన ఆస్తులను సృష్టించడానికి కేంద్రప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఈ అదనపు సహాయం రూ. 23,876 కోట్ల మేరకు ఉంటుంది. రాబడి ఖర్చులు రూ.3,80,997 కోట్ల మేరకు పెరుగుతుండగా రాబడి వసూళ్లలో రూ.4,65,773 కోట్లు అని ఆర్థికమంత్రి తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా లేదు. 


ప్రభుత్వం వివిధరంగాలలో సదా వ్యయం చేస్తూనే ఉందని, కనుకనే ద్రవ్యలోటు 9.5 శాతానికి పెరిగిందని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. నిజమేమిటి? బడ్జెట్ లో పేర్కొన్న విధంగా వివిధ పన్నులను సంపూర్ణంగా వసూలు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమయింది. రాబడి ఖర్చులను అదుపు చేయడంలోకూడా విఫలమయింది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు సంబంధం లేకుండా పోయింది. దీంతో ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు అప్పులు తీసుకోవడం ఆర్థిక మంత్రికి అనివార్యమయింది. 


పేదలు, నిరుపేదలు, వలస కార్మికులు, దినసరివేతన కూలీలు, చిన్నకారు, సన్నకారు రైతులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమానులు నిరుద్యోగులు (వారి కుటుంబాలు), మధ్యతరగతి ప్రజలు వంచనకు గురయ్యారు. వారు తమ అసంతృప్తిని సామాజిక మాధ్యమాలలో వెళ్ళగక్కుతున్నారు. సామాన్యుల సంక్షేమం ఏమయితేనేం? సంపన్నులకు ప్రయోజనం కలిగించడమే ఈ బడ్జెట్ పరమార్థంగా ఉంది. అశేష జనజీవిత దైన్యస్థితిని విస్మరించిన, హృదయం లేని బడ్జెట్ ఇది.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-02-06T06:44:17+05:30 IST