రాజ్యాంగంపై అతిశయోక్తులు!

ABN , First Publish Date - 2021-12-31T07:41:06+05:30 IST

పాలకులకూ, వేతనశర్మలకూ, ఇతరులకూ కావాలంటే కులగణన చేసుకోండి; దానికోసం రాజ్యాంగం గురించి ఉన్నవీ లేనివీ చెప్పటం ఎందుకు? ‘మెజారిటీ బహుజనులకు ఈ రాజ్యాంగం ఆయుధం...

రాజ్యాంగంపై అతిశయోక్తులు!

పాలకులకూ, వేతనశర్మలకూ, ఇతరులకూ కావాలంటే కులగణన చేసుకోండి; దానికోసం రాజ్యాంగం గురించి ఉన్నవీ లేనివీ చెప్పటం ఎందుకు? ‘మెజారిటీ బహుజనులకు ఈ రాజ్యాంగం ఆయుధం. ఈ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మీకు (అంటే– రంగనాయకమ్మ గారికి) కనపడవు. రాజ్యం అందరికీ శత్రువు కాదు,’ అంటూ రాజ్యాంగం గురించి రాసారు సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్. దేశ ప్రజలంతా సమానులేనని చెప్పే రాజ్యాంగాన్ని దోపిడీ రాజ్యాంగం అంటున్నారని వారు ఆక్షేపించారు. ఇలాటివారిని ‘కార్ల్ మార్క్స్ క్షమించు గాక’ అని రాసారు (నవంబరు 18, 2021). 


 రాజ్యాంగం ఆయుధమే కానీ, మొట్టమొదటగా అది రాజ్యం చేతిలో ఎంత బలీయమైన ఆయుధమో చూడండి: 1) ఏ పౌరుడినైనా ఏ కారణమూ చూపకుండా, ఏ నేరమూ చేయకపోయినా, నేరంచేస్తాడేమోనని రాజ్యం– అంటే అప్పటి ప్రభుత్వం, పోలీసులు– భావిస్తే చాలు, అరెస్టు చేయగల అధికారం ఆర్టికల్ 22లోనే ప్రివెంటివ్ డిటెన్షనుగా పొందుపరచబడింది. నాటి టాడా నుంచి నేటి ఊపా వరకు అన్ని నల్లచట్టాల మూలం అందులోనే ఉంది. అలాటి చట్టాలతో వేలాదిగా– ఇందిర 1975 ఎమర్జన్సీలో ఐతే లక్షమందిని– అరెస్టు చేసారు, చేస్తున్నారు. అది రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి అరెస్టు మూడునెలలు.. ఇంకా అలా పొడిగించుకుంటూ పోటానికి చట్టబద్ధ ఏర్పాట్లున్నాయి. అదికాక విచారణకూడా లేకుండా 10–20 ఏళ్లు అభాగ్యులు జైళ్లలో మగ్గిపోతున్నారని సుప్రీంకోర్టే బాధపడింది! ఇదీ రాజ్యాంగం నీడనే, చట్టబద్ధంగానే సాగుతున్నది. ఇలా నిర్బంధాల పాలవుతున్న వారిలో సహజంగానే అత్యధికులు పేద దళిత బహుజన వర్గాలేనని సుప్రీంకోర్టూ గమనించింది. ఎల్గార్ పరిషత్ కేసులో దళిత బహుజన వర్గాలతో పాటు, అన్నిమతాల, కులాల వారినీ– వరవరరావు నుంచి తెల్తుంబ్డె దాకా, ఫాదర్ స్టాన్ స్వామి నుంచి ముస్లిములదాకా– కనీసం బెయిలూ లేకుండా నిర్బంధించారు; చట్టం ముందు (అధికార వర్గాల, పార్టీల వారు తప్ప) అంతా సమానులేనని రాజ్యం చూపెట్టింది. ఆర్టికల్ 14 అందరికీ ‘ఇందులో’ సమానత్వం కల్పించింది, స్వేచ్ఛా సౌభ్రాతృత్వాల్లో కాకపోయినా. 2) కేంద్రంలో లాగే ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలను ఆర్టికల్ 356 క్రింద నోటీసు ఇవ్వకుండా, తమ ఏజెంటైన గవర్నరు కుమ్మక్కుతో రద్దుచేయవచ్చును. 120సార్లకు పైగా రద్దు చేసారు, కోర్టు మంజూరుతోనే. ఇందులో డజన్లలో బహుజన ముఖ్యమంత్రులూ ఉన్నారు. 3) ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా ఏ కారణమూ చూపకుండా, నోటీసు ఇవ్వకుండా ఆర్టికల్ 311(2బి) ప్రకారం తొలగించచ్చును. అలా వేలాదిగా– ముఖ్యంగా రైల్వే సమ్మెలప్పుడు తీసేసారు. జయలలిత లక్షకు పైగా తొలగించారు. 4) ఏ చట్టమూ లేకుండానే సాగే నిరంకుశత్వం సరే సరి: 


