ట్విట్టర్ తుఫాను

ABN , First Publish Date - 2021-02-05T06:21:59+05:30 IST

ఏడాదిన్నర కిందట ఓ పదహారేళ్ల అమ్మాయి, ఇంగ్లండు నుంచి సౌరశక్తితో నడిచే ఒక పందెపు పడవలో అట్లాంటిక్ సాగరాన్ని దాటి అమెరికా మీద కాలుపెట్టింది. న్యూయార్క్ నగరానికి చేరి పర్యావరణం ఎదుర్కొంటున్న....

ట్విట్టర్ తుఫాను

ఏడాదిన్నర కిందట ఓ పదహారేళ్ల అమ్మాయి, ఇంగ్లండు నుంచి సౌరశక్తితో నడిచే ఒక పందెపు పడవలో అట్లాంటిక్ సాగరాన్ని దాటి అమెరికా మీద కాలుపెట్టింది. న్యూయార్క్ నగరానికి చేరి పర్యావరణం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని, మానవులకు ఎదురుకానున్న మహాప్రమాదాన్ని పది పంక్తుల్లో ఒక అమెరికా సభాసంఘం సమావేశంలో వివరించింది. అది ప్రసంగం కాదు, ఉద్వేగం– ఆవేదన కలగలసిన ధర్మాగ్రహం. ‘‘ఎంత ధైర్యం’’ అంటూ ప్రపంచాధినేతలను నిలదీసిన సందేశం అది. ‘‘మీ శుష్కవాగ్దానాలతో నా స్వప్నాలను, బాల్యాన్ని అపహరించారు, జనం చచ్చిపోతుంటే, యావత్ ప్రాకృతిక వ్యవస్థ ధ్వంసమవుతుంటే, ప్రళయమే సమీపిస్తుంటే మీరు డబ్బు గురించి, ఆర్థిక వృద్ధి గురించి కాకమ్మ కబుర్లు చెబుతున్నారు, ఎంత ధైర్యం!’’ అని ఆ చిన్న ప్రసంగం ముగుస్తుంది. ప్రపంచం ఆ ధైర్యానికి, అమాయకపు స్వచ్ఛతకు మురిసిపోయింది. వేనోళ్ల పొగిడింది. రెండు సంవత్సరాలు వరుసగా నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరును ప్రతిపాదించారు. స్వీడన్ దేశానికి చెందిన ఆ అమ్మాయి గ్రేటా థన్‌ బర్గ్. ఢిల్లీలో మోహరించిన రైతాంగ ఉద్యమశిబిరానికి తన మద్దతు ప్రకటించింది. సామాజిక మాధ్యమాలలో ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలనుకునే వారికి తగిన సహకారం అందిస్తానని కూడా ఆమె ట్విట్టర్‌లో ప్రకటించారు. 


అంతకు ముందు, బర్బడోస్ అనే కరేబియన్ దేశానికి చెందిన పాప్ గాయని రిహన్నా రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మూడు వ్యవసాయరంగ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రజాందోళన రిహన్నా ట్వీట్ కారణంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. గతంలోనే కెనడా, ఇంగ్లండ్ దేశాధినేతలు రైతుల ఆందోళన పరిష్కారం గురించి మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ పౌరసమాజం ఒక్కసారిగా భారత్‌లో ఏమి జరుగుతోందని కుతూహలం ప్రకటించసాగింది. 


న్యాయాన్యాయాల విషయంలో ప్రముఖులు కానీ, సాధారణ వ్యక్తులు కానీ దేశాల సరిహద్దులకు అతీతంగా స్పందించడం ఇవాళ కొత్త కాదు. భారతీయ రాజకీయ నాయకులు కూడా అనేక విదేశీ పరిణామాలపై స్పందించిన ఉదాహరణలు ఉన్నాయి. నరేంద్రమోదీ కూడా అమెరికాలో ట్రంప్ తిరిగి విజయం సాధించాలన్న ఆకాంక్షను బాహాటంగా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ, రైతు ఉద్యమాన్ని బలహీనపరచడంలో విఫలమవుతున్న కేంద్రప్రభుత్వం, తన ఆగ్రహాన్ని, నిస్సహాయతను అంతర్జాతీయ సమర్థకుల మీదకు ఎక్కుపెట్టడమే ఆశ్చర్యంగా ఉన్నది. గ్రేటాపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. రిహన్నా మీద ఆమె వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా పెట్టుకుని సామాజిక మాధ్యమాలలోనే దాడి జరుగుతోంది. అంతేకాదు, అంతర్జాతీయ పాప్ తారకు పోటీగా లతా మంగేష్కర్ దగ్గర నుంచి సచిన్ టెండూల్కర్ దాకా ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఎవరేమి అన్నారు, అది సబబా కాదా అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే భారత ప్రభుత్వ స్పందన వల్ల, వారు నివారించాలనుకున్న ప్రతికూల ప్రచారం మరింత ఉధృతం కావడం తప్ప మరో ప్రయోజనం లేదు. 


