తాలిబన్లతో తంటా

ABN , First Publish Date - 2021-09-08T05:48:15+05:30 IST

ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అరబ్‌దేశాలకు తాలిబన్ల పునరాగమనం సహజం గానే ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల కంచుకోట అయిన అఫ్ఘానిస్థాన్‌లోని తాజా పరిణామాలను...

తాలిబన్లతో తంటా

ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అరబ్‌దేశాలకు తాలిబన్ల పునరాగమనం సహజం గానే ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల కంచుకోట అయిన అఫ్ఘానిస్థాన్‌లోని తాజా పరిణామాలను అరబ్‌ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. గతంలో తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుర్తించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, పాకిస్థాన్ ఈ సారి తొందరపడడం లేదు. 1990 దశకంలో తాలిబన్లు తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు వారి ప్రభుత్వాన్ని కేవలం ఆ మూడుదేశాలు మాత్రమే గుర్తించాయి. 


తాలిబన్ల కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయమై అమెరికా, ఇతర దేశాలు ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. అలా చేయకున్నప్పటికీ ఖతర్‌లోని తాలిబన్ల  రాజకీయ సంప్రదింపుల కార్యాలయంతో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా సహా అనేక దేశాలు కొద్దికాలంగా నిరంతరం సంప్రదింపులలో ఉన్నాయి. చైనా, రష్యా తాలిబన్ల నూతన ప్రభుత్వాన్ని గుర్తించనున్నట్టు ఇప్పటికే పరోక్ష సంకేతాలు ఇచ్చాయి, పాకిస్థాన్, ఇరాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, తజికిస్థాన్, తుర్కేమనిస్థాన్ దేశాలు అఫ్ఘానిస్థాన్‌తో భౌగోళికంగా సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఆ దేశాలలోని వివిధ తెగలతో అఫ్ఘానీ తెగలకు బంధుత్వాలు ఉన్నాయి.


అఫ్ఘాన్‌తో 900 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న షియా ఇరాన్, సున్నీ ముస్లింల తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం అంత సులువు కాదు. ఇరాన్‌లో ఇప్పటికే ముప్పై లక్షల మంది అఫ్ఘాన్ శరణార్థులు ఉన్నారు. అదే విధంగా, పాకిస్థాన్‌తో అఫ్ఘాన్‌కు 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. ఆ దేశంలో కూడా ఇంచుమించు 30 లక్షల మంది సున్నీ అఫ్ఘానీ శరణార్థులు ఉన్నారు. తాలిబన్ల గుర్తింపు అనేది పాకిస్థాన్‌కు లాంఛనమే కానీ ప్రస్తుత పరిస్థితులలో అంతర్జాతీయ సమాజ అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించేందుకు ఇస్లామాబాద్ పాలకులు సంసిద్ధంగా లేరు. అమెరికాపై తీవ్ర వ్యతిరేకత, గ్యాస్ రవాణా ప్రయోజనాల దృష్ట్యా చైనా, రష్యా మాత్రమే తాలిబన్ల పట్ల మెతకవైఖరి ప్రదర్శిస్తున్నాయి. 


అందరినీ కలుపుకుని వెళ్ళడమే తమ అభిమతమని తాలిబన్లు ఉద్ఘాటిస్తున్నప్పటికీ పాకిస్థాన్‌తో సహా ఏ దేశానికీ వారి మాటపై విశ్వాసం లేదు. అప్ఘానిస్థాన్ లోని భౌగోళిక, సామాజిక పరిస్థితుల కారణాన విభిన్నతెగలు వివిధ చోట్ల ఆధిపత్యం చెలాయిస్తాయి, పరస్పరం ఘర్షించుకునే ఈ తెగలన్నీ కలిసి సమష్టిగా ప్రభుత్వం నడపడం అనేది సునాయాసమేమీ కాదు. బలవంతుడిదే రాజ్యం అనేది అప్ఘానిస్థాన్‌లో ఒక మౌలిక సూత్రం. దేశవ్యాప్తంగా అధికారాలను చెలాయించ గలిగే జాతీయ పాలనావ్యవస్థ మొదటి నుంచీ కూడా అప్ఘాన్‌లో లేదు. రాజధాని కాబూల్ నుంచి ఒక శాసనం జారీ అయితే ఆయా ప్రాంతాలలో అది అమలు కావాలంటే తెగల నేతల ఆమోదం తప్పనిసరి. పష్తూన్, ఉజ్బెకీ, తజ్కీ, బలూచీ, హాజరా అనే ప్రధాన తెగలకు చెందిన నాయకులందరు ప్రత్యర్థుల రక్తాన్ని ఊచకోతల ద్వారా వరదనీరులా ప్రవహింపచేసిన వారే. అనేక అగ్రరాజ్యాలతో ఈ తెగల యుద్ధవీరులకు సత్ససంబంధాలు ఉన్నాయి. పారిస్ నగరంలోని ఒక కూడలికి తజ్కీ తెగ గెరిల్లా యోధుడు అహ్మద్ మసూద్ పేరు ఉంది. అమెరికా నుంచి వచ్చిన విద్యావంతులు, మేధావులు హామిద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీలను అప్ఘానీ సమాజం ఎప్పుడూ తమ నిజమైన ప్రతినిధులుగా గుర్తించలేదు. అంతర్జాతీయంగా మాత్రమే వారు అధికారిక నేతలుగా చలామణి అయ్యారు తప్ప స్థానికంగా వారెప్పుడూ తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు.


కరుడుగట్టిన కక్షపూరిత విధానం, పష్తూన్ తెగ ఆధిపత్య అహంకారం, ఇస్లామిక్ ఛాందసవాదం, హింసాత్మక వైఖరి తాలిబన్ల స్వతస్సిద్ధ లక్షణాలు. ఉత్తర అఫ్ఘాన్ నుంచి మధ్య ఆసియాలోని మాజీ సోవియట్ దేశాలకు వెళ్ళే దారిలో ఇతర తెగల అధిపత్యం అధికంగా ఉంది. ప్రత్యర్థి తెగలు ఎంతకాలం సర్దుబాటు చేసుకుంటాయో కాలమే నిర్ణయిస్తుంది. ఇక స్వంత పష్తూన్లలో కూడ అనేక వర్గాలు, కీచులాటలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని గుర్తించడం ప్రపంచ దేశాలకు ఒక సవాల్‌గా మారింది. ఉగ్రవాదంపై రెండు దశాబ్దాల పోరాటంలో అమెరికా వైఫల్యంపై దిగ్భ్రాంతిలో ఉన్న అరబ్‌దేశాలు ఉగ్రవాద తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం అంత సునాయాసమేమీ కాదు. అటు చైనా ఇటు పాకిస్థాన్ అంశాల కారణంగా తాలిబన్ల విషయంలో భారత్ సంకట పరిస్థితిని ఎదుర్కొంటుంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2021-09-08T05:48:15+05:30 IST