తెలుగు కథ రాజయ్యని దాటిందా?

ABN , First Publish Date - 2021-12-27T06:03:13+05:30 IST

కొడుకు రైలు పట్టాల మీద శవమై ఉంటాడు. తండ్రి రాజారాం అల్లకల్లోలంగా ధ్వంసమైన పల్లెలాగా ఉంటాడు. ఆయన కొడుకు గురించేగాక అనేక మరణాలను తల పోసుకుంటూ ‘ఇంతకూ ఈ మరణం ఎప్పుడు మొదలైంది...

తెలుగు కథ రాజయ్యని దాటిందా?

కొడుకు రైలు పట్టాల మీద శవమై ఉంటాడు. తండ్రి రాజారాం అల్లకల్లోలంగా ధ్వంసమైన పల్లెలాగా ఉంటాడు. ఆయన కొడుకు గురించేగాక అనేక మరణాలను తల పోసుకుంటూ ‘ఇంతకూ ఈ మరణం ఎప్పుడు మొదలైంది’ అనుకుంటాడు. అల్లం రాజయ్య రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ కథలోని సన్నివేశమిది. ఈ మాట పాఠకుల మనసును కూడా ఆ బిడ్డడి మరణం గురించేగాక లోపలా బైటా సాగుతున్న మరణాల మీదికి, విధ్వంసాల మీదికి తీసికెళుతుంది. కథలోని ఫోకస్‌ పాయింట్‌తో కనెక్ట్‌ చేస్తుంది. ధ్వంసమై తప్పక కూల్చవలసిన సంబంధాలను ఎరుకలోకి తీసుకొస్తుంది. వీటన్నిటితో కూడిన భావోద్వేగాల్లో మనల్ని భాగం చేస్తుంది. మరణంలోని దుఃఖం మానవులందరికీ అనుభవమే. దాన్ని చెప్పడమే కథ ఉద్దేశమా? కాకపోవచ్చు. 


అసలు రాజయ్య కథలన్నిటిలోని అంతస్సూత్రం ఏమిటనే ప్రశ్న వేసుకుంటే ఒకే సమాధానం రాకపోవచ్చు. పలు అర్థ వ్యాఖ్యానాలు అవసరం అవుతాయి. అవి స్థల కాలాలనుబట్టి మారుతూ ఉంటాయి. ఒకానొక నిర్ధారణతో సంతృప్తి పొందలేం. అట్లని స్థలకాలాల నిర్దిష్టతలు లేవని కాదు. బహుశా తెలుగు కథా, నవలా సాహిత్యంలో అల్లం రాజయ్య వలె స్థలకాల బద్ధంగా రాసిన రచయితలు అరుదు. ఆ కారణం వల్లే ఆయన సాహిత్యానికి చారిత్రక గుణం వచ్చింది. నిజానికి స్థల కాలాలు విడిగా ఉండవు. అవి మానవులకు సకల నిర్దిష్టతలపట్ల ఎరుక కలిగిస్తాయి. అట్టడుగు ప్రజాజీవితంలో సాగుతున్న వర్గపోరాటాల నుంచి రాజయ్య వాటిని చూసిన తీరు మనల్ని అబ్బురపరు స్తుంది. అందుకే మనకు ఆయన కథల్లో, నవలల్లో ఉద్వేగాలు, ఆరాటాలు పోరాటాలే కనిపించవు. సామాజిక జగత్తును నిర్మిం చుకొనే క్రమంలో మనిషిని సామాజిక జీవిగా మార్చిన మానవ సంబంధాల చారిత్రక వికాసమే ఆయన కథల ఇతివృత్తం. 


1970లలో మొదలై 2000 దాకా ఆయన రాసిన కథలు, నవలలు ఇప్పుడు పర్‌స్పెక్టివ్‌ (హైదరాబాదు) ప్రచురణలుగా మరోసారి అందుబాటులోకి వచ్చాయి. తొలి కథ ‘శివసత్తి శక్తి’ దగ్గరి నుంచి ‘ప్రేరకాలు’ కథ వరకు అన్నీ ‘సృష్టికర్తలు’, ‘తల్లి చేప’, ‘అతడు’ అనే మూడు సంపుటాలుగా పాఠకుల చేతుల్లోకి వచ్చాయి. ‘కొలిమంటుకున్నది’, ‘ఊరు’, ‘అగ్నికణం’, ‘కొమురం బీము’, ‘వసంతగీతం’ ఐదు నవలలు కలిసి మొత్తం ఆరు సంపుటాలు ఈ సీరీస్‌లో భాగం. ఈ మొత్తానికీ వరవరరావు సంపాదకుడు. ఈ మొత్తం 2100 పేజీల్లో తెలుగు సమాజ పరి వర్తనా క్రమాలు కనిపిస్తాయి. బహుశా తెలుగులో మరెవరి సాహిత్యానికి దొరకని అరుదైన చేర్పు ఈ సంపుటాలకు వర వరరావు రాసిన ముందుమాటలు. విస్తారమైన జీవన, పోరాట క్షేత్రాల నుంచి ఆయన రాజయ్య కల్పనా సాహిత్యం వెనుక ఉన్న నిజ చరిత్రను విశ్లేషిస్తూ ముందుమాటలు రాశారు. ఈ ఆరు సంపుటాలకు ఆయన రాసిన ముందుమాటలే 280 పేజీలు. పర్‌స్పెక్టివ్‌ ఈ ముందుమాటలను కూడా ఒక పుస్తకంగా ఇటీవలే అచ్చేసింది. ఆ రకంగా అల్లం రాజయ్య కల్పనా సాహి త్యమూ, ఆ మొత్తం మీద సామాజిక రాజకీయ సాంస్కృతిక ఉద్యమ విశ్లేషణా అంతా ఇప్పుడు పాఠకుల ముందు ఉన్నది. 


