‘టెట్‌’ మరచిపోయారా?

ABN , First Publish Date - 2021-10-14T08:21:17+05:30 IST

తెలంగాణవాసుల ఉద్యోగాలన్నీ ఆంధ్రులపాలవుతున్నాయని ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రంలోనూ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు అన్యాయమే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకోసారి, లేదా ఏడాదికోసారైనా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌...

‘టెట్‌’ మరచిపోయారా?

తెలంగాణవాసుల ఉద్యోగాలన్నీ ఆంధ్రులపాలవుతున్నాయని ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రంలోనూ బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు అన్యాయమే జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకోసారి, లేదా ఏడాదికోసారైనా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) నిర్వహించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే టెట్‌ను నిర్వహిం చారు. మొదటిసారి 2016 మే 22న ఈ పరీక్ష జరిగింది. మొదటి పేపర్‌కు 88,158 మంది హాజరైతే 48,278 మంది పాసయ్యారు. రెండో పేపర్‌ను 2,51,924 మంది రాస్తే 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండోసారి 2017 జూలై 23న టెట్‌ నిర్వహించారు. మొదటి పేపర్‌కు 98,848 మంది హాజరైతే 56708 మంది పాసయ్యారు. రెండో పేపర్‌ను 2,30,932, మంది రాస్తే 45,045 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఆ తర్వాత మరో టెట్ నిర్వహించనే లేదు. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్ధులు, కొత్తగా పాస్ అవుట్ అవుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా 4.50 లక్షలకు చేరుకుంది. ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోగా రాష్ట్రంలో ఇప్పటికే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని తెలంగాణ సర్కార్ చెప్తున్నది. కొవిడ్ సాకుతో 15 వేల మంది విద్యావలంటీర్లను సైతం పక్కనపెట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ వలంటీర్లను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం లేదు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా క్లాసులు చెప్పాలన్నా ఈ అర్హత పరీక్ష తప్పని సరి. అటు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ప్రైవేట్ పాఠశాలల్లో అయినా క్లాసులు చెబుదామంటే కూడా చాన్స్ లేకుండా పోయింది


నాలుగేళ్లుగా బీఎడ్, డీఎడ్ కోర్సులు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య రానురాను తీవ్రంగా తగ్గే ప్రమాదం ఉన్నది. దానికి తోడు రాష్ట్ర సర్కార్ తీసుకున్న వయోపరిమితి నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మరిన్ని తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచడంతో ఖాళీ లేకుండా పోయింది. సాధారణంగా ప్రతిఏటా 20వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసే అవకాశం ఉండగా ఈ నిర్ణయంతో ఆ సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. 


దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టెట్‌ను ప్రతి ఆరునెలలకోసారి లేదా ఏడాదికోసారైనా నిర్వహిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏటా బీఎడ్, డీఎడ్ పాస్అవుట్ అయిన వారి సంఖ్య గణనీయంగా ఉంటున్నది. బీఎడ్‌ అభ్యర్థులు 3 లక్షల మంది ఉంటే, డీఎడ్ అభ్యర్థులు 1.5 లక్షల మంది ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తు న్నారు. తెలంగాణ సర్కార్ వెంటనే పట్టించుకుని టెట్‌ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి.

రావుల రాజేశం, లెక్చరర్

Updated Date - 2021-10-14T08:21:17+05:30 IST