ఉదాహరణకు, రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కనీసం 50 వేలమందిని ఎన్‌కౌంటర్లలో కాల్చేసారు; ఈశాన్య భారత్, కశ్మీరు, పంజాబు వదిలెయ్యండి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే వేలమంది దళిత బహుజన వర్గాలు ఇలా బలైపోయారని పోలీసుల లెక్క.


అంబేద్కరు మరణానికి నెలలముందు 1956 మార్చి 18న ఆగ్రాలో, చివరి సందేశం లాంటి ఉపన్యాసంలో, దళితబహుజన నాయకులనుద్దేశించి ఇలా అన్నారు: ‘‘మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే, వెళితే వెళ్ళండి. మీ ఇష్టం. అమ్ముడు పోవాలనుకుంటే అది మీఇష్టం. కానీ ఉద్యమాలకు ఎలాటి హానీ చేయకండి. నాకు ఇతరుల నుంచి కాదు, నా వాళ్ల నుండే ప్రమాదం ఉన్నట్టుగా భావిస్తున్నాను’’. కొద్దిపాటి ఎరలతో అనేకానేక దళితబహుజనకులాల్లో ఇలాటివారిని రాజ్యం కోఆప్టు చేసుకున్నది; (ఎన్నికల అఫిడవిట్ల మేరకు) బిలియనీర్ల, నేరస్తుల అజమాయిషీలో ఉన్నది నేటి ప్రజాస్వామ్యం; ‘అన్ని ఎన్నికల పార్టీలూ, ప్రజాస్వామికవాదులూ’ అందులో భాగమే. ఉభయశ్రీనివాసులకున్నట్టు దానిపై గౌరవం లేకపోవడమే ఉచితం. రాజ్యం వర్తమాన పాలక, పీడకవర్గాల కార్యవర్గంగా వ్యవహరిస్తుందని తెలియని (?) ఇలాటి వారిని మార్క్సు క్షమించుగాక, సరిదిద్దుగాక! 