సాహిత్యం మానవ పాత్రలతో, ఉద్వేగాలతో, అనుభవాలతో, చైతన్య క్రమాలతో నిర్మాణమవుతుంది. ఏ సాహిత్యానికైనా ఇదే గీటురాయి. వీటి పట్ల విప్లవాత్మక వైఖరిని తీసుకొని రాసే రచ యితలూ ఉంటారు. కానీ రాజయ్య ప్రత్యేకత ఎక్కడ ఉన్న దంటే వందల వేలఏళ్లుగా కొనసాగుతున్న వ్యవస్థ ఇక ఉనికిలో ఉండలేని సంఘర్షణలో పడిపోవడాన్ని తన సాహిత్య ఇతివృ త్తంగా ఎన్నుకున్నారు. ఈ వ్యవస్థ గర్భం నుంచే దాన్ని కూల దోసే శక్తుల ఆవిర్భావాన్ని చిత్రికపట్టడానికే ఆయన ఇంత సాహిత్యం రాశారు. అట్టడుగు కులాల, వర్గాల మానవులు, మహిళలు చారిత్రక శక్తులుగా రూపొందడంలోని సంరంభం, వొత్తిడి, రాపిడి, మరణాలు, విధ్వంసాలు, అంతిమంగా నిర్మా ణాలు అన్నీ రాజయ్య కథలయ్యాయి. నవలలయ్యాయి. అలాంటి రంగభూమి మీదే ఆయన రచయితగా కళ్లు తెరిచాడు. లేదా తన నిమిత్తం లేకుండా ఆయన ఆ స్థలకాలాలలో తన సహ చరులందరిలాగే నూతన మానవుడిగా రూపొందినందు వల్లనే సృజనకారుడయ్యాడు. ఈ సంఘర్షణా ప్రపంచమంతా విప్లవో ద్యమంలో ప్రతిబింబించింది. అది రాజయ్య సాహిత్య రూపం ధరించింది. 


మామూలుగా గత జీవితంలోని సౌందర్యాన్ని, నైసర్గికతను వర్ణించే రచయితలు ఎక్కువమంది ఉంటారు. గతాన్ని వైభవీ కరించేవాళ్లు, గతం లోతుల్లోకి జారిపోయే వాళ్లు, గతం కరిగి పోతోంటే కన్నీరు కార్చే సాహిత్యకారులు ఉంటారు. ఆ వేదన నుంచి తీవ్రమైన విమర్శపెట్టేవాళ్లు ఉంటారు. ఆ రకంగా తమకు తెలియకుండానే ఈ అనివార్యమైన సంఘర్షణలో వాళ్లు గతం పట్ల మొగ్గుచూపుతారు. కానీ రాజయ్య ధ్వంసమైపోతున్న పాత వ్యవస్థ గురించే రాయలేదు. అది ధ్వంసమైపోతున్నప్పటి ఆక్రం దనలే వినిపించలేదు. ఆ వైపు కూడా ఆయన చూపు పడు తుంది. కానీ ఆయన ఉద్దేశం దాన్ని చిత్రించడం కాదు. రూపొం దుతున్న కొత్త జగత్తును చిత్రించడం ఆయన సాహిత్య కర్తవ్యం. బహుశా ఆధునిక తెలుగు సాహిత్యంలోకి విప్లవోద్యమం తీసు కొచ్చిన గుణాత్మక పరిణామం ఇది. 


