వ్యాస ధార, ఉపన్యాస ఝరి

ABN , First Publish Date - 2021-01-12T06:24:45+05:30 IST

తెలుగు పాత్రికేయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నం ‘తుర్లపాటి’గా ప్రసిద్ధుడైన తుర్లపాటి కుటుంబరావుకు తెలియనివారు లేరు,...

వ్యాస ధార, ఉపన్యాస ఝరి

నివాళి

తెలుగు పాత్రికేయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నం ‘తుర్లపాటి’గా ప్రసిద్ధుడైన తుర్లపాటి కుటుంబరావుకు తెలియనివారు లేరు, ఆయన తెలియని వారు లేరు. చిన్ననాడే మహాత్మాగాంధీని కలుసుకుని, గాంధీజీ ఆటోగ్రాఫ్‌ను సంపాయించిన ఘనుడు. విద్యార్థి దశ నుంచే రచన, ప్రసంగాలలో దిట్ట. నార్ల వెంకటేశ్వరరావు గారే తనకు స్ఫూర్తి అని చెప్పేవారు. నాకు ఆయనతో సుమారు రెండు దశాబ్దాల సహ ప్రయాణం, చనువు. గంభీరమైన చమత్కారంతో దాదాపు 18000 సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన, అసమాన అనుభవజ్ఞుడు. అప్పుడప్పుడూ ఆయన చెప్పే విషయాలు, ఆయన పసిమనస్సును మాకు పరిచయం చేసేవి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద పిఏగా పని చేసినప్పుడు టంగుటూరి సూర్యకుమారి గారితో వివాహ ప్రతిపాదన వచ్చిందని, తానే అంగీకరించలేదని తుర్లపాటి చెప్పారు. ఆనాటికే ప్రముఖ నర్తకైన కృష్ణకుమారే 20–30 గంటల రైలు ప్రయాణంలో ముందు ప్రేమించి, తర్వాత ప్రతిపాదించి వివాహం కోరేలా చేసుకోగలిగిన అందమైన గడుసరి తుర్లపాటి. ఆమెతో ఆనాడు పాడించుకున్న మల్లీశ్వరిలోని ‘మనసున మల్లెల మాలలూగెనే’ ఈనాటికీ ఆయన ఫేవరెట్‌ సాంగ్‌. 


14 సంవత్సరాల వయస్సులో ‘స్వరాజ్యంలో స్వరాష్ట్రం’ అన్న శీర్షికతో ‘మాతృ భూమి’ అనే రాజకీయ వారపత్రికతో మొదలైన తుర్లపాటి రచనా ప్రవాహం, ఎన్‌జి రంగా నిర్వహించిన ‘వాహిని’కి సహసంపాదకత్వంతో; చలసాని రామారావు నిర్వహించిన ‘ప్రతిభ’కు సంపాదకత్వంతో సాగి, ప్రకాశం పంతులు గారి ‘ప్రజా పత్రిక’లో ఆంధ్రప్రాంత సంపాదకుని స్థాయికి చేర్చింది. తరువాత టీవీయస్‌ చలపతిరావు సారథ్యంలోని ‘ప్రజాసేవ’ పత్రికలో పనిచేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో 1991 వరకూ కొన సాగారు. నాటి నుంచి నేటి వరకు స్వేచ్ఛా పాత్రికేయునిగా వ్యవహరించిన తుర్లపాటి ఆదర్శప్రాయమైన వృత్తి నిబద్ధత శ్లాఘనీయమైనది. ఆంధ్రజ్యోతిలోనూ, వార్తలోనూ 50 సంవత్సరాలపాటు ఆయన అందించిన ‘వార్తలలోని వ్యక్తి’ అనే శీర్షిక ప్రపంచ రికార్డు. ౪000 మంది ప్రముఖుల జీవిత రేఖాచిత్రాలు, ఎంతో జ్ఞాపకశక్తి, పరిశోధన, పరిచయాలతో శీర్షిక నిర్వహించడం అనితర సాధ్యం. 


తెలుగును, తెలుగువారినీ ఏ మాత్రం చులకన చేసినా ఆయన నిర్భయంగా కలం ఝుళిపించేవారు. మన దేశానికి, మన రాష్ట్రానికి ఏ చిన్న అసౌకర్యం కలిగినా ఆయన రాతలు, మాటలు అనివార్యంగా ప్రభుత్వానికి లేఖల రూపంలో సంధింపబడేవి, అవి పరిష్కరింపబడేవి. 


కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యునిగా, ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అవార్డు ప్రదానోత్సవాల వ్యాఖ్యాతగా ఆయన అద్భుతంగా రాణించారు. అక్కినేనికి అన్నింటికన్నా ఇష్టమైన ‘నటసమ్రాట్‌’ బిరుదు ఆయన ఇచ్చిందే. వేదిక మీద ఎన్‌టిఆర్‌ ఉన్నప్పుడు ‘ఈ తెలుగు చలనచిత్ర సీమలో ఎన్‌టిఆర్‌ని మించిన నటుడు ఒక్కరే’ అన్నాడు. ఇక నిర్వాహకుల కం గారు, ఎన్‌టిఆర్‌ కోపం, ప్రేక్షకుల నిరసనలు అవధులు దాటాయట. ఒక్కనిముషం ఆగి, ‘ఎన్‌టిఆర్‌ని మించిన నటుడు ఎన్‌టీఆరే’ అని అనగానే అయిదు నిముషాల చప్పట్లు, ఎన్‌టీఆర్‌ చిరునవ్వు దొరికాయని చెప్పారు.


పద్మశ్రీ పురస్కారం పొందిన మొదటి... బహుశా ఒకే ఒక తెలుగు పాత్రికేయుడు తుర్లపాటి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షునిగా ఆయన సరళి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని ముగ్ధుణ్ణి చేసింది. పలు విషయాలపై ఆయన చేసిన సూచనలు విజయభాస్కర్‌ రెడ్డిని, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఆకర్షించి, తుర్లపాటికి శాసనమండలి సభ్యత్వం ప్రతిపాదించారు కానీ చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. రోశయ్యగారి హయాంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షునిగా తుర్లపాటిని నియమించారు. (సుమారు అయిదు సంవత్సరాల కాలానికి అనుకుంటాను.) నేను ఆనాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ పరిషత్‌ శాశ్వత అధ్యక్షుడు అని చమత్కరించేవాడిని. అంత అందంగా ఉండేవారాయన. 


‘నా కలం – నా గళం’ పేరుతో రాసిన ఆత్మకథతో పాటు తుర్లపాటి, ‘జాతి నిర్మాతలు’, ‘ఆంధ్రకేసరి జీవితంలో అద్భుత ఘట్టాలు’, మరెన్నో రచనలు చేశారు. ఆయన ఉత్తరాలు, ఆయనకు ప్రముఖలు రాసిన ఉత్తరాలు కలిపి ఒక గ్రంథంగా ప్రచురించడానికి మండలి బుద్ధప్రసాద్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయనపై జపాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ డాక్యుమెంటరీ తీసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ప్రతిభా పురస్కారం’, ‘నార్ల వెంకటేశ్వరరావు జీవన సాఫల్య పురస్కారం’, ఇంటర్నేషనల్‌ బయోగ్రాఫిక్‌ సెంటర్‌, ఇంగ్లండ్‌ వారి ‘ఇంటర్నేషనల్‌ మేన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు వగైరాలు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. ఆయనను రాజాజీ, ‘గార్డియన్‌ ఆఫ్‌ తెలుగు’ అని, కె.ఆర్‌. నారాయణన్‌ ‘జర్నలిస్టే కాక మరెన్నో రంగాలలో ప్రతిభావంతుడు’ అని ప్రశంసించారు. నెహ్రూ, బిఆర్‌ అంబేద్కర్‌, ఇందిరాగాంధీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, జగ్‌జీవన్‌రాం, పీవీ నరసింహారావు, ఆచార్య రంగా, మొరార్జీ దేశాయ్‌ వంటి ఎందరో ప్రముఖుల అభిమానం పొందారు. బిల్‌క్లింటన్‌ గుజరాత్‌ భూకంప బాధితులను సందర్శించి, సహాయం చేయడానికి కారకుడు తుర్లపాటి. మన రాష్ట్ర ముఖ్యమంత్రులందరితోనూ మంచి సంబంధాలు కలిగిన తుర్లపాటి కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతుడు. ఎవరితోనూ చెప్పకుండా, 11 సంవత్సరాలు ముందుగా తన 89వ ఏట తిరిగిరాని ప్రయాణానికి వెళ్లి, మనందరినీ దుఃఖంలో ముంచి, స్ఫూర్తికాయం వదలివెళ్లిన తుర్లపాటికి జేజేలు. 

గోక నారాయణరావు

అధ్యక్షుడు, ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ, విజయవాడ

Updated Date - 2021-01-12T06:24:45+05:30 IST