నెహ్రూ నియమించిన కాలేల్కరు కమిషను 1955లోనే 2399 బీసీ కులాల్ని, అందులో 837 అత్యంత బీసీలని లెక్కించింది. నేడు కేంద్ర ఓబీసీ లిస్టులో 5000పైగా కులాలున్నాయి; వాటిల్లో కేవలం 40 సగం అవకాశాల్ని పొందాయని, కాబట్టి ఉపకులాల్ని వెనుకబాటుతనం బట్టి (అత్యంత, మరీ, ఇతర బీసీలుగా) విభజించాలని రోహిణి కమిషన్ నియమించారు రెండేళ్ల క్రితం. 2008లో సుప్రీంకోర్టు క్రీమీ లేయరు తీర్పునిచ్చింది. కానీ బహుజన ‘వేతనశర్మ’ల లాబీలు ఈ ప్రక్రియల్ని వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలోనే 140 బీసీ కులాలుండగా, వాటిలో ఆరేడే లాభం పొందుతున్నాయి; ఉన్నవి 119 ఎమ్మెల్యే పదవులే. ఎస్సీల్లోనూ ఇంతే; వారిలో ఉపవర్గీకరణ కావాలని కోరుతున్నా, కమిషన్లు అసెంబ్లీలు తీర్మానించినా, ‘అగ్ర ఎస్సీలు, బీసీలు’ దశాబ్దాలుగా అడ్డంపడుతున్నారు. ఒక రాష్ట్రంలో ఎస్సీ మరోచోట బీసీ; లిస్టుల్లో మార్పుచేర్పులకోసం మళ్లీ పైరవీలు. ఇవన్నీ కేవలం ‘సామాజికం’ కావు; అక్షరాలా నూరేళ్ల నుంచి ఆయా ప్రభుత్వాలు ‘షెడ్యూల్లో’ చేర్చినవి. వీటిలో ఉన్నవి రాజకీయ, స్వప్రయోజనాలే; 90 శాతం ప్రజలకేమీ ఒరగదు, ఈర్ష్యాద్వేషాలు తప్ప. 


‘‘ఈ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీలు కలిసే పని చేస్తున్నాం, మా మధ్య కొట్లాటలు రావు. మీ కల ఫలించదు’’, అనిరాసారు! అయా ఉద్యోగుల సంఘాల్లోనే ఇది నిజంకాదు. బ్రాహ్మణ బనియాలతోనూ, బిజెపీతోనూ అయినా చేతులుకలిపారు కానీ మాయావతి బిఎస్పీకీ, యాదవుల ఎస్పీకీ ఎంతవైరమో దశాబ్దాలుగా చూసాం. లాలూ నితీషుల వైరాన్నీ చూస్తున్నాం. తెలుగు ప్రాంతాల్లో మాల మాదిగల వైరుధ్యాలను 30 ఏళ్లుగా చూస్తున్నాం. కమిషన్లు చెప్పినా, పాలక పార్టీలు అసెంబ్లీల్లో తీర్మానాలు పాసుచేసినా, ఎమ్మార్పీయస్ కోర్కె అలాగే ఉంది; ముస్లిము, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు వర్తించకుండా అడ్డుపడేవారిలో అంతా ఉన్నారు! దళితబహుజన ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో అత్యధికులు నేడు బీజేపీలోనే ఉన్నారు.


నాడు యాదవ కృష్ణుని చేతనే భగవద్గీతలో వర్ణాశ్రమధర్మాల్ని చెప్పించారు. నేడూ అంతే. కులవ్యవస్థ రద్దుని 70ఏళ్లుగా జపిస్తూ, దాన్ని ఉద్యోగాల్లో హాస్టళ్లలో కొత్తగా కట్టిన కాలనీల్లో శాశ్వతం చేస్తున్నారు; దళితబహుజన వేతనశర్మల వెంపర్లాటంతా అదే.


కులనిర్మూలనజపం, ఆచరణలో రాజ్యాంగమే సాధనంగా కులశాస్వతీకరణ. 70 ఏళ్లుగా ఇదే తంతు. ప్రజలకు ఉపయోగపడేమేరకు రాజ్యాంగాన్ని వినియోగించటం వేరు; అంతులేని భ్రమలు పెంచటం వేరు. వేతనశర్మలకూ, పాలకులకూ, కులగణన కావాలంటే చేసుకోండి; దానికోసం రాజ్యాంగం గురించి ఉన్నవీ లేనివీ చెప్పటం ఎందుకు? మధ్యలో మార్క్సుని లాక్కురావటమెందుకు?

యం. బాపూజీ

 సి.ఎస్.ఐ.ఆర్. విశ్రాంత సీనియర్ సైంటిస్టు


Updated Date - 2021-12-31T07:41:06+05:30 IST