ఒక చారిత్రక యుగావధిలో మానవాళి గతాన్ని ధ్వంసం చేసుకుంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడమనే సంఘర్షణ ఒక్కటే ఆయన సాహిత్య పరిశీలనకు ప్రమాణం. బహుశా అక్కడి నుంచే శిల్పరీతులు, ప్రయోగాలు చర్చించాలేమో. ఈ అర్థంలో అల్లం రాజయ్య కథలు, నవలలు భారతీయ భాషా సాహిత్యాల్లోనే ఒక కొత్త చారిత్రక ప్రపంచపు నిర్మాణ కళ. అందుకే కన్నీళ్లు, మరణాలు, మృత్యు అనుభవాలు ఆయన సాహిత్యంలో వేరే అర్థాల్లో గోచరమవుతాయి. ‘మనిషిలోపలి విధ్వంసం’ కథలో పైన ఉటంకించిన మాట మరణం మీద మన దృష్టిని తీసికెళ్లదు. ఈ మరణం, లేదా ఈ విధ్వంసం లోపలా, బైటా ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైంది? అనే తాత్విక అన్వేషణ లోకి తీసికెళుతుంది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఈ విధ్వంసాల అంతరాంతరాల్లోని నిర్మాణ క్రమాల మీదికి మన ఆలోచనల్ని లాక్కెళుతుంది. దేనికంటే రాజయ్య సాహిత్యమంతా మనుషులు, సంబంధాలు, విలువలు, పోరాటాలు, పోరాట రూపాలు నిర్మాణమయ్యే తీరు గురించి చెప్పడమే. హింసా పీడనల గురించి చెబుతున్నట్లు ఉంటుందిగాని అణగారిపోయి, వెలివేతలకు గురైన మనుషుల్లోని సకల సృజనాత్మకతలు విముక్త మయ్యే సంరంభం చెప్పడం ఆయన ఉద్దేశం.  


ఆయన తొలి రచనల్లో సహితం ఆనాటి వాతావరణం, స్థితి గతులు మినహా వాటిలోని రూపొందుతున్న లక్షణం ఈ రోజుకూ, రేపటికీ వర్తించేదే. దాన్ని చిత్రించడానికి అప్పటికి తగిన కథన పద్ధతులను అనుసరించారు. వాటినీ ఈ సీరీస్‌లోని చివరి సంపుటం ‘అతడు’లోని శిల్పాన్ని పోల్చిచూడండి. అది కథకుడిగా రాజయ్య గొప్పతనానికి సంబంధించింది కాదు. రూపొందు తున్న కొత్త ప్రపంచపు శిల్ప విశేషాలు అందులో కనిపిస్తాయి. ఈ చివరి సంపుటంలోని కథలు రాజయ్య సాహిత్య సృజనను శిఖరాగ్రానికి తీసికెళ్లాయి. బహుశా ఇప్పటికీ తెలుగు కథ దాన్ని దాటి ముందుకు పోలేదు. అక్కడినుంచే చాలా అవసరమైన భిన్న కోణాలను దర్శించవచ్చు. పాఠకులకు చూపించవచ్చు. అంత వరకే. ఆ సంపుటంలోని ఒక్కో కథను తీసుకొని వాచక విశ్లేషణ చేస్తే తెలుగు సాహిత్య విమర్శ కూడా ముందుకు వెళుతుంది. 


‘సృష్టికర్తలు’, ‘తల్లి చేప’ సంపుటాల మీదుగా రాజయ్య కథన వికాసం ‘అతడు’ను చేరుకొనే నాటికి స్వతహాగా ఆయనలోని తాత్విక, కాల్పనికశక్తి ఇనుమడించి ఉంటుంది. అదొక్కటే కాదు. ఆయన ఎంచుకున్న సామాజిక నిర్మాణ క్రమాలే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ‘ఎదురు తిరిగితే’ కథ దగ్గరి నుంచి ‘ప్రత్యర్థులు’ దాకా ఆయన చూపిన నిర్మాణ క్రమాలు ఎక్కడా ఆగిపోలేదు. రాజయ్యకు అందుబాటులో ఉన్న ఆవరణ నుంచి మరింత విస్తారమైన స్థల కాలాలకు ఎదిగి ఉండవచ్చు. అంతిమంగా కొత్త మానవుల రూపకల్పనే ఈ నిర్మాణ క్రమాల సారాంశం. దాన్ని రాజయ్య తన మొదటి రెండు దశల కథలకంటే మూడో దశలోనే అత్యద్భుతంగా చిత్రించారు.   


మన సమాజం ఒక దశ నుంచి మరో దశలోకి పరివర్తన చెందడానికి అనుభవిస్తున్న తీవ్రమైన పెనుగులాట రాజయ్య సాహిత్యం మూడో దశలో బాగా కనిపిస్తుంది. వ్యవసాయ, పారి శ్రామిక, ఆదివాసీ, సేవా రంగాల్లోని ప్రజలు తమ వికాసం కోసం వ్యవస్థ బంధనాలతో, దోపిడీతో ఘర్షణ పడుతున్నారు. అది అంతులేని హింసాత్మకమైనది. ఇప్పటికీ కొనసాగుతున్నది. ఆ కోణాలన్నిటినీ పట్టుకొని రాజయ్య ఆ తావుల నిర్మాణమవు తున్న కొత్త ప్రపంచాన్ని సాహిత్యీకరించారు. మన కళ్లెదుటే ఉన్నట్లు కనిపిస్తూ భవిష్యత్తులోకి విస్తరించే క్రమాలను రాయడం చాలా కష్టం. అలాంటి అద్భుతమైన నిజ, కాల్పనిక అనుభవం పొందాలంటే అల్లం రాజయ్య సాహిత్యాన్ని చదవాల్సిందే. మళ్లీ మళ్లీ విశ్లేషించాల్సిందే.

పాణి

Updated Date - 2021-12-27T06:03:13+05:30 IST