బయటి దేశాల వారు ప్రేక్షకులుగా ఉండాలి కానీ, భారత్ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించకూడదు, అది భారత సార్వభౌమాధికారానికి భంగకరం-.. వంటి వ్యాఖ్యలు మన దేశీయ ప్రముఖులు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యాసమరానికి సార్వభౌమాధికారం వంటి అంశాలతో నిమిత్తం ఉంటుందని ఎందుకు భావిస్తున్నారో తెలియదు. దేశరాజధానిలోని అమెరికా రాయబార కార్యాలయం- వ్యవసాయ చట్టాలను పరోక్షంగా సమర్థించినప్పటికీ, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తున్నామని, ఆ ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నామని వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటే ఏమిటి అర్థం, ప్రభుత్వం అణచివేత చర్యలు తీసుకోకూడదనే కదా? అంతేకాదు, ఇంటర్నెట్‌ను నిరోధించడం భావప్రసారానికి అవరోధమని కూడా వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలు మాత్రం ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కాదా? 


అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తమకు ఎదురుగా నిలబడ్డ ప్రతి అంశాన్నీ దేశభక్తితోను, సార్వభౌమత్వంతోను ముడిపెట్టి గట్టెక్కాలనుకోవడం. సామాజిక రంగంలో నైతిక, ధార్మిక పోలీసింగ్ చేసినట్టు, సామాజిక మాధ్యమాలలో కూడా దండధారులను ఉపయోగించుకుంటే ఎట్లా? పాపం, లతా మంగేష్కర్‌కు ఈ వయసులో ఒక పాప్ గాయనికి పోటీగా మాట్లాడడం అవసరమా? ఎవరెవరు ట్విట్టర్‌లో ఎదురుదాడికి దిగారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు భారత్‌లో జరుగుతున్నది ప్రపంచమంతా తీక్షణంగా గమనిస్తుంది. రోడ్ల మీద మేకులు కొట్టిన చిత్రాలను విదేశీయులు చూసి ఏమనుకుంటారు? అటువంటి వాస్తవం పదిమందికి తెలియడం మన దేశానికి ఎంత అవమానం? ఆ పర్యావరణ సాధకురాలు కానీ, ఈ గాయని కానీ భారత ప్రభుత్వం చేసిన విన్యాసాలకు ఏ మాత్రం బెదిరినట్టు లేదు. ఈ సందర్భంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న పెద్దలు గమనించవలసింది ఏమిటంటే, ఈ సమస్యను అంతర్జాతీయ వేదికల మీదకు లాగి రచ్చ చేయాలని ఉద్యమకారులు అనుకోలేదు. అనుకుని ఉంటే, వారు ఆ పని ఎప్పుడో చేయగలిగి ఉండేవారు. రెండు నెలల పాటు, వారు తమ గొంతును ప్రభుత్వానికి వినిపించడానికే ప్రయత్నించారు. కానీ, నిప్పు ఎంతకాలం గుప్పిట ఉండగలదు? ఇష్టం ఉన్నా లేకున్నా, లోకం ఈ సన్నివేశాన్ని చూసింది. దేశంలోపల ఏ అప్పీలు లేని న్యాయం సర్వరంగాలలో నడుస్తున్నప్పుడు, బయటి ప్రపంచానికి ఒక కిటికీ తెరుచుకోవడం ఉద్యమకారులకు కొంత ఊరటే కదా?


ఇదంతా చేయకుండా ఉంటే బాగుండేది. ప్రభుత్వం తాను చేస్తున్నది న్యాయం అనుకుంటున్నప్పుడు, ఎవరో కొందరు వ్యాఖ్యలు చేస్తే ఎందుకు బెదిరిపోవాలి, ఎందుకు అల్లరి చేసుకోవాలి?

Updated Date - 2021-02-05T06:21:59+05:30 IST