విఫల విమర్శ

ABN , First Publish Date - 2021-02-06T06:32:50+05:30 IST

‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనే వ్యాసంలో (ఆంధ్రజ్యోతి, జనవరి 31) కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారు సుభాష్చంద్ర బోస్ ‘ఉదాసీనత’ గురించి...

విఫల విమర్శ

‘విఫల ప్రత్యామ్నాయం బోస్’ అనే వ్యాసంలో (ఆంధ్రజ్యోతి, జనవరి 31) కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారు సుభాష్చంద్ర బోస్ ‘ఉదాసీనత’ గురించి రాశారు. ‘నాజీ హిట్లరు’ తోనూ, ‘ఫాసిస్టు ముస్సోలినీ’ తోనూ జత కట్టడానికి ప్రయత్నించిన బోసు, ఆ నియంతలు సృష్టించిన ‘బీభత్సం’ పట్ల ఎందుకంత ఉదాసీనత చూపాడో అని మూర్తిగారు ‘విస్తు’ పోయారు. ‘సామ్యవాద దేశాలు’ (రష్యా?) రెండో ప్రపంచయుద్ధాన్ని నిరంకుశ రాజ్యాల మీద చేస్తున్న యుద్ధంగా పరిగణిస్తున్న కాలంలో, బోస్ ఆ విచక్షణ చూపలేదన్నట్టు రాశారు.


బోస్ తాను కమ్యూనిస్టునని ఏనాడూ చెప్పుకోలేదు. కానీ, ‘మార్కిస్టు మహోపాధ్యాయుడైన కామ్రేడ్ స్టాలిన్’, నాజీ హిట్లర్ తోనూ, ఫాసిస్టు ముస్సోలినితోనూ ‘జత’ కట్టడానికి చేసిన ప్రయత్నం సంగతి మర్చిపోయారు మూర్తిగారు. 1939లో స్టాలిన్ హిట్లర్కి టోస్ట్ (శుభాకాంక్షలు) చెప్పడం, 1939 ఆగస్టు నించీ, 1941 జూన్ వరకూ జర్మనీతో అనేక ఒప్పందాలు చేసుకోవడం ఏ రకం విచక్షణ? గ్రాంషీ వంటి కమ్యూనిస్టు నాయకుణ్ణి జైల్లో పెట్టిన ముస్సోలినీ నాయకత్వంలోని ఇటలీతో ‘ఉత్తమ సంబంధాలు’ (బెస్ట్ రెలేషన్స్’‌) వున్నాయని స్టాలిన్ ప్రకటించడం ఏ రకం విచక్షణ? (స్టాలిన్ కలెక్టడ్ వర్క్సు, సంపుటి 13, పేజీ 308). బోస్ సైనికదుస్తులు ధరించి వుండడం సైనిక నియంతలను గ్న్యప్తికి తెస్తుందని ఆక్షేపించిన మూర్తిగారికి, కోరమీసాలతో, గుండె నిండా మెడల్సుతో, సైనికదుస్తులు ధరించి బూర్జువా నాయకులైన చర్చిల్, రూజ్వెర్ట్‌ల పక్కన కూచున్న మార్షల్ స్టాలిన్ ఫోటో గుర్తుకు రాలేదు. 


మూర్తి గారి వ్యాసం, బోసు మీదే అయినప్పటికీ, ‘ప్రజాస్వామిక, సామ్యవాద దేశాల’ ప్రస్తావన తెచ్చినప్పుడు, ఆ సామ్యవాద దేశ నాయకుడి ప్రవర్తన గురించి కూడా విస్తుపోయివుంటే, అది ఫలవంతమైన విమర్శ అయివుండేది.

బి.ఆర్. బాపూజీ

Updated Date - 2021-02-06T06:32:50+05:30 IST