ఆర్థిక నిపుణుడి ఆరోగ్య సేవలు

ABN , First Publish Date - 2021-12-07T06:04:28+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం సుమారు మూడు దశాబ్దాలకు పైగానే. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల...

ఆర్థిక నిపుణుడి ఆరోగ్య సేవలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం సుమారు మూడు దశాబ్దాలకు పైగానే. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల తర్వాత ఆయనను కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే మిత్రుడు భండారు శ్రీనివాసరావుతో కలిసి వెళ్లాను. ముఖ్యమంత్రి చాంబర్ ఎదుటి గదిలో కూర్చోబోతుండగా, ఆయనను కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తూ తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన రోశయ్య, పేర్లు పెట్టి పిలిచి రమ్మన్నారు. లోపలికి వెళ్లి నమస్కారం చేసి మర్యాదపూర్వకంగా కలవడానికి, వ్యక్తిగతంగా అభినందనలు చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. మమ్మల్ని వెళ్లనివ్వకుండా కూచోమని చెప్పి, ఎప్పటి రోశయ్య గారి లాగానే గంటకు పైగా మాట్లాడారు.


రోశయ్యతో నాకు సన్నిహిత పరిచయం మొదటిసారి 1989లో జరిగింది. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చెన్నారెడ్డి ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎన్నికల ముందు పరిచయమైన చెన్నారెడ్డి నన్ను ‘ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి’గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్యకి తెలియచేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఆర్ఓగా ప్రతి దినం ఆయనను కలిసే అవకాశం ఉండేది. అలాగే విధి నిర్వహణలో నిరంతరం ఆయన సూచనలు–సలహాలు తీసుకోవడం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, రోశయ్యను చాలా పర్యాయాలు కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా పలుమార్లు కలిసి సహాయం కోరితే ఎప్పుడూ కాదనలేదు. 1994 –2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయనను చాలాసార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.


2004లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇఎంఆర్ఐ సంస్థలో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య ఇంచార్జిగా చేరాను. ఆ మధ్యలో నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, ఏమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇఎంఆర్ఐలో చేరిన మొదటి వారంలోనే, రైల్లో ఒకే కంపార్ట్‌మెంటులో ప్రయాణిస్తూ ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005న 108 సేవలను ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి లాంఛనంగా ప్రారంభించినప్పుడు తాను అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థికశాఖతో పాటు, ఆరోగ్య–వైద్య–కుటుంబ సంక్షేమ శాఖకు కూడా ఆయనే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రైవేట్‌ నిధులతోనే నడిచిన ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను మున్ముందు బడ్జెట్లో కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను రోశయ్య మొట్టమొదటి‍సారిగా బహిరంగంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 2007–2008 బడ్జెట్లో ఆ మొత్తాన్ని కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో 108 అత్యవసర సహాయ సేవల విషయం అప్పటికింకా వివరంగా పడలేదు. 


రోశయ్య ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వపరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇఎంఆర్ఐ సంస్థకు మధ్య సెప్టెంబర్ 2006లో ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ నిధుల కేటాయింపు అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చరిత్రాత్మక మలుపు. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ మరిన్ని అంబులెన్సులను అందజేయడంలోను, నిర్వహణ నిధులను 95 శాతం వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఆయన సహకారం కోసం కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది.


సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇఎంఆర్ఐ చైర్మన్ రామలింగరాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009న, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. అందులో కీలక నిర్ణయాలన్నిటినీ రోశయ్య సలహాతోనే రాజశేఖరరెడ్డి తీసుకున్నారు. నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రైవేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమంటూ జీవీ కృష్ణారెడ్డితో రాజశేఖరరెడ్డి సూచించిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్యకాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇఎంఆర్ఐ ఖాతాలో ఉన్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడంతో ఆయన వెంటనే దానిని పరిష్కరించారు. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రైవేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి ‘బ్రాండ్ అంబాసిడర్’ లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇఎంఆర్ఐ బాధ్యతలు స్వీకరించలేకపోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్ఛంద సంస్థపై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం రోశయ్యను కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. ఆయన మళ్ళీ అదే అత్మీయత చూపారు.


రోశయ్య 1968లో విధానమండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్‌టిరామారావు మండలిని రద్దు చేసేంతవరకు అందులో సభ్యుడిగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజకవర్గాల నుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత ‘ఆర్థిక రంగ నిపుణుడు’ ఆయన వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995–97 మధ్యకాలంలో సమర్థంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరోమారు శాసనమండలి సభ్యుడిగా 2009లో ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 3, 2009న మండలి సభ్యుడిగానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 


మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటూ, పాలనలో తనదంటూ చెదరని ముద్ర వేశారాయన. క్లిష్టసమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకదాని వెంట మరొక సంక్షోభం ఆయనను వెంటాడింది. అనుకోని రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకుని, పాలనను గాడిలో పెట్టారు.


రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఒక పర్యాయం నేను, భండారు శ్రీనివాసరావు, ఎమ్మెస్ శంకర్ చెన్నై రాజ్‌భవన్‌లో కలవడానికి ఉదయం పూట వెళ్లాం. ఆయన అప్పుడే మార్నింగ్‌వాక్ ముగించుకుని కాఫీ తాగుతూ మాతో గంటకు పైగా ముచ్చటించారు. ఆయన ఆప్యాయతను, నిరాడంబరతను ఎన్నటికీ మరచిపోలేం.

వనం జ్వాలానరసింహారావు

Updated Date - 2021-12-07T06:04:28+05:30 IST